2008లో విజయ్ ఎదుగుతున్న సినీ స్టార్. ఉదయనిధి స్టాలిన్ విజయ్‌కు ప్రొడ్యూసర్. కానీ 15 ఏళ్లలో కథ ఇలా మారుతుందని ఉదయనిధి కానీ, విజయ్ కానీ ఊహించి ఉండరు.
డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ తీసిన ‘కురువి’ సినిమాలో విజయ్ హీరో. కానీ అదే విజయ్ ఈ రోజు డీఎంకే రాజకీయ కోటలు బద్దలు కొట్టారు. ఓ దశలో సినిమా రంగంలో ఉమ్మడిగా ప్రయాణం మొదలుపెట్టిన ఈ ఇద్దరూ, నేడు రాష్ట్రంలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థులుగా నిలిచారు.
రాజకీయ వారసత్వంగా ఉదయనిధి..
డీఎంకే రాజకీయాల్లో ఉదయనిధి ప్రవేశం సహజమే. తమిళ రాజకీయ దురంధరుడు కరుణానిధి మనవడిగా, ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకుగా ఉదయనిధి తమిళనాట డీఎంకే రాజకీయ వారసుడు. పార్టీలో ఆయన ప్రస్థానం కూడా జాగ్రత్తగా ఏర్పాటు చేసిందే.
పార్టీ యువజన నేతగా తెరమీదకు వచ్చిన ఉదయనిధి, ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి గెలిచి కేబినెట్ మంత్రి అయ్యారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు.
సినిమా, గుర్తింపు, డీఎంకే కొత్త ముఖం..
సహజంగానే ఉదయనిధికి ఎంజీ రామచంద్రన్‌కు ఉన్నంత ప్రజాదరణ కానీ, కరుణానిధికి ద్రావిడ రాజకీయాలలో ఉన్నంత సైద్ధాంతిక పునాది కానీ, డీఎంకే నిర్మాణంపై స్టాలిన్‌కు ఉన్నంత పట్టు కానీ లేవు. ఇవన్నీ సాధించేంత వయసు, అనుభవం కూడా ఉదయనిధికి లేదు.
తమిళ సినీ రంగంలో కొన్ని దశాబ్దాల పాటు ఉదయనిధికి ఉన్న గుర్తింపు విషయంలో ఎవరికీ సందేహం లేదు. ప్రొడ్యూసర్‌గా, నటుడిగా రాణించారు. ఈ రాణింపును ఉపయోగించుకుని అతన్ని డీఎంకే యువజన విభాగం నేతగా నియమించడం ద్వారా తమిళనాడులో ఉన్న యువజనులను చేరుకోవడానికి డీఎంకే ప్రయత్నించింది.
మిగిలిన అన్ని ప్రాంతాలలో ఉన్నట్టుగానే తమిళనాట కూడా యువజనులు పాతకాలపు సాంప్రదాయ పద్ధతులలో రాజకీయాలు నేర్చుకోవడం లేదు, రాజకీయాలలో భాగస్వాములు కావటం లేదు. సామాజిక మాధ్యమాలే వీరికి రాజకీయం నేర్పే తొలి పాఠశాలలుగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఉదయనిధి పార్టీ సమాచార ప్రసార విభాగాలను ఆధునీకరించే బాధ్యతలు చేపట్టారు.
సాంప్రదాయక పత్రికా మాధ్యమం ద్వారా డీఎంకే శ్రేణులను చేరుకోవడం నుండి, ఆధునిక సోషల్ మీడియా ద్వారా డీఎంకేలోని యువతను చేరుకోవడానికి కావాల్సిన వ్యూహాన్ని రూపొందించి అమలు చేశాడు ఉదయనిధి. ఈ వ్యూహం కొంతకాలం బాగానే పనిచేసింది.
2019 నుంచి 2021 వరకు జరిగిన పరిణామాలు..
2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలు, 2021లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే సాధించిన విజయాలు గమనిస్తే, డీఎంకే ఉదయనిధిపై పెట్టిన ఆశలు సబబైనవే అని రుజువైంది.
డిజిటల్ మాధ్యమాల ద్వారా ఓటర్లను, డీఎంకే శ్రేణులను చేరుకోవడంలో ఉదయనిధి వ్యూహం మంచి ఫలితాలను ఇచ్చింది.
చెపాక్-తిరువల్లికేణి నియోజకవర్గం నుంచి గెలిచి తాను ఎన్నికల బాహాబాహీలో కూడా సత్తా చాటుకోగలను అని నిరూపించారు. తరువాత వరుసగా డీఎంకేలో ఉదయనిధి ఎదుగుదల సహజ పరిణామంగానే కనిపించింది. ఈ పరిస్థితుల్లో తాజా ఎన్నికల ఫలితాలు డీఎంకే ముందు, ఉదయనిధి ముందు కీలకమైన సవాళ్లను విసురుతున్నాయి.
కొత్త తరం ప్రత్యర్థి..
టీవీకే అధినేత విజయ్ చేతిలో పరాజయం ఇప్పటికిప్పుడు డీఎంకేలో ఉదయనిధి రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయదు. డీఎంకేకు స్టాలిన్ తరువాత వారసుడిగా ఉదయనిధి ఉంటారు. పార్టీ పునరుద్ధరణకు రూపొందించే దీర్ఘకాలిక వ్యూహంలో ఉదయనిధికి ప్రత్యేకమైన పాత్ర, స్థానం, బాధ్యత ఉంటాయి.
