అమెరికా అప్పు దాని జీడీపీని మించిపోయింది. అమెరికా జాతీయ అప్పు ఇప్పుడు ఆ దేశ స్థూల జాతీయోత్పత్తి 100% కంటే ఎక్కువకు చేరుకుంది.
ఎన్నడూ ఊహించని విధంగా ఈ పరిమితిని దాటుకుంటూ, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నమోదైన రికార్డును బద్దలు కొట్టే దిశగా అప్పులు సాగుతున్నాయి.
2026 మార్చి 31 నాటికి అమెరికా దేశం పబ్లిక్ డెట్ $31.265 ట్రిలియన్లకు చేరుకుంది. 2025-26 సంవత్సరానికి జీడీపీ $31.216 ట్రిలియన్లుగా ఉందని విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. దీనితో అప్పు-జీడీపీ నిష్పత్తి 100.2% కి చేరుకుంది.
సెప్టెంబర్ 30తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం చివరిలో ఇది 99.5%గా ఉండేది. ప్రభుత్వం ప్రస్తుతం జీడీపీలో దాదాపు 6% వార్షిక లోటుతో ఉన్నందున, ఈ అప్పు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఆదాయం, వ్యయాల మధ్య భారీ వ్యత్యాసం..
ప్రభుత్వం తాను వసూలు చేసే ప్రతి ఒక డాలర్ ఆదాయానికిగాను $1.33 డాలర్లను ఖర్చు చేస్తోంది. ఈ ఏడాది బడ్జెట్ లోటు $1.9 ట్రిలియన్లుగా ఉంటుందని అంచనా. 2025తో పోలిస్తే ఇందులో పెద్దగా మార్పు లేదు.
ట్రంప్ అధికారానికి వచ్చిన వెంటనే ప్రజలపై వెచ్చించే ఖర్చులో కోత విధించారు. అది అమల్లోకి రాకముందే, ఆయన శత కోటీశ్వరులపై తగ్గించిన పన్ను ప్రభావం చూపింది.
యుద్ధ ఖర్చులు, టారిఫ్ రీఫండ్లు, ఆర్థిక వ్యవస్థ పటిష్టతపై తుది గణాంకాలు ఆధారపడి ఉంటాయి.
ఆర్థిక వ్యవస్థపై పడే భారం- ప్రమాద ఘంటికలు..
అయితే, కేవలం ఈ మైలురాయిని చేరుకోవడం వల్ల తక్షణమే పెద్ద మార్పు ఏమీ ఉండదు. అప్పు ఏ స్థాయికి చేరితే సమస్యాత్మకం నుంచి విపత్కరంగా మారుతుందనే దానికి నిర్దిష్టమైన కొలమానం ఏదీ లేదు.
రాబోయే రోజుల్లో ఈ నిష్పత్తిలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. పన్ను వసూళ్లు రావడం, టారిఫ్ రీఫండ్లు వెళ్లడం, ద్రవ్యోల్బణం, జీడీపీ హెచ్చుతగ్గులకు లోనవడంతో ఈ పరిస్థితి నెలకొంది.
అయినప్పటికీ, దశాబ్దాలుగా అమెరికాపై పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్లకు ఈ మూడంకెల మార్కు(100%) ఒక శక్తివంతమైన చిహ్నం.
రెండు పార్టీల శాసన కర్తలు(రిపబ్లికన్, డెమొక్రటిక్) దీనిపై ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ, స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం పన్ను కోతలు, వ్యయాల పెంపునకే ప్రాధాన్యత ఇచ్చారు.
“మనం తెలియని ప్రమాదకరమైన మార్గంలో వెళ్తున్నాం” అని ‘కమిటీ ఫర్ ఏ రెస్పాన్సిబుల్ ఫెడరల్ బడ్జెట్’ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మార్క్ గోల్డ్‌వైన్ అన్నారు. “100%కి, 99%కి మధ్య పెద్ద మాయాజాలం ఏమీ లేదు. కానీ ఇది భయంకరమైన పరిస్థితి.”
దేశం చేసే అప్పు ఆర్థిక వ్యవస్థపై ఎంత భారాన్ని వేస్తుందో కొలవడానికి ఆర్థికవేత్తలు ‘డెట్-టు-జీడీపీ రేషియో’ను ప్రాధాన్యత కలిగిన కొలమానంగా భావిస్తారు. ఇది పెరిగే కొద్దీ, ఇతర ఉత్పాదక రంగాల్లో ఉపయోగించాల్సిన వనరులను అప్పులే మింగేస్తాయి.
పెరుగుతున్న వడ్డీ భారం..
