బ్రెజిల్ అనుభవం చెప్పే పాఠం రిజర్వేషన్లు ఒక్కటే సరిపోతాయని కాదు.
బ్రెజిల్‌కు చెందిన పరిశోధకులే ప్రైవేట్ రంగంలో సమానత్వాన్ని తీసుకురావడం ఇంకా పూర్తికాలేదని, అలాగే జాతీయ జాతి సమానత్వ సూచీ కూడా ఇంకా ఏర్పాటు కాలేదని అంగీకరిస్తున్నారు.
కానీ నిరంతరం నవీకరించబడే జనాభా గణాంకాలతో అనుసంధానమైన చట్టబద్ధమైన బాధ్యతలు అమల్లో ఉంటే రాజకీయ నాయకుల ఇష్టానుసార నిర్ణయాలతో ఎప్పటికీ సాధ్యం కాని ఫలితాలను సాధించవచ్చని బ్రెజిల్ స్పష్టంగా చూపించింది. దీనికి విరుద్ధంగా మలేషియా అనుభవం ఒక హెచ్చరికగా నిలుస్తుంది.
హెచ్చరికగా మలేషియా అనుభవం..
1971 నుంచి మలేషియా తన న్యూ ఎకనామిక్ పాలసీ(ఎన్ఈపీ) అనంతర కార్యక్రమాల ద్వారా బుమిపుతెర మెజారిటీ వర్గానికి అంటే మలయ్‌లు, ఇతర స్వదేశీ జాతులకు విశ్వవిద్యాలయ ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, కార్పొరేట్ ఈక్విటీ యాజమాన్య లక్ష్యాలు, ప్రభుత్వ కొనుగోళ్లలో ప్రాధాన్యత వంటి రంగాల్లో ప్రత్యేక అవకాశాలను కల్పించింది.
జాతి ఆధారిత ఈ విధానాలు ఐదు దశాబ్దాల పాటు అమలుకావడంతో మొత్తం పేదరికం తగ్గింది. అలాగే బుమిపుతెర వర్గంలో ఒక మధ్యతరగతి కూడా ఏర్పడింది.
అయితే ఈ కార్యక్రమం వైఫల్యంలోని అంతర్లీన నిర్మాణమే భారత్‌కు ముఖ్యమైన హెచ్చరిక.
ఎన్ఈపీ అమలులో విధాన లక్ష్యాలు, వాటిని అమలు చేసే సాధనాలు, ఆశించిన ఫలితాలు వంటి అంశాలపై స్పష్టమైన, క్రమబద్ధమైన రూపకల్పన లేకపోయింది.
ఫలితంగా ఈ విధానాల ప్రయోజనాలు ప్రధానంగా రాజకీయంగా ప్రభావశీలమైన బుమిపుతెర ఉన్నత వర్గాలకే ఎక్కువగా చేరాయి.
అదే సమయంలో బుమిపుతెర సమాజంలోని అంతర్గత అసమానతలు మరింత పెరిగాయి.
ఉన్నత వర్గాల ఆధిపత్యాన్ని బలోపేతం చేసే సాధనంగా మారిపోయే ప్రమాదం..
తక్కువ స్థాయి ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఎక్కువగా చదువుకున్న బుమిపుతెర గ్రాడ్యుయేట్లు వృత్తిపరమైన ఉద్యోగాల కోసం ఇప్పటికీ ప్రధానంగా ప్రభుత్వ రంగంపైనే ఆధారపడుతున్నారు.
అంటే ప్రత్యేక అవకాశాల విధానం ప్రభుత్వం పైనే ఆధారపడే నిర్మాణాన్ని తొలగించడానికి బదులుగా మరింత బలపరిచిందనే విషయం స్పష్టమవుతోంది.
భారత్‌కు ఈ అనుభవం చెప్పే పాఠం నేరుగా కొంత అసౌకర్యంగా ఉన్నప్పటికీ ఇదే స్పష్టమైనది.
