Protesters celebrate after Union Education Minister Dharmendra Pradhan resigns, at Jantar Mantar in New Delhi
సిజెపి (CJP) ఉద్యమం భారతదేశపు అత్యుత్తమ నిరసన వారసత్వానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. తర్వాత ఏంటి?
ప్రతి నిరసన ఉద్యమం ఎదుర్కొనే సందేహాన్నే సిజెపి (CJP) కూడా ఇప్పుడు ఎదుర్కొంటోంది. తమ లక్ష్యం పూర్తయిందని ప్రకటించి ఉద్యమాన్ని ముగించాలా, లేక పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాలా?
క్రాక్‌రోచ్ జనతా పార్టీ ఉద్యమం కేవలం ఒక నిరసన మాత్రమే కాదు. ఇది భారతదేశపు శాశ్వతమైన అసమ్మతి స్ఫూర్తికి తరాల సాక్ష్యం. పరీక్షల అక్రమాలు, యువత నిరుద్యోగం యొక్క బూడిద నుండి పుట్టుకొచ్చిన ఈ ఉద్యమం, 21వ శతాబ్దపు డిజిటల్ ఆయుధాలను ధరిస్తూనే 1970ల విద్యార్థి ఉద్యమాల నైతిక వ్యాకరణాన్ని పునరుద్ధ రించింది. కానీ తక్షణ విజయం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా రాజకీయ జ్ఞాపకాలలో మసకబారుతున్న వేళ, ఈ ఉద్యమం అత్యంత కీలకమైన ప్రశ్నను ఎదుర్కొంటోంది. ఇది కేవలం ఒక ధర్మ బద్ధమైన మెరుపుగా మాత్రమే మిగిలి పోతుందా లేక భారతదేశ ప్రజాస్వామ్య క్షీణతతో ఎండిపోయిన నేలను సస్యశ్యామలం చేసే శాశ్వత వర్షంగా మారుతుందా?
అసమ్మతి వారసత్వం:
సిజెపి నిరసనలు ఏదో అసాధారణమైన సంఘటన కాదు. అవి భారతదేశపు యువత నేతృత్వంలోని సుదీర్ఘమైన, తెగని అసమ్మతి చరిత్రలో తాజా అధ్యాయం. ఇది 1930ల నాటి తీవ్రమైన వలసరాజ్య వ్యతిరేక విద్యార్థి ఉద్యమాల నుండి 1974 నాటి గుజరాత్‌లోని నవనిర్మాణ ఉద్యమం వరకు విస్తరించిన వారసత్వం. ఆ ఉద్యమాలలో పెరుగుతున్న హాస్టల్ ఫీజులు, ఆహార ధరలకు వ్యతిరేకంగా విద్యార్థులు తిరగబడి ప్రభుత్వాలనే కూల్చి వేశారు.
ఆ తర్వాతి కాలంలో 1975 నాటి అత్యవసర పరిస్థితికి ముందు “సంపూర్ణ విప్లవం” కి పిలుపునిచ్చిన జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలోని బిహార్ ఉద్యమానికి ఈ ఉద్యమమే ప్రేరణగా నిలిచింది. నాటి జెపి నిరసనలకు ప్రస్తుత అధికార పార్టీ యొక్క పూర్వ రూపమైన జనసంఘ్, దాని విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పర్యవేక్షణలో క్షేత్ర స్థాయి మద్దతును అందించాయి. అది పరిపాలనా అవినీతిపై స్థానిక అసంతృప్తులతో ప్రారంభమై, ఆ తర్వాత అధికార దుర్వినియోగాన్ని నిలదీసే దేశవ్యాప్త ఉద్యమంగా రూపాంతరం చెందింది.
సిజెపి ఉద్యమాన్ని చారిత్రాత్మకంగా ప్రాముఖ్యత కలిగినది గా మార్చేది దాని కొత్తదనం కాదు. ఈ వారసత్వం పట్ల దానికి ఉన్న విశ్వసనీయత. గత ఉద్యమాల లాగానే, ఇది కూడా ఒక నిర్దిష్టమైన, సాధారణమైన అసంతృప్తితో 2026 నీట్ పేపర్ లీక్‌తో ప్రారంభమై, వ్యవస్థాగత కుళ్లు పై విస్తృతమైన నిరసనగా మారింది. విద్యార్థులు తమ భవిష్యత్తులను ఒక మోసపూరిత ఆటలో లాటరీ టిక్కెట్లుగా పరిగణించే వ్యవస్థను నిరసించారు. ప్రధాన్ రాజీనామా అనేది ఒక లక్షణం మాత్రమే. అసలు వ్యాధి ఇంకా నిర్ధారణ కాలేదు.
