ప్రపంచ కార్మిక వర్గానికి, పీడించబడే అందరికీ మార్గదర్శకుడిగా నిలిచిన మహనీయుడు కార్ల్ మార్క్స్.
ఆయన 1818 మే 5న నాటి ప్రష్యా, నేటి జర్మనీలోని ట్రియర్ పట్టణంలో జన్మించారు.
కార్ల్ మార్క్స్ జయంతి సందర్భంగా వారికి నివాళులు. ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు నేటికీ ప్రపంచ రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలపై గొప్ప ప్రభావాన్ని చూపుతున్నాయి.
ఆయన సిద్ధాంతీకరించినదే మార్క్సిజం. ఇది సమాజాన్ని వర్గాలుగా విభజించి, దోపిడీకి గురయ్యే, దోపిడీ చేసే వర్గాల మధ్య ఉన్న వైరుధ్యాలను విశ్లేషిస్తుంది.
ఆ వైరుధ్యాల పరిష్కారానికి మార్గనిర్దేశం చేస్తుంది.
కమ్యూనిస్టు మేనిఫెస్టో అనే ప్రసిద్ధ గ్రంథాన్ని మార్క్స్ తన స్నేహితుడు ఫ్రెడరిక్ ఎంగెల్స్‌తో కలిసి రచించారు. ఈ గ్రంథం ప్రపంచ కార్మికులకు ఒక దిశానిర్దేశకంగా మారింది.
“ప్రపంచ కార్మికులారా, ఏకం కండి – పోయేదేమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప” అనే పిలుపు నేటికీ ప్రతిధ్వనిస్తోంది.
దాస్ క్యాపిటల్ – విప్లవాలకు ప్రేరణ..
మార్క్స్ మరో సుప్రసిద్ధ రచన “దాస్ క్యాపిటల్”- రాజకీయ అర్థశాస్త్రం.
సంపద సృష్టికర్తలు కార్మికులే అయినప్పటికీ దానిపై వారికి ఎలాంటి హక్కు, భాగస్వామ్యం లేకుండా లాభాలు మాత్రం పెట్టుబడిదారుల చేతుల్లోనే కేంద్రీకృతమవుతున్నాయని ఆయన విశ్లేషించారు.
మార్క్స్ సిద్ధాంతాలు కేవలం పుస్తకాలకే పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా కార్మిక ఉద్యమాలకు ప్రేరణగా మారాయి.
అనేక దేశాల్లో సామ్యవాద ఉద్యమాలు, విప్లవాలు ఆయన సిద్ధాంతాల ఆధారంగా జరిగాయి. ముఖ్యంగా 1917లో జరిగిన రష్యా విప్లవం మార్క్సిజం ప్రభావానికి ఒక గొప్ప ఉదాహరణ.
నేటి సమాజానికి మార్క్స్ సిద్ధాంతాల ఆవశ్యకత..
నేటి ప్రపంచంలో దారిద్ర్యం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగాయి.
ఈ నేపథ్యంలో మార్క్స్ ఆలోచనలు, సిద్ధాంతం మరింత ప్రాముఖ్యతను సంపాదించుకున్నాయి.
కార్మికుల హక్కులు, సమాన వేతనాలు, సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన మార్గమే నేటి ప్రత్యామ్నాయం.
మార్క్స్ జన్మదినం సందర్భంగా, మనం ఆయన సిద్ధాంతాలను గుర్తుచేసుకుని, సమానత్వం, న్యాయం, నిజమైన ప్రజాస్వామ్యం, మానవ గౌరవం కోసం కృషి చేయాలి.
సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించడమే నిజమైన అభివృద్ధి అనే సందేశాన్ని, అది సాధించే మార్గాన్ని ఆయన మనకు అందించారు.
సహచరుల సహకారం – సమసమాజ కాంక్ష..
“సమాజ పరిణామాన్ని అనేకమంది అధ్యయనం చేశారు, విశ్లేషించారు. ఇప్పుడు చేయాల్సిందల్లా ఆ సమాజాన్ని మార్చడమే” అని సిద్ధాంతీకరించిన ఏకైక వ్యక్తి, మహోన్నత వ్యక్తి మార్క్స్.
