స్వాతంత్ర్యం వచ్చిన 79 సంవత్సరాల తర్వాత, పౌరులను స్వతంత్రంగా ఆలోచించే మనసులను చూసి భయపడమని ప్రజాస్వామ్యం కోరకూడదు.
స్వాతంత్ర్యం అనేది రాజకీయ ఆధిపత్యాన్ని ఒక వలస రాజ్య పాలన నుంచి సార్వభౌమాధికారం కలిగిన ప్రజలకు బదిలీ చేసింది. పాలించేవారికి, పాలింపబడే వారికి మధ్య ఉన్న సంబంధాన్ని ప్రజాస్వామ్యం మార్చివేస్తుందని భావించారు.
ప్రజాస్వామ్యంలో పౌరులు ప్రభుత్వం చెప్పే జ్ఞానాన్ని మింగేసే శ్రోతలు మాత్రమే కారు. తమను పాలించేవారిని ప్రశ్నించడానికి, వారి విధానాలతో విభేదించడానికి, వారికి వ్యతిరేకంగా సంఘటితం కావడానికి, ఒక భిన్నమైన సమాజాన్ని ఊహించుకోవడానికి పౌరులకు రాజ్యాంగబద్ధమైన హక్కు ఉంది.
ప్రధాని నోట కొత్త వర్గీకరణ..
అయితే, భారతదేశపు 80వ స్వాతంత్ర్య దినోత్సవం ఎర్రకోట నుంచి ఒక అసాధారణమైన హెచ్చరికతో ముగిసింది. సాయుధ నక్సలిజం అంతానికి చేరువైందని ప్రకటిస్తూనే, ప్రధాని నరేంద్ర మోదీ మరొక శత్రువు వైపు మళ్లారు.
సాయుధ నక్సల్స్ ఓడిపోయి ఉండవచ్చని, కానీ “దిమాగీ నక్సల్స్”(మానసిక నక్సల్స్) ఇంకా మిగిలే ఉన్నారని ఆయన అన్నారు. వారిని గుర్తించి, సమాజం నుంచి వేరు చేయాలని కోరారు.
ఇక్కడ వాడిన పదాల ఎంపిక చాలా ముఖ్యమైనది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత, దేశంలో రాజకీయ స్వేచ్ఛను జరుపుకునే అత్యంత ముఖ్యమైన వార్షికోత్సవం, ప్రజల ‘దిమాగ్'(ఆలోచన/మనస్సు) ప్రాతిపదికన వర్గీకరించబడిన ఒక తరహా ప్రజలను గుర్తించి, వేరు చేయాలని కోరడానికి వేదికగా మారింది.
ఆలోచనే అనుమానమా?
సాయుధ నక్సలైట్‌ను కనీసం భావాత్మకంగానైనా సాయుధ తిరుగుబాటులో భాగస్వామ్యం ద్వారా గుర్తించవచ్చు. కానీ ఒక “దిమాగీ నక్సల్”ను గుర్తించడం అంత సులభం కాదు.
ఈ విశేషణం అనుమానపు పరిధిని మారుస్తుంది. ప్రశ్నించే కోణం, ఒక వ్యక్తి ‘ఏమి చేస్తున్నాడు’ అనే దాని నుంచి, ఆ వ్యక్తి ‘ఏమి ఆలోచిస్తున్నాడని భావిస్తున్నారు’ అనే వైపునకు మళ్లుతుంది.
నక్సలిజానికి ఒక నిర్దిష్టమైన రాజకీయ చరిత్ర ఉంది. ఆ పేరు పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్బరీలో 1967లో వచ్చిన తిరుగుబాటు, ఆ తర్వాత ఉద్భవించిన మావోయిస్ట్ రాజకీయ ఉద్యమాల నుంచి వచ్చింది. దశాబ్దాల పాటు, నక్సలైట్ అనే పదం ప్రధానంగా సాయుధ విప్లవాత్మక రాజకీయాలతో ముడిపడి ఉంది.
‘అర్బన్ నక్సల్’ ముద్ర..
