1977 తర్వాత కేరళలో ఎల్డీఎఫ్ ఓటమితో దేశంలో ఏ రాష్ట్రంలోనూ వామపక్షాలు అధికారంలో లేని ఓ ప్రత్యేక పరిస్థితి ఏర్పడింది.
కేరళ ఓటమి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్క్సిస్ట్)[సీపీఐ(ఎం)] అనుసరిస్తున్న రాజకీయ ఎత్తుగడలపై అనేక ప్రశ్నలకు దారితీస్తోంది.
కేరళలో పాలక ఎల్డీఎఫ్కు నాయకత్వం వహిస్తున్న సీపీఎం, బీజేపీతో చేతులు కలిపిందంటూ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఆరోపించింది.
లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరో అడుగు ముందుకు వేసి సీపీఎంను ‘కమ్యూనిస్టు జనతా పార్టీ’ అని కూడా విమర్శించారు.
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఏ బేబీ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఉద్దేశపూర్వకంగా పార్టీ ప్రతిష్ఠను దిగజార్చేందుకే ఈ రకంగా ప్రచారం చేస్తున్నారని అన్నారు.
“సమాజంలోని అన్ని తరగతులకు చెందిన ప్రజానీకానికి సీపీఎం ప్రాతినిధ్యం వహిస్తోంది. సామాజికంగా, ధార్మికంగా, కులపరంగా వెలివేతకు గురైన వారందరి పక్షాన సీపీఎం నిలుస్తోంది” అని బేబీ అన్నారు.
తీర్మానం – ఉల్లంఘనల ఆరోపణలు..
సీపీఎం 21వ మహాసభలు అప్పటి పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నేతృత్వంలో జరిగాయి.
బీజేపీ, మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడడమే ప్రధాన కర్తవ్యమంటూ ఏచూరి ఆ సభలలో తీర్మానాన్ని ఆమోదించారు.
అయితే, పార్టీ ఈ మౌలిక కర్తవ్యాన్ని ఉల్లంఘించిందని కొందరు ఆరోపిస్తున్నారు.
2022 అక్టోబరులో నూతన విద్యావిధానం- 2020 అమలు ముందస్తు షరతుగా ఉన్న పీఎంశ్రీ పథకాన్ని పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం అంగీకరించిందని విమర్శకులు గుర్తు చేశారు.
పీఎంశ్రీ పథకం కింద దేశవ్యాప్తంగా 14,500 హైస్కూళ్లను ఆధునిక విద్యాసంస్థలుగా రూపొందించనున్నారు.
పథకం అమలుకు తీవ్ర వ్యతిరేకత..
2020లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యావిధానాన్ని వ్యతిరేకించిన రాష్ట్రాలలో తమిళనాడు, పశ్చిమబెంగాల్‌తో పాటు కేరళ కూడా ఒకటి.
రాజ్యాంగం ప్రకారం, ఉమ్మడి జాబితాలో ఉన్న పాఠశాల విద్యారంగంపై కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో జోక్యం చేసుకుంటుందని కేరళ ఆరోపించింది.
తర్వాతి కాలంలో కేంద్రం నుంచి నిధులు వస్తాయన్న కారణం చూపించి పీఎంశ్రీ పథకాన్ని అంగీకరించారు.
అయితే, పాలక ఎల్డీఎఫ్ కూటమిలో ప్రధాన భాగస్వామి సీపీఐ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు.
పినరయి విజయన్ నాయకత్వంలోని ప్రభుత్వానికి మద్దతుదారుగా ఉన్న వెల్లపల్లి నటేశన్ చేసిన మతోన్మాద వ్యాఖ్యలపై సీపీఎం తగిన విధంగా స్పందించలేదని విమర్శకులు గుర్తు చేశారు.
ఈ రెండు ఆరోపణలను ఎంఏ బేబీ తిరస్కరించారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం పీఎంశ్రీ పథకాన్ని అమలు చేసిందని, కానీ కేరళలో ఈ పథకాన్ని తాము అమలు చేయలేదని ఆయన గుర్తు చేశారు.
నటేశన్ వ్యాఖ్యల గురించి ప్రస్తావిస్తూ “ఆ వ్యాఖ్యలను సీపీఎం ఎన్నడూ సమర్థించలేదు.
ఆయనకు ఉన్న హోదాకు ఈ వ్యాఖ్యలు తగినవి కావు అని నేను విమర్శించాను” అని గుర్తు చేశారు.
త్రిస్సూర్ జిల్లా పంచాయితీలో బీజేపీ- కాంగ్రెస్ భాగస్వాములని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో త్రిస్సూర్ నుంచి బీజేపీ గెలవడానికి కాంగ్రెస్సే ప్రధాన కారణమని అన్నారు.
ఓటమిపై లోతైన సమీక్ష..
ఎన్నికల ఫలితాలపై లోతైన సమీక్ష జరిపి లోపాలను గుర్తించి సరి చేసేందుకు చర్యలు తీసుకుంటామని బేబీ తెలియజేశారు.
“కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం వరుసగా పదేళ్లపాటు అధికారంలో ఉన్నది. ఈ కాలంలో ప్రజా సంక్షేమం కోసం, ప్రజల మనోభావాలకు అనుగుణంగా శక్తి వంచన లేకుండా పని చేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్థికంగా కలిగించిన అనేక అవరోధాలను కూడా లెక్కచేయకుండా ప్రజల కోసం పనిచేశాము” అన్నారు.
సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా మాట్లాడుతూ, “కేరళను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారుస్తామన్న వాగ్దానాన్ని ఎల్డీఎఫ్ నిలబెట్టుకున్నది. సగటు ఆయుఃప్రమాణం పెంచడంలోనూ, శిశు మరణాలను తగ్గించడంలోనూ, రహదారులు- మెట్రో రైళ్లు వంటి మౌలిక వసతులను ఆధునీకరించడంలో ఎల్డీఎఫ్ విశేష కృషి చేసింది” అని గుర్తు చేశారు.
గత పదేళ్లలో రాష్ట్రంలో మతోన్మాద కలహాలు జరగకపోవడాన్ని కూడా డీ రాజా ప్రత్యేకంగా ప్రస్తావించారు.
“ఇంత చేసినా ఓడిపోయాము. ఓటమికి గల కారణాల గురించి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేశ రాజకీయాలను మార్చడానికి వామపక్షాలు బలమైన శక్తిగా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది” అని రాజా అభిప్రాయపడ్డారు.
ది హిందూ సౌజన్యంతో ఈ వ్యాసాన్ని ది వైర్ తెలుగు పాఠకులకు అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
