1967–1971 మధ్య కాలం భారత రాజకీయాల్లో కీలక మలుపు. స్వాతంత్య్రానంతర కాంగ్రెస్ ఆధిపత్యానికి ముగింపు. తాజాగా రాఘవ్ చద్దా తిరుగుబాటు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఉలిక్కిపడింది. బీజేపీ భారీ లాభాన్ని ఆర్జించింది.
అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఈ ఫిరాయింపులు, ఎన్నికైన ప్రతినిధులు పార్టీలు మారే అంశాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చాయి.
గత నాలుగేళ్లుగా ఈ ధోరణి ఎంత తీవ్రమైందంటే, భారతదేశంలో ప్రజాస్వామ్య భవిష్యత్తుపై ఓటర్లు సందేహాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు, ఫలితంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని గురించి మళ్లీ చర్చించాల్సి వచ్చింది.
అస్థిరతా యుగం(1967–1971)..
1967 నుంచి 1971 మధ్య కాలాన్ని “అస్థిరతా యుగం”గా వ్యవహరిస్తారు; ఈ కాలంలో వివిధ రాష్ట్రాలలో 45 ప్రభుత్వాలు ఏర్పడి, కుప్పకూలాయి. ఇది స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ పార్టీ కొనసాగించిన ఆధిపత్యానికి ముగింపు, సంకీర్ణ ప్రభుత్వాల ప్రయోగానికి ఆరంభం.
ఈ దశలో, రాజ్యాంగంలోని 356వ అధికరణను ప్రయోగిస్తూ మొత్తం 16 సార్లు రాష్ట్రపతి పాలన విధించబడింది. 1,800 మందికి పైగా శాసనసభ్యులు పార్టీలు ఫిరాయించగా, వారిలో సుమారు 115 మందికి మంత్రి పదవులు దక్కాయి.
భారత రాజకీయాల్లో ప్రసిద్ధి చెందిన “ఆయా రామ్, గయా రామ్” అనే నినాదం వాడుకలోకి వచ్చింది కూడా ఈ కాలంలోనే.
ఒక మైలురాయి సంవత్సరం: 1967 ఎన్నికలు..
1967 ఎన్నికలు – లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగిన చివరి సందర్భం- భారత రాజకీయాల్లో కీలక మలుపు.
ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మద్రాసు(ప్రస్తుతం తమిళనాడు), కేరళ, రాజస్థాన్, పంజాబ్‌లతో సహా ఎనిమిది రాష్ట్రాల్లో కాంగ్రెస్ మెజారిటీని సాధించలేకపోయింది.
మద్రాసులో డీఎంకే మెజారిటీ సాధించగా, ఇతర రాష్ట్రాలలో కాంగ్రెసేతర పార్టీల కూటమి అయిన ‘సంయుక్త విధాయక్ దళ్’ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.
సిద్ధాంతపరంగా భిన్నమైన ఈ కూటములు అంతర్గత వైరుధ్యాలతో నిండి ఉన్నాయి; ఇవి మితవాద ధోరణి కలిగిన భారతీయ జనసంఘ్ వంటి పార్టీల నుంచి, కమ్యూనిస్టు పార్టీల వరకు పూర్తిగా విభిన్నమైన శక్తులను ఒకే వేదికపైకి చేర్చాయి.
దాదాపు ఎటువంటి సైద్ధాంతిక పొంతన లేకపోవడంతో, ఈ అసంగత కూటములు రాజకీయ ఫిరాయింపులకు సారవంతమైన భూమిని సృష్టించాయి.
ముఖ్యమంత్రి కావాలనే ఆశతో పలువురు ప్రభావవంతమైన కాంగ్రెస్ నాయకులు తమ సొంత పార్టీని చీల్చేంత వరకు వెళ్లారు.
ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా, గవర్నర్లను ఉపయోగించుకోవడం ద్వారా ప్రతిపక్ష సంకీర్ణ ప్రభుత్వాలను అస్థిరపరచడంలో ఒక పాత్ర పోషించింది.
అనేక సందర్భాల్లో, అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు సభలో తమ మెజారిటీని నిరూపించుకునే అవకాశాన్ని కూడా కల్పించకుండానే, అది ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలనను విధించింది.