ఆ తర్వాత “అర్బన్ నక్సల్”(పట్టణ నక్సల్) అనే పదం వచ్చింది. ఈ పదం ముఖ్యంగా 2018లో భీమా కోరేగావ్ కేసుకు సంబంధించి కార్యకర్తలు, లాయర్లు, మేధావుల అరెస్టుల సమయంలో విస్తృత రాజకీయ ప్రాచుర్యాన్ని పొందింది.
ఈ రాజకీయ వర్గీకరణ సాయుధ తిరుగుబాటులో పాల్గొన్నారనే ఆరోపణలు ఉన్నవారిని దాటి విస్తరించడం ప్రారంభించింది.
చరిత్రకారిణి రోమిలా థాపర్ ఈ మార్పు ప్రాముఖ్యతను గుర్తించారు. 2018లో ఆమె ప్రసంగిస్తూ(తరువాత 2019లో ప్రచురితమైంది), “ఉదారవాదులను, మేధావులను” “అర్బన్ నక్సల్స్” అని ముద్ర వేస్తున్నారని పేర్కొన్నారు. ఆమె ఆందోళన నిర్దిష్ట వ్యక్తులపై వచ్చిన ఆరోపణల కంటే పెద్దది.
చారిత్రకంగా సాయుధ తిరుగుబాటుతో ముడిపడి ఉన్న ఒక భాష, విద్యావేత్తలు, లాయర్లు, రచయితలు, కవులు, సామాజిక న్యాయం గురించి ప్రశ్నించేవారిని కూడా తన పరిధిలోకి తీసుకోవడం ప్రారంభించినప్పుడు ఏమి జరుగుతుంది?
విశ్వవిద్యాలయాల్లోకి చొరబడిన వర్గీకరణ..
ఈ వర్గీకరణ ప్రయాణం అక్కడితో ఆగలేదు. 2025 నాటికి, ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ యోగేష్ సింగ్ విశ్వవిద్యాలయాల లోపల “అర్బన్ నక్సల్స్” ఉన్నారని మాట్లాడారు. ప్రొఫెసర్లు “మనస్సులను కలుషితం చేస్తున్నారని” ఆరోపించారు.
అంతేకాకుండా, పింజ్రా తోడ్ వంటి ఉద్యమాలను కూడా ఆయన విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై విద్యార్థులు, అధ్యాపకులు నిరసన వ్యక్తం చేశారు.
ఇది ఒక సుదీర్ఘ ప్రయాణం అడవి నుంచి నగరానికి. నగరం నుంచి విశ్వవిద్యాలయానికి. కార్యకర్త నుంచి ప్రొఫెసర్‌కి, విద్యార్థికి. ఇప్పుడు, విశ్వవిద్యాలయం నుంచి స్వయంగా మనిషి ఆలోచన/మనస్సు స్థాయికి.
అనుమానించే భౌగోళిక విస్తృతి క్రమంగా కుంచించుకుపోయి, చివరికి చేరుకున్న ఏకైక స్థానం మనిషి ‘ఆలోచన’.
సందేహాల వలయంలో మేధావులు..
కానీ అసలు ఒక ఆలోచనను లేదా మనస్సును నక్సల్‌గా మార్చేది ఏమిటి? తీవ్రమైన అసమానతలను విమర్శించడం దానికి అర్హత సాధిస్తుందా? ఆదివాసీల నిర్వాసితంపై పరిశోధన చేయడం దాంట్లోకి వస్తుందా? గనుల ప్రాజెక్టును వ్యతిరేకించడమా? మార్క్సిస్ట్ అధ్యయనాలా? మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తరఫున వాదించే లాయరా?
ప్రభుత్వ హింస ఆరోపణలను నమోదు చేసే విలేకరియా? లేక భూమి కోల్పోవడం, నిర్వాసితులు కావడం, పాలనా లోపాలే తిరుగుబాట్లకు మద్దతు లభించడానికి కారణమని వాదించే ఆర్థికవేత్తనా?
