లక్షలాది మంది తమ ప్లాన్లను వదులుకుంటున్నారు. మెరుగైన సహాయాన్ని(సబ్సిడీలను) నిలిపివేయాలని కాంగ్రెస్ నిర్ణయించిన తర్వాత చాలా మంది ఖర్చును భరించలేకపోతున్నారు.
అఫర్డబుల్ కేర్ యాక్ట్(ACA)లో కీలకమైన ఆరోగ్య సబ్సిడీలను పొడిగించడంలో అమెరికన్ కాంగ్రెస్ విఫలమైనప్పటి నుంచి, లక్షలాది మంది అమెరికన్లు ఒబామాకేర్ కవరేజీని వదులుకుంటున్నట్టు కనిపిస్తోంది.
ప్రారంభ సైన్-అప్లు ఇప్పటికే దాదాపు 1.2 మిలియన్ల మేర తగ్గాయి.
అయితే ప్రజలు దీర్ఘకాలిక అధిక ఖర్చులను ఎదుర్కొంటున్నందున, చాలా మంది తమ ఒబామాకేర్ కవరేజీని కోల్పోయారని ఇన్సూరెన్స్ కంపెనీలు, రాష్ట్ర అధికారులతోపాటు పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు. ఫెడరల్ ప్రభుత్వం ప్రస్తుత గణాంకాలను ఇంకా విడుదల చేయాల్సి ఉంది.
గత ఏడాది ఏసీఏ కింద కవరేజీ పొందిన 24 మిలియన్ల నుంచి సుమారు 19 మిలియన్లకు, అంటే మొత్తం మీద 20 శాతం మేర తగ్గుదల ఉంటుందని చాలా మంది బీమా సంస్థలు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇతర అంచనాల ప్రకారం, ఈ ఏడాది చివరి నాటికి మరింత భారీ నష్టాలు సంభవించే అవకాశం ఉంది.
ఇది ఒబామాకేర్ కవరేజీలో తీవ్రమైన తరుగుదల. గత కొన్ని సంవత్సరాలుగా సాధించిన గణనీయమైన వృద్ధికి ఇది విరుద్ధంగా ఉంది.
పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులు..
పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులు అమెరికన్లలో ప్రధాన ఆందోళనగా ఉన్నాయని పలు ప్రజాభిప్రాయ సేకరణలు వెల్లడిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరుగుతున్నందున, ఉద్యోగాల ద్వారా ఇన్సూరెన్స్ పొందే అమెరికన్లకు కూడా ప్రీమియంలు పెరుగుతున్నాయి.
అధిక డిడక్టబుల్స్ కలిగిన ప్లాన్లు ప్రాచుర్యం పొందుతుండటంతో, చేతి నుంచి పెట్టుకునే ఖర్చులు కూడా పెరుగుతున్నాయి.
2025 చివరలో సబ్సిడీల విషయంలో చట్టసభ సభ్యులు ప్రతిష్టంభనకు చేరుకున్నప్పటి నుంచి, రిపబ్లికన్ నియంత్రణలో ఉన్న కాంగ్రెస్‌కు ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యత తగ్గింది.
అయినప్పటికీ, ఈ ఏడాది జరిగే మధ్యంతర ఎన్నికలలో ఇది ప్రముఖ అంశంగా ఉండే అవకాశం ఉంది.
ఇన్సూరెన్స్‌కు సంబంధించిన సంపూర్ణ సమాచారం కలిగిన “వీక్లీ కన్సల్టింగ్ గ్రూప్” చేసిన ఒక విశ్లేషణ ప్రకారం, గత ఏడాది సగటు నమోదుతో పోలిస్తే ఈ ఏడాది మార్కెట్‌ప్లేస్‌లలో బీమా కవరేజ్ 26 శాతం వరకు తగ్గుతుందని అంచనా.
బీమా సంస్థల కస్టమర్ల నష్టం..
2021లో అదనపు ఆర్థిక సహాయం ప్రారంభమైనప్పటి నుంచి జార్జియాలో కవరేజ్ దాదాపు మూడు రెట్లు పెరిగింది. “న్యూస్ ఆర్గనైజేషన్” అనే సంస్థ సేకరించిన సమాచారం ప్రకారం అక్కడ నమోదులు మూడింట ఒక వంతు కంటే ఎక్కువగా పడిపోయాయి.
బ్లూ క్రాస్ వంటి ప్రధాన బీమా సంస్థలు ఈ సంవత్సరం తమ కస్టమర్లలో 20 నుంచి 30 శాతాన్ని కోల్పోయాయి.
