ప్రజలు ఈ రకమైన నియంత్రిత ప్రజాస్వామ్యానికి సిద్ధపడితే ఒకప్పుడు యూనియన్‌లో జరిగినట్లుగా భారతదేశంలో ఎన్నికలు కూడా నామమాత్రపు కసరత్తుగా మారిపోతాయి. ప్రయాణం మొదలుకాకముందే గమ్యం నిర్ధారణ అయిపోతుంది.
పశ్చిమ బెంగాల్లో కొత్త శాసనసభను ఎన్నుకోవటానికి జరిగిన పోలింగ్ ముగిసింది. మే 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
ఫలితాలు రాకముందే మమతా బెనర్జీ ఓడిపోతోంది అన్న ప్రచారంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది.
ఎన్నికల ప్రక్రియలో జరిగిన శస్త్రచికిత్స రీత్యా ఇటువంటి ఫలితం అనివార్యం అని ఆశించే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. అటువంటి పరిణామాలు సహజమే అన్న అభిప్రాయం కలుగుతుంది.
ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అన్న విషయం జోలికి పోకుండానే ఎన్నికల ప్రచారం జరిగిన తీరును పరిశీలించి, ఇటువంటి నడవడిక బెంగాల్‌ను, భారత గణతంత్ర రాజ్యాన్ని రానున్న కాలంలో ఎటువైపు నడిపిస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు.
ఈ ఎన్నికలలో ఓ వైపు తృణమూల్ కాంగ్రెస్, మరోవైపు బీజేపీలు హోరాహోరీ తలపడ్డాయి.
అయినా కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం నిష్పాక్షిక మధ్యవర్తి పాత్ర పోషించడానికి బదులు బీజేపీకి అనుబంధ విభాగంగా వ్యవహరించింది.
విస్తారమైన ఎన్నికల నిర్వహణ యంత్రాంగాన్ని కేంద్రంలో పాలక పార్టీ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లటానికి కేటాయించింది.
ఎన్నికల సంఘం చేసిన ప్రతి పనిని వెనకేసుకురావడం ద్వారా సుప్రీంకోర్టు కూడా ఈ అసమతౌల్యానికి మౌనంగానే మద్దతుని ఇచ్చింది.
ప్రజలు ఈ రకమైన నియంత్రిత ప్రజాస్వామ్యాన్ని స్వాగతిస్తే భారత ప్రజాస్వామ్యం కూడా సోవియట్ వ్యవస్థ తరహాలోనే కాగితాలకే పరిమితం అవుతుంది. ప్రయాణం మొదలు కాకముందే గమ్యాన్ని చేరుస్తుంది.
భద్రతా బలగాల మోహరింపు – పౌరులపై ఒత్తిడి..
మీడియాలో ఒక భాగం ఈ ఎన్నికలను మమతా బెనర్జీ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలుగా పరిగణించింది.
ఎన్నికల సందర్భంగా మోహరించిన పారా మిలిటరీ బలగాల సంఖ్యను చూస్తే ఇది నిజంగా యుద్ధాన్ని తలపిస్తూ ఉంది.
కేవలం వైమానిక, నావిక దళాలు మినహా దేశంలోని అన్ని రకాల భద్రతా బలగాలను ఈ ఎన్నికలలో మోహరించారని విమర్శకులు వ్యాఖ్యానించారు.
ఈ స్థాయిలో బలగాల మోహరింపు చూసి ఎన్నికల్లో జరగబోతున్న హింసను నివారించడానికి ఈ మోహరింపు అని అపోహ పడవద్దు.
ఇది కేవలం తృణమూల్ కార్యకర్తలపై ఒత్తిడి తీసుకురావడానికి, సాధారణ ఓటర్లను ప్రభావితం చేయటానికి మాత్రమే. ఈ బలగాలు కూడా కేంద్ర పాలక పార్టీ పట్ల తమ పక్షపాతాన్ని దాచుకోలేదు.
