అత్యంత ప్రాధాన్యంగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఉత్కంఠంగా సాగిన కౌంటింగ్ పూర్తయింది. విజేతలు ఎవరో, పరాజితులు ఎవరో రూఢి అయింది.
తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి ఐదు సంవత్సరాల తర్వాత అక్కడి పాలక పక్షాన్ని మార్చడం ఆ రాష్ట్రాల ప్రజల రివాజు.
అయితే గతంలో ఒకసారి తమిళనాడులో జయలలిత, కేరళలో పినరయి విజయన్‌ల నేతృత్వంలోని పార్టీలు రెండవ దఫా అధికారంలోకి వచ్చాయి.
కేరళలో వామపక్ష ప్రభుత్వంపై ఆర్థిక దిగ్బంధనం..
కేరళ రాష్ట్రంలోని వామపక్ష ప్రజాతంత్ర సంఘటన ప్రభుత్వం తనను గెలిపించిన ప్రజల శ్రేయస్సు కోసమే అంకితమై పనిచేసింది.
రెండవ దఫా కూడా అధికారంలోకి రావడంతో ఎలాగైనా ఈసారి ఓడించాలని కేంద్రం నిర్ధారించుకుంది.
అందుకే ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన పథకాలను అమలు చేయకుండా ఆర్థిక దిగ్బంధనం చేసింది. ఇది సహజంగానే కేరళ రాష్ట్ర ప్రజలలో అసంతృప్తిని కలుగజేసి ఉండవచ్చు.
తమిళనాడు, బెంగాల్లో సరళీకృత ఆర్థిక విధానాల ప్రభావం..
తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం నికరంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా నిలబడింది. అది చాలా అభినందనీయం.
అయితే ఆర్థిక విధానాల విషయంలో మాత్రం కేంద్రం శరవేగంగా అమలు జరుపుతున్న సరళీకృత ఆర్థిక విధానాలనే స్టాలిన్ ప్రభుత్వం కూడా అమలు జరిపింది.
పశ్చిమ బెంగాల్లో మమతా ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ సరళీకృత ఆర్థిక విధానాలనే అమలు చేసింది.
పైగా మతోన్మాద శక్తులకు అవకాశం కల్పించే పలు చర్యలను చేపట్టింది.
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రెండు రాష్ట్రాలలో పాలకపక్షం ఓటమికి ఒక కీలకమైన అంశం సరళీకృత ఆర్థిక విధానాలు.
కేవలం ప్రజలకు కొన్ని తాయిలాలు ఇవ్వడం ద్వారానే అధికారాన్ని నిలబెట్టుకోవడం సాధ్యం కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అనేక రెట్లు అదనపు తాయిలాలను ప్రజలకు వాగ్దానం చేసింది. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవడం అత్యంత ఆవశ్యకం.
ఎన్నికల నిర్వహణ – ప్రమాదకర పోకడలు..
ఏమైనా ఎన్నికల ఫలితాలపై ఆయా రాజకీయ పార్టీలు వివిధ కోణాలలో విశ్లేషిస్తాయి. ఇక్కడ మరొక కీలకమైన అంశం మరిచిపోరానిది.
అది ఎన్నికల నిర్వహణలోనే జరిగిన, జరుగుతున్న అత్యంత ప్రమాదకర పోకడలు.
ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్, యోగేంద్ర యాదవ్‌లు ప్రధానంగా 2024 పార్లమెంట్ ఎన్నికల నుంచి ఎన్నికల్లో జరుగుతున్న ఘోరాతి ఘోరమైన తప్పులను ఎత్తి చూపుతున్నారు. ప్రజలకు ఏ ప్రభుత్వం కావాలో ఎన్నుకునే స్వేచ్ఛ, అధికారం ప్రజలకు కాకుండా, తనకు ఓటర్లుగా ఎవరు ఉండాలో ప్రభుత్వమే నిర్ణయించుకునే విధంగా ఓటర్ల జాబితాలు తయారవుతున్నాయని పరకాల ప్రభాకర్ అనేక సందర్భాలలో ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రధానంగా ముస్లింలను టార్గెట్‌గా చేసుకొని లక్షల సంఖ్యలో వారి ఓట్లను తొలగించడం, తమకు మాత్రమే ఓటు చేస్తారనుకున్న వారి పేర్లను దొడ్డిదారిన ఓటర్ల లిస్టులో చేర్పించారనే ఆరోపణలున్నాయి.
కేంద్ర ఎన్నికల కమిషన్ భారతీయ జనతా పార్టీకి అనుబంధ విభాగంగా మారిపోయిందని అనేక విమర్శలు ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ పశ్చిమబెంగాల్, అస్సాం రాష్ట్రాలలో అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి దోహదపడ్డాయనే విమర్శలకు రానున్న కాలం సమాధానం చెప్తుంది.
ప్రజానుకూల పాలన ఆవశ్యకత..
నూతనంగా గద్దెనెక్కనున్న ప్రభుత్వాలు ప్రజాభిప్రాయం మేరకు, రాజ్యాంగం నిర్దేశించిన పద్ధతుల్లో ప్రజానుకూల పాలన సాగించాల్సిన అవసరం ఉంది. అందుకు ఆయా రాష్ట్రాల ప్రజలు సమాయత్తం కావాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
