ప్రపంచ పత్రికాస్వేచ్ఛా దినోత్సవం సాక్షిగా మాటకు స్వేచ్ఛ, వాక్చాతుర్యం, నిజం చెప్పే హక్కు గురించి ప్రపంచం మాట్లాడుతున్న రోజునే ఆ హక్కులపై దాడులు జరుగుతున్న వాస్తవాలు మన ముందుకు వస్తున్నాయి.
ఒకవైపు పత్రికాస్వేచ్ఛను కాపాడాలని నినాదాలు వినిపిస్తుంటే, మరోవైపు జర్నలిస్టులపై దాడులు జరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం.
అనంతపురం జిల్లాలో గీతం కాలేజీకి సంబంధించిన ఒక వార్త, అక్కడి పరిస్థితులను వెలుగులోకి తీసుకురావాలనే మీడియా ప్రయత్నం ఇప్పుడు వివాదానికి దారి తీసింది.
ప్రజలకు నిజం తెలియజేయాల్సిన బాధ్యతతో పనిచేసిన జర్నలిస్టు లక్ష్మీనారాయణపై జరిగిన దాడి, వ్యవస్థలో ఉన్న లోపాలను మరోసారి బయటపెట్టింది. వార్త రాయడం ఒక నేరమా? లేక ప్రశ్నించడం తప్పా? అనే ప్రశ్నలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి.
ఈ ఘటనలో మనీషా నాయర్, ఆమె అనుచరులపై కేసులు నమోదవడం ఒక దిశలో న్యాయపరమైన చర్యగా కనిపించినా జరిగిన ఘటనను అనంతపురం స్థానిక జర్నలిస్టు సంఘాలు మాత్రం దీన్ని వదిలేది లేదు అంటున్నాయి.
కేవలం కేసులు పెట్టడం కాదు, కఠిన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా దాడికి గురైన విలేకరి లక్ష్మీనారాయణ షెడ్యూల్ కాస్ట్ వ్యక్తిగా చెపుతూ ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదు, మొత్తం జర్నలిజం వృత్తిపై దాడిగా అక్కడి వారు భావిస్తున్నారు.
న్యాయం కోసం నిలదీస్తున్న జర్నలిస్టులు..
ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు నిరసనలకు దిగుతున్నారు. “జర్నలిస్టుల రక్షణ ఎక్కడ?” అనే ప్రశ్నకు సమాధానం కోరుతున్నారు.
ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా పరిగణించే మీడియా రోజు తన భద్రత కోసం పోరాడాల్సిన పరిస్థితి రావడం “జర్నలిజం-జర్నలిస్టుల”కు దురదృష్టకరం.
పత్రికా స్వేచ్ఛ అంటే కేవలం పత్రికలు ముద్రించుకోవడం కాదు కదా..!
భయపడకుండా నిజం చెప్పే ధైర్యం కలిగిన వాతావరణం కూడా “జర్నలిజం-జర్నలిస్టుల”కు ఉండాలి.
ఒక జర్నలిస్టుపై దాడి జరిగితే, అది కేవలం ఒక వ్యక్తిని కాదు, ప్రజలు తెలుసుకునే సమాచార హక్కు దెబ్బతీసినట్టే.
ఈ ప్రపంచ పత్రికాస్వేచ్ఛా దినోత్సవం మనకు ఒకటి గుర్తుచేస్తోంది. స్వేచ్ఛను కాపాడుకోవాలంటే మాట చెప్పేవారిని కాపాడాలి.
లేకపోతే, రేపటి రోజున నిజం అనేది నోరు తెరిచి మాట్లాడలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది.
మీడియా యాజమాన్యాల బాధ్యతారాహిత్యం..
