రష్యా సైన్యంలో చేరిన ఒక భారతీయ పౌరుడు మూడు రోజుల పాటు యుద్ధరంగంలో గడిపిన తర్వాత తమకు లొంగిపోయాడని ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. లొంగిపోయిన వ్యక్తిని గుజరాత్‌లోని మోర్బి నివాసి 22 ఏళ్ల మజోతి సాహిల్ మొహమ్మద్ హుస్సేన్‌గా గుర్తించారు. ఒక విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి తను రష్యా వెళ్ళాడు.
న్యూఢిల్లీ: రష్యా సైన్యంలో చేరిన ఒక భారతీయ పౌరుడు మూడు రోజుల పాటు యుద్ధరంగంలో గడిపాడు. ఆ తర్వాత తమకు లొంగిపోయాడని ఉక్రెయిన్ సైన్యం మంగళవారం(అక్టోబర్ 7) ప్రకటించింది.
కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ సమాచారంపై ఆరా తీస్తోందని న్యూఢిల్లీలోని అధికారిక వర్గాలు వెల్లడించాయి. “ఈ విషయంలో ఉక్రెయిన్ వైపు నుంచి ఇంకా అధికారిక సమాచారం తమకు అందలేద”ని తెలిపాయి.
ఉక్రెయిన్ 63వ మెకనైజ్డ్ బ్రిగేడ్ తన అధికారిక టెలిగ్రామ్ ఛానెల్లో “22 ఏళ్ల యువకుడు, భారతీయుడిని ఖైదీగా పట్టుకున్నారు!” అనే అనే శీర్షికతో వీడియోను పోస్ట్ చేసింది.
అనేక మంది భారతీయ పౌరులను కాంట్రాక్టు ఒప్పందంపై రష్యన్ సైన్యంలో నియమించుకుంటున్నారు. ఇప్పటివరకు చాలామంది యుద్ధరంగంలో చనిపోయారు. అయినప్పటికీ, ఉక్రెయిన్ సైన్యం అదుపులోకి తీసుకున్న భారతీయ పౌరుడి గురించి తెలిసిన మొదటి కేసు ఇది.
వీడియోలో గుర్తించబడిన వ్యక్తి గుజరాత్‌లోని మోర్బికి చెందిన 22 ఏళ్ల మజోతి సాహిల్ మొహమ్మద్ హుస్సేన్, ఒక విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి రష్యాకు వెళ్లాడు. ఆ తరువాత మాదకద్రవ్యాల సంబంధిత ఆరోపణలపై దోషిగా నిర్ధారించబడ్డాడు.
“నేను జైలులో ఉండటానికి ఇష్టపడలేదు, కాబట్టి “ప్రత్యేక సైనిక ఆపరేషన్” కోసం ఒప్పందంపై సంతకం చేశాను. ఆ తర్వాత అక్కడి నుంచి నేను బయటపడాలని అనుకున్నాను” అని తను రష్యన్ భాషా వీడియోలో చెప్పాడని కీవ్ ఇండిపెండెంట్ పేర్కొన్నది.
అక్టోబర్ 1న ఫ్రంట్ లైన్లకు పంపబడే ముందు తాను కేవలం 16 రోజుల శిక్షణ మాత్రమే పొందానని హుస్సేన్ చెప్పాడు. తన కమాండర్‌తో వివాదం తర్వాత లొంగిపోవాలని నిర్ణయించుకున్నానని తెలియజేశాడు. 63వ మెకనైజ్డ్ బ్రిగేడ్ నుంచి రెండు లేదా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉక్రెయిన్ ట్రెంచ్ వద్దకు తాను చేరుకున్నానని చెప్పుకొచ్చాడు. “నేను వెంటనే నా రైఫిల్‌ను కింద పెట్టాను. పోరాడకూడదని అనుకుంటున్నాని నేను వాళ్లకు చెప్పాను. నాకు సహాయం కావాలని అడిగాన”ని తెలియజేశాడు.
ఒప్పందం ప్రకారం రష్యా తనకు ఎప్పుడూ జీతం చెల్లించలేదని హుస్సేన్ ఆరోపించాడు. రష్యాకు తిరిగి రావడం కంటే ఉక్రెయిన్‌లోనే ఉండటానికి ఇష్టపడతానని అన్నాడు. “అక్కడ ఏమీ లేదు. నేను ఇక్కడే జైలుకు వెళ్లడం మంచిది” అని పేర్కొన్నాడు.
ఉక్రెయిన్- రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా సైన్యంలో చేరిన 127 మంది భారతీయుల గురించి తమకు తెలుసని భారత ప్రభుత్వం 2025 ఫిబ్రవరిలో పార్లమెంటుకు చెప్పడం గమనార్హం. ఇప్పటివరకు 12 మంది మరణించారు. 18 మంది తప్పిపోయారు. మిగిలిన వారు విడుదలైన తర్వాత తిరిగి వచ్చారు.
గత నెలలో ది వైర్ నివేదించిన ప్రకారం, యుద్ధేతర ఉద్యోగాల కోసం తప్పుడు హామీలతో ఆకర్షితులై ఇటీవల ఎక్కువ మంది భారతీయులు రష్యన్ సైన్యంలో చేరారు.
భారతీయ పౌరులను నియమించడాన్ని నిలిపివేయాలని న్యూఢిల్లీ మాస్కోను పదేపదే అభ్యర్థించిందని భారత అధికారులు తెలియజేశారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 73వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఫోన్ చేసిన రోజే భారత జాతీయుడి లొంగిపోయిన వార్త వెలువడింది. వార్షిక ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు రష్యా నాయకుడు డిసెంబర్లో భారతదేశాన్ని సందర్శించనున్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
