ఎటు చూసినా ఆందోళనకర సంకేతాలే కనిపిస్తున్నాయి. 5 ట్రిలియన్ డాలర్ల జీడీపీ లక్ష్యం చేజారింది.
రూపాయి విలువ డాలర్‌కు ₹100 మార్కును దాటే దిశగా సాగుతోంది. ధరలు, ప్రాజెక్టుల వ్యయాలు విపరీతంగా పెరుగుతున్నాయి.
అయినప్పటికీ కేంద్ర మంత్రివర్గం మాత్రం యథాతథంగానే కొనసాగుతోంది.
ఇటీవల ప్రభుత్వం అనుకూల రచయిత ఒకరు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పాలనను మళ్లీ సర్దుబాటు చేయాలంటే మోదీ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని సూచించారు.
ఈ వ్యాఖ్య సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చకు దారితీసింది.
కేంద్ర మంత్రివర్గం ఉత్సాహం కోల్పోయిందని ఆయన పేర్కొంటూ, అందులోని పనికిరాని లేదా క్రియాశీలకంగా లేని వ్యక్తులను తొలగించాలని సూచించారు.
మోదీ మంత్రివర్గానికి కొత్త ముఖాలు, కొత్త ఆలోచనలు అవసరమని అభిప్రాయపడ్డారు.
తారుమారైన పరిస్థితులు..
ఆ కాలమిస్టు ఎవరినీ పేరుపేరునా ప్రస్తావించకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఆయన ఉద్దేశం ఎవరిని సూచిస్తుందో స్పష్టంగానే అర్థమైంది.
ప్రధాన స్రవంతి మీడియా కూడా ఈ చర్చను ప్రముఖంగా ప్రచురించింది.
అయితే దీన్ని కేంద్ర ప్రభుత్వ పరిపాలనతో పాటు రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత వ్యవస్థను మరింత చురుకుగా చేయడానికి రూపొందించిన విస్తృత ప్రణాళికలో భాగంగా అభివర్ణించింది. అయినప్పటికీ చివరికి అధికారంలో ఉన్న మోదీ–షా ద్వయం ప్రస్తుతం ఉన్న మంత్రులను కదిలించకుండా ఉండటమే మరింత సురక్షితమని భావించింది.
ఆ పాత మంచి రోజుల్లో మంత్రివర్గం లేదా ఉన్నతాధికారుల బదిలీలు, మార్పులపై అప్పుడప్పుడు కథనాలు రాయడం జర్నలిస్టులుగా మా ఆనవాయితీగా ఉండేది.
మంత్రులు, ఉన్నతాధికారుల పనితీరును నిశితంగా పరిశీలించి సమర్థంగా పనిచేయని వారిని, ప్రజల్లో ఆదరణ కోల్పోయిన వారిని గుర్తించి ప్రస్తావించేవాళ్లం.
పరిపాలనకు చెడ్డపేరు తెచ్చిన పనితీరు లేని వ్యక్తుల గురించి కూడా చూపించేవాళ్లం.
అలాగే ఏ మంత్రి లేదా అధికారి త్వరలో పదవి కోల్పోయే అవకాశం ఉందో, ఎవరికి ముఖ్యమైన శాఖలు లేదా మంత్రిత్వ బాధ్యతలు దక్కవచ్చో కూడా సంకేతాలు ఇచ్చేవాళ్లం. అలాంటి నిజాయితీతో కూడిన సమాచారమే ప్రధానమంత్రులు తమ నిర్ణయాలను తీసుకోవడంలో ఉపయోగపడేది.
చక్రవ్యూహంలో చిక్కుకున్న మోదీ–షా..
ఆ రోజుల్లో ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఎవరూ ఎడిటర్‌కు ఫోన్ చేసి ప్రశ్నించేవారు కాదు లేదా విలేకరిని మందలించేవారు కాదు.
శాఖల కార్యదర్శులు కూడా ఇప్పుడు ఉన్నంతగా అధికారానికి విధేయులుగా ఉండేవారు కాదు.
మీడియా కార్యదర్శులు, మంత్రిత్వ శాఖల గురించి ఊహాగానాలు ప్రచురించినప్పటికీ వారు కొంత గౌరవాన్ని, నిష్పాక్షికతను పాటించేవారు. కానీ నేడు ఇవన్నీ జర్నలిస్టులకు ఊహించలేని విషయాలుగా మారిపోయాయి.
