గతంలో జరిగిందానికి, ఇప్పుడు జరుగుతున్న దానికి పెద్దగా తేడా ఏమీ లేదు. ఒకటే తేడా. గతంలో తనకు ఎంతో ఇష్టమైన ప్రత్యర్థి కాంగ్రెస్ విషయంలో బీజేపీ ఇలానే వ్యవహరించింది. కానీ ఇప్పుడు జరుగుతున్నది దానికి పూర్తి విరుద్ధం. నరేంద్ర మోదీ పప్పుగా మారుతున్నాడు.
కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్‌లో ఈ సంవత్సరం జూన్‌లో నిరసన కార్యక్రమం ప్రారంభించినప్పుడు చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి.
ప్రభుత్వమే మొదట్లో ఈ నిరసనలను తీవ్రమైనవిగా పరిగణించలేదు. మరోవైపు కాస్తంత విసుగు, ఇదేమైనా ఆమ్ ఆద్మీ పార్టీకి బీ-టీమా, సీజేపీ కేవలం విదూషక పాత్రకే పరిమితమా అన్న ప్రశ్నలు అందరి మెదడులలోనూ కదిలాడాయి.
అదే సమయంలో సోనమ్ వాంగ్‌చుక్ మంచివాడేనని, చందా చోరీ నుండి దేశం దృష్టి మళ్లించడానికి ప్రభుత్వమే సీజేపీని తెరమీదకు తెచ్చిందని, హిందువులైన యువకుల పట్ల బీజేపీ సున్నితంగా వ్యవహరిస్తుందని, జెన్-జీ(నవతరం యువత) ఫోన్లో ఉన్నంత క్రియాశీలకంగా క్షేత్రస్థాయిలో ఉండరని, సీజేపీకి ఒక సిద్ధాంతం అంటూ లేకపోవడం ప్రధాన లోపం అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి.
అయితే వీళ్లు ఏదో ఒకటి సాధిస్తారని మాత్రం నేను నమ్మాను. దానికి కారణం: ఏమాత్రం ఆలోచన లేకపోతే మోదీ-షాల జోడీని ఎదుర్కోవటానికి సాహసిస్తారా? కేంద్ర ప్రభుత్వంలోని కుయుక్తుల విభాగానికి ఉన్న అస్త్రశస్త్రాలు అన్నీ ఇన్నీ కావు.
పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే, కొంతమంది కుర్రోళ్లు నిర్భయంగా ఆ స్థాయిలో నినాదాలు ఇస్తున్నారంటే కూర్చొని వినాల్సిన విషయం ఏదో ఉండి ఉంటుంది.
సోషల్ డెమోక్రటిక్ వేదిక..
దీప్కే భారతదేశంలో రానున్నాడు అన్న వార్త వచ్చినప్పుడు వినిపించిన కథనాలు ఏమిటి? ఆయనను ఎయిర్‌పోర్ట్‌లోనే అరెస్టు చేస్తారు అనుకున్నారు.
ఈ తరం పిల్లలు వాళ్ల తల్లిదండ్రులకు కొద్దిపాటి కొనసాగింపు మాత్రమే అనుకున్నాను. అంటే తల్లిదండ్రులు భజనలతో కాలం గడిపితే, ఈ తరం పిల్లలు భజనలతోపాటు కాలక్షేపం కబుర్లు, సమావేశాలతో కాలం గడుపుతారు అన్నది ఒక అంచనా.
నిలువెత్తు నిరాశలు కమ్ముకున్న సమయం ఇది. కానీ ఇప్పుడు చూడండి – ఏ నోట విన్నా ఆ కుర్రవాళ్ల పేర్లే.
ఈ దేశపు యువత అన్ని రకాల విభజన రేఖలను అధిగమించి దేశం ముందు హీరోగా నిలుచుంది. సీజేపీ వెబ్సైట్లో వాళ్ల గురించి వాళ్లే రాసుకున్నట్లుగా ‘అంతర్జాలంలో పిచ్చాపాటీ మాట్లాడుకునే దశనుండి సోషల్ ఇష్యూ డెమోక్రటిక్ వేదికగా ఎదిగాం’.