వడ్డీ భారం: అప్పు పెరిగేకొద్దీ, ప్రభుత్వం వడ్డీ రేట్ల పట్ల మరింత సున్నితంగా మారుతుంది. ప్రస్తుతం ఫెడరల్ వ్యయంలో ప్రతి ఏడు డాలర్లలో ఒక డాలర్ వడ్డీ చెల్లింపులకే వెళ్తోంది.
వడ్డీ రేటు కేవలం 0.1 శాతం పెరిగినా, 10 ఏళ్లలో 379 బిలియన్ డాలర్ల అదనపు భారం పడుతుందని కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం తెలిపింది.
ప్రస్తుత అమెరికా అప్పుల పరిస్థితిలో మార్పులు చేయకపోతే అమెరికా కూడా ఫ్రాన్స్, ఇటలీ, గ్రీస్, జపాన్‌వంటి దేశాల రుణ నిష్పత్తుల వైపు వెళ్తుంది.
అయితే అమెరికా డాలర్ ఇంకా ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా ఉండటం, ట్రెజరీ డెట్ పెట్టుబడిదారులకు సురక్షితమైనది కావడంతో, ఇతర దేశాల కంటే అమెరికాకు అప్పు తీసుకునే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది.
దీర్ఘకాలిక ప్రభావాలు..
ఈ రక్షణ కవచం అపరిమితమైనది కాదు. దీర్ఘకాలంలో అధిక అప్పుల వల్ల వడ్డీ రేట్లు పెరుగుతాయని, ఇది గృహ రుణాలు, కార్ లోన్లు, క్రెడిట్ కార్డ్‌లపై ప్రభావం చూపుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.
బాండ్ల ద్వారా ఎక్కువ లాభం వస్తున్నప్పుడు, పెట్టుబడిదారులు ఇతర ఆర్థిక ప్రాజెక్టుల నుంచి కూడా అధిక రాబడిని ఆశిస్తారు. ఇది ప్రైవేట్ పెట్టుబడులను దెబ్బతీస్తుంది. కొందరు ఆర్థికవేత్తల అభిప్రాయం ప్రకారం, అధిక అప్పుల వల్ల కేంద్ర బ్యాంకుపై ఒత్తిడి పెరిగి ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉంది.
కేంద్ర బ్యాంకు(మన దేశ రిజర్వ్ బ్యాంక్ లాంటిది) వడ్డీ రేట్లను తక్కువగా ఉంచాలని, విపరీతమైన పరిస్థితులలో, అప్పులు తీర్చడానికి డబ్బును ముద్రించాలని ఒత్తిడి చేయవచ్చు.
చారిత్రక నేపథ్యం: 1946 తర్వాత తొలిసారి..
2020లో కరోనా వైరస్ మహమ్మారి సమయంలో అప్పులు జీడీపీలో 100% మించాయి. దీనివల్ల జీడీపీ తగ్గిపోయింది. అమెరికా కుటుంబాలకు సహాయం చేయడానికి ప్రభుత్వ రుణాలను పెంచాల్సి వచ్చింది. ఉద్దీపన ముగియడం, ఆర్థిక వృద్ధి పుంజుకోవడం, ద్రవ్యోల్బణం కారణంగా నామమాత్రపు జీడీపీ పెరగడంతో ఈ నిష్పత్తి తగ్గింది.
1946 తర్వాత అమెరికా ఎప్పుడూ ఒక ఆర్థిక సంవత్సరాన్ని జీడీపీలో 100% కంటే ఎక్కువ రుణంతో ముగించలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారేలా కనిపిస్తోంది.
2020-21 నాటి పరిస్థితులతో పోలిస్తే, ప్రస్తుత లోటుకు కారణాలు తాత్కాలికమైనవి కావు. అవి నిర్మాణాత్మకమైనవి. వడ్డీ రేట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి.
సెప్టెంబర్ 30తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి ఈ నిష్పత్తి 100.6% కి చేరుకుంటుందని, 2030 నాటికి పాత రికార్డును మించిపోతుందని సీబీఓ అంచనా వేస్తోంది.
ఈ అంచనాలు ప్రజల వద్ద ఉన్న ఫెడరల్ రుణాన్ని పరిగణనలోకి తీసుకుంటాయి. ప్రభుత్వం తనకు తానుగా చెల్లించాల్సిన అప్పుతో కలిపి ఉండే పెద్ద సంఖ్య కంటే, ఆర్థికవేత్తలు దీనికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు.
ఇక్కడ జీడీపీ సంఖ్య అనేది గత నాలుగు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణానికి సర్దుబాటు చేయని నామమాత్రపు ఆర్థిక ఉత్పత్తిని సూచిస్తుంది.
