మరోసారి వేసవికాలం ముంచుకొచ్చింది. ఈ వేసవిలో ఎండ తాపం ఉధృతంగా ఉండబోతుందని వాతావరణ శాఖ హెచ్చరికల్లాంటి అంచనాలు వెలువరించింది.
ఎండాకాలం ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది అన్నది కాదు మన ముందు ఉన్న ప్రశ్న.
ఈ అధిక ఉష్ణోగ్రతలు ఆర్థిక వ్యవస్థకు తెచ్చిపెడుతున్న సమస్యలను తట్టుకోగల సామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు ఉన్నదా లేదా అన్నది ప్రశ్న.
ఈ మధ్యకాలంలో 2022లో భారతదేశంలో వేసవి కారణంగా మరణాలు ఎక్కువగా చోటుచేసుకున్నాయని అధికారిక వివరాలు వెల్లడిస్తున్నాయి.
గత దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో సాధారణ సమయం కంటే ఎక్కువ కాలమే వడగాలులు, మండుటెండలు పేట్రేగిపోతున్నాయని వాతావరణ శాఖ విశ్లేషించింది.
మండు వేసవి ముంగిట్లో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అధికారులు సమీక్ష చేస్తుంటే ఈ మొత్తం పరిణామాల నడుమ ఓ బృందం గురించిన చర్చే జరగటం లేదు.
పట్టణ ప్రాంత వ్యవస్థలో అంతర్భాగంగా మారిన గిగ్ వర్కర్స్, డెలివరీ వర్కర్స్ మీద మండుటెండలు, వడగాల్పులు పెద్ద ఎత్తున ప్రభావం చూపుతున్నాయి.
ఈ ఆర్థిక తరగతి గురించి ఆలోచించే నాథుడే లేడు.
రోజువారీ ఆహారం సరఫరా చేసే రైడర్లు మొదలుకొని, ఎలక్ట్రానిక్ కామర్స్ యాప్స్‌తో అనుసంధానమై పనిచేసే డ్రైవర్లు, రవాణా కార్మికులు వంటి లక్షలాది మంది డిజిటల్ ప్లాట్‌ఫారాల ద్వారా రోజువారీ ఆదాయాలు పొందుతున్నారు.
నీతి ఆయోగ్ అంచనాల ప్రకారం 2020-21 నాటికి దేశంలో 77 లక్షల మంది ఈ మార్గం ద్వారా ఉపాధి పొందుతున్నారు.
ఈ కార్మికవర్గమే మండుటెండల్లో డెలివరీలకి వెళ్లాల్సి రావడంతో బాగా ప్రభావితం అవుతోంది. కానీ వీళ్ల గురించి ఎవరూ ఆలోచించడం లేదు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు – తరగనున్న ఆదాయాలు..
ఈ గిగ్, డెలివరీ కార్మికులకు ఎండలు కేవలం అసౌకర్యం మాత్రమే కాదు. వారి ఆదాయాలను ప్రభావితం చేసే అంశం కూడా. ఈ తరహా కార్మికులు రోజుకు ఎన్ని ఆర్డర్లు డెలివరీ చేయగలరు, ఎంత మంది క్లయింట్స్‌ను కలవగలరు, డిజిటల్ అప్లికేషన్ లేదా ప్లాట్‌ఫారమ్ మీద ఎన్ని గంటలు అందుబాటులో ఉంటారు వంటి అంశాలపై వారి ఆదాయం ఆధారపడి ఉంటుంది.
ఎండలు పెరిగినప్పుడు కదలిక మందగిస్తుంది. విసుగు, చికాకు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి.
అయినా ఆయా కంపెనీలు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో ఇచ్చే ఇన్సెంటివ్‌లలో మాత్రం ఎటువంటి మార్పూ ఉండదు.
తీవ్రమైన ఎండల కారణంగా గిగ్ వర్కర్స్, డెలివరీ కార్మికులకు నెలసరి వేతన కార్మికుల్లాగానో, సాఫ్ట్వేర్ ఉద్యోగుల లాగానో ఇంటి దగ్గర నుంచి పనిచేసే వీలు ఉండదు.
బాగా ఎండల్లో తిరగాల్సి రావడంతో డీహైడ్రేషన్ వంటి తక్షణ సమస్యలతో పాటు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి.
