“క్యూబన్ మిస్సైల్ సంక్షోభంలో జేఎఫ్‌కే నుంచి “గ్రెనడాలో రీగన్ నుంచి ట్రంప్, అతని బృందం ఒక పాఠం నేర్చుకోవచ్చు.
అమెరికాను సందర్శించిన చరిత్రలో మొట్టమొదటి అధికారిక పోప్ అయిన పోప్ పాల్ VI, 1965 అక్టోబర్ 4న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
అప్పుడు ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది, భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం అప్పుడే జరిగింది, వియత్నాంలో అమెరికా పెద్ద ఎత్తున సైనిక చర్యలు సాగిస్తోంది.
ఆ సమయంలో ఆ మతగురువు ఐక్యరాజ్యసమితి తన బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు:
“ఐక్యరాజ్యసమితి ఏర్పడిన అసలు ఉద్దేశ్యం ఇది కాదా: యుద్ధానికి వ్యతిరేకంగా, శాంతికి అనుకూలంగా ఉండటం? ఇప్పుడు మన మధ్య లేని ఒక గొప్ప నాయకుడు జాన్ కెన్నెడీ, నాలుగు సంవత్సరాల క్రితం చెప్పిన స్పష్టమైన మాటలను వినండి.. ‘మానవాళి యుద్ధానికి స్వస్తి పలకాలి, లేకపోతే యుద్ధమే మానవాళికి స్వస్తి పలుకుతుంది.’
మీ సంస్థ ప్రధాన ఉద్దేశాన్ని ప్రకటించడానికి పెద్దగా ప్రసంగం అవసరం లేదు.
లక్షలాది ప్రజల రక్తం, చెప్పలేనన్ని బాధలు, అర్థం లేని మారణహోమాలు, భయానక విధ్వంసాలు— ఇవన్నీ కలిసి మిమ్మల్ని ఒక ప్రతిజ్ఞతో ఏకం చేశాయి. ఆ ప్రతిజ్ఞ ప్రపంచ చరిత్రను మార్చగలదు.
‘ఇకపై యుద్ధం వద్దు, ఎన్నడూ యుద్ధం వద్దు! శాంతి, శాంతి మాత్రమే సమస్త మానవాళి, దేశాల భవితవ్యాన్ని నడిపించాలి.'”
ఆ ప్రసంగం విద్యుత్తును పుట్టించేంత ఉత్తేజితంగా ఉంది. అది రాజీలేని నైతిక గాంభీర్యానికి నిదర్శనమైన స్వరం.
జాన్ ఎఫ్ కెన్నెడీ: సంక్షోభ సమయంలో వాగ్ధాటితో కూడిన నాయకత్వం..
క్లిష్ట సమయంలో వాగ్ధాటితో కూడిన నాయకత్వానికి ఇక్కడ మరొక ఉదాహరణ ఉంది.
1962 అక్టోబర్ 22న, తర్వాతి కాలంలో ‘క్యూబన్ మిస్సైల్ సంక్షోభం’గా పిలవబడిన పరిస్థితుల గురించి అమెరికాకు నివేదిస్తున్న జాన్ ఎఫ్ కెన్నెడీ ప్రసంగం అది.
ఆయన మాటలు సూటిగా, క్రమశిక్షణతో, పొదుపుగా ఉన్నాయి—ఆ మాటల సాంద్రతే వాటి గంభీరతను నిరూపించింది.
“ఈ ప్రభుత్వం, వాగ్దానం చేసినట్లుగానే, క్యూబా ద్వీపంలో సోవియట్ సైనిక బలగాల సమీకరణపై అత్యంత నిశితమైన నిఘాను ఉంచింది. గత వారంలో, దాడులు జరపటానికి క్షిపణి స్థావరాలు సిద్ధం అవుతున్నాయని నిర్ద్వంద్వమైన సాక్ష్యాలు బయటపడ్డాయి. పశ్చిమార్ధగోళంపై అణుదాడి చేయగల సామర్థ్యాన్ని అందించడం తప్ప ఈ స్థావరాల ఉద్దేశ్యం మరేమీ కాదు.”
