సమ్మెకు వ్యతిరేకంగా యంత్రం శక్తివంతమైన కార్మికవర్గ ముఖ్యమైన రక్షణా ఆయుధం అవుతుంది. తమ డిమాండ్లకు కార్మికులు సమ్మెను ఆశ్రయిస్తే, మరొక దశ పోరాటంలో యంత్రం వారిని నిరుపయోగంగా మారుస్తుందని పెట్టుబడిదారుడు పదేపదే కార్మికులను హెచ్చరిస్తాడు. తరచుగా కార్మికులను వాడుకలో లేనివారిగా లేదా నిరుపయోగులుగా చేయడం ద్వారా, ఉత్పత్తి చేసే పద్ధతులలోనూ, ఉత్పత్తి వివిధ శాఖల మధ్య సంబంధాలలో అది సృష్టించే విస్తారమైన, వేగవంతమైన మార్పులద్వారా పెట్టుబడిదారీ విధానంలో స్వాభావికంగా ఉన్న పరాయీకరణను యంత్రాలు పెంచుతాయి.
‘మొత్తం మీద పెట్టుబడిదారీ తరహా ఉత్పత్తి విధానం కార్మికునికి వ్యతిరేకంగా శ్రమ సాధనాలకూ, ఉత్పత్తులకూ ఇచ్చే స్వాతంత్రం– విభజన లక్షణం యంత్రాల ద్వారా పూర్తి వైరుధ్యంగా మార్చబడుతుంది.’
నిరుద్యోగ సమస్య..
యంత్రాలు నిజంగా కార్మికులను స్థానభ్రంశం చేయవని మార్క్స్ కాలంలోని పెట్టుబడిదారీ రాజకీయ అర్ధశాస్త్రవేత్తలు వాదించారు. యంత్రాలు ఉత్పత్తికి చెందిన ఒక శాఖలో కార్మికులను స్థానభ్రంశం చేసినా, అదేసమయంలో స్థానభ్రంశం చెందిన కార్మికులను తిరిగి ఉపయోగించుకోవడానికి కావలసిన మూలధనాన్ని అది అందుబాటులోకి తెస్తుందని వారు వాదించారు. ఈ వాదన తప్పని మార్క్స్ వెంటనే ఎత్తిచూపారు.
స్థానభ్రంశం చెందిన కార్మికులు వెచ్చించే జీవన భృతినే పెట్టుబడిదారీ అర్ధశాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చిన మూలధనమని అంటున్నారు. స్థానభ్రంశం చెందిన కార్మికులకే ఉద్యోగ కల్పన చేయడానికి ఈ మొత్తాన్ని వేరొక చోట ఎందుకు పెట్టుబడి పెట్టాలి అన్నదానికి అస్సలు సరైన కారణమే లేదు. వాస్తవానికి ఉద్యోగ కల్పనకు ఈ విలువలో కొంత భాగాన్ని ముడిసరకులు, శ్రమ సాధనాలు వంటి స్థిర మూలధనంలో పెట్టాలి. అందుచేత ఈ మొత్తం మూలధనంగా తిరిగి పెట్టబడినా స్థానభ్రంశం చెందిన కార్మికులందరికీ ఉపాధి కల్పించడంలో తప్పనిసరిగా విఫలమవుతుంది.
మార్క్స్ చేసిన సరైన విశ్లేషణ యంత్రం కార్మికులను స్థానభ్రంశం చేస్తుందని గుర్తించింది. అందువలన ఉత్పత్తి అనేక శాఖలలో ఎంతో కొంత మేరకు ఒకే సమయంలో కార్మికుల ప్రారంభ స్థానభ్రంశం జరిగినప్పుడు– వాస్తవానికి కొనుగోలు శక్తి పడిపోవడం, వినియోగదారుల డిమాండు తగ్గిపోవడంతో మరింత నిరుద్యోగానికి దారితీస్తుంది.