ఎందుకంటే వారు మోదీ అధికార కేంద్రీకృత పాలనా విధానానికి బాగా అలవాటుపడిపోయారు.
ఈ ప్రభుత్వంలోని ప్రతి నిర్ణయానికీ మోదీకే ఘనత దక్కుతుంది. ఆ నిర్ణయాలను ఆయనే ఆలోచించి తన పేరుమీదే అమలు చేస్తారు. ప్రతి ప్రాజెక్టును ఆయనే ప్రారంభిస్తారు.
ప్రతి సమీక్షా సమావేశానికి స్వయంగా హాజరయ్యే బాధ్యతనూ తనపైనే వేసుకుంటారు. వీటన్నింటినీ మీడియా కూడా ప్రముఖంగా ప్రచారం చేస్తుంది.
అలాంటప్పుడు జరిగిన పొరపాట్లు లేదా నిర్లక్ష్యాలన్నింటికీ అకస్మాత్తుగా మంత్రి లేదా అధికారులపై మాత్రమే ఎలా నెపం వేయగలరు?
స్పష్టంగా చెప్పాలంటే, తామే నిర్మించుకున్న అధికార కేంద్రీకృత చక్రవ్యూహంలో మోదీ–షా చిక్కుకున్నారు.
అందుకే సమగ్ర స్థాయిలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అత్యవసరంగా అవసరమైనప్పటికీ దాన్ని చేపట్టే విషయంలో వారు వెనుకడుగు వేశారు.
పరీక్షల వ్యవస్థను పదేపదే గందరగోళానికి గురి చేసినప్పటికీ హర్యానా వంటి రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ బాధ్యతలను అప్పగించిన తన నమ్మకస్థుడు ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రధానమంత్రి నిజంగా పదవి నుంచి తొలగించగలరా? అనే సందేహం కలుగుతోంది.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో జరిగే ప్రతి పని ప్రధానమంత్రి పేరుమీద ఆయన తరఫునే జరుగుతుంది. ముఖ్యమైన ప్రతి నిర్ణయం గురించి ఆయనకు వ్యక్తిగతంగా సమాచారం అందుతుంది.
ప్రతి బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే దానిని ఆయనే ప్రశంసిస్తారు.
అలాంటప్పుడు ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న గందరగోళ పరిస్థితులన్నింటికీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పైనే పూర్తి బాధ్యతను మోపి ప్రధానమంత్రి తప్పించుకోగలరా?
బాధ్యతను ఎవరు స్వీకరించాలి?
వాస్తవానికి మంత్రివర్గంలో ఏర్పడిన ఈ మొత్తం గందరగోళానికి మూల కారణం మోదీ వ్యక్తి ఆరాధన చుట్టూ నిర్మించుకున్న వ్యక్తికేంద్రీకృత దుర్వ్యవస్థాపనా విధానమే.
ప్రచార నైపుణ్యంతో అధికారాన్ని నిలబెట్టుకునే నియంతల నాయకత్వంలోని ప్రభుత్వాల్లో వ్యవస్థాగత క్షీణత సహజంగానే వేళ్లూనుకుంటుంది.
21వ శతాబ్దంలో కథనాలను తమకు అనుకూలంగా మలుచుకుంటూ పాలిస్తున్న కొత్త తరహా పాలకుల ఆధీనంలో ఉన్న చాలా దేశాల్లో ఇదే పరిస్థితి కనిపించింది.
అంతేకాదు భారతదేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యూహాత్మక ఎత్తుగడలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర బలగాలు, ఎన్నికల సంఘం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ల కలయికతో వరుసగా రాష్ట్రాలను తన ఆధీనంలోకి తీసుకురాగలుగుతున్నారు.
కానీ ఆ రాష్ట్రాలను నిలబెట్టుకోవడం మాత్రం ఆయనకు అత్యంత కష్టంగా మారుతోంది.
క్రమంగా క్షీణించిన మోదీ మ్యాజిక్..
ముఖ్యంగా ప్రజలకు సమర్థవంతంగా పనిచేసే పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలను అందించడం ద్వారా ఆ రాష్ట్రాలను నిలబెట్టుకోలేకపోతున్నారు. ఫలితంగా విశ్వసనీయత లోటు మరింత విస్తరిస్తూ వస్తోంది.
దీనికి తోడు మోదీ మ్యాజిక్ క్రమంగా క్షీణించడం, ఆయన ప్రభుత్వం కొత్త రూపంలో ప్రవేశపెట్టిన పథకాలు, ప్రాజెక్టుల వల్ల లభించే రాజకీయ ప్రయోజనాలు కూడా తగ్గిపోవడం మరో అంశం.
