డెట్రాయిట్‌లోని ప్రసిద్ధ స్పిరిట్ ఆఫ్ డెట్రాయిట్ కాంస్య విగ్రహం ముందు నిలబడి, బాక్సింగ్ దిగ్గజం మహమ్మద్ అలీని గుర్తుచేసుకుంటూ, “మేము ప్రపంచాన్ని కుదిపేశాం”అని అబ్దుల్ ఎల్-సయీద్ అన్నారు.
41 ఏళ్ల మాజీ ప్రజారోగ్య అధికారి ఎల్-సయీద్, మిచిగన్‌లో డెమోక్రటిక్ పార్టీ తరఫున సెనేట్ అభ్యర్థిత్వాన్ని సాధించేందుకు అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు హేలీ స్టీవెన్స్‌ను ఓడించి, డెమోక్రటిక్ పార్టీలోని మితవాదులకు గట్టి దెబ్బ కొట్టారు.
ఎల్-సయీద్ సార్వత్రిక ఆరోగ్య సేవలు, ఇజ్రాయెల్‌కు అమెరికా సైనిక సహాయాన్ని నిలిపివేయడం, ఎన్నికల ప్రచార నిధుల వ్యవస్థలో సమూల సంస్కరణలు వంటి ధైర్యమైన ప్రగతిశీల విధానాలతో ప్రచారం చేశారు.
మితవాద అభ్యర్థి స్టీవెన్స్‌కు బడా సంస్థల నుంచి 6 కోట్ల డాలర్లు నిధులు అందాయి. అందులో అమెరికన్ ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ దాని అనుబంధ సంస్థల నుంచి సుమారు 3 కోట్ల డాలర్లు వచ్చాయి. ఇది డెమోక్రటిక్ పార్టీని కుదిపేస్తున్న రాజకీయ భూకంపంలో తాజా, బహుశా అత్యంత పెద్ద ప్రకంపన.
మధ్య పశ్చిమ ప్రాంతానికి విస్తరిస్తున్న వామపక్ష ప్రభావం..
డెమోక్రటిక్ పార్టీ లోపల వామపక్షం వైపు పెరుగుతున్న మొగ్గు, ఇప్పటివరకు గాఢంగా డెమోక్రటిక్గా ఉండే తీరప్రాంత నగరాలకే పరిమితం కాలేదు.
ఇప్పుడు అది అమెరికా మధ్య పశ్చిమ ప్రాంతంలోని కీలకమైన స్వింగ్ స్టేట్ అయిన మిచిగన్లోకి కూడా ప్రవేశించింది. దీంతో 2026 మధ్యంతర ఎన్నికలు, 2028 అధ్యక్ష ఎన్నికలకు ముందు డెమోక్రటిక్ పార్టీ నాయకత్వం, సిద్ధాంతపరమైన దిశ గురించి పునరాలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.
“ఇది మన దేశంలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య దేశాలలో కూడా కనిపిస్తోంది. తమ కోసం ఏమీ చేయని, తమ బాధలను అర్థం చేసుకోని, తమ సమస్యలను తెలుసుకోవాలన్న, పట్టించుకోవాలన్న ఆసక్తి లేని ఒక వ్యవస్థతో ఓటర్లు విసిగిపోయారు. అబ్దుల్ విజయానికి ఇదొక కారణం” అని మ్యాట్ డస్, సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ పాలసీ ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్, అలాగే వామపక్ష సెనేటర్ బెర్నీ సాండర్స్ మాజీ విదేశాంగ విధాన సలహాదారు అన్నారు.
అమెరికా రాజకీయాల్లో బలపడుతున్న వామపక్ష ప్రజాకర్షక రాజకీయాలు..
గత దశాబ్ద కాలంగా అమెరికా రాజకీయాలను డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన మితవాద ప్రజాకర్షక రాజకీయాలు ఆధిపత్యం చేశాయి.
అయితే 2016లో అధ్యక్ష పదవికి బెర్నీ సాండర్స్ చేసిన ప్రచారాన్ని హిల్లరీ క్లింటన్, డెమోక్రటిక్ పార్టీ నాయకత్వం ఓడించినప్పటి నుంచి వామపక్ష ప్రజాకర్షక రాజకీయాలు కూడా బలపడుతున్నాయి.