ఉద్యమ వ్యూహాలను ఆధునీక రించడం:
గడిచిన దశాబ్దం భారతదేశ అసమ్మతికి ఒక పరీక్షా సమయంగా నిలిచింది. సిఎఎ వ్యతిరేక నిరసనల నుండి రైతు పోరాటాల వరకు ప్రధాన స్థానిక, జాతీయ సమీకరణలను చూసింది. ఇవి సుదీర్ఘ ధర్నాలు, డిజిటల్ సమన్వయం, ప్రభుత్వ ఒత్తిడిని తట్టుకునే నిరోధకత తో కూడిన ఒక సుపరిచితమైన ఉద్యమ వ్యూహాన్ని సృష్టించాయి.
ప్రతి ఉద్యమం తదుపరి ఉద్యమం కోసం ఒక కొత్త ఆయుధాన్ని తయారు చేసింది. సిఎఎ వ్యతిరేక నిరసనలు (2019-2020) పొరుగు దేశాల నుండి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వాన్ని వేగవంతం చేసే పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రదర్శనల రూపాన్ని తీసుకున్నాయి. ఇది లౌకిక తత్వానికి విఘాతం కలిగిస్తుందని, ముస్లింల పై వివక్ష చూపుతుందనే ఆందోళనల మధ్య జరిగాయి. ఇది నాయకులు లేని సమీకరణ యొక్క నైపుణ్యాన్ని, ఆక్రమిత బహిరంగ ప్రదేశాల బలాన్ని చూపించింది. అరెస్టయిన నిరసన కారులలో కొందరు ఐదేళ్లు దాటినా ఇంకా విచారణ ఖైదీలుగానే జైళ్లలో మగ్గుతున్నారు.
ప్రతిగా, రైతుల నిరసనలు (2020-2021) ప్రభుత్వ నిర్బంధాన్ని తట్టుకునే శక్తిని, సుదీర్ఘ ధర్నాల నిర్వహించే శక్తి, నిరుపేదల నైతిక బలాన్ని మనకు చూపించాయి. సిజెపి ఈ వ్యూహాన్ని వారసత్వంగా పొంది మరింత నవీకరించింది. రైతులు ట్రాక్టర్లు, రాగ్ సంగీతాన్ని ఉపయోగిస్తే, సిజెపి AI ద్వారా తయారుచేసిన వీడియోలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్‌ను ఉపయోగించింది. సిఎఎ వ్యతిరేక నిరసన కారులు నినాదాలు ఉపయోగిస్తే, సిజెపి మీమ్స్‌ను ఉపయోగించింది. ఇది నిరసన స్థాయి దిగజారడం కాదు. ఇది దాని పరిణామ క్రమం.
ఒక ఉద్యమం ఒకే సమయంలో డిజిటల్, భౌతిక రూపాల లో, వ్యంగ్యాత్మకంగా, అత్యంత తీవ్రమైనదిగా ఉండగలదని సిజెపి నిరూపించింది. విద్యార్థి సంఘాల భాగస్వామ్యం, సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహారదీక్ష ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేశాయి. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం క్రూరమైన బలాన్ని ఉపయోగించి, ఆ తర్వాత రాజకీయ ఒత్తిడికి తలొగ్గడంతో భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రజాదరణ బాగా పడిపోయింది. బిహార్, మధ్యప్రదేశ్ ఉపఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనం.
సిజెపి ఉద్యమానికి ప్రేరకాలు:
2026 NEET పేపర్ లీక్ సిజెపి ఉద్యమానికి ప్రధాన కారణం కాదు. దశాబ్దాలుగా నెరవేరని హామీలతో నిండిపోయిన బాంబుల కుప్పను రగిల్చిన నిప్పురవ్వ మాత్రమే అది. భారతదేశ యువత చరిత్రలోనే అత్యంత చదువుకున్న తరం, అయినప్పటికీ వారు అత్యంత అనిశ్చితమైన ఉపాధి అవకాశాలను ఎదుర్కొంటున్నారు. వారు అర్హతకు మించిన చదువు కలిగి ఉండి తక్కువ ఉపాధితో, ఆశయాలు ఉండి సరైన అవకాశాలు లేక సతమతమవుతున్నారు.