కేవలం ఓటర్లు లుంగీ కట్టుకుని వచ్చినందుకు వాళ్లను ఓటు వేయనీయకుండా వెనక్కి పంపడం అంటే పౌరులు వేసుకునే బట్టలను బట్టి వారిని గుర్తించే రాజకీయ సంస్కృతిని ఆచరణలో పెట్టడమే.
ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరిట కోతలు..
గత కొంతకాలంగా కేంద్ర ఎన్నికల సంఘం పలు ప్రకటనల ద్వారా బీజేపీకి సానుకూలంగా రంగం సిద్ధం చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నించింది.
ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు అవరోధం అనుకున్న ప్రతి ఇబ్బందిని తొలగించేందుకు ఎన్నికల సంఘం శత విధాలా ప్రయత్నించింది.
ఓటర్ల జాబితాను శుద్ధి చేస్తున్నామన్న నెపంతో 27 లక్షల మంది బతికున్న ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. ఈ ప్రయత్నంలో ఎన్నికల సంఘం ఇచ్చిన విలువ ఓటుకు, దాని పవిత్రతకు కాదు.
ఫలానా ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారు అనుకుంటే వారిని తొలగించడమే ప్రమాణంగా పరిగణించింది ఎన్నికల సంఘం.
ఇంత భారీ స్థాయిలో ఓటర్లను జాబితా నుంచి తొలగించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎంచుకున్న కుతర్కాన్ని గమనించిన సుప్రీంకోర్టు కూడా చివరకు ఈ స్థాయిలో ఓట్ల రద్దు అనూహ్య పరిణామం అని, హేతుబద్ధతలేని వివరణ అని వ్యాఖ్యానించవలసి వచ్చింది.
తాజా పరిణామాలలోని అనూహ్యతను, నిర్హేతుకతను గమనించినా సుప్రీంకోర్టు కూడా లక్షలాది పౌరుల ప్రాథమిక హక్కు అయిన ఓటుహక్కును కాపాడటం తక్షణ ప్రాధాన్యతగా పరిగణించలేదు.
పైగా “వీళ్ళంతా ఈ ఎన్నికల్లో ఓటు వేయకపోతే ఏమి కొంపలంటుకుంటాయి” అని స్వయంగా సుప్రీంకోర్ట్ ప్రశ్నించింది.
లక్షలాది మంది ప్రజల ప్రజాతంత్ర హక్కులను కాలరాసే పరిణామాల పట్ల న్యాయవ్యవస్థ తీసుకున్న ఈ వైఖరి రానున్న కాలంలో ఎదురుకానున్న విపరీత పరిణామాలకు, ప్రమాదాలకు హెచ్చరికగా పనిచేస్తుంది.
చివరకు పోలింగ్ అధికారులు కూడా ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేకపోవటం చూసి విస్మయం చెందారు. కానీ సుప్రీంకోర్టు దృష్టిలో మాత్రం ఇదేదో కాకతాళీయంగా జరిగిన పొరపాటుగానే మిగిలిపోయింది.
ఓటర్ల జాబితాల్లో పేర్లు లేకపోయినా ఈ సారి ఎన్నికల నిర్వహణ కర్తవ్యాన్ని జయప్రదం చేసిన తర్వాత ఆ కోల్పోయిన ఓటుహక్కు సంగతేదో చూసుకోవచ్చు అని కూడా సుప్రీంకోర్టు భరోసా ఇచ్చింది. తొలగింపుకు గురైన పేర్లలో అత్యధికం ముస్లిం పేర్లే అన్నది కూడా గణించలేనంత చిన్న విషయమేమీ కాదు.
ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల సంఖ్యలో ముస్లిం జనాభా ఉన్న నియోజకవర్గాల్లో ఈ తొలగింపు మరింత ఎక్కువగా జరిగిందన్నది కూడా తిరుగులేని వాస్తవం.
దర్యాప్తు సంస్థల ఏకపక్ష దాడులు..
పైగా తృణమూల్ తరఫున ఎన్నికల కసరత్తును సమన్వయం చేస్తున్న ప్రైవేటు కంపెనీపై దర్యాప్తు సంస్థలు విరుచుకుపడ్డాయి.
