‘ఉక్కుపాదం’ నవలా రచయితగా చిరపరిచితుడైన జాక్ లండన్ 1876 జనవరి 12న అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించారు.
ఆయన తల్లి ఫ్లోరా వెల్మాన్, తండ్రి విలియం చానీ.
జాక్ లండన్ అసలు పేరు జాక్ గ్రిఫిత్ చానీ.
బాల్యంలో ఒక్క డాలర్ కోసం ఒళ్లు హూనం చేసుకుని రాత్రింబవళ్లు పనిచేసిన జాక్ లండన్ ఆ తరువాత కాలంలో వేల డాలర్లు సంపాదించారు.
బాల కార్మికుడిగా, రోజువారీ కూలీగా, సముద్రపు దొంగగా(ఆయిస్టర్లను స్మగుల్ చేసేవాడిగా), వలస కూలీగా, యుద్ధ క్షేత్రంలో విలేఖరిగా, బొగ్గుగని పనివాడిగా, జూట్ మిల్లు కార్మికుడిగా, బంగారపు గని శ్రామికుడిగా, నావికుడిగా, పాత్రికేయుడిగా, ప్రజాపక్ష ఉద్యమకారుడిగా, జంతు ప్రేమికుడిగా ఎన్నో అవతారాలు ఎత్తారు.
ఆయన జీవితంలో అతి గొప్ప ప్రజా రచయితగా కీర్తి పొందారు. తన రచనలకు పేజీలను బట్టి కాక, పదాలను బట్టి డబ్బు తీసుకునేవారు.
రోజుకు కనీసం వెయ్యి పదాలకు తగ్గకుండా ఆయన చేసిన రచనలు దట్టించిన మందుగుండులాగా పేలాయి.
30 ఏళ్లకే ప్రపంచవ్యాప్తంగా రచయితగా గుర్తింపు పొందారు. అంతర్జాతీయ స్థాయిలో సెలబ్రిటీ హోదాను పొందిన తొలి అమెరికన్ రచయిత.
ఎర్నెస్ట్ హెమింగ్వే, అప్టన్ సింక్లెయిర్, జార్జ్ ఆర్వెల్ వంటి ఎందరో మేధావుల్ని ఆయన ప్రభావితం చేశారు.
సాహిత్య ప్రస్థానం-అజరామరమైన రచనలు..
జీవితాన్ని దాని అన్ని పార్శ్వాల నుంచి గాఢంగా కాచి వడబోశారు. ఆయన కేవలం నవలా రచయిత మాత్రమే కాదు, వివిధ సాహిత్య ప్రక్రియలలో రచనలు చేశారు.
ఆయన రాసిన నవలలలో ‘ప్రకృతి పిలుపు'(The Call of the Wild – 1903), ‘వైట్ ఫాంగ్’ (1906) అనే రెండు నవలలు ఆనాటి వాయువ్య కెనడాలో బంగారం కోసం ప్రారంభమైన విపరీతమైన వెతుకులాటను గురించి చిత్రించిన గొప్ప రచనలు. ‘ఉక్కుపాదం'(The Iron Heel) 1908లో(గమనిక: మూలంలో 1924 అని పడింది) రాశారు.
‘లవ్ ఆఫ్ లైఫ్’ అనేది చిన్న కథల సంపుటి. ఇవే కాక కథలు, కవితలు మొత్తం మూడువందల వరకు రాశారు. 1905లో రాసిన ‘వార్ ఆఫ్ క్లాసెస్’, 1910లో రాసిన ‘రివల్యూషన్ అండ్ అదర్ ఎస్సేస్’ అనేవి వ్యాస సంపుటాలు.
తొలి సైన్స్ ఫిక్షన్ రాసిన వ్యక్తులలో కూడా ఆయనే ముందు వరుసలో ఉంటారు. కొన్ని చిత్రాలకు స్క్రీన్ ప్లే కూడా రాశారు.
ఆయన రచనలన్నీ దాదాపు ప్రపంచంలోని అన్ని భాషలలోకి అనువాదమయ్యాయి. ఆయనో మానవీయ వ్యక్తి, సామ్యవాద స్వాప్నికులు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, “నేను మట్టి కావడం కంటే బూడిద కావడానికే ఇష్టపడతాను, కుళ్ళి, కృశించి నశించడానికి బదులు నాలోని ప్రతి అణువూ భగభగ మండే మంటల్లో ఆహుతి కావాలనుకుంటాను.
మందకొడిగా శాశ్వతమైన గ్రహంలాగా ఉండడం కంటే దేదీప్యమానంగా వెలిగి పతనమయ్యే అద్భుతమైన ఉల్కగా మారాలనుకుంటాను. మనిషన్నవాడు జీవించాలి. బతుకు ఈడ్చడం కాదు.”
విప్లవ భావాలు – తుది శ్వాస వరకు పోరాటం..
ఆయన 1897లో అంటే తన 21వ ఏట బర్క్లీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో చదువుకున్నారు.
సాహిత్యం పట్ల ప్రారంభం నుంచీ అభిరుచి కలిగిన వ్యక్తిగా ఆయన అమెరికాలోని వాస్తవికవాదం, నాచురలిజం సాహిత్య ఉద్యమాలలో భాగస్వామి అయ్యారు.
‘ది క్రౌడ్’ అనే సాహిత్య బృందంలో సభ్యుడిగా కొనసాగారు. ఆయన తాను రాసిన ఉత్తరాలన్నింటినీ, ‘విప్లవం కోసం మీ వాడిని’ అనే మాటలతో ముగించేవారు.
ఆయన భావాలన్నీ సామాజిక జీవనంలో అట్టడుగున ఉన్న ప్రజలతో కలిసి జీవించిన అనుభవాలతో ప్రభావితమైనవి. ఆయన్ని ప్రభావితం చేసిన రచయితలు నీట్షే, హెర్బర్ట్ స్పెన్సర్, కార్ల్ మార్క్స్, రాబర్ట్ లూయీస్ స్టీవెన్సన్.
సొనోమా అనే లోయలో 1400 ఎకరాలలో వ్యవసాయ క్షేత్రం నెలకొల్పారు. అక్కడ ‘వోల్ఫ్ హౌస్’ అనే పేరుతో ఒక కళాత్మక సౌధాన్ని నిర్మించుకున్నారు. అతడి జీవితంలో నిరాశ అనే పదమే లేదు. కాలానికి ఎదురీదేవారు. 1916 నవంబర్ 22న అంటే నలభై ఏళ్ల వయస్సులోనే తీవ్ర అనారోగ్యంతో చనిపోయారు.
ఆయన కట్టించుకున్న సౌధం గృహ ప్రవేశం జరగడానికి ఒక్కరోజు ముందు కాలి బూడిదైపోయింది. అయినా ఆయన నిరాశ చెందలేదు. తదనంతర కాలంలో అతడి వ్యవసాయ క్షేత్రంలో కొంత భాగాన్ని అమెరికా ప్రభుత్వం కొని, అక్కడ ‘జాక్ లండన్ స్టేట్ హిస్టారిక్ పార్క్’ను అభివృద్ధి చేసింది.
(జాక్ లండన్ 150వ జయంతి సంవత్సరం సందర్భంగా అరుణతార సౌజన్యంతో ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