భక్తులు, ఉదారవాదుల మధ్య ఉన్న వైరుధ్యాన్ని బద్దలు కొట్టడం సీజేపీ సాధించిన అతిపెద్ద విజయం. నిరసన కార్యక్రమం కొనసాగినంత కాలం వీళ్ల గురించి పల్లెత్తు మాటలు వినపడలేదు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా బొద్దింకలు అని మాత్రమే విన్నాము తప్ప హిందూ మేధావులకు వ్యతిరేకంగా ఉదారవాదులు అన్న వాదన వినిపించలేదు. దీంతో ఈ ఉద్యమం పరిధి విస్తరించడానికి అవకాశం ఏర్పడింది.
జోహ్రాన్ మందానీ భరించదగిన మోతాదులోనే ఇంటి అద్దెలు అన్న నినాదాన్ని జనం మనసులో నాటుకుపోయేలా చేసినట్లుగానే, సీజేపీ ఉద్యమం కూడా జవాబుదారీతనం అన్న భావన ప్రజలను ఆవహించేంతవరకు చర్చకు పెట్టింది. జవాబుదారీతనం అన్నది ఒక తటస్థ భావన.
ఈ ఉద్యమం రంగుల హరివిల్లులా ఆకాశమంత ఎత్తుకు ఎగిసేసరికి సమాజంలో ఉన్న ఆగ్రహవేశాలు, తీవ్ర నిరసనలు బట్టబయలయ్యాయి.
వ్యంగ్య విమర్శలకు వేదికగా మారిన మోదీ..
ప్రభుత్వం పాత సిలబస్‌కే పరిమితమైంది. నిరసనకారులను వేధించటానికి సిద్ధమయింది. హిందుత్వ కాల్బలం రంగప్రవేశం చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న సోషల్ మీడియా పోస్టులను ఆయా సామాజిక మాధ్యమాల నుండి తొలగించాలన్న ఆదేశాలు వెళ్లాయి.
ఈ ఉద్యమం వెనుక విదేశీ అదృశ్య హస్తం ఉందని ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ ఉద్యమానికి నిధులు ఎక్కడ నుంచి సమకూర్చుకుంటున్నారు అని ఒక మీడియా సంస్థ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ అమాయకపు ముఖం పెట్టి ‘జంతర్ మంతర్‌లో ధర్నాకు వెళ్లడానికి జ్యూతీ షోరూమ్స్ నాకు వంద రూపాయలు పంపించాడు’ అంటూ సమాధానం ఇచ్చాడు.
ఈ వ్యాఖ్య రాసే సమయానికి తన ఆశువు ప్రసంగాలతో సభా వేదికలను క్రిక్కిరిసేలా చేయగల సమర్థుడైన సూపర్ హీరో అని మోదీకి ఉన్న గుర్తింపు గందరగోళంలో పడింది. ఆయన కోల్పోయిన నైతిక హోదా ఆయనే తయారు చేస్తున్న సంక్షిప్త సందేశాల్లో కనిపిస్తోంది. ఈ యువత దారితప్పలేదు. దారి దాటుకుంటూనే వచ్చారు. ఈ ప్రభుత్వం, దానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ ఇంతకాలం ఈ యువతను దారితప్పించింది అని అర్థం చేసుకున్నారు.
ఒక చిన్న పాప వాడిన పదాలు ఆధారంగా చేసుకుని నన్నేదో ఆడిపోసుకున్నారని సానుభూతి పొందటం కోసం జరుగుతున్న ప్రయత్నాలు చూస్తే బడిలో పిల్లాడు టీచర్ దగ్గరకి వెళ్లి ఫలానా విద్యార్థి ఏడిపిస్తున్నాడని ఫిర్యాదు చేస్తున్న వైనం కనిపిస్తోంది. కానీ ప్రస్తుత సందర్భంలో హెడ్ మాస్టర్‌గా ఉన్న ప్రధానమంత్రి తన రాజకీయ శిబిరంలో ఉన్న ఆయా విద్యార్థుల తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తున్నారు.
