సుమారు నాలుగు దశాబ్ధాల క్రితం “లిబరలైజేషన్, ప్రైవెటైజేషన్, గ్లోబలైజేషన్”(ఎల్పీజీ) పేరుతో నూతన ఆర్ధిక సంస్కరణలను ప్రపంచం చూసింది. త్వరలోనే వాటికి ప్రత్యామ్నాయమైన సంస్కరణలను ఆర్ధికరంగంలో ప్రపంచం చూడబోతుంది.
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులు, పర్యావరణ సమతౌల్యత, సాంకేతిక ఆధారిత సుస్థిర అభివృద్ధి, మానవళి మనుగడ వంటి అనేక విషయాలను దృష్టిలో పెట్టుకొని; ఈ నూతన ఆర్ధిక సంస్కరణల రూపకల్పన చేశారు. మరీ వీటి అమలును ఎవరు మొదలు పెడతారు? ఏ దేశం ఎప్పటి నుంచి అమలు చేస్తుందనే విషమంలో ఇంతవరకు స్పష్టత లేదు. అయితే, ప్రపంచ ప్రఖ్యాత ఆర్ధికవేత్తలు, విధాన రూపకర్తలు మాత్రం తాజాగా ఈ నూతన ఆర్ధిక సంస్కరణలను రూపకల్పన చేసి సిద్ధంగా ఉంచారు.
ఇప్పటి వరకు అమలవుతున్న ఆర్ధిక విధానాలను “కాలం చెల్లినవి”గా తాజా విధానాలను రూపొందించిన ఆర్ధికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అధ్వర్యాన లండన్‌లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 55 మంది ప్రపంచ ప్రఖ్యాత ఆర్ధికవేత్తలు, విధాన రూపకర్తలు పాల్గొన్నారు.
కాలం చెల్లిన ఆర్థికవిధానాలు..
సుదీర్ఘ చర్చల తర్వాత, సమావేశంలో రూపొందించిన కొత్త విధానాలకు “21వ శతాబ్దం కొరకు లండన్ అవగాహన, ఆర్థిక ఏకాభిప్రాయం సూత్రాలు”అని నామకరణం చేశారు. వాషింగ్టన్ ఏకాభిప్రాయం పేరుతో ప్రస్తుతం అమలవుతన్న ఎల్పీజీ విధానాలలో ఉన్న పది సూత్రాలకు బదులుగా, కేవలం ఐదు ఆర్ధిక సూత్రలనే తాజాగా ఖరారు చేశారు.
కాగా, ఏప్రిల్ 1989లో బ్రిటన్ ఆర్దికవేత్త జాన్ విలియమ్సన్ అప్పుడున్న ప్రపంచ ఆర్ధిక పరిస్థితులు, పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అమెరికా ఆధిపత్యంలో ఉన్న ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్వంటి అంతర్జాతీయ ఆర్ధిక సంస్థలకు అనుకూలంగా “వాట్ వాషింగ్టన్ మీన్స్ బై పాలసీ రిఫామ్స్”అనే టైటిల్‌తో ఆర్దిక పత్రాన్ని రూపొందించారు. దీనినే “వాషింగ్టన్ ఏకాభిప్రాయం” అని పిలుస్తున్నారు. ఇందులో ఆయా దేశాల ఆర్ధికాభివృద్ధి కొరకు పది సూత్రాలను సూచించారు.
ఆనాటి పరిస్థితుల్లో అభివృద్ధికి సంబంధించి వెనకబడి ఉన్న లాటిన్ అమెరికా దేశాలతో పాటు భారత్‌తో సహా ఇతర దేశాలను ఆదుకోవాలన్న ఉద్దేశ్యంతో విలియమ్సన్ ఆర్ధిక రంగంలో సంస్కరణలను ప్రతిపాదించి అందుకు పది సూత్రాలను ఖరారు చేశారు. ఈ పది సూత్రాలలోనే ఉన్న ఎల్పీజీ విధానాలను తమకు అనుకూలంగా అలవర్చుకొని నేటికీ భారత్‌తో సహా అనేక దేశాలు అమలు పరుస్తున్నాయి.
1990 దశకంలో సోవియట్‌యూనియన్ పతనం, తూర్పు ఐరోపాలో కమ్యూనిజం అంతం నేపథ్యంలో ఈ పదిసూత్రాలు(ఎల్పీజీ)అనివార్యమైన ఆర్థిక విధానాలుగా మారాయి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఎల్పీజీ సూత్రాలు ప్రపంచ ఆర్ధిక రంగంలో “హైపర్ గ్లోబలైజేషన్”కు ఎంతో దోహదపడిందని తాజాగా లండన్‌లో సమావేశమైన ఆర్ధికవేత్తలు అభిప్రాయపడ్డారు.
2008లో ప్రపంచంలో ఏర్పడిన ఆర్ధిక సంక్షోభం,ఆర్ధికశక్తిగా చైనా ఎదుగుదలతో పాటు ఎల్పీజీ విధానాల వల్ల చైనా, భారత్, వియత్నాం, మెక్సికో వంటి దేశాలే లబ్ధిపొందాయని- మిగితా చాలా దేశాలు, ముఖ్యంగా పశ్చిమ ప్రపంచంలో భారీ సంఖ్యలో నిరుద్యోగం పెరుగుదల, పరిశ్రమలు మూతపడటానికి “కాలం చెల్లిన ఎల్పీజీ” విధానాలే కారణమని ఆర్ధికవేత్తలు భావిస్తున్నారు.
ఇప్పటికే అనేక దేశాలు ఎల్పీజీ విధానాలను వ్యతిరేకిస్తున్నాయని, ఈ విధానాలు, ఆ పదిసూత్రలు “కాలం చెల్లినవి”గా భావించి వాటికి వాషింగ్టన్ ఏకాభిప్రాయానికి ప్రత్యామ్నాయంగా లండన్ ఏఅవగాహనని ముందుకు తీసుకొచ్చారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