రాజకీయ అస్థిరత – విస్తరించిన ఫిరాయింపుల రుగ్మత..
ఉత్తర భారతదేశం అంతటా భారీ ఎత్తున రాజకీయ ఫిరాయింపులు చోటుచేసుకున్నాయి.
హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, పంజాబ్ రాష్ట్రాలలోనే 30కి పైగా ప్రభుత్వాలు ఏర్పడటంతోపాటు కూలిపోవడం సంభవించింది.
తూర్పు, దక్షిణ భారతదేశాలలో కూడా ఇటువంటిదే అయినప్పటికీ, కొంత తక్కువ తీవ్రత కలిగిన ఒక నమూనా కనిపించింది.
ఈ రాజకీయ ఫిరాయింపుల వెల్లువ ఎంతగా విస్తరించి, ఆందోళనకరంగా తయారైందంటే, ఈ సమస్యను పరిష్కరించడానికి 1968లో అప్పటి హోం మంత్రి వైబీ చవాన్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
1967 ఎన్నికలు జరిగిన ఒక సంవత్సరంలోపే, ఈ కమిటీ వందలాది ఫిరాయింపుల ఉదంతాలను నమోదు చేసింది.
ఈ రాజకీయ అస్వస్థతపై లభించిన అత్యంత ప్రాచీనమైన, ప్రామాణికమైన అధికారిక పత్రంగా ఇది ఇప్పటికీ నిలిచి ఉంది.
ప్రఖ్యాత రాజ్యాంగ నిపుణులు, మాజీ లోక్‌సభ సెక్రటరీ జనరల్ సుభాష్ సీ కశ్యప్ రచించిన ‘The Politics of Defection: A Study of State Politics in India’ అనే పుస్తకంలో కూడా ఈ సంఘటనలు ఒక క్రమబద్ధమైన రీతిలో నమోదు చేయబడ్డాయి.
1967 తర్వాతి కాలంలో, శాసనసభ్యుల “హార్స్ ట్రేడింగ్” కారణంగా ప్రభుత్వాలు పేకమేడల వలె ఎలా కూలిపోయాయో ఆయన ఇందులో వివరించారు.
గ్రౌండ్ జీరో: వివిధ రాష్ట్రాల్లో ఫిరాయింపుల పర్వం..
పార్టీ ఫిరాయింపుల రాజకీయాలకు హర్యానా ఒక కేంద్ర బిందువుగా అవతరించింది. 1967లో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ, అతి తక్కువ కాలంలోనే ఎమ్మెల్యే రావు బీరేందర్ సింగ్ పార్టీని చీల్చి, పలువురు శాసనసభ్యులను తనతో పాటు తీసుకువెళ్లారు.
ఆ తర్వాత ఆయన ‘విశాల్ హర్యానా పార్టీ’ని స్థాపించి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఇదే సమయంలో, హర్యానాలోని హసన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గయా లాల్, కేవలం పక్షం రోజుల వ్యవధిలోనే మూడుసార్లు పార్టీలు మారారు; దీనితో ‘ఆయా రామ్, గయా రామ్’ అనే నానుడి పుట్టుకొచ్చింది, ఇది రాజకీయ ఫిరాయింపుదారులకు పర్యాయపదంగా మారిపోయింది.
అంతిమంగా, ఈ నిరంతర రాజకీయ అస్థిరత కారణంగా, నవంబర్ 1967లో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది.
ఉత్తరప్రదేశ్‌లో, కాంగ్రెస్ నాయకుడు చంద్ర భాను గుప్తా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, కానీ అది కేవలం 18 రోజులు మాత్రమే మనుగడ సాగించింది. ఆయన సహచరుడు చౌదరి చరణ్ సింగ్, 17 మంది శాసనసభ్యులతో కలిసి తిరుగుబాటు చేసి ‘భారతీయ క్రాంతి దళ్’ను స్థాపించారు.
జనసంఘ్, సోషలిస్టులతో పొత్తు పెట్టుకుని, ఆయన ‘సంయుక్త విధాయక్ దళ్’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, తన కూటమి భాగస్వాములతో ఏర్పడిన సిద్ధాంతపరమైన విభేదాల కారణంగా, ఈ ప్రభుత్వం కూడా ఫిబ్రవరి 1968లో కుప్పకూలింది; తదనంతరం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబడింది.