మోదీ చేసే ప్రతి రీల్ జెన్ జీ కి కొత్త మేతగా మారింది. వ్యంగ్య బాణాలు పెంచింది. ప్రభుత్వం ఎన్ని వందలు, వేలు రీల్స్, పోస్టర్లు అంతర్జాలం నుండి తొలగిస్తూ ఉందో అంతకు మించిన సమాచారం పోస్ట్ అవుతూ ఉంది.
కోట్ల సంఖ్యలో ఈ సమాచారం యువత మధ్య పంపిణీ అవుతోంది. ఈ విప్లవం టీవీలకు ఎక్కకుండా బీజేపీ జాగ్రత్తలు తీసుకుంటే, దాన్నే ఆదాయ వనరుగా మార్చుకుంది జెన్ జీ.
గతంలో బీజేపీకి అత్యంత ప్రియమైన ప్రతిపక్షం కాంగ్రెస్ పట్ల బీజేపీ ఏ విధంగా వ్యవహరించిందో అదే వాయనం ఇపుడు అందుకుంటోంది బీజేపీ. నరేంద్ర మోదీ పప్పుగా మారుతున్నాడు.
సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై వీక్షకుల స్పందన చూస్తే ప్రతివాక్యం హేళనకు సాధనంగానే కనిపిస్తోంది. దేవుడంతటి వాడు మానవమాత్రుడుగా మారాడు. వ్యంగ్యానికి లక్ష్యంగా మారాడు.
హిందుత్వ అనేది నుదుట బొట్టు పెట్టుకున్న కొందరు దుండగులు వీరంగం వేస్తూ మహిళలపై అత్యాచారాలకు సైతం సిద్ధమని ప్రకటనలు ఇచ్చే గుంపు అన్న భావన స్థిరపడింది.
మితవాద బృందాల్లో “ఈరోజు వీడికి మూడింది” అన్న మాటలు సాధారణంగా వినిపిస్తూ ఉంటాయి.
ఖాళీ రైలుకి పచ్చ జెండా..
ఈ విషయాలు రాస్తున్నప్పుడు నాకు ఒక ఫోటో జ్ఞాపకం వస్తోంది. కొత్తగా వచ్చిన వందే భారత్ రైలును పచ్చ జెండా ఊపి ప్రారంభిస్తున్న మోదీ ఫోటో అది. రైల్లో మాత్రం ప్రయాణికులు లేరు. ఖాళీ రైలు లాగానే మోదీ కూడా ఖాళీ అయ్యారు. ఈ ఉదంతాన్ని మరోలా కూడా అర్థం చేసుకోవచ్చు.
ప్రయాణికులున్న రైలు ఎపుడో స్టేషన్ దాటిపోయింది. కానీ కీర్తి కిరీటం తగిలించుకున్న మోదీ మాత్రం ఒక్కడే స్టేషన్లో నిలబడి పట్టాల మీద లేని రైలుకు జెండా ఊపుతున్నాడని కూడా అర్థం చేసుకోవచ్చు.
నిద్రనుంచి లేచి ప్లేటో నిర్మించిన గుహ నుండి యువత తప్పించుకోవడంతో ఇకపై మోదీ స్లీపర్ రైలుకు కూడా పచ్చ జెండా ఊపే రోజులు దాటిపోయాయి.
సందేశంగా మారిన మాధ్యమం..
మారిన వాస్తవాన్ని గుర్తించి దానికి సిద్ధం కావడమే ఇపుడు బీజేపీ, మోదీ చేయాల్సిన పని. ఆ పని చేయలేరు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంతో బీజేపీ బందీ అయ్యింది.
విద్యారంగంలో చెప్పుకోదగ్గ మార్పులు వచ్చేదేమీ ఉండదు. ఎందుకంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంతకన్నా చేయగలిగేది ఏమీ లేదు కాబట్టి. వాళ్లలో అత్యంత సమర్థత కలిగిన వాళ్లను ముందుకు తెచ్చారు.
కాంగ్రెస్ వంటి అవకాశవాద పార్టీలు ప్రస్తుత పరిస్థితులను ఉపయోగించుకునే ప్రయత్నం చేయవచ్చు. గతాన్ని వైభవోపేతంగా ఊహించుకునే సిద్ధాంతానికి కట్టుబడిన బీజేపీ లాంటి పార్టీలకు అదే సిద్ధాంతం గుదిబండగా మారుతుందని గుర్తిస్తుంది.