తద్వారా రాష్ట్ర పాలక పార్టీ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేయడమే ఈ వ్యూహాత్మక దాడుల లక్ష్యం. తుది దఫా పోలింగ్ పూర్తి అయిన వెంటనే ఈ దాడుల్లో అరెస్టయిన కీలక వ్యక్తులకు బెయిలు వచ్చింది.
కోర్టుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బెయిల్ అప్లికేషన్లకు అభ్యంతరం చెప్పలేదు.
టీఎంసీ కార్యకర్తలను ఎంతగా వేధించారంటే ఆఖరికి కలకత్తా హైకోర్టు రెండు సార్లు ఎన్నికల సంఘాన్ని నియంత్రిస్తూ ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చింది. అయినా అరెస్టులు కొనసాగాయి.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన సంస్థలే బీజేపీ పట్ల పక్షపాతంతో వ్యవహరించాయి.
ఇది పరుగు పందెం.. కాకపోతే ఒక పోటీదారుడి కాళ్ళు కట్టేసి, రెండోవాడిని వదిలేసి ఇద్దరినీ పరిగెత్తమని చెప్పే పరుగు పందెం. ఇదో ప్రమాదకరమైన క్రీడ. కానీ దీన్ని కూడా ఆస్వాదించగల సమర్థత ఉన్నవాళ్ళు కొందరున్నారు.
అసలు ఎజెండా – విద్వేష ప్రచారం..
సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అన్న నినాదం ముసుగులో బీజేపీ తన మతోన్మాద ఎజెండాను కప్పి పెట్టుకున్నట్టుగానే, బెంగాల్లో తన అసలైన ఎజెండాను ‘పరివర్తన’ నినాదం మాటున కప్పి పెట్టుకుంది బీజేపీ. ఈ పదంతో పాటు అత్యధికంగా ఈ ఎన్నికల్లో బీజేపీ ఉపయోగించిన పదం దురాక్రమణదారులు.. చొరబాటుదారులు అన్న పదం.
మమతా బెనర్జీ ఈ చొరబాటుదారుల కొమ్ము కాస్తోందని, ఒక్కొక్కరినీ ఏరి వేస్తామని స్వయంగా కేంద్ర హోంమంత్రి ప్రకటించారు. మంత్రిగారి మాటల్లో అంతరార్థం ఏమిటో అందరికీ తెలిసిందే.
సందేశ్‌ఖాలీ నియోజకవర్గంలో ల్యాండ్ మాఫియాగా మారి, హింసాత్మక చర్యలకు కేంద్రంగా ఉన్న షాజహాన్ షేక్‌ను చొరబాటుదారుగా ప్రచారం చేసింది బీజేపీ.
ఆ ఎమ్మెల్యేను ఒక నేరస్తుడిగా కూడా పరిగణించవచ్చు. ప్రచారం చేయవచ్చు. కానీ స్వయానా కేంద్ర హోంమంత్రి ఉద్దేశపూర్వకంగానే ముస్లింలు అంటేనే ఈ దేశానికి చెందిన వారు కాదు అన్న అభిప్రాయం కలిగించే విధంగా ప్రచారానికి సిద్ధపడ్డారు.
దీనికి తోడు హుమాయున్ కబీర్ బాబ్రీ మసీదు కూల్చివేత గురించి చేసిన ఉపన్యాసాలు కూడా బీజేపీకి కావలసిన మందుగుండు సామాగ్రిని అందించేందుకు, ముస్లిం ఆధిపత్యం గురించి విద్వేషాలు రెచ్చగొట్టేందుకు అవకాశం ఇచ్చాయి. ఇటువంటి ఉద్దేశపూర్వక ప్రచారానికి అమిత్ షా వెంటనే స్పందించారు.
దేశంలో కనీసం ఒక్క బీజేపీ కార్యకర్త ప్రాణాలతో ఉన్నా సరే బాబ్రీ మసీదు పునర్నిర్మాణం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
బెంగాల్ రాజకీయ వాతావరణాన్ని పరిశీలించే వాళ్ళు ఎవరైనా హుమాయున్ కబీర్ బీజేపీ పనుపున పనిచేసేందుకే బరిలోకి దిగాడని విశ్వసిస్తారు.