రిజర్వేషన్ వ్యవస్థ వల్ల కలిగే ప్రయోజనాలు నిజంగా అత్యంత వెనుకబడిన లబ్ధిదారులకే చేరుతున్నాయా లేదా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించని పక్షంలో కాలక్రమేణా ఆ వ్యవస్థ వెనుకబాటుతనాన్ని తొలగించే సాధనంగా కాకుండా అదే వర్గంలోని కొద్దిమంది ఉన్నత వర్గాల ఆధిపత్యాన్ని బలోపేతం చేసే సాధనంగా మారిపోయే ప్రమాదం ఉంది.
సీబీఐలో భారీ వ్యత్యాసాలు..
తెలంగాణ సర్వే గణాంకాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అంతర్గతంగా కూడా సమ్మిళిత వెనుకబాటుతన సూచీ (సీబీఐ)లో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని చూపిస్తున్నాయి.
కొన్ని ఉపవర్గాలు 116కు సమీపంలో స్కోరు సాధించగా, మరికొన్ని ఉపవర్గాలు 85కు సమీపంలో ఉన్నాయి.
అంటే, ఒకే వర్గంగా పరిగణించే సమాజాల్లో కూడా వెనుకబాటుతనం ఒకే స్థాయిలో లేదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇలాంటి సూక్ష్మమైన, ఆధారపూర్వకమైన సమాచారాన్నే మలేషియా ఎప్పుడూ క్రమబద్ధంగా సేకరించలేదు. ఆ లోటును విస్మరించిన కారణంగానే ఆ దేశం తరతరాలపాటు దాని ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
మూడో పాఠాన్ని దక్షిణాఫ్రికా 1998లో అమల్లోకి తీసుకొచ్చిన ఉపాధి సమానత్వ చట్టం అందిస్తుంది.
అయితే ఈ మూడు ఉదాహరణల్లో ఇదే అత్యంత నిరాశాజనకమైనది కూడా. వర్ణవివక్ష పాలన ముగిసిన తర్వాత రాజ్యాంగ స్ఫూర్తితో తీసుకొచ్చిన ఈ చట్టం ప్రకారం నిర్దిష్ట యజమానులు జాతి ఆధారంగా విడివిడిగా గణాంకాలను సమర్పించడం, సమానత్వ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం, ప్రాతినిధ్య లక్ష్యాలను నిర్దేశించుకోవడం తప్పనిసరి చేశారు.
కాగితంపై చూస్తే ఈ వ్యాసం భారత్‌కు అవసరమని వాదిస్తున్న విధానానికి అత్యంత దగ్గరగా ఉన్న నమూనా ఇదే. కానీ ఆచరణలో మాత్రం ఈ చట్టం ప్రభావం గణనీయంగా బలహీనపడింది.
అందుకు ప్రధాన కారణాలు ఉపాధి, కార్మిక శాఖలో పరిమిత అమలు సామర్థ్యం, కార్పొరేట్ సంస్థలు కేవలం పైపైకి నిబంధనలు పాటించడం, దిగువ స్థాయి ఉద్యోగాల్లో మాత్రమే వైవిధ్యాన్ని పెంచి, నాయకత్వ స్థానాల్లో మాత్రం జాతి ఆధిపత్యాన్ని యథాతథంగా కొనసాగించడం, అలాగే చిన్న సంస్థలు చట్టంలోని సంక్లిష్ట నిబంధనలను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడం.
దక్షిణాఫ్రికా అనుభవం..
దక్షిణాఫ్రికా అనుభవం ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. చట్టబద్ధమైన వ్యవస్థ అవసరమే అయినప్పటికీ అది ఒక్కటే సరిపోదు.