ఆయన ప్రతి అడుగు, ప్రతి సిద్ధాంతం వెనుక దాగివున్న, అన్ని విధాలా సహకరించిన ఆయన సతీమణి జెన్నీ, ప్రాణ స్నేహితుడు ఎంగెల్స్ ప్రస్తావన లేకుండా మార్క్స్‌ను ఊహించడం సాధ్యం కాదు.
కార్ల్ మార్క్స్ పుట్టింది మధ్యతరగతి వర్గంలో. ఉన్నత చదువులు అభ్యసించి అనేక సామాజిక శాస్త్రాలను సంపూర్ణంగా అధ్యయనం చేశారు.
ఆ కృషిలో భాగమే ఆయన మరణించేదాకా ఏ దేశ పౌరసత్వం లేకుండా, ప్రపంచమంతా తనదిగా భావించి జీవించిన వ్యక్తి.
కటిక దరిద్రాన్ని, దుర్భర జీవన పరిస్థితులను లెక్కచేయకుండా సమాజ శ్రేయస్సు లక్ష్యంగా జీవించాడు.
సమాజమంతా వర్గ పోరాటాల చరిత్ర అని విశ్లేషించి, దానికి గల కారణాలను, పరిష్కారాలను చూపిన మొట్టమొదటి దార్శనికుడు.

సమాజంలో వర్గ విభజన అంతం కావాలని, దోపిడీ లేని సమసమాజ నిర్మాణం ఏర్పాటే ఏకైక పరిష్కార మార్గమని సిద్ధాంతీకరించాడు.
లెనిన్ ఆచరణ – సోవియట్ విజయాలు..
దోపిడీ సమాజాన్ని ఎలా కూల్చివేయాలో మార్గనిర్దేశం చేశారు. దానిని మరింత లోతుగా విశ్లేషించి రష్యా దేశ పరిస్థితులకు అన్వయించి, రష్యాలోని నియంత జార్ చక్రవర్తి స్థానంలో ప్రపంచంలోనే మొదటిసారి కార్మిక వర్గ నాయకత్వంలో సమసమాజ స్థాపన చేసిన మహనీయుడు లెనిన్.
మార్క్సిజం జడపదార్థం కాదని, ఆచరణాత్మకమైన, ప్రజాప్రయోజనకరమైన సిద్ధాంతమని లెనిన్ నిరూపించాడు.
ప్రపంచంలోనే మొట్టమొదటిసారి కార్మికులకు ఎనిమిది గంటల పని, సమ్మెలను హక్కుగా గుర్తించి చట్టాలు చేసింది సోవియట్ యూనియన్ మాత్రమే.
నేడు ప్రపంచంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, దారిద్ర్యం అన్ని దేశాల ప్రజలను పట్టిపీడిస్తున్న వ్యాధులు. సోవియట్ యూనియన్ వీటిని అంతం చేసి ప్రపంచ మానవాళికి మార్గనిర్దేశం చేసింది.

నిరుద్యోగాన్ని సంపూర్ణంగా నిర్మూలించి చివరి నిరుద్యోగిని సన్మానించింది సోవియట్ యూనియన్. ధరల పెరుగుదల అంటే ఏమిటో తెలియని సమాజాన్ని సృష్టించింది. ప్రతి ఒక్కరికి సరైన తిండి, విద్య, వైద్యం, గృహవసతి ప్రభుత్వ బాధ్యతగా తీసుకొని అమలు చేసిన ఏకైక దేశం సోవియట్ యూనియన్.
పెట్టుబడిదారీ వ్యవస్థ వైఫల్యాలు – సోషలిస్టు దేశాల ప్రగతి..
1991లో సోవియట్ యూనియన్, తూర్పు యూరప్ దేశాలలోని సోషలిస్టు వ్యవస్థలు పతనమైనాయి. దాంతో పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయం లేదు అనే నినాదం మారుమోగింది. అందుకు కేరాఫ్ అడ్రస్ “అమెరికా” అని ప్రచారం హోరెత్తించింది. మీడియా సంస్థలు పుంఖానుపుంఖాలుగా కథనాలు వండి వడ్డించాయి.