మోదీ ప్రధానమంత్రిగా ఉన్న ప్రారంభ దశలో ప్రధానమంత్రి కార్యాలయంలోని సహాయకులు బడ్జెట్ కేటాయింపులకు టిక్ పెట్టి ఇప్పటికే ఉన్న పథకాలకు సంస్కృత పేర్లు పెట్టి వాటిని మోదీ ప్రతిష్ఠాత్మక ఆలోచనలుగా ప్రారంభించేవారు.
కానీ ఇప్పుడు అలాంటి విఫలమైన, రాజకీయ ప్రయోజనం కోల్పోయిన పథకాల గుట్టతో శ్మశానం నిండిపోతోంది. అవి ఇక రాజకీయంగా ఎలాంటి లాభాలనూ అందించడం లేదు.
ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో గణనీయమైన లోపాలు ఉన్నాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇటీవలి నివేదిక ఎత్తి చూపింది.
శిక్షణ, ధృవీకరణ తర్వాత కేవలం 41% మంది అభ్యర్థులు మాత్రమే ఉపాధి పొందగలిగారని ఆ నివేదిక పేర్కొంది.
అమలులో పెద్ద సంఖ్యలో వైఫల్యాలు ఉన్నాయని కాగ్ ఉదహరించింది. ఉదాహరణకు సైన్స్ మరియు పర్యావరణ కార్యక్రమాలపై కోట్ల రూపాయలు వృధా అయ్యాయని తెలిపింది.
ఆర్థిక సంక్షోభానికి మోదీ ప్రభుత్వ స్పందన..
ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ దాడి చేయడం వల్ల తలెత్తిన ఆర్థిక సంక్షోభానికి మోదీ ప్రభుత్వ స్పందనను చూడండి.
ఈ యుద్ధం అకస్మాత్తుగా జరిగిన పరిణామం కాదు.
యుద్ధం ప్రారంభం కాకముందే ప్రపంచంలోని చాలా దేశాలు దాని ప్రభావాలను ఎదుర్కొనేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటుండగా మోదీ ప్రభుత్వం మాత్రం భారత ఆర్థిక వ్యవస్థలోని అంతర్గత స్థైర్యం గురించి గొప్పలు చెప్పుకోవడంలోనే నిమగ్నమై ఉంది.
ఆ తర్వాత ఈ నెల ప్రారంభంలో సంభవించే ఆర్థిక విపత్తులను అరికట్టేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు హడావుడిగా చర్యలు చేపట్టింది.
అందులో భాగంగా విదేశాల్లో నివసించే భారతీయుల పెట్టుబడులపై వడ్డీ రేట్లను పెంచి భారత్‌కు మరింత నిధులను ఆకర్షించాలని సూచించింది.
అంతకుముందు గత డిసెంబరులో ఆర్థిక వ్యవస్థలో ₹290 లక్షల కోట్ల మేర ద్రవ్య లభ్యత(లిక్విడిటీ)ని ప్రవేశపెట్టే చర్యలను ఆర్బీఐ ప్రకటించింది.
మరుసటి రోజే యుద్ధం వల్ల ముంచుకొస్తున్న ఆర్థిక సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలనే విషయంపై నిపుణుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ప్రధానమంత్రి తన ఆర్థిక సలహా మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.
ఆ తర్వాత జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో విదేశీ పెట్టుబడిదారులకు పన్ను నిబంధనలను సడలించే ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం భావించింది.
అలాగే యుద్ధం కారణంగా విమాన ఇంధన ధరలు పెరగడంతో దాని ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు విమానయాన సంస్థలకు సహాయంగా ₹10,000 కోట్ల నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
మరోవైపు పాత ట్రక్కులను BS-VI ప్రమాణాలకు అనుగుణమైన కొత్త ట్రక్కులతో మార్చుకునేందుకు ట్రక్కు యజమానులకు సహాయంగా ₹9,585 కోట్ల ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
న్యూఢిల్లీలో అధికారాన్ని అతిగా కేంద్రీకరించడం వల్ల ఏర్పడిన శాశ్వత అనిశ్చితి..
అయితే పరిస్థితి ఇప్పటికీ అనిశ్చితంగానే ఉంది. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవాల్సిన గడువును మనం ఇప్పటికే కోల్పోయాం.