ఒకప్పుడు సమానత్వాన్ని అందించిన పరీక్షల వ్యవస్థ, ఇప్పుడు సామర్థ్యం కంటే అవకాశానికి, జిజ్ఞాస కంటే కోచింగ్ సెంటర్లకు, నిజమైన నేర్చుకోవడం కంటే బట్టీ పట్టడానికి ప్రాధాన్యత నిచ్చే ఒక ద్వారపాలకుడిగా మారింది. భవిష్యత్తును వాగ్దానం చేసి లాటరీ టిక్కెట్ కొనుక్కున్న తరానికి సిజెపి ఉద్యమం గొంతుకగా నిలిచింది. లీకైన ప్రతి పేపర్, ప్రతి కట్-ఆఫ్ మార్కు, “ఐదేళ్ల అనుభవం ఉన్న ఫ్రైషర్లు కావాలి” అని కోరే ప్రతి ఉద్యోగ ప్రకటన వారి నిరాశ గోడలో ఒక్కో ఇటుక వంటిది. ఈ నిరసనలు కేవలం ఒక పరీక్ష గురించి మాత్రమే కాదు, భారతదేశంలోని ఆశయాల సమగ్ర నిర్మాణం గురించినవి.
భారత ప్రధాన న్యాయమూర్తి నిరసన కారులను “బొద్దింకలు” అని సంబోధించినప్పుడు, అది తిరస్కారంతో అన్న మాట. కానీ సిజెపి దాన్ని ఒక కిరీట ధారణగా మార్చుకుంది. సంకేతాత్మక గుర్తింపును తిరిగి కైవసం చేసుకునే ఈ చర్య భారత నిరసన చరిత్రలోనే అత్యంత మానసిక పరిణతి కలిగిన ఎత్తుగడల్లో ఒకటి. బొద్దింక ఆకర్షణీయమైనది కాదు. కానీ అది తట్టుకునే శక్తి కలిగినది. అది అణు వినాశనాన్ని కూడా తట్టుకుని జీవిస్తుంది. మురికిలో పెరుగుతుంది. దానిపై అడుగు వేస్తే మరిన్ని రెట్లు పెరుగుతుంది.
ఆ నిందను స్వీకరించడం ద్వారా, సిజెపి ఒక లోతైన మానసిక తిరుగు బాటును ప్రదర్శించింది. వారు వ్యవస్థకు ఇలా జవాబు చెప్పారు. మీరు మమ్మల్ని పురుగులుగా చూస్తున్నారా? అయితే మీ భవనాల కంటే ఎక్కువ కాలం మనుగడ సాగించే పురుగులం మేమే. మీ బహిష్కరణ వ్యవస్థలను తట్టుకుని నిలబడేది మేమే. ఇది బాధితులుగా మారడం కాదు. ఇది ఆత్మగౌరవాన్ని ఆయుధంగా మార్చడం. ఇది అవమానాన్ని ఐక్యతగా, తిరస్కారాన్ని సంఘీభావంగా మారుస్తుంది.
డిజిటల్ మౌలిక సదుపాయాలు: కొత్త ఆయుధాగారం:
సిజెపి డిజిటల్ వ్యూహం కేవలం “సోషల్ మీడియాను ఉపయోగించడం” మాత్రమే కాదు. ఇది రాజకీయ సమీకరణకు ఇచ్చిన ఒక కొత్త రూపం. నిరసనలు కరపత్రాలు, బహిరంగ సభలపై ఆధారపడిన 1970ల వలె కాకుండా, సిజెపి ఒక సమాంతర డిజిటల్ ప్రపంచాన్ని నిర్మించింది. ఎఐ-సృష్టించిన కంటెంట్ సంప్రదాయ మీడియా అడ్డంకులను అధిగమించి పెద్ద ఎత్తున ప్రచారాన్ని ఉత్పత్తి చేయడానికి వారికి ఉపయోగపడింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ సంక్లిష్టమైన విధాన వైఫల్యాలను 15 సెకన్ల భావోద్వేగ పూరిత ప్రభావాలుగా మార్చాయి. ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్, ప్రభుత్వ నిఘా సులభంగా చొరబడలేని వికేంద్రీకృత సమన్వయానికి అవకాసం వచ్చింది.
శ్రద్ధ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో (Attention economy), వైరల్ అవ్వడమే వేగం అని సిజెపి అర్థం చేసుకుంది. ఒక చక్కగా తయారు చేసిన మీమ్, పోలీసు లాఠీ కంటే వేగంగా ప్రయాణిస్తుంది. ఒక హ్యాష్ ట్యాగ్, ఒక కమిటీ కంటే బాగా సమీకరిస్తుంది. ఇది భౌతిక నిరసనకు ప్రత్యామ్నాయం కాదు. దాని శక్తిని రెట్టింపు చేసే సాధనం. వీధి, స్క్రీన్ ఇప్పుడు ఒకే యుద్ధభూమి అని ఇది నిరూపించింది.