మధ్యప్రదేశ్‌లో రాజకీయ ఫిరాయింపుల పర్వానికి గ్వాలియర్‌కు చెందిన రాజమాత విజయరాజే సింధియా నాయకత్వం వహించారు. ఆమె కాంగ్రెస్ ముఖ్యమంత్రి ద్వారకా ప్రసాద్ మిశ్రాపై తీవ్రస్థాయిలో పోరాటం సాగించారు. గోవింద్ నారాయణ్ సింగ్, మరో 36 మంది కాంగ్రెస్ శాసనసభ్యులతో కలిసి పక్షం మారి, ‘సంయుక్త విధాయక్ దళ్’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
వర్గ రాజకీయాలతో సతమతమవుతూ, ఆపై సొంత ప్రభుత్వంలోనే ఫిరాయింపులను ఎదుర్కొన్న ఈ ప్రభుత్వం కూడా కేవలం 1969 వరకు మాత్రమే మనుగడ సాగించగలిగింది.
ఇంతలో, బీహార్ రాజకీయ అస్థిరత పరాకాష్టకు చేరుకుంది, 1967 నుండి 1971 మధ్య తొమ్మిది మంది ముఖ్యమంత్రులను చూసింది. మహామాయ ప్రసాద్ సిన్హా మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం రాజకీయ ఫిరాయింపుల కారణంగా కూలిపోయింది.
బీపీ మండల్ ‘శోషిత్ దళ్’ ను ఏర్పాటు చేసి కాంగ్రెస్ బాహ్య మద్దతుతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు, కానీ ఆయన ప్రభుత్వం కేవలం 31 రోజులు మాత్రమే కొనసాగింది.
పరిస్థితి ఎంత హాస్యాస్పదంగా మారిందంటే, శాసనసభ్యులు ఉదయం ఒక పార్టీలో ఉండి, సాయంత్రానికల్లా ప్రతిపక్ష శిబిరంలో కనిపించేవారు.
పశ్చిమ బెంగాల్లో, అజోయ్ ముఖర్జీ నాయకత్వంలో, ‘బంగ్లా కాంగ్రెస్’, వామపక్ష పార్టీలు ఏకమై ఒక ‘ఐక్య కూటమి’ (యునైటెడ్ ఫ్రంట్) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
అయితే, కాంగ్రెస్ వ్యూహకర్తలు పీసీ ఘోష్‌ను పార్టీ ఫిరాయించేలా ప్రేరేపించడంతో ఆ ప్రభుత్వం కుప్పకూలింది. ఘోష్ ముఖ్యమంత్రి అయ్యారు, కానీ ఆయన ప్రభుత్వం కూడా అస్థిరంగానే కొనసాగింది.
బెంగాల్లో, రాజకీయ ఫిరాయింపులతో పాటు, రాజకీయ హింస కూడా ప్రజాస్వామ్య ప్రక్రియకు తీవ్ర నష్టాన్ని కలిగించింది.
అకాలీదళ్(సంత్ ఫతే సింగ్ వర్గం), ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని, పంజాబ్‌లో ‘పాపులర్ యునైటెడ్ ఫ్రంట్’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, లచ్మన్ సింగ్ గిల్ 16 మంది శాసనసభ్యులతో కలిసి పార్టీ ఫిరాయించి, కాంగ్రెస్ బాహ్య మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆయన ప్రభుత్వం కేవలం తొమ్మిది నెలల్లోనే కుప్పకూలింది; ఆ కాలంలో రాష్ట్రం తరచుగా రాష్ట్రపతి పాలనను, అలాగే మధ్యంతర ఎన్నికలను చవిచూసింది.
మంత్రి పదవి ఆకర్షణ – గవర్నర్ల పాత్ర..
45 ప్రభుత్వాల పతనానికి దారితీసిన లేదా దోహదపడిన కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. పార్టీ ఫిరాయించిన ప్రతి ఎనిమిది మంది శాసనసభ్యులలో ఒకరికి మంత్రి పదవి బహుమతిగా లభించింది; తద్వారా రాజకీయ విధేయత కంటే ‘ఎర్ర దీపం'(మంత్రి హోదాకు చిహ్నం) ఆకర్షణే అధిక ప్రాధాన్యతను సంతరించుకోవడం ప్రారంభమైంది.