సాక్ష్యాలను పరిశీలించారు, ఒక కార్యాచరణను నిర్ణయించారు, ఆ తరువాత “ఈ కొత్త సంక్షోభాన్ని పూర్తి వివరాలతో మీకు వివరించాల్సిన బాధ్యత” తనపై ఉందని ఆయన భావించారు.
అందుకే ఆయన వివరించారు. 1,000 నాటికల్ మైళ్ల దూరానికి మించి అణు వార్‌హెడ్‌ను మోసుకెళ్లగల మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణుల ఉనికిని అమెరికా నిర్ధారించింది.
“అదనంగా, అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్న జెట్ బాంబర్లు ప్రస్తుతం క్యూబాలో పెట్టెల నుంచి బయటకు తీసి అమరుస్తున్నారు, వాటికి అవసరమైన వైమానిక స్థావరాలు కూడా సిద్ధం చేయబడుతున్నాయి.”
ఇది నెలల తరబడి సాగుతున్న వ్యవహారం. దీని గురించి అడిగిన ప్రతిసారీ సోవియట్లు అబద్ధాలే చెప్పారు.
ఒకవేళ అమెరికా దీనిని చూస్తూ ఊరుకుంటే, మన ధైర్యాన్ని లేదా మన మాటను అటు మిత్రదేశాలు గానీ, ఇటు శత్రుదేశాలు గానీ ఎప్పటికీ నమ్మవు.
కాబట్టి, ఈ క్షిపణులను ఈ దేశంపై లేదా మరే ఇతర దేశంపై వినియోగించకుండా నిరోధించడం, పశ్చిమార్ధగోళం నుంచి వాటిని నిర్మూలించడమే మన అచంచలమైన లక్ష్యం కావాలి.
అందుకే ఈ ప్రణాళిక: క్యూబాకు తరలించే సైనిక సామాగ్రిపై అమెరికా ‘కఠినమైన ఆంక్షలు’ విధిస్తోంది. ఆ ద్వీపంపై నిరంతరం నిఘా కొనసాగుతుంది.
ఒకవేళ సోవియట్లు తమ క్షిపణి వ్యవస్థల ఏర్పాటును ఆపకపోతే, మేము ‘మరింత కఠినమైన చర్యలు’ తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి అమెరికా సైన్యం సిద్ధంగా ఉంది.
క్యూబా నుంచి పశ్చిమార్ధగోళంలోని ఏ దేశంపైనా అణు క్షిపణి ప్రయోగం జరిగినా, సోవియట్ యూనియన్‌పై పూర్తి ప్రతీకార చర్య అవసరమని అమెరికా భావిస్తుంది.
ఆయన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు.
“మాకు సోవియట్ యూనియన్‌తో యుద్ధం చేయాలనే కోరిక లేదు, ఎందుకంటే మేము శాంతిని కోరుకునే వ్యక్తులం, అన్ని ఇతర దేశాలతో శాంతితో జీవించాలని ఆశిస్తాం. కానీ అవసరమైతే ఏం చేయాలో అది చేసి తీరుతాము. స్పందించకపోవడం అన్నింటికంటే పెద్ద ప్రమాదం.”
11 ఏళ్ల వయసున్న నాకు కూడా ఆయన చెప్పే విషయాలు స్థూలంగా అర్థమయ్యేవి. నిజానికి మనందరికీ అర్థమైంది.
ఆధారాలు విన్నాం, అధ్యక్షుడి ఆలోచనను అనుసరించాం, ఆయన నిర్ణయంపై విశ్వాసం ఉంచాం. అందుకే ఆయనకు ప్రజల మద్దతు లభించింది.
రోనాల్డ్ రీగన్: గ్రెనెడాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ..
ఇక్కడ 1983 అక్టోబర్ 25 నాటి విషయం- ఇది అంత ప్రమాదకరం కాకపోయినా నాటకీయతతో కూడిన సందర్భం.
అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ వైట్ హౌస్ బ్రీఫింగ్ రూమ్ నుంచి దేశాన్ని ఉద్దేశించి, కరేబియన్ దీవి గ్రెనెడాకు అమెరికా సైన్యాన్ని పంపినట్లు ప్రకటించారు.
జేఎఫ్‌కే లాగే, రీగన్ కూడా తాను ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో ప్రజలకు స్పష్టంగా వివరించారు.