దానితో పాటు మరో మూడు అంశాలు కూడా తప్పనిసరిగా చేయాలి. అవి కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి నిజమైన సంస్థాగత స్వతంత్రత, చట్టాన్ని సమర్థంగా అమలు చేయడానికి తగిన వనరులు, అలాగే గణాంకాల ఆధారంగా లక్ష్యాలను క్రమం తప్పకుండా సమీక్షించి సవరించే వ్యవస్థ.
తగిన వనరులు, అధికారాలు కలిగిన అమలు సంస్థ లేకుండా చేసిన చట్టం ఆచరణలో అది ఒక సిఫారసుగా మాత్రమే మిగిలిపోతుంది.
బ్రెజిల్ సాధించిన పాక్షిక విజయం, మలేషియాలో ప్రయోజనాలు ఉన్నత వర్గాలకే పరిమితమవడం, దక్షిణాఫ్రికాలో అమలు లోపాలు ఈ మూడింటినీ కలిపే ఉమ్మడి అంశం ఒకటే.
అదే గణాంకాల నుంచి ఆశించిన ఫలితాల వరకు ఉండే సంస్థాగత వ్యవస్థ నాణ్యత.
ఈ మూడు దేశాల్లోనూ గణాంకాలను సేకరించాలనే రాజకీయ సంకల్పం, వాటి ఆధారంగా చర్యలు తీసుకోవాలనే రాజకీయ సంకల్పం కంటే బలంగా కనిపించింది.
అలాగే తప్పనిసరి అమలు వ్యవస్థ, స్వతంత్ర పర్యవేక్షణ, క్రమానుగత సమీక్ష వంటి యంత్రాంగాలు లేకపోవడంతో ఆధిపత్య వర్గాలు పునర్విభజన ప్రక్రియను తమ ప్రయోజనాలకు అనుగుణంగా మలచగలిగాయి, ఆలస్యం చేయగలిగాయి లేదా దాని ప్రభావాన్ని బలహీనపరచగలిగాయి.
ప్రస్తుతం భారత్ ఉన్న పరిస్థితి 2002లో బ్రెజిల్ లేదా 1997లో దక్షిణాఫ్రికా ఉన్న పరిస్థితిని తలపిస్తోంది. కొత్త గణాంకాలు ఉన్నాయి కానీ పాత సంస్థాగత వ్యవస్థలే కొనసాగుతున్నాయి.
ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే ఆ రెండు దేశాల అనుభవాల నుంచి భారత్ పాఠాలు నేర్చుకుంటుందా? లేక అవే తప్పులను మళ్లీ పునరావృతం చేస్తుందా?
కుల సమానత్వ బడ్జెట్ వ్యవస్థకు నిజంగా ఏమేమి అవసరం?
విధానపరమైన చర్చ కేవలం గణాంకాల సేకరణ వద్ద ఆగిపోకుండా వాటి ఆధారంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన తప్పనిసరి బాధ్యతల దిశగా సాగాలి.
తెలంగాణ సర్వే వెల్లడించిన గణాంకాలు అలాంటి మూడు కీలకమైన సంస్థాగత మార్పుల అవసరాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి.
మొదటిగా భారతదేశంలో ప్రభుత్వ వ్యయ ప్రణాళికలో భాగంగా ఒక కుల సమానత్వ బడ్జెట్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జాతీయ ఆరోగ్య మిషన్, పీఎం పోషణ పథకం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఎస్) వంటి ప్రతీ ప్రధాన సంక్షేమ పథకం అర్హత కలిగిన వర్గాల వివరాలు మాత్రమే కాకుండా, వాస్తవంగా లబ్ధి పొందిన వారి కులాల వారీ గణాంకాలను కూడా తప్పనిసరిగా వెల్లడించాలి.
ఉదాహరణకు ఒక జిల్లాలో అగ్రవర్ణాల జనాభా కేవలం 12 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, గృహ నిర్మాణ పథకం లబ్ధిదారుల్లో 40 శాతం మంది అగ్రవర్ణాలకు చెందినవారైతే అది సంక్షేమ పథకం విజయంగా కాకుండా పాలనా వైఫల్యంగా పరిగణించాలి.