రూపాయి విలువ డాలర్‌కు ₹100 మార్కు వైపు పరుగులు తీస్తోంది. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ గణాంకాల ప్రకారం ఈక్విటీ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు పదేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. అంటే విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్లోని షేర్లను నిరంతరంగా విక్రయిస్తూ భారతీయ లిస్టెడ్ కంపెనీల్లో తమ పెట్టుబడులను క్రమంగా తగ్గించుకుంటున్నారని ఇది సూచిస్తోంది.
నికర విదేశీ పెట్టుబడుల ప్రవాహం 2016 తర్వాత ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి పడిపోయింది.
గత దశాబ్ద కాలంలో భారతీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ పెట్టుబడిదారుల యాజమాన్య వాటా కూడా గణనీయంగా తగ్గిపోయింది. దీంతో మూలధన మార్కెట్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ ఫలించలేదనే విషయం స్పష్టమవుతోంది.
2021లో అమిత్ షా పెద్దగా నిరూపితమైన రాజకీయ అనుభవం లేని భూపేంద్ర పటేల్ వంటి వ్యక్తులను స్వయంగా ఎంపిక చేసి ముఖ్యమంత్రులుగా నియమించినప్పుడు దాని వల్ల తలెత్తే ప్రమాదాలను ముందుగా హెచ్చరించిన వాటిలో ది వైర్ ఒకటి. అయినప్పటికీ అప్పటి నుంచి బీజేపీలో జరిగిన దాదాపు ప్రతి రాజకీయ నియామకమూ ఇదే తరహాలో కొనసాగింది.
ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, త్రిపుర, గోవా రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపికలో సామర్థ్యం, అనుభవం, సీనియారిటీ, శాసనసభలో మెజారిటీ లేదా ప్రజాదరణ కంటే వ్యక్తిగత విధేయతకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
అధికారంలోకి వచ్చి సంవత్సరాలు గడిచినప్పటికీ అమిత్ షా అత్యంత సూక్ష్మ స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ ఈ విధంగా నియమించబడిన ముఖ్యమంత్రులు ఆశించిన స్థాయిలో పనితీరు కనబరచలేకపోతున్నారు.
అమిత్ షా బాధ్యతలు అకస్మాత్తుగా ఇతర రంగాలకు కూడా విస్తరించడంతో ప్రతి విషయాన్ని స్వయంగా నడిపిస్తూ సూచనలు ఇచ్చే పాత్ర నుంచి ఆయన దూరమయ్యారు. దాంతో ఏర్పడిన ఖాళీ కారణంగా ముఖ్యమంత్రులు తమ వ్యవహారాలను తామే చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆవిధంగా పనిచేయడానికి వారికి అలవాటు లేదు.
ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా వంటి వారు పార్టీలోని పార్టీ వెలుపల ఉన్న ఒత్తిడి వర్గాల ప్రభావానికి సులభంగా గురయ్యే పరిస్థితిలో ఉన్నారు.
ఒక్క క్షణం బీజేపీ వర్గాల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి గురించి ప్రచారంలో ఉన్న అనేక వ్యంగ్య వ్యాఖ్యలను పక్కన పెడదాం. ఆమె స్వయంగా బహిరంగంగా చేసిన వ్యాఖ్యలకే పరిమితమవుదాం.
ఇటీవల జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో దేశ రాజధానిలో ఏర్పడిన వేసవి నీటి సంక్షోభానికి ఎండ తీవ్రంగా ఉండటంతో నీరు ఆవిరైపోవడమే కారణమని ఆమె చెప్పారు.
గత ఏడాది డిసెంబరులో “ఏక్యూఐ అనేది ఒక ఉష్ణోగ్రత. దానిని ఏ పరికరంతోనైనా కొలవవచ్చు” అని ఆమె వ్యాఖ్యానించారు.
అత్యంత చురుకైన నేతగా పేరున్న హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని ప్రభుత్వంతో సహా బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలేవీ ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు.
ఎక్కువ సమయం రాజకీయాలకే కేటాయించే ఈ ముఖ్యమంత్రులు ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాలను యథావిధిగా అమలు చేయడానికే అలవాటు పడిపోయారు. దాంతో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని పరిపాలనను సమర్థంగా నడిపించే సామర్థ్యాన్నే క్రమంగా కోల్పోయారు.