గత కొన్నేళ్లుగా ఉన్నట్టుగానే ఈ సంవత్సరం ఎండలు కూడా ఉధృతంగా ఉంటే ఈ సారి కేవలం ఆరోగ్య సమస్యలే కాదు, ఆదాయ సమస్యల్ని కూడా మోసుకొస్తాయి.
ఈ వేసవిలో గిగ్, డెలివరీ వర్కర్స్ ముందు ఉన్నవి రెండు రకాల సమస్యలు. ఒకటి ఆదాయం కాపాడుకోవడం, రెండు ఆరోగ్యం కాపాడుకోవడం.
అసమగ్ర సన్నద్ధత..
మండుటెండలను ప్రజారోగ్య సమస్యగా గుర్తించడంలో భారతదేశం గణనీయమైన పురోగతి సాధించింది.
అనేక నగరాల్లో ఎండ తాపాన్ని తట్టుకునేందుకు కావాల్సిన చర్యలతో పాటు ముందస్తు హెచ్చరికల వ్యవస్థలు, అత్యవసర స్పందన వ్యవస్థలు సిద్ధమయ్యాయి.
అయితే ఈ జాగ్రత్తలన్నీ మండుటెండలని ఆరోగ్య సమస్యగానే పరిగణిస్తున్నాయి తప్ప ఆర్థిక పర్యవసానాలున్న సమస్యగా పరిగణించడం లేదు.
ప్రజలే పరిస్థితిని బట్టి సర్దుకుంటారులే అన్న అభిప్రాయంతో ప్రభుత్వాలు ఉన్నాయి.
సలహాపూర్వక హెచ్చరికలన్నీ ఎండతాపాన్ని తట్టుకోవడానికి ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, బయటికి వెళ్లే పనులు తగ్గించుకోవాలని, పనిలో విరామం తీసుకుంటూ ఉండాలన్న సూచనలకే పరిమితం అవుతున్నాయి.
ఈ సలహాలు, సూచనలు గిగ్తోపాటు డెలివరీ వర్కర్స్కు ఆచరణసాధ్యమైనవి కావు. వాళ్ల రోజువారీ ఆదాయాలు ఈ బయట తిరిగే పని మీదనే ఆధారపడి ఉంటాయి.
నగరాల్లో అక్కడక్కడా మంచి నీటి కుళాయిలు, నీడనిచ్చే తాత్కాలిక ఏర్పాట్లు చేసినా, అవి నిరంతరం తిరగడమే పనిగా ఉన్న గిగ్, డెలివరీ కార్మికులను దృష్టిలో పెట్టుకొని చేసినవి కావు.
ఇటువంటి చర్యలు కొంతమేర ప్రాణాలు కాపాడతాయేమో కానీ నష్టపోయే ఆదాయాలకు ప్రత్యామ్నాయం చూపలేవు.
మండుటెండలు మొదలు కావడానికి కొన్ని వారాల ముందు ఉన్న సమయమే విధాన నిర్ణయాలు తీసుకోవడానికి సరైన సమయం.
పర్యావరణం, పట్టణ పరిపాలన, కార్మిక చట్టాల అమలు, డిజిటల్ ప్లాట్‌ఫారాల నియంత్రణ, పర్యవేక్షణ వంటి అంశాల మేళవింపుతో కావాల్సిన విధానాలు రూపొందించాలి.
ఈ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు వివిధ విభాగాల మధ్య చీలిపోయి ఉంటాయి.
ఆరోగ్య శాఖలు అనారోగ్యం, మరణాల గురించి దృష్టి పెడతాయి. ప్రకృతి వైపరీత్యాల నియంత్రణ సంస్థ తక్షణం ఎదురయ్యే సమస్యలపై, ఉత్పాతాలపై దృష్టి పెడుతుంది.
కార్మిక శాఖలు గిగ్ కార్మికులను ఉద్యోగులుగా గుర్తించాలా వద్దా అన్న మీమాంసతో సతమతమవుతూ ఉంటాయి.
డెలివరీ సమయాలను మరింత మెరుగు పరుచుకోవడానికి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు కొత్త కొత్త మార్గాలు కనిపెడుతూ ఉంటాయి.
అయితే ఇవేవీ పర్యావరణ సమస్యలతో తమ చర్యలను, విధానాలను మేళవించవు.
వివిధ శాఖల మధ్య బాధ్యతలు, జవాబుదారీతనం చీలిపోయినపుడు గిగ్ కార్మికుల సమస్యలను అర్థం చేసుకోవడం, పరిష్కారాలు ఆచరణలో పెట్టడం అన్నది అసమగ్రంగానే మిగిలిపోతుంది.