సిజెపి ఉద్యమం భారతదేశపు అత్యుత్తమ నిరసన వారసత్వం. ఎందుకంటే వేరే ఏ ఉద్యమం చేయని పనిని ఇది చేసింది. అధికారానికి వ్యతిరేకంగా హాస్యాన్ని, తిరస్కారానికి వ్యతిరేకంగా గౌరవాన్ని, వ్యవస్థాగత అపారదర్శకతకు వ్యతిరేకంగా డిజిటల్ సాన్నిహిత్యాన్ని ఆయుధాలుగా మార్చుకుంది. కానీ వారసత్వం అనేది మాత్రమే భవిష్యత్తును నిర్ణయించలేదు.
సిజెపి యొక్క నిజమైన పరీక్ష అది ఒక మంత్రితో రాజీనామా చేయించగలిగిందా లేదా అనే దానిపై కాదు. అది ఒక వ్యవస్థను పునర్నిర్మించ గలదా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రశ్న కేవలం “తర్వాత ఏంటి?” అని మాత్రమే కాదు. “తర్వాత ఎవరు?” ఢిల్లీ వీధులను దాటి గ్రామాలు, అడవులు, కర్మాగారాలు, అన్నీ వాగ్దానాలు మినహా అమలుకు నోచుకోని ఈ దేశపు ఎండిపోయిన వ్యవసాయ భూముల్లోకి ఈ నిప్పును ఎవరు తీసుకెళ్తారు అనేది అసలు ప్రశ్న.
అజెండాను విస్తరించడం-లక్షణం నుండి వ్యవస్థ వైపు:
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఆయన స్థానంలో హిందూత్వ సిద్ధాంత కర్తగా పేరుపొందిన మరొక వ్యక్తిని నియమించడం అనేది ఒక విజయానికి సంకేతం మాత్రమే. ఇది ఒక పరిమిత రాజకీయ విజయం తప్ప, భారతదేశ విద్య వ్యవస్థను పట్టి పీడిస్తున్న లోతైన సంక్షోభాలకు శాశ్వత పరిష్కారం కాదు.
నీట్ పేపర్ లీక్‌కు సంబంధించిన ప్రాథమిక సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. వీటిలో ఆశావహులైన విద్యార్థులపై పడుతున్న తీవ్ర మానసిక ఒత్తిడి, వైద్య విద్య యొక్క పెరుగుతున్న వాణిజ్యీకరణ, విద్యార్థుల అవకాశాలలో కొనసాగుతున్న అసమానతలు, పరిపాలనా సమగ్రత, పరీక్షల భద్రతపై పునరావృతమయ్యే ప్రశ్నలు, విద్యా విధానంలో కేంద్ర ఆదేశాలు, రాష్ట్ర స్వయంప్రతిపత్తి మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి.
సిజెపి ఇప్పుడు ఇతర నిరసన ఉద్యమాలు ఎదుర్కొన్న సందేహాలనే ఎదుర్కొంటోంది. తమ లక్ష్యం పూర్తయిందని ప్రకటించి ఉద్యమాన్ని ముగించాలా, లేక పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాలా? కేవలం ఒక సమస్య కే పరిమితం అయి వ్యవస్థ లోని లోపాలను వదిలివేస్తే ప్రయోజనం చాలా పరిమితం. నీట్ లీక్ అనేది ఒక ప్రాథమిక సమస్య మాత్రమే. అది లోతైన వ్యవస్థాగత రుగ్మతలను బయటపెట్టిన ఒక కనిపించే గాయం. ఉన్నత విద్యను చుట్టుముడుతున్న సామాజిక, వ్యవస్థాగత, సాంస్కృతిక సంక్షోభాలను పరిష్కరించడానికి ఇప్పుడు తన దృక్పథాన్ని విస్తరించాలి, ముఖ్యంగా విశ్వవిద్యాలయాల కార్పొరేటీకరణను అడ్డుకోవాలి. ఎందుకంటే లాభం అనేది బోధన కంటే ముఖ్యమైనదిగా మారుతోంది.
మరో వైపు, తీవ్రమైన నిరుద్యోగం యువత భవిష్యత్తును దెబ్బతీస్తుండటంతో, భారతదేశం ఎంతగానో ప్రచారం చేసుకునే జనాభా అనుకూలత (Demographic Dividend) ఒక జనాభా విపత్తుగా మారే ప్రమాదం ఉంది. ప్రాథమిక పాఠశాల నుండి కళాశాల వరకు విద్యా వ్యవస్థ అంతా క్షీణ దశలో ఉండగా, విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా కేంద్రాలు తమ వ్యవస్థాగత స్వయంప్రతిపత్తిని వేగంగా కోల్పోతున్నాయి.