ప్రతిపక్షాల నేతృత్వంలోని ప్రభుత్వాలను అస్థిరపరచడానికి గవర్నర్ పదవిని దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలను కూడా కాంగ్రెస్ ఎదుర్కొంది. కాంగ్రెస్‌ను వ్యతిరేకించడం తప్ప, ‘సంయుక్త విధాయక్ దళ్'(SVD) ప్రభుత్వాలకు ఎటువంటి ఉమ్మడి ఎజెండా లేకపోవడమే ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసింది.
సమన్వయం లేకపోవడం అనే ఈ లోపమే, అంతర్గత ఒత్తిళ్ల కారణంగా ఆ ప్రభుత్వాలు చివరికి కుప్పకూలిపోవడానికి దారితీసింది.
ఈ రాజకీయ అస్థిరత, భారీ ఎత్తున జరిగిన పార్టీ ఫిరాయింపులు, 1971 ఎన్నికల్లో కీలక ప్రభావం చూపాయి. ‘బలమైన కేంద్రం’ అలాగే ‘స్థిరమైన ప్రభుత్వం’ అనే నినాదాలకు మద్దతుగా నిలిచిన ఓటర్లు ఇందిరా గాంధీకి భారీ మెజారిటీని కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించారు.
‘ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(Requisitionists)’గా పిలువబడే గాంధీ వర్గపు కాంగ్రెస్, లోక్‌సభలోని 521 స్థానాలకు గాను 352 స్థానాలను గెలుచుకుని, రాజకీయ ఫిరాయింపుల పరంపరకు తాత్కాలికంగా అడ్డుకట్ట వేసింది.
చవాన్ కమిటీ సిఫార్సులు-పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం..
ఇంతలో, చవాన్ కమిటీ అనేక కీలక సిఫార్సులను ముందుకు తెచ్చింది. మంత్రి మండలి పరిమాణం, శాసనసభ మొత్తం సభ్యుల సంఖ్యలో 10-11 శాతానికి మించకూడదని అది సిఫార్సు చేసింది. తదనంతరం, 2003లో, 91వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పరిమితిని 15 శాతంగా నిర్ణయించారు.
శాసనసభ్యులు తమ పార్టీని వీడితే, కనీసం ఒక సంవత్సరం పాటు వారిని మంత్రిగా గానీ, ముఖ్యమంత్రిగా గానీ నియమించకుండా నిషేధించాలని ఆ కమిటీ మరింతగా నిర్దేశించింది.
రాజకీయ ఫిరాయింపులను ఓటర్ల నమ్మకానికి చేసిన ద్రోహంగా అభివర్ణించిన ఆ కమిటీ, ఎన్నికలలో ఫిరాయింపుదారులను అభ్యర్థులుగా నిలబెట్టకుండా రాజకీయ పార్టీలు దూరంగా ఉండాలని సిఫార్సు చేసింది.
ఈ నివేదిక ఆధారంగానే, 1985లో అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం’ను రూపొందించింది; దీనిని 1985లో జరిగిన 52వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌గా చేర్చారు.
మరింత పటిష్టం చేసే ఉద్దేశంతో, 2003లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో దీనికి గణనీయమైన సవరణలు చేశారు.
ప్రస్తుత ఆప్ వలసలు – చట్టం ఏం చెబుతోంది?
శుక్రవారం నాటి ఆప్ వలసలకు పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు. ఎందుకంటే రాఘవ్ చద్దాతో సహా పార్టీకి చెందిన 10 మంది రాజ్యసభ ఎంపీలలో ఏడుగురు బీజేపీలో విలీనమవుతున్నారు, తద్వారా వారు విలీనానికి అవసరమైన కీలకమైన మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించినట్లవుతుంది.
10వ షెడ్యూల్ ప్రకారం, ఒక రాజకీయ పార్టీ తన శాసనసభ్యులలో కనీసం మూడింట రెండు వంతుల మంది విలీనానికి అనుకూలంగా ఉన్నట్లయితే, ఆ పార్టీ మరొక పార్టీలో విలీనం కావడానికి చట్టం అనుమతిస్తుంది.
అనువాదం: డాక్టర్ ఆర్ తిరునాధర్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