ఆ చిన్న కరేబియన్ దీవిలోని ప్రజాస్వామ్య ప్రభుత్వం ఒక మార్క్సిస్టు తిరుగుబాటుతో కూలదోయబడింది.
అక్కడ అమెరికన్ పౌరులు ఉన్నారు- వారిలో సెయింట్ జార్జ్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్లో చదువుతున్న సుమారు 700 మంది విద్యార్థులు కూడా ఉన్నారు.
గ్రెనెడా ప్రధానమంత్రి, ఆయన ప్రభుత్వంలోని పలువురు సభ్యులు ఎలా హత్య చేయబడ్డారో రీగన్ వివరించారు.
పొరుగు కరేబియన్ దేశాల నుంచి “తక్షణ” సహాయం కోసం విజ్ఞప్తులు అమెరికాకు అందాయి. “ఈ రోజు తెల్లవారుజామున, ఆరు కరేబియన్ ప్రజాస్వామ్య దేశాలు, యునైటెడ్ స్టేట్స్ దళాలు తూర్పు కరేబియన్‌లోని గ్రెనెడా దీవిపై దిగడం ప్రారంభించాయి.”
ఈ చర్యకు మూడు కారణాలు ఉన్నాయి: అమెరికన్ ప్రాణాలను రక్షించడం, మరింత అస్తవ్యస్తతను నివారించడం, ప్రజాస్వామ్య వ్యవస్థలను పునరుద్ధరించడంలో సహాయపడడం. లక్ష్యాలు నెరవేరిన వెంటనే అమెరికా దళాలు ఉపసంహరించుకుంటాయి.
“మేము వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయటకు రావాలనుకుంటున్నాం, ఎందుకంటే అక్కడ ఉండటానికి మా ఉద్దేశ్యం వారు తమ వ్యవహారాలను తామే నిర్వహించుకునేలా చేయడమే.”
కొన్ని రోజుల తరువాత దేశాన్ని ఉద్దేశించి చేసిన మరో ప్రసంగంలో, ఆయన విస్తృత నేపథ్యాన్ని అంగీకరించారు.
“మేము మరో “క్యూబా”లాంటి పరిస్థితిని అనుమతించలేము.” గత కొన్ని సంవత్సరాలుగా సోవియట్ యూనియన్, క్యూబా గ్రెనెడాలో జోక్యం పెంచుతూ, సైనిక సదుపాయాలు నిర్మించడం, ఆయుధాలు సరఫరా చేయడం, సైనిక విమానాలను నిర్వహించగల ఎయిర్‌ఫీల్డ్‌ను నిర్మించడం వంటి చర్యలు చేపట్టాయి.
రీగన్ ప్రకటనలు జేఎఫ్‌కే ప్రకటనల మాదిరిగానే వాక్చాతుర్యంలో క్రమశిక్షణతో కూడి ఉన్నాయి- ఎటువంటి ఆడంబరాలు లేకుండా, భావోద్వేగ ప్రదర్శన లేకుండా, కేవలం వాస్తవాలను మాత్రమే ప్రతిపాదించాయి.
తమ చర్యలు నైతిక విలువలు, వ్యూహాత్మక ఆలోచనలపై ఆధారపడి ఉన్నాయని, దేశ విస్తరణ కాంక్షతోనో లేదా దురాక్రమణ ఉద్దేశంతోనో చేసినవి కావని ఇద్దరూ స్పష్టం చేశారు.
చివరగా, 7,000 మంది అమెరికన్ సైనికులు కరీబియన్ దళాలతో కలిశారు. కేవలం మూడు రోజుల్లోనే వారు అక్కడి కొత్త ప్రభుత్వాన్ని కూలదోసి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు. తద్వారా సోవియట్-క్యూబా కొత్త స్థావరం ఏర్పడకుండా అడ్డుకున్నారు.
ప్రారంభంలో దీనిపై అమెరికన్ పత్రికల స్పందన అనుమానాస్పదంగా, వ్యతిరేకతతో కూడి ఉంది. అయితే, రక్షించబడిన మెడికల్ విద్యార్థులు సౌత్ కరోలినాలోని చార్లెస్టన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌కు చేరుకున్నప్పుడు జరిగిన సంఘటనలు ప్రజల అభిప్రాయాన్ని మార్చేశాయి. వారు సైనిక విమానాల నుంచి దిగగానే, కొందరు రన్‌వేపై మోకరిల్లి నేలను ముద్దాడారు.