ఇటువంటి ఘటనలపై జర్నలిస్టులను ముందు వరుసలో ఉంచి వార్తల కోసం దర్జాగా ఆర్డర్లు వేసి, ఏం జరిగినా తమకేమీ పట్టనట్లు హోదాలు ప్రదర్శించుకునే కొన్ని మీడియా యాజమాన్యాలు ప్రధాన ఎజెండా ప్రక్కనబెట్టి, కాస్త జర్నలిస్టులకు అండగా నిలవాల్సిన పరిస్థితులు గమనించాలి.
ఇలాంటి సంక్షోభ సమయాల్లో తమ బాధ్యతను ఎంతవరకు నిర్వర్తిస్తున్నాయన్న ప్రశ్న ఇప్పుడు తప్పనిసరిగా మీడియా యాజమాన్యాలకు మరింతగా ఎదురుపడుతోంది.
సంఘటనల సమయంలో మైక్ పట్టుకుని, నిజం వెలికితీసే బాధ్యతను జర్నలిస్టుల భుజాలపై వేస్తున్న సంస్థలు, అదే జర్నలిస్టు ప్రమాదంలో పడినప్పుడు, దాడులకు గురైనప్పుడు మాత్రం వెనుకంజ వేస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇది మీడియా యాజమాన్యాల స్వార్థ బుద్ధి అని ఇప్పటికే లోకం కాకులుగా కూస్తోంది.
జర్నలిజం అనేది కేవలం ఒక ఉద్యోగం కాదు, అది ప్రజల కోసం జర్నలిస్టులు నెరవేర్చాల్సిన బాధ్యత.
అలాంటి బాధ్యత నిర్వర్తించే వ్యక్తి ప్రమాదంలో పడితే, అతని వెనుక నిలబడటం మీడియా సంస్థల కనీస కర్తవ్యంగా మారాలి. కానీ వాస్తవ పరిస్థితుల్లో చూస్తే, చాలా సందర్భాల్లో బాధిత జర్నలిస్టులు ఒంటరిగా పోరాడాల్సిన పరిస్థితి వస్తోంది.
ఇది వృత్తి భద్రతపై తీవ్రమైన సందేహాలు కలిగిస్తోంది.
ఒక జర్నలిస్టుపై దాడి జరిగితే, ఆ ఘటనను కేవలం వ్యక్తిగత సమస్యగా కాకుండా, సంస్థపై జరిగిన దాడిగా భావించాలి. అప్పుడు మాత్రమే సరైన ప్రతిస్పందన ఉంటుంది.
ముందు పంపితే… వెనుక నిలబడాలి..
బాధితుడికి న్యాయం జరిగే వరకు న్యాయపరమైన పోరాటంలో అతనికి అండగా నిలవడం, అవసరమైతే చట్టపరమైన సహాయం అందించడం, కుటుంబానికి మానసిక ధైర్యం అందించడం ఇవన్నీ మీడియా యాజమాన్యాల బాధ్యతల్లో భాగం కావాలి.
ఇటువంటి సందర్భాల్లో మీడియా సంస్థలు మౌనం వహిస్తే, అది కేవలం ఒక వ్యక్తిని నిరాశపరచడం మాత్రమే కాదు, జర్నలిస్టుల వృత్తి గౌరవాన్ని తగ్గించడం కూడా అవుతుంది.
ఇలా అయితే, రేపు మరొక జర్నలిస్టు ఎవరైనా కావచ్చు ఫీల్డ్లోకి వెళ్లే ధైర్యాన్ని కోల్పోతాడు.
కాబట్టి “ముందు పంపించి, తర్వాత మర్చిపోవడం” అనే విధానాన్ని మార్చి…, ప్రతి మీడియా యాజమాన్యం తమ జర్నలిస్టులను న్యూస్ కవరేజీకి “ముందు పంపితే, వెనుక నిలబడతాం” అనే నమ్మకాన్ని కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జర్నలిస్టులు ప్రధానంగా తమ యాజమాన్యాల నుంచి ఈ హక్కును తప్పకుండా సాధించుకోవాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