బ్లూ క్రాస్ బ్లూ షీల్డ్ అసోసియేషన్ ప్రతినిధి డేవిడ్ మెరిట్ మాట్లాడుతూ, “అందరిలాగే మేము కూడా పూర్తి సమాచారం కోసం ఎదురు చూస్తున్నాము” అని చెప్పారు.
“అయితే చాలామంది ప్రీమియంల భారం భరించలేక జేబు నుంచి పెట్టుకోవలసిన ఖర్చు అదనంగా ఉన్నప్పటికీ తక్కువ ప్రీమియం ఇన్సూరెన్స్ ప్యాకేజీలను ఆశ్రయిస్తున్నారు” అని అన్నారు.
ముందస్తు పదవీ విరమణ పొందినవారిపై భారం..
మధ్యతరగతి ఆదాయం కలిగిన ముందస్తు పదవీ విరమణ పొందినవారు ఎక్కువగా ప్రభావితమయ్యారని ప్రభుత్వ వర్గాలు, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు చెప్పారు.
కొన్ని ప్రాంతాల్లో వీరి బీమా ఖర్చులు నెలకు $1,000 లేదా అంతకంటే ఎక్కువ పెరిగాయి.
చాలా రాష్ట్రాలలో ఇన్సూరెన్స్ చేసుకున్న వారిలో దాదాపు 10 శాతం మంది “బ్రోంజ్ ప్లాన్స్” అని పిలవబడే స్కీములను ఎంచుకుంటున్నారు.
ఇవి కవరేజ్ తక్కువగా ఉన్నప్పటికీ సంవత్సరానికి పదివేల ఆరువందల డాలర్లు అవుతుంది.
అధికారుల వాదన – వాస్తవ పరిస్థితి..
తగ్గుతున్న నమోదుల సంఖ్యను ట్రంప్ ప్రభుత్వం తక్కువ చేసి చూపుతోంది. మార్కెట్‌ప్లేస్ ఇప్పటికీ బలంగా, విజయవంతంగా ఉందని సెంటర్స్ ఫర్ మెడికేర్ అండ్ మెడికైడ్ సర్వీసెస్ అధికారులు పేర్కొన్నారు.
హెల్త్ ఇన్సూరెన్స్ రంగం చాలా బలంగా ఉందని, అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో ఉందని, భరించగలిగిన ప్రీమియం స్కీములు ఉన్నాయని కమ్యూనికేషన్స్ ఏజెన్సీ డైరెక్టర్ క్రిష్ అన్నారు.
గత నెలలో విద్య, కార్మిక భాగస్వామ్యం కమిటీ ముందు నేషనల్ హెల్త్ సెక్రటరీ రాబర్ట్ ఎఫ్ కెనడి జూనియర్ సాక్ష్యం ఇస్తూ పరిపాలనలో అవినీతి కారణంగా ప్రాథమిక స్థాయిలో మొదట కొందరు తమ పాలసీలను విరమించుకున్నారని ఆయన చెప్పారు.
తక్కువ ఖరీదు కలిగిన ప్రీమియంలను అత్యధిక మంది ప్రజలు తీసుకుంటున్నారని ఆయన నొక్కి చెప్పారు.
ఫెడరల్ రికార్డుల ప్రకారం జనవరి నెలలో 87% అమెరికన్లు ఒబామా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీములను నెలకు కేవలం 96 డాలర్లకే తీసుకున్నారని ఆయన వివరించారు.
కానీ వాస్తవంగా అమెరికా ప్రజలు చాలా ఎక్కువగా చెల్లిస్తున్నారు. 43 రోజులు సాగిన షట్‌డౌన్ సందర్భంగా భారీగా పెరుగుతున్న ఇన్సూరెన్స్ ప్రీమియం చార్జీలు, అది కల్పించే కవరేజీ, నష్టాలు తదితర అంశాలు కేంద్ర బిందువుగా చర్చలు సాగాయి.
ఇప్పటికీ అత్యధిక మంది అమెరికా ప్రజలు ఒబామా కేర్ క్రింద ఆర్థిక సహాయానికి అర్హులై ఉన్నారు.
అత్యధికంగా సంపాదిస్తున్న వారికి సబ్సిడీలకు అర్హత పొందే విధంగా ప్రీమియంలను మారుస్తున్నారు.
సామాన్యుల ఆవేదన- భరించలేని ప్రీమియంలు..
వర్జీనియాకు చెందిన 63 ఏళ్ల హోమ్ కేర్ వర్కర్ జాయిస్ రెనా బుంబ్రే-గ్రేవ్స్, తనకు, తన భర్తకు బీమా ప్రీమియం నెలకు $544 నుంచి $1,300కు పెరగడంతో బీమాను వదులుకోవాల్సి వచ్చిందని వాపోయారు.