వాషింగ్టన్ పోస్ట్‌తో ఒక విద్యార్థి మాట్లాడుతూ, తాను ఎప్పుడూ “శాంతి కాముకుడిని” అని, కానీ ఇకపై అమెరికన్ సైన్యానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా వినలేనని చెప్పాడు.
నాయకత్వంలో లోపాలు: గంభీరత, స్పష్టత కరువు..
మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇది ఎలా చేయాలో గుర్తుచేస్తున్నాం. ఒక అధ్యక్షుడు తన దేశాన్ని సైనిక చర్యకు సిద్ధం చేసేటప్పుడు అది ఎలా ఉండాలో వివరిస్తున్నాం. ఆయన చరిత్రను వివరిస్తారు, సాక్ష్యాలను చూపుతారు, దాని అర్థాన్ని విశ్లేషిస్తారు, ప్రణాళికను రూపొందిస్తారు.
ఇలాంటి బలమైన వాక్చాతుర్యం లేకుండా మీరు ఒక దేశాన్ని యుద్ధానికి తీసుకెళ్లలేరు. మిస్టర్ ట్రంప్ అది చేయటంలో విఫలమయ్యారు. అప్పుడప్పుడు ఆయన వేదికపై నిలబడి కొన్ని విషయాలు ప్రకటిస్తారు, విలేకరుల ప్రశ్నలకు అప్పటికప్పుడు స్పందిస్తారు. కానీ లోతుగా ఆలోచించి రూపొందించిన వివరణ లేదు, విషయాన్ని స్పష్టంగా తెలియజేసే ఒక్క పత్రం కూడా లేదు. దీనివల్ల ప్రజలలో ఎప్పుడూ నమ్మకం కలగలేదు.
ఇరాన్‌తో ఉద్రిక్తతలు మొదలై నెల గడుస్తున్నా, “ఇప్పుడే ఎందుకు?” అనే విషయం మనకు ఇంకా తెలియదు. గత 50 ఏళ్లుగా ఇరాన్ ప్రపంచానికి ఒక తీవ్ర సమస్యగా ఉంటూనే ఉంది. మరి ప్రణాళిక ఏమిటి?
గంభీరత, స్పష్టత లేకపోవడమే అధ్యక్షుడి ప్రజాదరణ తగ్గడానికి ఒక కారణం. ఒకవేళ డోనాల్డ్ ట్రంప్ దీన్ని చేయలేకపోతే, ఆయన ఉపాధ్యక్షుడు కూడా దీన్ని చిత్తశుద్ధితో చేయలేకపోతే, బహుశా విదేశాంగ మంత్రి రంగంలోకి దిగాలేమో?
వాటికన్‌కు ఒక సూచన: సోషల్ మీడియా కంటే హుందాతనం ముఖ్యం..
సలహాగా చెప్పాలంటే- వాటికన్ సామాజిక మాధ్యమ ఖాతాలను నిర్వహిస్తున్న కొందరు ఉత్సాహవంతులైన మోన్సిగ్నోర్లు, పోప్‌ను చాలా ఆధునికంగా చూపించాలని ఆత్రుతగా ఉన్నారని అనిపిస్తుంది. కానీ గొప్ప సందర్భాల్లో గొప్ప సందేశాలు ఇవ్వడానికి “ఎక్స్”లో చేసే హడావిడి పోస్టుల కంటే, హోమిలీలు, ప్రసంగాలు, అధికారిక పత్రాలు, ఎన్సైక్లికల్స్ మరింత తగినవిగా ఉంటాయి.
చౌకబారు పద్ధతులు వద్దు. మీరు సెయింట్ పీటర్ సింహాసనాన్ని అధిష్టించిన వారు. ఏదైనా గంభీరంగా, హుందాగా చేయండి.
ఈ వ్యాసాన్ని ది వాల్ స్ట్రీట్ జర్నల్ సౌజన్యంతో ది వైర్ తెలుగు పాఠకులకు అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