రెండేళ్ల తర్వాత 14వ న్యూయార్క్ కాంగ్రెస్ నియోజకవర్గంలో అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్టెజ్ సంచలన విజయం సాధించారు.
29 ఏళ్ల వయసులో అమెరికా కాంగ్రెస్‌లో పనిచేసిన అత్యంత పిన్న వయస్కురాలిగా ఆమె నిలిచారు. ఆమెతో పాటు “ది స్క్వాడ్”గా ప్రసిద్ధి చెందిన కొంతమంది, గట్టిగా తమ స్వరం వినిపించే ప్రగతిశీల నాయకుల బృందం ఏర్పడింది.
2020లో సాండర్స్ మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఆయన జో బైడెన్ చేతిలో ఓడిపోయినప్పటికీ, అధ్యక్షుడిగా బైడెన్ చేపట్టిన ప్రగతిశీల విధానాల రూపకల్పనలో సాండర్స్ బృందానికి గణనీయమైన పాత్ర ఉంది.
అయితే 2024లో జరిగిన పరిణామాలు, బైడెన్ రెండోసారి పోటీ చేయాలన్న విఫల ప్రయత్నం, కమలా హారిస్‌కు పార్టీ ఇచ్చిన ప్రాధాన్యత, ట్రంప్ తిరిగి అధికారంలోకి రావడం పార్టీ నాయకత్వానికి, కింది స్థాయి కార్యకర్తలకు మధ్య ఉన్న భారీ అంతరాన్ని బయటపెట్టాయి.
కొత్త నాయకుల సంచలన విజయాలు..
డెమోక్రటిక్ పార్టీ స్థాపిత నాయకత్వం మద్దతున్న ఆండ్రూ క్యూమోను గత నవంబర్‌లో జోహ్రన్ మమ్దానీ “అందుబాటు ధరలు, జీవన వ్యయం” వంటి అంశాలపై దృష్టి పెట్టి ఓడించి న్యూయార్క్‌కు తొలి ముస్లిం మేయర్‌గా ఎన్నికయ్యారు.
ఆ తర్వాత న్యూయార్క్‌లో డెమోక్రటిక్ ప్రైమరీ ఎన్నికల్లో ముగ్గురు సోషలిస్ట్ అభ్యర్థులు గెలవడానికి ఆయన సహకరించారు.
మమ్దానీ ప్రభావం కొలరాడో, ఇల్లినాయిస్, మిచిగన్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, వాషింగ్టన్ రాష్ట్రం, విస్కాన్సిన్, వాషింగ్టన్ డీసీ వరకు విస్తరించింది.
ఇందుకు ట్రంప్‌పై అసంతృప్తి, పెరుగుతున్న జీవన వ్యయం, రాజకీయాల్లో కార్పొరేట్ డబ్బు ప్రభావం, గాజా యుద్ధం మొదలైనవి ప్రధాన కారణాలు.
రాయ్‌టర్స్-ఇప్సోస్ సర్వే ప్రకారం, డెమోక్రాట్లలో ఇజ్రాయెల్ పట్ల అనుకూలత 2018లో 59 శాతం నుంచి 2026 మేలో కేవలం 22 శాతానికి పడిపోయింది. రాజకీయ ప్రచారాల్లోకి అమెరికన్ ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ నుంచి వస్తున్న భారీ మొత్తాల నిధులు యువ ఓటర్లలో తీవ్ర వ్యతిరేకతను కలిగిస్తున్నాయి.
ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతున్న విషయాన్ని ఎల్-సయీద్ మిచిగన్‌లో వివరించారు. ఇజ్రాయెల్‌కు అమెరికా ఇస్తున్న సైనిక సహాయాన్ని నిలిపివేయాలనే డిమాండ్‌ను తన ప్రచారానికి కేంద్ర బిందువుగా చేసుకున్నారు. దీంతో ఆయన నేరుగా స్టీవెన్స్‌కు వ్యతిరేకంగా నిలిచారు.
స్టీవెన్స్ మాత్రం అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాలను సమర్థించి, అమెరికన్ ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ నుండి నిధులు పొందారు.