రేపటి గురించిన హెచ్చరికలు గుర్తించటానికి బదులు వాటిని కనిపించకుండా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు మోదీ. భారతీయ సమాజం జంతర్ మంతర్‌లో రంగులు నిండిన గోడ కాదు. ఊహాజనితమైన ఉప్పెనకు సంకేతం.
యువతపై మోహన్ భాగవత్ వ్యాఖ్యలు..
సీజేపీ నిరసనలు జరుగుతున్నపుడు మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు గుర్తు తెచ్చుకుంటే తరాల మధ్య అంతరం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది.
హైదరాబాద్‌లో విశ్వ మాంగల్య మహాసభలో మాట్లాడుతూ భాగవత్ “జెన్ జీ ని తేలికగానే మచ్చిక చేసుకోవచ్చు. భావోద్వేగం ఎక్కువ వాళ్లకు. ప్రశాంతంగా ఆలోచించరు. వాళ్లకి అందుబాటులో ఉన్నది సరైనదే అనిపిస్తే దాన్నే ప్రమాణంగా భావిస్తారు” అన్నారు.
మహిళా విముక్తి ఉద్యమం సమాజంలో ఒక చీలిక తెచ్చింది. “స్త్రీ విముక్తి ఆందోళన మొదలై విస్తరించిన తర్వాత సార్వత్రిక ఆమోదం పొందింది. అలా ఒక దశ గడిచింది. కొంతకాలం తర్వాత దారి తప్పాము అని వారికి వారే గుర్తించారు. ఈ దేశంలో కొన్ని తరాలను నాశనం చేశాము అని అర్థం చేసుకున్నారు” అని ఆయన అన్నారు.
ప్రజాభిప్రాయాన్ని మార్చలేరు..
ప్రజల సాధారణ రాజకీయ స్పందన, ఎన్నికల ఫలితాల మధ్య ఉన్న అగాధాన్ని సీజేపీ ఉద్యమం ముందుకు తెచ్చింది. ఈ అగాధాన్ని గుర్తించాల్సిన పరిస్థితి కల్పించింది.
ఏదో ఒకరకంగా బీజేపీ ఎన్నికలు గెలుస్తుంది. ఎస్ఐఆర్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్) రూపంలో ముస్లింలను ఓటర్ల జాబితా నుండి కనుమరుగు చేయటం ద్వారానో, గెలుపు ఓటములు హోరాహోరీగా ఉన్నపుడు ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో చివరి నిమిషంలో ఇబ్బడి ముబ్బడిగా ఓటింగ్ పెంచడం ద్వారానో, గెలిచిన ఎంపీలను కొనుగోలు చేయటం ద్వారానో బీజేపీ తన జైత్రయాత్ర కొనసాగిస్తూనే ఉంటుంది.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు సంబంధించిన రసీదులు బయట పెట్టాలని ప్రతిపక్షాలు చాలాకాలంగా డిమాండ్ చేస్తూ వచ్చాయి. అంకెల్లో వికలాటకం పెట్టవచ్చు కానీ జనం ఏం ఆలోచించాలి, ఏమి చెప్పాలి, ఎటువంటి భావన కలిగి ఉండాలి అన్న విషయాన్ని నిర్దేశించలేము.
ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయని ముందే తెలుసు కాబట్టి వంచనకు పాల్పడవచ్చు. అంటే జనాభిప్రాయం మారుతుందనే విషయం తెలుసు.
ఎన్నికలు అర్థవంతంగా జరిగే సమయంలో ఇందిరా గాంధీ విషయంలో ప్రజల మనోభావాలు ఓట్ల పెట్టెల్లో వ్యక్తమయ్యాయి. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ఒక రక్షణ కవచం లాగా పనిచేశాయి. ప్రజాగ్రహం వ్యక్తీకరణకు వేదికలా పనిచేశాయి. ఇందిరా ఓడిపోయారు, తిరిగి గెలిచారు. ఇప్పటిలాగా ఆ భావోద్వేగాల వ్యక్తీకరణకు అవరోధం ఏర్పడితే ప్రజలకు వీధుల్లోకి రావడం తప్ప మరో మార్గం లేదు.