ప్రధానమంత్రి భిన్నాభిప్రాయాలు ఉన్నవారిని ఉద్దేశించి ఈ మాటలు అనలేదని వాదించవచ్చు. ఆయన మాటలు “దిమాగీ నక్సల్స్”ను హింస, అలజడులను సృష్టించే ప్రయత్నాలతో ముడిపెట్టాయి. ఆ పదానికి ఉన్న అర్థం అంతే అయితే, సమస్య చాలా సులువవుతుంది. గూడుపుఠాణీ, రెచ్చగొట్టడం, చట్టవిరుద్ధమైన సంఘాలు, నిషేధిత సంస్థలకు సహాయం చేయడం వంటి అంశాలను ఎదుర్కోవడానికి భారతీయ క్రిమినల్ చట్టంలో ఇప్పటికే నిబంధనలు ఉన్నాయి.
ఈ వర్గీకరణలకు చట్టబద్ధంగా నిర్దేశించిన ప్రవర్తన, ఆధారాలు అవసరం. అలాంటప్పుడు, మరొక వర్గీకరణ ఎందుకు అవసరం?
ఒకవేళ “దిమాగీ నక్సల్” అనేది చట్టం ద్వారా ఇప్పటికే నిషేధించబడిన ప్రవర్తనకు అదనంగా ఏదో ఒకదానిని వర్ణిస్తుంటే, దాని సరిహద్దులను స్పష్టం చేయడం మరింత ముఖ్యం.
“దిమాగీ నక్సల్” అని పిలవబడే నిష్పాక్షికంగా నిర్దేశించబడిన వర్గం ఏదైనా ఉండగలదా?
ఒక రాజకీయ ముద్రకు ఇటువంటి రక్షణలు అవసరమా? లేదా తగినంత రాజకీయ, పరిపాలనా లేదా సంభాషణల అధికారం కలిగినవారి ప్రాధాన్యతలకు అనుగుణంగా ఈ ముద్ర సరిహద్దులు విస్తరిస్తాయా?
ప్రమాదంలో పడుతున్న ప్రామాణికత..
ఇప్పుడు సమస్య భాష నుంచి ప్రోత్సాహకాల వైపు మారుతుంది. అధికారం తప్ప మరేదీ ఈ “దిమాగీ నక్సల్” అనే వర్గాన్ని నిర్వహించలేదు.
ఈ పదం విమర్శకుడి ప్రామాణికతను చెరిపివేస్తుంది. ప్రామాణికతను దెబ్బతీయడం వల్ల విభేదించడం ద్వారా చెల్లించాల్సిన మూల్యం పెరుగుతుంది. ప్రజలు ఆ మూల్యాన్ని ఊహించి, తమ ప్రవర్తనను మార్చుకుంటారు.
ఇక్కడ ఎలాంటి సెన్సార్షిప్ ఉత్తర్వులు రానవసరం లేదు. ఒక ప్రొఫెసర్ ఒక పరిశోధనా అంశం అనవసరమైన ప్రమాదంతో కూడుకున్నదని భావించి వదిలేస్తారు. ఒక ఎడిటర్ ఒక వ్యాసాన్ని ప్రచురించకుండా ఉండటమే మంచిదని నిర్ణయించుకుంటారు. ఒక యూనివర్సిటీ నిర్వాహకుడు వివాదాస్పద మేధావిని ఆహ్వానించకపోవడమే శ్రేయస్కరమని భావిస్తారు.
ఒక యజమాని తన వద్ద పనిచేసే బిగ్గరగా ప్రశ్నించే ఉద్యోగిని ఇబ్బందికరంగా భావిస్తారు. ఒక విద్యార్థి అధికార వ్యవస్థను ప్రశ్నించడం కంటే మౌనంగా ఉండటంలోనే తక్కువ నష్టం ఉందని తెలుసుకుంటాడు.
ప్రతి ఒక్కరూ లొంగిపోవాలని ఆదేశించబడినందున కాదు, లొంగిపోకపోవడం సంస్థాగతంగా చాలా ఖరీదైనదిగా మారుతుంది కాబట్టి లొంగుబాటు ఉద్భవిస్తుంది.
ఇది సెన్సార్షిప్ కంటే అత్యంత ప్రభావవంతమైన క్రమశిక్షణా విధానం..