ఎల్-సయీద్ విజయం, మిచిగన్ హౌస్ ఎన్నికల్లో ప్రగతిశీల అభ్యర్థులు విల్ లారెన్స్, డొనావన్ మెకిన్నీ సాధించిన విజయాలతో కలిపి చూస్తే, వామపక్ష ప్రజాకర్షక నాయకులు డెమోక్రటిక్ పార్టీ బలమైన కోటల్లోనే గెలవగలరు అనే విషయాన్ని రుజువు చేసింది.
డెమోక్రాట్లలో పెరుగుతున్న అంతర్గత చీలిక..
మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ పాలిటిక్స్ అండ్ గవర్నెన్స్ డైరెక్టర్ ల్యారీ జాకబ్స్ మాట్లాడుతూ, డెమోక్రటిక్ పార్టీలో వివిధ కారణాల వల్ల సాధారణ స్థాయి నుంచి చీలిక ఏర్పడుతోందని అన్నారు.
వాటిలో ప్రస్తుత నాయకుల “నిస్తేజం”, సెనేట్‌లో చక్ షూమర్, ప్రతినిధుల సభలో హకీమ్ జెఫ్రీస్ వంటి వారి నాయకత్వం కూడా ఉంది. వారిద్దరూ ఇజ్రాయెల్‌కు బలమైన మద్దతుదారులు. “గాజా, మిగిలిన అన్ని సమస్యలకు మెరుపు దండంలా మారింది” అని ఆయన అన్నారు.
“ట్రంప్‌ను ఎదుర్కొనే విషయంలో డెమోక్రట్లు బలహీనంగా వ్యవహరించారనే భావన ఉంది. అమెరికా రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగిన పాత సిద్ధాంతాలను సోషలిస్టుల ప్రభావం కుదిపివేస్తున్నది. మితవాద నాయకత్వం ప్రాజెక్ట్ 2025 వంటి పత్రాల్లో తీవ్రమైన రాజకీయ కార్యక్రమాలను ప్రతిపాదిస్తే, వామపక్షం సంపద పునర్విభజన, బలమైన కార్మిక సంఘాలు, ప్రజాస్వామ్య సంస్కరణలు వంటి అంశాలతో కొత్త రాజకీయ నినాదాలతో దూసుకుపోతున్నది” అని తెలియజేశారు.
వ్యవస్థీకృతమవుతున్న వామపక్షం..
ఒక వైపు డెమోక్రటిక్ పార్టీలోని మితవాద వర్గంపై విశ్వాసం సన్నగిల్లుతుండగా మరొకవైపు డెమోక్రటిక్ సోషలిస్ట్స్ ఆఫ్ అమెరికా వంటి సంస్థల ఎదుగుదల సాగుతోంది.
ట్రంప్ తన మితవాద ఆధిపత్య రాజకీయ రంగాన్ని స్పష్టంగా, రంగు రంగుల కళతో ప్రచారంలో ఉంటే, మితవాద డెమోక్రాట్లు మాత్రం నెమ్మదిగా చిన్నచిన్న మార్పులు చేయాలనుకునే, కొత్త ఆలోచనలు లేని నాయకులుగా కనిపిస్తున్నారు.
“మిచిగన్ ఫలితాలతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. అయితే అదే సమయంలో, అనేక దశాబ్దాలుగా జాతీయ డెమోక్రటిక్ పార్టీని నడిపిస్తూ వచ్చిన శక్తివంతమైన వర్గాల నుంచి ప్రతి చర్య ఎలా ఉంటుందోనని కొంత ఆందోళనగా కూడా ఉంది” అని రూట్స్యాక్షన్ డైరెక్టర్, ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ అక్యురసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నార్మన్ సోలమన్ అన్నారు.
డెమోక్రటిక్ లీడర్షిప్ కౌన్సిల్ 1990ల ప్రారంభంలో బలంగా ఎదిగినప్పటి నుంచి ఈ ప్రభావం కొనసాగుతోందని ఆయన అన్నారు. డెమోక్రటిక్ లీడర్షిప్ కౌన్సిల్‌ను అల్ ఫ్రమ్ స్థాపించారు.