ఈ ప్రతికూల పరిస్థితుల్లో అదనపు ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎదుర్కొనేది ఈ కార్మిక తరగతే.
మారాల్సిన ధోరణి – తీసుకోవాల్సిన చర్యలు..
ఏదైనా జరిగితే స్పందించవచ్చు అన్న ధోరణిలో మార్పు తేవాలి అంటే ఇదే సరైన తరుణం.
మొదటి అంశం: మండుటెండలను కార్మికులకు సంబంధించిన, ఉత్పాదకతకు సంబంధించిన సమస్యగా చూడాలి.
కేవలం ఆరోగ్య సమస్యగా పరిమితం చేయరాదు. ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో విశ్రాంతి తీసుకునే అవకాశం, ఎక్కువ మందికి నీడ ఇచ్చే ఏర్పాట్లు, బహిరంగ స్థలాల్లో తాగునీటి వసతి వంటివి మౌలిక అవసరాలుగా భావించాలి.
రెండోది: విపరీతంగా పెరుగుతున్న ఎండల కారణంగా రోజువారీ కార్మికుల ఆదాయాల్లో నిలకడతనం లోపిస్తుంది అన్న వాస్తవాన్ని ప్రభుత్వ అధినేతలు, విధాన రూపకర్తలు గుర్తించాలి.
ఈ ఆదాయ నష్టాలను పూరించేందుకు ఇప్పుడున్న సంక్షేమ పథకాలను సవరించి గిగ్తోపాటు డెలివరీ కార్మికులకు ప్రయోజనాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం కానీ, లేదా తగు పరిష్కార మార్గాలు వెతుక్కోవడం కానీ చేయాలి. లేనిపక్షంలో వీరి పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవుతుంది.
మూడోది: డిజిటల్ ప్లాట్‌ఫారాలు కూడా ఈ రకమైన సన్నాహాలకు చర్యలు తీసుకోవాలి. ఎండలు ఎక్కువగా ఉన్నపుడు డెలివరీ ఆలస్యమైనా కార్మికులపై పెనాల్టీ లేకుండా చూడటం, ఆర్డర్ల కేటాయింపు సమయంలోనే ఇటువంటి జాగ్రత్తలను సిస్టమ్‌లో కనిపించేలా చేయటం వంటి చర్యల ద్వారా డెలివరీ కార్మికులపై ఒత్తిడి తగ్గించేందుకు అవకాశం ఉంటుంది.
వేసవికాలం రావడానికి ముందే వివిధ ప్రభుత్వ ఏజెన్సీల మధ్య సమన్వయం పటిష్టపరచుకోవాలి. కార్మిక శాఖ, పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థలు, ప్రకృతి వైపరీత్యాల నివారణ సంస్థ, ఇతర నియంత్రణ సంస్థలు ఈ ఎండ తాపం కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదని, ఆర్థిక సమస్య కూడా అన్న విషయంలో ఓ ఉమ్మడి అవగాహనకు రావాలి.
మన్నికత్వం గురించి పునః పరిశీలన..
భారతదేశంలో నగరాలు తమ రోజువారీ జీవితానికి గిగ్తోపాటు డెలివరీ కార్మికులపై ఆధారపడటం పెరిగింది. ఆహారం, మందులు, ఇతర నిత్యావసరాలు వంటివన్నీ ప్రజలకు చేరేందుకు, చేర్చేందుకు ఈ కార్మికులే ప్రధాన సాధనంగా మారుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉష్ణోగ్రతలు పెరిగితే పర్యవసానాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.
కేవలం సలహాలు, సూచనల ద్వారానే పర్యావరణ ప్రమాదాలను నిలువరించలేము. సైకిళ్లు, మోటార్ సైకిళ్ల మీద నగరమంతా తిరిగే కార్మికులకు మన్నికత్వం అంటే ఉత్పాతాలకు లోనుకాకుండా నిలకడైన ఆదాయాలు సంపాదించుకోవడం.
అటువంటి పరిస్థితుల్లో భారీ ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ కీలక కార్మిక తరగతి ప్రాణాలు ఫణంగా పెట్టే మరో మండు వేసవికి మనం సిద్ధం కావడం తప్ప వేరే మార్గం లేదు.
అనువాదం: వీరయ్య కొండూరి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