ఫలితంగా ఇప్పుడు అమిత్ షా రాష్ట్రాల్లో మరో రకమైన చొరబాటును ఎదుర్కొంటున్నారు. దీనిని ఎస్ఐఆర్ గానీ, ‘గుర్తించి బహిష్కరించే’ చర్యలుగానీ అరికట్టలేవు.
సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగడం వల్ల బీజేపీ ప్రభుత్వాలు పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా అధికార దళారులు, లాబీయిస్టులు, కాంట్రాక్టర్ల ప్రభావానికి లోనయ్యే స్థితికి చేరుకున్నాయి. పరిణామం వ్యవస్థలో క్రమంగా క్షీణత వేళ్లూనుకుంటోంది.
అధికారపు కారిడార్లలో జారుతోన్న పట్టు..
చక్కగా మాట్లాడే నేర్పు, ఒప్పించే చాతుర్యం ఉన్న దళారులు పరిపాలనలో ఎదురయ్యే ప్రతి పరిస్థితికీ అందంగా ప్యాక్ చేసిన ప్రాజెక్టు ప్రతిపాదనలు, స్టార్టప్ ఆలోచనలు, సాఫ్ట్వేర్ పరిష్కారాలతో అధికారపు కారిడార్లలో తిరుగుతుంటారు.
మరోవైపు ప్రభుత్వ కాంట్రాక్టుల కోసం ప్రయత్నించే వారు తాము ఆర్ఎస్ఎస్ శాఖ నేపథ్యం కలవారమని లేదా నాగ్‌పూర్‌లోని హెడ్గేవార్ భవన్, ఢిల్లీలోని కేశవ్ కుంజ్లతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటూ తిరుగుతుంటారు.
మరికొందరు తమకు గుజరాత్‌తో ప్రత్యేక సంబంధాలున్నాయని కూడా గొప్పలు చెప్పుకుంటారు.
ఈ పేర్లు చెప్పుకుంటూ ప్రభావం చూపే ధోరణి రాష్ట్ర బీజేపీ నాయకులను కలవరపెడుతోంది.
గత పదేళ్లుగా పైస్థాయి నాయకత్వం చెప్పిందే ప్రశ్నించకుండా పాటించడం ఆనవాయితీగా మారిన అత్యంత కేంద్రీకృత వ్యవస్థలో పనిచేస్తూ వచ్చిన వారు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల వల్ల మరింత అసౌకర్యానికి గురవుతున్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడినవారు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, రోడ్డు ప్రమాదాల కేసుల్లో పట్టుబడినవారు కూడా తమకు పైస్థాయి పరిచయాలు ఉన్నాయని చెప్పుకోవడం పోలీసులకు పెద్ద సమస్యగా మారింది.
నిందితులు బీజేపీ నాయకుల పేర్లు ప్రస్తావిస్తూ వారితో తమకు బంధుత్వం లేదా సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పి పోలీసులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో ఒక బీజేపీ నాయకుడి వ్యాపార మిత్రుడికి చెందిన లాంబోర్గినీ కారు ప్రమాదానికి గురైంది. దీనిపై సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ వ్యంగ్యంగా దోషులను శిక్షించడానికి ముఖ్యమంత్రి బుల్డోజర్ను ఎందుకు పంపలేదు?’ అని ప్రశ్నించారు.
అయితే ఆయన చేసిన ఈ వ్యంగ్య వ్యాఖ్యకు ఎలాంటి సమాధానం రాలేదు.
అనేక సందర్భాల్లో అధికార పార్టీతో సంబంధాలు ఉన్నవారి కుమారులు, కుమార్తెలు తమకు ప్రత్యేక హక్కులు ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రజల దృష్టిలో బీజేపీ ప్రతిష్ఠ క్రమంగా దెబ్బతింటోంది.
(విచ్ఛిన్నమైన అధికారాలు, వ్యక్తి ఆరాధనలు, లావాదేవీల పొత్తులు ఉన్న ఈ కాలంలో భారతదేశపు మారుతున్న రాజకీయ సమీకరణాలకు పి రామన్ స్పష్టతనిస్తున్నారు. నినాదాలు, ప్రచారాల వెనుక దాగి ఉన్న భారతదేశ రాజకీయాలను నడిపిస్తున్న అధికార ఆటలు, ఆర్భాటాలు, సంక్షోభాలు, అభద్రతలను రియల్‌పాలిటిక్ పుస్తకంలో ఈ సీనియర్ జర్నలిస్ట్ బహిర్గతం చేస్తున్నారు.)
అనువాదం : మనోహర్ రాజు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