జంతర్ మంతర్‌లో జరిగింది అదే. ఎముకలు విరగ్గొట్టి లేదా పెల్లెట్ తుపాకులతోనో లేదా కేసులు పెట్టడం ద్వారానో రోడ్లు నిర్మానుష్యం చేయవచ్చు. కానీ ఉద్యమం అంతర్జాల వేదికల ద్వారా విస్తరిస్తూనే ఉంది. లావాను వెదజల్లే అగ్నిపర్వతంలా కుతకుతలాడుతూనే ఉంది. చలనం ఆగలేదు. మాధ్యమం ఇక్కడ సందేశంగా మారింది.
సీజేపీ అసలు ఎజెండా..
ఈ పరిణామాలన్నీ సీజేపీ ప్రతిపాదించిన వ్యవస్థాగత సంస్కరణల గురించి మనల్ని ఆలోచింపజేస్తాయి. ఈ ప్రత్యామ్నాయాలు, పరిష్కారాలు, ప్రతిపాదనలు ప్రజాస్వామ్య సంస్కరణల కోసం జరిగే సుదీర్ఘ పోరాటంలో అంతర్భాగం.
న్యాయమూర్తులకు పదవీ విరమణ అనంతర నియామకాల రద్దు: “పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు ఆకర్షణీయమైన రాజకీయ నియామకాలు, రాజ్యసభ సీట్లు కేటాయించడం వంటివి వ్యవస్థాగతంగా భిన్న ప్రయోజనాల మధ్య వైరుధ్యం.”
ఓటర్ల తొలగింపు గురించి: ‘భౌతికంగా సర్వే చేసి తనిఖీ చేయకుండా, ప్రజలకు నోటీసులు ఇవ్వకుండా, పారదర్శకమైన పద్ధతులు పాటించకుండా వందలు, వేలమంది ఓటర్లను ఓటర్ల జాబితాలోంచి తొలగించడం, ఇటువంటి చర్యలకు పాల్పడిన ఎన్నికల సంఘం సీనియర్ అధికారులు, ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ వంటి వారిపై యూఏపీఏ(అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్) చట్టం కింద కేసులు నమోదు చేయాలి’.
అంతేకాదు: ఓటర్ల తొలగింపుకు సంబంధించిన వివాదంపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఎన్నికల సంఘం దర్యాప్తు జరిపి 48 గంటల లోపల సవరణ చేయాలి. ఓటర్ల జాబితాలో పేర్ల గురించి ఫిర్యాదు చేస్తే దాన్ని పాలనాపరమైన జాప్యంతో అపరిష్కృతంగా వదిలేస్తున్నారు.
కొన్ని కొన్ని చోట్ల ఎలక్షన్లు పూర్తయ్యే వరకు ఈ ఫిర్యాదులు పరిష్కారం కావడం లేదు. ఒక హక్కును అనుభవించడంలో ఆలస్యానికి అవకాశం ఇవ్వటం అంటే హక్కును నిరాకరించడమే.’
ఇవేవీ ఆచరణ సాధ్యం కాని డిమాండ్లు కావు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వార్త వెలువడిన తర్వాత సీజేపీ అధికార ప్రతినిధి ఆశుతోష్ రాంకా మాట్లాడుతూ ఇది ఆరంభం మాత్రమేనని తొలి వికెట్టు పడిందని వ్యాఖ్యానించారు.
చూడబోతే ఈ పరిణామాలు ఆసక్తికరమైన భారీ టెస్ట్ మ్యాచ్‌గా మారనున్నాయి అనిపిస్తుంది. ఈ ఆటలో అంపైర్ మోసగించవచ్చు. ఆట నిబంధనలే మార్చవచ్చు. మ్యాచ్ ఫిక్సింగ్ జరగవచ్చు. ఎన్ని జరిగినా ఒకటి మాత్రం నిజం: ఆట డ్రాగా ముగియదు. గెలిచే పప్పు ఎవరు అన్నదే ఇక్కడ పందెం.
పలాష్ కృష్ణ మహారోత్ర
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