అధిక స్థాయిలో వెనుకబాటుతనం ఉన్నప్పటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందడంలో ముస్లిం సమాజాలు అత్యంత వెనుకబడి ఉన్నాయని తెలంగాణ ఎస్ఈఈఈపీసీ సర్వే వెల్లడించింది.
కులాల వారీగా ప్రభుత్వ వ్యయాన్ని ఆడిట్ చేసే వ్యవస్థ ఉంటే గనక ఇలాంటి అసమానతలు స్పష్టంగా వెలుగులోకి వచ్చి వాటిపై ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టే అవకాశం ఉంటుంది.
రెండవది ప్రత్యేక అవకాశాల విధానం విస్తృతమైన వర్గీకరణల నుంచి మరింత కచ్చితమైన ఉపవర్గీకరణ వైపు మారాలి.
తెలంగాణ సర్వే ప్రకారం ఎస్టీలలో నక్కల తెగకు సమ్మిళిత వెనుకబాటుతన సూచీ (సీబీఐ) 112 ఉండగా, లంబాడీ తెగకు అది 95గా ఉంది. అలాగే ఎస్సీలలో డక్కలి వర్గం 116 స్కోరు సాధించగా మరికొన్ని ఉపవర్గాలు 85కు సమీపంలో ఉన్నాయి.
అయితే ఎస్టీలందరినీ ఒకే స్థితిలో ఉన్నట్లుగా పరిగణించే రిజర్వేషన్ వ్యవస్థ నిజంగా అత్యంత వెనుకబడిన వర్గాలను లక్ష్యంగా చేసుకున్న వ్యవస్థగా చెప్పలేం.
దీంతో కుల జనగణన గణాంకాల ఆధారంగా ప్రతి పదేళ్లకోసారి కులాల వెనుకబాటుతనంపై సమగ్ర సమీక్ష నిర్వహించి, ఉపవర్గీకరణను తప్పనిసరిగా పునఃసమీక్షించాలి.
అలాగే అత్యంత వెనుకబడిన సమాజాలకే సంస్థాగత ప్రయోజనాల్లో అత్యధిక వాటా నిజంగా అందుతోందా లేదా అనే విషయాన్ని స్వతంత్రంగా అంచనా వేసే వ్యవస్థ కూడా ఉండాలి.
మూడవది పట్టణ ప్రణాళికలో కులాల వారీ వెనుకబాటుతన పటాలను(మ్యాపింగ్) తప్పనిసరి ప్రాతిపదికగా చేర్చాలి.
తెలంగాణ ఎస్ఈఈఈపీసీ సర్వే గణాంకాలు ఏమి చెబుతున్నాయంటే నగరాల అభివృద్ధి వల్ల కలిగే ప్రయోజనాలను అగ్రవర్ణాలు అసమానంగా ఎక్కువగా పొందుతుండగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు మాత్రం ఇప్పటికీ మౌలిక సదుపాయాలు గ్రామీణ మురికివాడల కంటే కొద్దిగా మాత్రమే మెరుగ్గా ఉన్న పట్టణ అనధికారిక నివాస ప్రాంతాల్లోనే అధికంగా కేంద్రీకృతమై ఉన్నాయి.
అంటే పట్టణీకరణ కుల అసమానతలను అంతం చేయకపోగా వాటిని కొత్త రూపంలో, కొత్త ప్రాంతాలకు తరలిస్తుంది.
దీంతో మొదటి శ్రేణి, రెండో శ్రేణి నగరాల మాస్టర్ ప్లాన్లలో కులాల వారీ వెనుకబాటుతనం అధికంగా ఉన్న ప్రాంతాలను తప్పనిసరిగా గుర్తించాలి.