ఎంప్లాయిస్ ఇంటర్నేషనల్ యూనియన్ సర్వీస్‌కు చెందిన సభ్యురాలు బుంబ్రే-గ్రేవ్స్ ఇటీవల తన అనుభవాలను పంచుకోవడానికి కాంగ్రెస్ ముందు హాజరైంది.
“తన భర్త మాత్రం ఆయన పని చేసే కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ ప్రీమియం పొందగలిగారు.
కానీ నాకు మాత్రం అది భరించరాని ఖర్చు అయింది” అని ఆందోళన వ్యక్తం చేశారు.
“నేను కొంతవరకు ఆరోగ్యంగానే ఉన్నాను అయితే మందులకు డాక్టర్ కన్సల్టేషన్ చార్జీలు చెల్లించడానికి నేను చాలా అవస్థలు పడుతున్నాను” అన్నారు.
“నేను అనారోగ్యానికి గురికాకూడదని ఆశిస్తున్నాను” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రానైట్ క్లైవ్లో నర్సుగా పనిచేస్తున్న మేఘన్ బ్రాకెట్ తాను తన భర్త, కొడుకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఖర్చులు భరించలేక ప్రీమియంలను వదులుకున్నామని చెప్పారు.
ఆమె మూడు రకాల పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు, వాటిలో ఏ ఒక్కటి కూడా తనకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఇవ్వడం లేదు.
తన భర్త స్వయం ఉపాధిపై పనిచేసే ఒక కాంట్రాక్టర్, ఆయనకు కూడా కంపెనీ తరఫున ఇన్సూరెన్స్ లేదు. ACA కవరేజ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కోసం ఈ సంవత్సరం సంప్రదించగా తన కుటుంబానికి నెలకు 2500 డాలర్లు ఇన్సూరెన్స్ ప్రీమియం అవుతుందని చెప్పారని వాపోయింది.
తను గత సంవత్సరం ఫెడరల్ సబ్సిడీకి అర్హత పొందినప్పుడు కుటుంబం మొత్తానికి ఇన్సూరెన్స్ ప్రీమియం నెలకు 307 డాలర్లు మాత్రమే అయిందని చెప్పారు.
కాగితాల మీద మాత్రం నాకు మంచి జీవితం ఉన్నట్లుగా కనబడుతున్నది కానీ ఆచరణలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం భరించడం సాధ్యం కాకుండా పోయింది అని బ్రాకెట్ చెప్పారు.
విశ్లేషకుల మాట ఎలా ఉందంటే..
కాలిఫోర్నియాలోని ఒక దుకాణాన్ని నడిపే జెస్సికా ఆల్ట్మాన్ మాట్లాడుతూ “ఇన్సూరెన్స్ ప్రీమియం చార్జీలు పెరిగిన కారణంగా చాలామంది ఉపసంహరించుకున్నారు” అని చెప్పారు.
“ఈ పరిస్థితి చూసి నేనేమీ ఆశ్చర్య పడట్లేదు. అది ఎంత మాత్రం చిన్నపాటి దుఃఖం కాదు” అన్నారు.
ఆటోమెటిక్‌గా హెల్త్ ఇన్సూరెన్స్ పునరుద్ధరించుకోవాల్సిన వాళ్లకు 90 రోజుల గడువు ఇచ్చారు. ఆ గడువు అయిపోయింది.
ఫెడరల్ ప్రభుత్వం గడువైపోయిన వారి పూర్తి సమాచారం ఇంతవరకు ఇవ్వలేదు. కొన్ని రాష్ట్రాలు వారి సొంత ఇన్సూరెన్స్ ప్రీమియములు నిర్వహించుకుంటున్నాయి.
వారు ప్రకటించిన వివరాల ఆధారంగా భారీ సంఖ్యలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను పునరుద్ధరించుకోవడం లేదు.
వాషింగ్టన్ డీసీలో గత సంవత్సరం 2,20,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. అలాగే నిరుద్యోగం పెరుగుతున్నది. 29 రాష్ట్రాలలోని ఇన్సూరెన్స్ కంపెనీల వారు చెప్తున్న దాని ప్రకారం, గత సంవత్సరంతో పోలిస్తే 2/3 వంతుల ప్రజలు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను ఉపసంహరించుకుంటున్నారు.
యునైటెడ్ హెల్త్ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నది. ఇన్సూరెన్స్ ప్రీమియం చార్జీల పెరుగుదల వల్ల అమెరికన్ ప్రజలు ఇన్సూరెన్స్ ప్రీమియములు తీసుకోవడం భారీగా పడిపోతున్నదని విశ్లేషకులు చెబుతున్నారు.
న్యూయార్క్ టైమ్స్ పత్రిక సౌజన్యంతో, స్వేచ్ఛనువాదం: ఆర్ లక్ష్మయ్య.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