అంతేకాకుండా, రాజకీయ ముద్రల వల్ల చెల్లించే మూల్యం అందరికీ సమానంగా పంపిణీ కావు. ప్రత్యర్థి ద్వారా తీవ్రవాది అని ఆరోపించబడిన ఒక శక్తివంతమైన రాజకీయనాయకుడికి స్పందించడానికి పార్టీ, లాయర్లు, మీడియా ప్రాప్యత, ప్రభావవంతమైన నెట్‌వర్క్‌లు ఉంటాయి. కానీ ఒక విద్యార్థి, ఉపాధ్యాయుడు, జర్నలిస్ట్, పరిశోధకుడు లేదా కార్యకర్త వద్ద చాలా తక్కువ సంస్థాగత వనరులు ఉంటాయి. కాబట్టి, అదే ముద్ర అసమానమైన ప్రమాదాన్ని సృష్టిస్తుంది.
నోరు మూయించే యంత్రాంగం..
అన్నింటికంటే ముఖ్యంగా, దీని ప్రభావం కేవలం ఆ ముద్ర పడిన వ్యక్తికే పరిమితం కాదు. ఏమి జరుగుతుందో గమనిస్తున్న ప్రతి ఒక్కరూ ఒక అనిశ్చిత సరిహద్దును దాటడం వల్ల చెల్లించాల్సిన మూల్యం ఎంత ఉంటుందో అర్థం చేసుకుంటారు.
ఇప్పుడు ఒక రాజకీయ సంకేతం, ప్రవర్తనా యంత్రాంగంగా మారుతుంది. ప్రతి విమర్శకుడి నోరు మూయించడమే ఇక్కడ లక్ష్యం కాకపోవచ్చు.
మాట్లాడే ముందు ప్రజలు తమను తాము ఒక ప్రశ్న వేసుకునేలా చేస్తే చాలు- “ఇది నన్ను అనుమానితుడిగా మారుస్తుందా?”
ఆ ప్రశ్న దైనందిన నిర్ణయాధికారంలోకి ప్రవేశించిన వెంటనే, బహిరంగ చర్చల సరిహద్దులు మారడం ప్రారంభిస్తాయి. ఆదర్శ పౌరుడు అంటే కేవలం చట్టాన్ని గౌరవించే పౌరుడు మాత్రమే కాదు. ఆదర్శ పౌరుడు అంటే ఇప్పుడు లొంగి ఉండే పౌరుడు, తప్పుడు వ్యాఖ్యానాలకు తావిచ్చే ప్రశ్నలను అడగని పౌరుడు. క్షేమంగా ఉండేవాడే ఆదర్శ పౌరుడు.
రాజకీయ క్షేమం అనేది కేవలం చట్టాన్ని పాటించడంపై మాత్రమే కాకుండా, అనుమానాలకు దూరంగా ఉండటంపై ఆధారపడటం ప్రారంభమవుతుంది.
బహిష్కరణ రాజకీయాలు..
“దిమాగీ” అనే పదానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో, “ఐసోలేట్”(వేరు చేయడం/బహిష్కరించడం) అనే పదానికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. వేరు చేయడం అనేది దృష్టిని వాదన నుంచి, దానిని చెప్పిన వ్యక్తి వైపునకు మళ్లిస్తుంది. ఆ వాదన సరైనదా కాదా అని ఎవరూ ప్రశ్నించరు. దానికి బదులుగా “అలాంటి వాదనను ఎలాంటి వ్యక్తి చేస్తాడు?” అని ప్రశ్నిస్తారు.
ఆ ప్రతిపాదన జరిగాక, నిరాకరించాల్సిన అవసరం ఉండదు. వర్గీకరణే వాదన పనిని చేస్తుంది. చర్చ ముగుస్తుంది.
స్వతంత్ర ఆలోచన సామాజిక అవసరంగా ఉన్న సంస్థలపై దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కేవలం ఆమోదయోగ్యమైన ముగింపులను మాత్రమే ఇచ్చే విశ్వవిద్యాలయం, ఏ రకంగా చూసినా విశ్వవిద్యాలయంగా నిలవలేదు.