బీజేపీ ఏ మెజారిటీ ఆధిపత్య భావోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తుందో, హుమాయున్ కబీర్ కూడా అదే రకమైన భావావేశాలు రెచ్చగొట్టడానికి కావలసిన ఉపకరణాలు అందిస్తూ వచ్చాడు.
బీజేపీ నేతలు అందరూ ఉమ్మడి పౌరస్మృతి గురించి పదేపదే వక్కాణిస్తూ వచ్చారు. దాని అర్థం ఏమిటో మనందరికీ తెలిసిందే.
సాంస్కృతిక దాడులు – మతపరమైన విభజన..
నరేంద్ర మోదీ తనదైన ట్రేడ్ మార్క్ శైలిలో ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న మమతా బెనర్జీ చివరకు దుర్గా పూజను కూడా అడ్డుకుంటుందని విమర్శించారు.
బెంగాల్లో ఉర్దూ భాషకు స్థానం లేకుండా చేస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కేకలు పెట్టారు.
తృణమూల్ కాంగ్రెస్ పరిపాలనలో ఉర్దూ భాషకు పెద్దపీట వేయడానికి ప్రయత్నిస్తోంది అని చెప్పకనే చెప్పటం ఈ ప్రచారం ఉద్దేశం.
బెంగాల్లో హిందువులకు స్థానం లేకుండా చేయడం కోసం తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని యోగి ఆదిత్యనాథ్ ధ్వజమెత్తారు.
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి హిమంత బిశ్వాస్ శర్మ ఎన్నికల పోరాటం నాగరికత పరిరక్షణ కోసం సాగే పోరాటమని, స్థానికులకు ఆక్రమణదారులకు మధ్య జరిగే పోరాటమని ప్రచారం చేశారు.
బీజేపీ స్థానిక ప్రధాన నాయకుల్లో ఒకడైన సువేందు అధికారి తన ఉపన్యాసాన్ని జై శ్రీరామ్ నినాదం చుట్టూ తిప్పారు.
భక్తి విశ్వాసాలతో పిలిచే పిలుపును ఆయుధంగా మార్చారు. నేను పూజ చేస్తూ ఉంటే మమతా బెనర్జీ నమాజ్ చేస్తోంది అంటూ విషం కక్కారు.
ఓటర్లను నిట్టనిలువునా మతాల ప్రాతిపదికన చీల్చడానికి జరుగుతున్న ప్రయత్నాలకు ఇంతకంటే ఉదాహరణలు ఏమి కావాలి!
ఎన్నికలలో బీజేపీ ప్రధాన ప్రచారాస్త్రం హిందుత్వ..
ఉనికిలో లేని ముస్లిం ప్రమాదాన్ని బూచిగా చూపిస్తూ హిందువులను కాపాడటం కోసమే బెంగాల్లో తాము బరిలోకి దిగామని, అధికారం కోరుకుంటున్నామని ప్రచారం చేశారు.
ఈ ప్రచారంలో ఒక్కసారి కూడా ఏ బీజేపీ నేత కూడా ముస్లింలు బీజేపీకి ఓటు వేయాలంటూ విజ్ఞప్తి చేయలేదు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యక్ష, పరోక్ష సహాయ సహకారాలతో సాగుతున్న ఈ మతోన్మాద విద్వేష ప్రచారం బెంగాల్‌లోని ఆలోచనాపరులను తీవ్ర ఉద్వేగానికి గురిచేసింది. ఇటువంటి ప్రచారం ఆధారంగా ఎన్నికలలో గెలిచిన ప్రభుత్వం అధికారం చేపడితే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
వ్యాస రచయిత అపూర్వానంద్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బోధిస్తున్నారు. ఈ వ్యాసం మొదట ‘ది వైర్’ నడిపే ప్రీమియం వార్తా విభాగం ‘ది ఇండియా కేబుల్’లో ప్రచురితమైంది.
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