అదే సమయంలో మరొక ప్రత్యామ్నాయ అవకాశాన్ని కూడా తప్పనిసరిగా గుర్తించాలని మార్క్స్ ఎత్తి చూపాడు. కార్మికులను స్థానభ్రంశం చేసే యంత్రాలు ఖర్చులను తీవ్రంగా తగ్గించేటంత గణనీయంగా ఉత్పత్తిని పెంచేటందుకు దారితీస్తే, అప్పుడు నిరుద్యోగంపై ప్రభావం కొంతవరకు తగ్గించబడుతుంది. అనుసంధాన ప్రభావాలు కంటికి కనుపించడం(దృగ్విషయం) కూడా ఉంది.
యంత్రాల వినియోగం రెందువిధాలుగా ఉత్పత్తిని విస్తారంగా పెంచుతుంది: (i) యంత్రాలను సరఫరా చేసే శాఖలో/ విభాగంలో ఉత్పత్తిని పెంచుతుంది. ఆవిధంగా అక్కడ కొంత ఉపాధిని కల్పిస్తుంది. (ii) సరుకులను యంత్రాల ద్వారా ఉత్పత్తి చేయడం వలన పెరిగిన ఉత్పాదకత ముడిసరకుగా, ఈ సరుకులను ముడి సరుకులుగా వాడే పరిశ్రమకు పెద్ద మొత్తంలో అందుబాటులోకి తీసుకువస్తుంది. ఆవిధంగా ఆ పరిశ్రమలో కొంత అదనపు ఉపాధిని కల్పిస్తుంది.
(i) వస్త్రాల ఉత్పత్తిలో యంత్రాల వినియోగం వస్త్రోత్పత్తి యంత్రాలకు డిమాండుకు దారితీసి తద్వారా వస్త్రోత్పత్తి యంత్రాలను నిర్మించే పరిశ్రమలో కొంత ఉపాధిని కల్పించడం ఒక ఉదాహరణ. (ii)నేత పరిశ్రమలో ఉపాధి పెరిగే విధంగా, నూలు ఉత్పత్తి యాంత్రీకరణ నూలు సరఫరాను బాగా విస్తరించి, చౌకగా చేయడం ఒక ఉదాహరణ.
ఏ సందర్భంలోనైనా, యంత్రాలను ప్రవేశపెట్టడం కొన్ని సందర్భాలలో కార్మికుల ప్రత్యక్ష స్థానభ్రంశాన్ని భర్తీ చేయడానికి తగినంతగా పరోక్ష ఉపాధిని కల్పిస్తుంది. అయినప్పటికీ, స్థానభ్రంశం చెందిన కార్మికులు మరొకచోట ఉపాధి పొందడం పెట్టుబడి పెట్టాలని కోరుకుంటున్న కొత్త, అదనపు మూలధన మధ్యవర్తిత్వం ద్వారా మాత్రమే కానీ, గతంలో ఉద్యోగకల్పన చేసి తరువాత యంత్రాలుగా మారిన మూలధన మధ్యవర్తిత్వం ద్వారా కాదనే, మార్క్స్ ప్రాథమిక సూత్రీకరణలో మార్పేమీ లేదు.
మార్కెట్ పోటీ, పారిశ్రామిక వలయం..
యంత్రాల ద్వారా ఉత్పత్తి మిగులు ఉత్పత్తిలో అపారమైన పెరుగుదలకు దారితీస్తుంది. అనవసరమైన, విలాస వస్తువుల ఉత్పత్తి పెరగుదలను సాధ్యం చేస్తుంది. యంత్రాల ఆధారంగా విస్తరించిన పెట్టుబడిదారీ ఉత్పత్తి పెట్టుబడిదారుల, వారిపై ఆధారపడిన వారి సంఖ్య పెరగడానికి దారితీస్తుంది. వీరిలో తరువాతి వారు( పెట్టుబడిదారులపై ఆధారపడిన వారు) ఈ సరుకులకు మార్కెట్‌ను కల్పించే వివిధ పెట్టీ బూర్జువా(చిన్న పెట్టుబడిదారులు లేదా స్వయం ఉపాధి కలవారు)దొంతరలకు చెందినవారు.