కేవలం 35 సంవత్సరాలలోనే అదంతా బూటకమని తేటతెల్లమైంది. నేడు ఆ అమెరికాలోనే నిరుద్యోగం, దరిద్రం, ధరల పెరుగుదల ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. ట్రంప్ గ్రాఫ్ గణనీయంగా పడిపోతున్నది. అమెరికాకి గుండెకాయ అయిన న్యూయార్క్ నగర ఎన్నికలలో డెమొక్రాట్లు, రిపబ్లికన్లు నానా గడ్డి కరిచినా, ఒక సోషలిస్టు యువకుడు జోహ్రాన్ మమ్దానీ విజయకేతనం ఎగురవేశాడు.
ప్రపంచంలో కేవలం 40 సంవత్సరాల వ్యవధిలో ఏ దేశం సాధించని అభివృద్ధిని చైనా సాధించింది. అనేక రంగాలలో అమెరికా కంటే ముందు స్థానంలో ఉంది. అతి చిన్న దేశమైన క్యూబాను అమెరికా అష్టదిగ్బంధనం చేసింది. అలాంటి క్యూబా ప్రజారోగ్య వ్యవస్థలో ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది.

వియత్నాం, ఉత్తర కొరియా దేశాలు సాధించిన అభివృద్ధి సామాన్యమైనవి కావు. ఇవన్నీ మార్క్సిజం, లెనినిజం సిద్ధాంతాల ప్రాతిపదికన సోషలిస్టు వ్యవస్థ నిర్మాణంలో ఉన్న దేశాలు.
ప్రపంచవ్యాప్త ప్రజా పోరాటాలు..
ప్రజల ఇబ్బందులు, ఈతి బాధలకు మూలం పెట్టుబడిదారీ వ్యవస్థలోనే ఉంది అని రుజువు అవుతున్నది. ఈ వాస్తవాన్ని నేడు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక దేశాల ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఆ పెట్టుబడిదారీ వ్యవస్థ పండించిన విష ఫలాలకు వ్యతిరేకంగా ప్రజలు వివిధ దేశాలలో తిరుగుబాట్లు చేస్తున్నారు.
ముఖ్యంగా యువత వీటిలో ప్రధాన శక్తిగా ఉంది. బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ ఈ కోవకు చెందినవే. మరికొన్ని దేశాలలో ప్రజలు ప్రభుత్వాధినేతలను గద్దె నుండి తరిమి వేస్తున్నారు. గత ఏప్రిల్ నెలలో జరిగిన పోలాండ్, హంగేరీ ఎన్నికలు ఇందుకు ఉదాహరణ.
మార్క్సిజం పరాయి దేశ సిద్ధాంతమా?..
ఈ వాస్తవాలను కప్పిపుచ్చి ప్రజలను పక్కదారి పట్టించడానికి నేడు దేశంలోని పాలకులు మార్క్సిజం పరాయి దేశ సిద్ధాంతమని, మన దేశానికి మన దేశ విధానాలే కావాలని మాట్లాడుతున్నారు.
ఏదైనా ఒక సిద్ధాంతం, ఒక నూతన ఆవిష్కరణ జరిగినప్పుడు అది ప్రజల శ్రేయస్సుకు ఉపయోగపడినప్పుడు దాన్ని సిద్ధాంతీకరించినవారు ఏ దేశస్థులు అనేది చూడడం అవివేకం, ప్రమాదకరం.
పారిశ్రామిక విప్లవానికి మూలమైన ఆవిరి యంత్రం, పరిశ్రమల పురోభివృద్ధికి – అవి 24 గంటలు నిరంతరాయంగా పనిచేయడానికి అవసరమైన విద్యుత్తును కనిపెట్టింది, సమాచారానికి మూలమైన టెలిఫోన్ కనిపెట్టింది, రవాణాలో విమానాన్ని కనిపెట్టింది భారతీయులు కారు.
నేడు భారత ప్రజలు వినియోగిస్తున్న అనేక సరుకులు, సేవల మూలాలను కనుగొన్న శాస్త్రవేత్తలు భారతీయులు కారు. సమాజ పరిణామంలో జరిగిన అనేక నూతన ఆవిష్కరణలు, వాటి సిద్ధాంతకర్తలు, వారు ఏ దేశానికి చెందినవారు అనే వివరాలు అనుబంధంలోని పట్టికలో చూడండి. మరి వాటిని వదులుకోవడానికి సిద్ధమా?
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