1989లో బిల్ క్లింటన్‌ను, డెమోక్రటిక్ పార్టీని రాజకీయ మధ్యేమార్గం వైపు నడిపించేందుకు అల్ ఫ్రమ్ను ఎంపిక చేశారు. “మేము రిపబ్లికన్లను ఓడించడంపై దృష్టి పెట్టాం. కానీ ప్రజాస్వామ్య సోషలిస్టులు మమ్మల్ని ఓడించడంపై దృష్టి పెట్టారు. మేము తిరిగి పోరాడాలి” అని అల్ ఫ్రమ్ అన్నారు.
నవంబర్‌లో అసలు పరీక్ష..
రోడ్స్ స్కాలర్, వైద్యుడు, ఈజిప్టు వలసదారుల కుమారుడైన ఎల్ సయీద్‌కు అసలు సామర్థ్య పరీక్ష నవంబర్‌లో ఎదురుకానుంది. అప్పుడు ఆయన మాజీ రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు మైక్ రోజర్స్‌ను ఎదుర్కోబోతున్నారు. ఈ పోటీ సెనేట్‌లో అధికార సమతుల్యతను నిర్ణయించే అవకాశం ఉంది.
తీవ్రంగా సాగిన ప్రచారం తర్వాత, “మనల్ని విభజించే విషయాల కంటే, మనల్ని ఏకం చేసే విషయాలు చాలా పెద్దవి” అని ఎల్-సయీద్ అన్నారు.
స్టీవెన్స్ కూడా ఆయనకు మద్దతు ప్రకటించడానికి అంతే త్వరగా ముందుకు వచ్చారు. నిజానికి, అమెరికా అంతటా ప్రగతిశీలురు, మితవాదులు రాబోయే మధ్యంతర ఎన్నికల వరకు అసౌకర్యవంతమైన సహజీవనాన్ని కొనసాగించే అవకాశం ఉంది. కానీ ఆ తర్వాత 2028 వస్తుంది. అప్పుడు సరైన ఎంపిక చేసుకోవాల్సిన సమయం వస్తుంది.
ప్రగతిశీలురు కేవలం కొన్ని ఎన్నికల్లో మాత్రమే గెలిచారని, వామపక్ష తిరుగుబాటు పరిమాణాన్ని అతిగా చూపిస్తున్నారని కొంతమంది డెమోక్రట్లు వాపోతున్నారు.
మరికొందరు మాత్రం మిచిగన్ ఫలితంతో వామపక్షానికి రాజకీయ బలం మరింత విస్తరించిందని భావిస్తున్నారు. “మన మధ్య ఉన్న సారూప్యతలు విభేదాల కంటే చాలా పెద్దవి” అన్నారు.
ఎల్-సయీద్ బరాక్ ఒబామాతో మాట్లాడినట్లు తెలిపారు. మిచిగన్‌లో ఎన్నికల ప్రచారం ఎలా నిర్వహించాలనే దానిపై ఒబామా ఆయనకు సలహాలు ఇచ్చారు.
సీఎన్ఎన్తో ఎల్-సయీద్ మాట్లాడుతూ, పార్టీ అంతర్గత విభేదాలు “మన మధ్య ఉన్న సారూప్యతలతో పోలిస్తే చాలా చిన్నవి” అని అన్నారు. “మనం ప్రపంచాన్ని భిన్నంగా చూడవచ్చు. కానీ కలిసి రావాల్సిన బాధ్యత మనపై ఉందని కూడా మనం గుర్తిస్తున్నాం” అని ఆయన చెప్పారు.
జోసెఫ్ గీవర్గీస్, రెవల్యూషన్ అనే సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, 2016లో సాండర్స్ ప్రచారంలో పనిచేశారు. “మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఓటర్లు తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించలేని నాయకత్వంతో విసిగిపోయారు. విఫలమైన ప్రజాకర్షక రాజకీయాల ప్రతిధ్వనిని మనం చూస్తున్నాం. అదే సమయంలో వామపక్ష సామర్థ్యం మరింత పెరుగుతోంది” అని అన్నారు.
చివరికి, డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రత్యామ్నాయంగా నిలిచే శక్తి అదే అవుతుందనే చర్చలు జరుగుతున్నాయి.
(రచయిత: “డేవిడ్ స్మిత్” — ది గార్డియన్ పత్రిక సౌజన్యంతో. అనువాదం: డి వెంకన్న)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