‘పరిణామంలోనూ, రకాలలోనూ విలాస వస్తువుల పెరుగుదల కూడా ఆధునిక పరిశ్రమ కల్పించిన ప్రపంచ మార్కెట్లతో ఏర్పడిన కొత్త సంబంధాల వలననే’. దీంతోపాటు ఇతర పరిణామాల ద్వారా కొన్ని రకాల గృహ సేవలు వంటి అనుత్పాదక ఉపాధి కల్పన పెరగడాన్ని యంత్ర ఉత్పత్తి పెరిగిన ఉత్పాదకత సాధ్యం చేస్తుంది.
ప్రారంభంలో ఆధునిక పరిశ్రమ కర్మాగార వ్యవస్థచే వర్గీకరించబడింది. తయారీ, చేతివృత్తుల పోటీని తొలగించడం ద్వారా తన స్వేచ్ఛను విస్తరించుకుంది. యంత్ర నిర్మాణ పరిశ్రమే ఒక మారు యాంత్రీకరణ చేయబడిన తరువాత, ఆధునిక పారిశ్రామిక ఉత్పత్తి వ్యవస్థ కోసం సాధారణ పరిస్థితులు ఏర్పడిన తరువాత, ‘ఈ తరహా ఉత్పత్తి విధానం(స్థితిస్తాపకతను) (ఎలాస్టిసిటీ) సాగే గుణాన్ని, ముడి సరకుల సరఫరాలోనూ, ఉత్పత్తుల అమ్మకాలలోనూ తప్ప మరే ఇతర అడ్డంకులనూ ఎదుర్కోని వేగంగా విస్తరించే సామర్ధ్యాన్ని పొందుతుంది.’
‘ఇది క్రమంగా ఆధునిక పరిశ్రమల ప్రధాన కేంద్రాల అవసరాలకు తగిన విభజన, ప్రపంచంలో కొంత భాగాన్ని, ప్రధానంగా ఆధునిక పరిశ్రమల ప్రధాన కేంద్రాలకు ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేసే రంగానికి పరిమితంచేసే’ అంతర్జాతీయ శ్రమ విభజనకు దారితీస్తుంది.
పెట్టుబడిదారీ ఆధునికత సాగే గుణం, వేగవంతమైన విస్తరణ సామర్ధ్యం, ప్రపంచమంతటా వ్యాప్తి(ప్రపంచ మార్కెట్లపై ఆధారపడడం) వలన ప్రచండమైన హెచ్చుతగ్గులకు/ ఆటుపోట్లకు గురయ్యే అవకాశం ఉంది. మరొక మాటలో చెప్పాలంటే, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధాన సంక్షోభానికి గురయ్యే అవకాశం, వైరుధ్య లక్షణం స్పష్టంగా కనిపిస్తుంది.
ఆధునిక పరిశ్రమ జీవితకాలం మితమైన కార్యాచరణ, సంపద, అధికోత్పత్తి సంక్షోభం, మాంద్యాల కాలాల సమాహారం. పారిశ్రామిక వలయం నియమిత కాలంలో సంభవించే మార్పుల వలన ఉపాధికి యంత్రాలు గురిచేస్తున్న అనిశ్చిత స్థితి, అస్థిరత సర్వ సాధారణం అవుతున్నాయి. సంపద్వంతమైన కాలంలో తప్ప మిగతా సమయంలో మార్కెట్లో ప్రతి ఒక్కరి వాటా కొరకు పెట్టుబడిదారుల మధ్య చాలా తీవ్రమైన పోటీ చెలరేగుతుంది.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 27వ భాగం, 26వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