ఆ మ్యాపింగ్ ఆధారంగానే మౌలిక సదుపాయాలు, పాఠశాలలు, తాగునీటి వసతి, రహదారులు, ఆరోగ్య కేంద్రాల వంటి వాటిపై పెట్టుబడులను కేటాయించాలి.
కేవలం జనాభా సాంద్రత లేదా భూవినియోగ వర్గీకరణల ఆధారంగా కాకుండా ఎవరు ఎక్కడ నివసిస్తున్నారు అనే సామాజిక వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రణాళిక రూపొందించాలి.
కులాలను లెక్కించడం అవసరమే కానీ అది ఒక్కటే సరిపోదు..
తెలంగాణ సర్వే ఇలాంటి ప్రక్రియను పరిపాలనాపరంగా అమలు చేయడం సాధ్యమేనని, విశ్లేషణాత్మకంగా ఇది బలమైనదని, అలాగే ఇటువంటి గణాంకాలు అత్యంత అవసరమని నిరూపించింది.
అయితే గణాంకాలు ఉండటం ఒక్కటే ఎలాంటి మార్పును తీసుకురాదు.
దశాబ్దాల పాటు కుల జనగణనను వ్యతిరేకించిన అదే రాజకీయ-ఆర్థిక శక్తులు ఇప్పుడు దాని ఫలితాల ఆధారంగా చర్యలు తీసుకోవడాన్నీ ప్రతిఘటిస్తాయి.
కుల జనగణన తమకు లభిస్తున్న సామాజిక ప్రయోజనాలను బహిర్గతం చేస్తుందనే భయంతో ఉన్న ఆధిపత్య వర్గాలు గణాంకాలు వెలువడిన తర్వాత కూడా ఆ ప్రయోజనాలను కాపాడుకోవడానికి న్యాయస్థానాల్లో సవాళ్లు విసరడం, పరిపాలనా జాప్యం కల్పించడం, నిర్వచనాలపై వివాదాలు సృష్టించడం వంటి ఇతర మార్గాలను ఆశ్రయించే అవకాశం ఉంది.
కుల జనగణన విలువను నిర్ణయించేది దాని పద్ధతి ఎంత మెరుగ్గా ఉందనేది కాదు. ఆ గణాంకాల ఆధారంగా ప్రభుత్వం చట్టపరంగా ఏమి చేయాల్సి వస్తుందనేదే అసలు ప్రమాణం.
ఆ చట్టబద్ధమైన బాధ్యతను సృష్టించనంత వరకు, అలాగే వెనుకబాటుతన సూచీలను నిర్దిష్ట కాలపరిమితితో, స్వతంత్రంగా తనిఖీ చేయబడే పునర్విభజన చర్యలుగా మార్చే అధికారాన్ని కలిగిన నిజమైన స్వతంత్ర, చట్టబద్ధ సంస్థను ఏర్పాటు చేయనంత వరకు, ప్రతీ కేంద్ర మంత్రిత్వ శాఖ, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అమలు పురోగతిని ప్రజలకు వెల్లడించే అనుసరణ నివేదికలను తప్పనిసరిగా ప్రచురించే వ్యవస్థను తీసుకురానంత వరకు కుల జనగణన కేవలం ఒక ఎక్స్‌రేలా మాత్రమే మిగిలిపోతుంది.
వ్యాధిని చూపిస్తుంది కానీ దానికి చికిత్స మాత్రం జరగదు.
ప్రస్తుతం దేశానికి అత్యంత అవసరమైనది గణాంకాలు కాదు. ఆ గణాంకాలను సామాజిక మార్పుకు దారితీసే చర్యలుగా మార్చగల సంస్థాగత వ్యవస్థ.
అప్పుడే కుల జనగణన ఒక సమాచార సేకరణగా కాకుండా సామాజిక న్యాయానికి దారితీసే విధాన సాధనంగా మారుతుంది.
అనువాదం: మనోహర్ రాజు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