ఒకటో, రెండో పరాజయాలు ఎదురైనంతమాత్రాన పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు ధోరణులు తమిళనాట అంతగా కనిపించని విషయాలు.
కానీ తాజా ఫలితాలు తమిళనాడు రాజకీయ తెరపై నూతన పాత్రధారులను ముందుకు తెస్తున్నాయి. గత 47 ఏళ్లలో స్టాలిన్ రాజకీయ జీవితంలో ఎదురుకాని ప్రత్యర్థులను ఇప్పుడు ఉదయనిధి ఎదుర్కోవాల్సి వస్తోంది. స్టాలిన్ రాజకీయాలలో ప్రవేశించిన నాటి నుంచి ఏఐఏడీఎంకే ప్రధాన ప్రత్యర్థిగా ఉంది.
డీఎంకే లాగానే ఏఐఏడీఎంకే కూడా ద్రావిడ రాజకీయ చట్రం, సైద్ధాంతిక నేపథ్యంలోనే రాజకీయాలు నడిపింది.
కానీ టీవీకే రంగం మీదకు రావడంతో ఈ సాంప్రదాయక ద్వంద్వ యుద్ధానికి కాలం చెల్లినట్లు అయింది.
సినీ హీరో నుంచి రాజకీయ హీరో వరకు విజయ్ అడుగులు..
టీవీకే అనూహ్య విజయం సాధించడంతో రాజకీయాలలో విజయ్ ఒక ప్రత్యేక అధికారాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. ఇప్పటివరకు తమిళనాడు రాజకీయాలను శాసించిన సైద్ధాంతిక ద్రావిడ రాజకీయ నేపథ్యం, కట్టుదిట్టమైన పార్టీ నిర్మాణాలు టీవీకేకు గానీ, విజయ్‌కు గానీ లేవు.
అయితే దీర్ఘకాలం వరుస విజయాలతో బాక్సాఫీసును బద్దలు కొట్టిన విజయ్‌కు తనదైన అభిమాన బృందం ఉంది.
ఇటువంటి సాంస్కృతిక పెట్టుబడి, ఆయా ప్రత్యేక సందర్భాలలో రాజకీయ పెట్టుబడిగా, ప్రత్యేకించి ఓట్లుగా మారటం అన్నది దక్షిణాది రాజకీయాలలో సహజమే.
ఉదయనిధికి సినీ రంగంలో ఉన్న ప్రవేశం, అనుభవం రాజకీయంగా ఉపయోగపడినప్పటికీ తనకంటూ భారీ అభిమాన బృందాలను తయారు చేయడానికి దారి తీయలేదు.
డీఎంకేకు తనదైన నిర్మాణం, క్షేత్రస్థాయి యంత్రాంగం ఉన్నాయి కాబట్టి వాటిని సమర్థవంతంగా పర్యవేక్షించి, ఫలితాలు ఇచ్చే విధంగా ఉపయోగించుకునే వ్యూహాలు రూపొందించడం, నిర్మాణ దక్షత ప్రదర్శించడం ఉదయనిధి చేయాల్సిన పనులు.
అందువలనే విజయ్ తరహాలో ‘దళపతి’లాంటి బిరుదులు గానీ, సినీ దిగ్గజం హోదా గానీ అవసరం కాలేదు. దీనికి భిన్నంగా విజయ్ అప్పటికప్పుడు పొంగుతున్న భావోద్వేగాలను పెట్టుబడిగా మార్చుకుని రాజకీయాలలో ప్రవేశించారు. డీఎంకే లేదా ఏఐఏడీఎంకే తరహాలో క్షేత్రస్థాయి నిర్మాణం గానీ, యంత్రాంగం గానీ టీవీకేకు లేవు. ఇది రానున్న కాలంలో టీవీకేకు సవాలుగా మారనుంది..
వారసత్వం – బరిలో నిగ్గు తేలడం..
ఈ నేపథ్యంలో ఉదయనిధి ముందు ఉన్న సవాళ్లు భిన్నమైనవి. ఇప్పటివరకు ఉదయనిధికి తన కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించగలడా లేదా అన్నదే ప్రశ్నగా ఉండేది. కానీ ఈ ఎన్నికలు కేవలం రాజకీయ వారసత్వం ఒక్కటే ఉదయనిధి తన ప్రతిభను, సత్తాను చాటుకోవడానికి సరిపోదు అని రుజువు చేశాయి.
ఇప్పుడు ద్రావిడ రాజకీయ సైద్ధాంతిక చట్రం బయట రాజకీయాలు నడిపే విజయ్‌తో ఉదయనిధి పోటీపడాల్సి ఉంటుంది. డీఎంకేలో ఉదయనిధికి ఎదురు లేకపోవచ్చు కానీ, తమిళనాడు రాజకీయాలలో ఉదయనిధి తనను తాను నిలకడైన, నమ్మదగిన నాయకుడిగా, ద్రావిడ రాజకీయాలను ముందుకు తీసుకెళ్లగల సమర్థుడిగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