జాతీయ విద్యా విధానం కింద తీసుకువచ్చిన విధాన మార్పులు విద్యావ్యవస్థ సాంస్కృతిక కాషాయీకరణ వైపు పయనిస్తున్నాయి. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 28లో పొందుపరిచిన లౌకిక విధానానికి విరుద్ధంగా ఉంది. హిందూత్వ సిద్ధాంతానికి అనుగుణంగా ఉన్న విద్యా నాయకుల కేడర్‌ను తయారు చేయడం ద్వారా ప్రభుత్వం ఈ సంకేత మార్పు సులభతరం చేస్తున్నది. విద్యాపరమైన నియామకాలలో రాజకీయ జోక్యం చేసుకున్నప్పుడు, జ్ఞానం అనేది అధికారానికి దాసోహ మవుతుంది. ఆవు మూత్రం కూడా ఔషధంగా ప్రచారం చేయబడటం.
యువతరం పర్యావరణ-దోపిడీ సంబంధాల గురించి కూడా ఆందోళన చేపట్టాలి. బడా పెట్టుబడిదారులు పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతాలను లాభాలను ఇచ్చే ఆస్తులుగా మారుస్తున్నారు. ప్రజలను నిర్వాసితులను చేస్తున్నారు. అడవులను, భూములను నాశనం చేస్తున్నారు. దేశ సంపదను పై స్థాయిలో ఉన్న ఒక శాతానికి కట్టబెడుతున్నారు. పర్యావరణ న్యాయం, ఆర్థిక న్యాయం వేర్వేరు పోరాటాలు కావు. అవి రెండూ ఒకటే అనే సత్యాన్ని తిరస్కరించలేము.
ఆధారాలు మన ముందే ఉన్నాయి. అభివృద్ధి పేరిట ఆరావళి, హిమాలయాలు, గ్రేట్ నికోబార్‌లను ధ్వంసం చేస్తున్నారు. ఉద్యోగం దొరకని విద్యార్థి, స్వచ్ఛమైన గాలిని పీల్చుకోలేని లేదా కలుషితం కాని నీటిని పొందలేని పౌరుడు కూడా. అడవి నుండి వెళ్లగొట్ట బడిన ఆదివాసీ, పరీక్ష పేపర్ లీక్ అయిన అదే యువకుడు. ఇవి విడి విడి సంక్షోభాలు కావు. ఇవి ఒకదాని కొకటి ముడిపడి ఉన్న గాయాలు. ఈ అన్ని రంగాల మధ్య ఉద్యమం ఐక్యతా వారధులను నిర్మించాలి.
మిగ్యుయెల్ తోర్గా రాసిన “టేల్స్ ఫ్రమ్ ది మౌంటైన్” కథల సంపుటి పీఠిక నుండి ఒక వాక్యంతో ముగిస్తాను.
“ఈ పర్వతాల గుండా పేదరికం యొక్క నిర్జనమైన గాలి వీస్తున్నది. అది చెట్లు పూయడానికి లేదా గొర్రెలు మేయడానికి అనుమతించదు. ప్రకృతి ప్రకోపానికి తోడు సామాజిక కష్టాలు తోడయ్యాయి. నీటి ఊటలను ఎండబెట్టడానికి దక్షిణపు గాలితో చట్టం చేయి చేయి కలిపి నడుస్తోంది. ముడతలు పడిన వృద్ధుల ముఖాలు, క్రూరమైన బాధ, లోతైన విచారకర గాథలను చెక్కిన వెయ్యేళ్ల నాటి తాళపత్రాల వలె కనిపిస్తాయి. యువకుల మృదువైన ముఖాల్లో ఆశ చాలా స్వల్పంగా మిగిలి ఉంది.” పెరుగుతున్న నైరాశ్యం, పేదరికం యొక్క గాలికి వ్యతిరేకంగా నిలబడాల్సిన సమయం ఇది.
రచయిత
సి.పి. రాజేంద్రన్
జియో సైంటిస్ట్ (భూవిజ్ఞాన శాస్త్రవేత్త). సైన్స్, రాజకీయం, పర్యావరణం, విద్య అంశాలపై వ్యాసకర్త. వీటిపై అధ్యయనాలు చేశారు.
అనువాదం: ది వైర్ తెలుగు స్టాఫ్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