రుణం-జీడీపీ నిష్పత్తి 1946లో అత్యధికంగా 106.1%ని తాకింది. ఆ తర్వాత అది తగ్గుతూ వచ్చింది.
అమెరికా అప్పు, ఆర్థిక స్థితిగతుల విశ్లేషణ..
యుద్ధం తర్వాత ఏర్పడిన వృద్ధి, ద్రవ్యోల్బణం- సైనిక వ్యయంలో కోతల కారణంగా, తరువాతి దశాబ్దంలో అప్పు-జీడీపీ నిష్పత్తి తగ్గింది.
1957 నాటికి ఇది 50% కంటే తక్కువకు చేరుకుంది. 2008 వరకు కూడా అప్పు జీడీపీలో 40% కంటే తక్కువగానే ఉంది.
అప్పటి నుంచి, 2007-09 ఆర్థిక సంక్షోభం- కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి అమెరికా భారీగా అప్పులు చేసింది. కాంగ్రెస్ 2013, 2017- 2025లలో సంపన్నులపై పన్నులను తగ్గించింది.
ప్రభుత్వ ఆరోగ్య కవరేజీని, అనుభవజ్ఞులైన సైనికుల ప్రయోజనాలను విస్తరించింది. అయితే ప్రధాన ఖర్చు కార్యక్రమాలను మార్చడానికి పెద్దగా ప్రయత్నం చేయలేదు.
లోటు-తగ్గింపు మద్దతుదారులు కూడా యుద్ధం తర్వాత కాలంలో లాగా నిష్పత్తి గణనీయంగా పడిపోవాలని కోరుకోవడం లేదు. ఈ నిష్పత్తి పెరగకుండా నిలకడగా ఉంటే చాలని వారు భావిస్తున్నారు.
పెరుగుతున్న వయోవృద్ధుల జనాభా కారణంగా మెడికేర్, సోషల్ సెక్యూరిటీ ఖర్చులు పెరగడమే దీనికి ప్రధాన కారణం.
“ఇప్పటి నుంచి 20 ఏళ్ల తర్వాత అప్పు-జీడీపీ నిష్పత్తి 100% గా ఉంటుందని మీరు చెబితే, నేను చాలా సంతోషిస్తాను” అని బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్ ఆర్థికవేత్త విలియం గేల్ అన్నారు.
భవిష్యత్తు అంచనాలు – రాజకీయ సవాళ్లు..
సీబీఓ అంచనా: అప్పు 2036 నాటికి జీడీపీలో 120% కి, 2056 నాటికి 175% కి పెరుగుతుందని సీబీఓ అంచనా వేస్తోంది.
ట్రంప్ ప్రభుత్వ అంచనా: అప్పు-జీడీపీ నిష్పత్తి 2034 నాటికి 88%కి తగ్గుతుందని ట్రంప్ యంత్రాంగం అంచనా వేస్తోంది. ఈ అంచనా భారీ సుంకాల ఆదాయం, వ్యయాల తగ్గింపు, ఊహించిన దానికంటే వేగవంతమైన వృద్ధిపై ఆధారపడి ఉంది.
వచ్చే దశాబ్దంలో మొత్తం లోటు $24 ట్రిలియన్లుగా ఉంటుందని అంచనా. దీనిని 100% వద్ద స్థిరీకరించాలంటే దాదాపు $10 ట్రిలియన్ల వ్యయ కోతలు, పన్నుల పెంపు కలయిక అవసరమవుతుంది.
1980 నుంచి 1990ల వరకు అప్పుల గురించిన ఆందోళనలు రాజకీయంగా ప్రధానమైనవిగా ఉండేవి. దీనివల్ల పాలకులు స్పందించేవారు. పన్నుల పెంపు, వ్యయ కోతలు, బలమైన వృద్ధి ఫలితంగా అప్పట్లో బడ్జెట్ మిగులు ఏర్పడింది. కానీ ఇప్పుడు, పెరుగుతున్న అప్పులు, లోటుల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ, ఆర్థిక మార్గాన్ని మార్చడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.
“ప్రజలను నిజంగా భయపెట్టే విషయం ఏమిటంటే, రాజకీయాలు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి” అని గేల్ అన్నారు. “మీరు కేవలం ఆర్థిక అంచనాలను మాత్రమే చూసి, రాజకీయ నాయకులు కలిసి ఈ సమస్యను పరిష్కరించగలరనే నమ్మకం మీకు ఉంటే, అది అందరినీ ఆశ్చర్యంలో ముంచుతుంది.”
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