ప్రభుత్వాలు అనుమతించిన వాటిని మాత్రమే పరిశీలించే జర్నలిజం అధికారంలో ఉన్నవారిని జవాబుదారీ చేయలేదు. ప్రజల ఆదరణ లేని వ్యక్తి తరఫున వాదించడం అనేది లాయర్‌కు వ్యతిరేకంగా సాక్ష్యంగా మారితే లాయర్లు తమ రాజ్యాంగ విధులు నిర్వహించలేరు.
ఒక తిరుగుబాటును సమర్థించడానికీ, దాని ఆవిర్భావాన్ని వివరించడానికీ ఉన్న తేడాను గుర్తించలేకపోతే పరిశోధకులు వివాదాల మూలాలను పరిశోధించలేరు.
సమ్మతించడం/లొంగిపోవడం వల్ల ఎలాంటి మూల్యం చెల్లించాల్సిన అవసరం లేనప్పుడు, కేవలం విభేదించడం వల్ల మాత్రమే ఒక పౌరుడు భావజాల అనుమానంలో పడిపోతుంటే, సంస్థలు ‘మౌనాన్ని’ ఎంచుకోవడం ప్రారంభిస్తాయి.
దీని ప్రభావం భవిష్యత్‌పై కూడా ఉంటుంది. కొద్దిమంది భిన్నాభిప్రాయాలు ఉన్న వ్యక్తులకు వేయబడిన ముద్రగా ప్రారంభమయ్యేది, జీవితంలో ఎన్నడూ ఆ ముద్ర పడని అనేక మందికి ఒక హెచ్చరికగా మారుతుంది.
భిన్నాభిప్రాయాలను గౌరవించే ప్రజాస్వామ్యం..
ఒక సమాజం భిన్నాభిప్రాయాల ద్వారా నేర్చుకుంటుంది. మౌనం అనేది, విధానపరమైన పొరపాట్లు సుదీర్ఘకాలం కొనసాగేలా చేస్తుంది.
లొంగుబాటు అనేది ఆధిక్యతను రక్షించగలదు. కానీ అది జ్ఞానాన్ని ఉత్పత్తి చేయలేదు. ఆలోచనను నియంత్రించే చట్టం ఏదీ లేకపోయినా, ఆలోచనల నియంత్రణ ఎలా జరుగుతుందో ఇది చూపుతుంది.
ప్రభుత్వాలు పాలిస్తాయి, కానీ తమను పాలించేవారిని పరిశీలించి విమర్శించే హక్కు పౌరులకు ఉంటుంది అనే ప్రాతిపదికపైనే రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంటుంది. కాబట్టి, ఆలోచించే పౌరులు ప్రజాస్వామ్యం భరించాల్సిన ఇబ్బందికారులు కారు. వారు ప్రజాస్వామ్యం తనను తాను సరిదిద్దుకునే సంస్థాగత యంత్రాంగంలో భాగం.
ఒక ఆత్మవిశ్వాసం కలిగిన గణతంత్ర రాజ్యం, రాజ్యానికి వ్యతిరేకంగా తుపాకీ పట్టిన పౌరుడికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదనను ఎక్కుపెట్టిన పౌరుడికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గ్రహించాలి.
మొదటి వ్యక్తిని చట్టం ద్వారా ఎదుర్కోవచ్చు. రెండవ వ్యక్తిని మరొక వాదన ద్వారా ఎదుర్కోవాలి.
స్వాతంత్ర్యం వచ్చిన డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత, పౌరులను, స్వతంత్ర ఆలోచనను చూసి భయపడమని ప్రజాస్వామ్యం కోరకూడదు. దానిపై ఆధారపడేంత భద్రతా భావం దానికి ఉండాలి.
(రచయిత శిరీన్ అఖ్తర్ ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన జాకీర్ హుస్సేన్ ఢిల్లీ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇవి వారి వ్యక్తిగత అభిప్రాయాలు. ది వైర్ ఇంగ్లీష్ లో రాసిన వ్యాసానికి తెలుగు అనువాదం.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
