అమెరికాలో అధికారంలో ఉన్న రిపబ్లికన్ పార్టీ సభ్యుల మధ్య విభేదాలతో హోంల్యాండ్ సెక్యూరిటీ, ఫిసా, వ్యవసాయ బిల్లులకు నిధుల కేటాయింపు మందకొడిగా సాగుతున్నది.
ఈ విషయంలో రిపబ్లికన్ పార్టీలో తీవ్రమైన విభేదాలు మళ్లీ బహిర్గతమయ్యాయి.
విదేశాల్లో నిఘా వ్యవస్థల నిర్వహణ, వ్యవసాయ బిల్లు, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీలకు నిధుల కేటాయింపులో వచ్చిన తగాదాల కారణంగా ప్రతినిధుల సభ పూర్తిగా నిలిచిపోయింది.
నిధుల కేటాయింపులో అమెరికన్ రిపబ్లికన్ పార్టీ నాయకులు, సభ్యుల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడంలో ట్రంప్ విఫలమయ్యారు.
ప్రతినిధుల సభలో రిపబ్లికన్ పార్టీకి ఉన్న స్వల్ప మెజారిటీ కారణంగా ఈ పరిస్థితి మరింత క్లిష్టమైంది.
ఈ సమస్యలను పరిష్కరించేందుకు మళ్లీ ట్రంప్ జోక్యం చేసుకోవాలని సభ్యులు కోరుతున్నారు.
వైట్ హౌస్ జోక్యం తప్పనిసరి..
“ఈ సమస్యలలో కొన్నింటినైనా పరిష్కరించుకోవడానికి, వైట్ హౌస్ జోక్యం తప్పనిసరి అవుతుంది” అని సెనేట్ మెజారిటీ లీడర్ జాన్ థ్యూన్ తెలిపారు.
హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగంపై వివాదం కొన్ని నెలలుగా కొనసాగుతోంది.
జాన్ థ్యూన్, ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ నాలుగు వారాల క్రితం, హోంల్యాండ్ సెక్యూరిటీకి సంబంధించిన ఎక్కువ భాగానికి నిధులను ముందుగా కేటాయించి, తరువాత వలసవాద చర్యలకు ప్రత్యేక బడ్జెట్ విధానంతో ఈ వసంతకాలం తరువాత నిధులు సమకూర్చాలని అంగీకరించారు.
ఈ రెండు దశల విధానానికి ట్రంప్ మద్దతు తెలిపారు. సెనేట్ వెంటనే రెండు పార్టీల మద్దతుతో డీహెచ్ఎస్ బిల్లును ఆమోదించింది.
కానీ ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ ఆ బిల్లుపై ఓటింగ్ నిర్వహించడానికి నిరాకరించారు.
జాన్ థ్యూన్ తాను జాన్సన్‌తో నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నానని, ముందుకు వెళ్లే మార్గం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
“అక్కడ ఉన్న సమస్యలను ట్రంప్ ఎదుర్కోవాలి. ఇక్కడ ఉన్న సమస్యలను మేము ఎదుర్కోవాలి” అని థ్యూన్ అన్నారు. “ఏదో ఒక దారిలో, ఈ సంస్థలకు నిధులు సమకూర్చాల్సిందే.”
హోంల్యాండ్ సెక్యూరిటీ నిధులపై అనిశ్చితి..
ట్రంప్ యంత్రాంగం ఇప్పటివరకు ఇతర నిధులను ఉపయోగించి డీహెచ్ఎస్ ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తోంది.
కానీ ఆ నిధులు వచ్చేవారం ముగిసే అవకాశముంది. చట్టసభ సభ్యులతో సంప్రదింపుల గురించి వ్యాఖ్యానించాలని కోరినప్పుడు వైట్ హౌస్ స్పందించలేదు.
ఒక మెమోలో ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్.. “కాంగ్రెస్ వెంటనే డీహెచ్ఎస్, దాని ముఖ్య కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం అత్యవసరం” అని పేర్కొంది.
గడువు సమీపిస్తుండగా, సోమవారం మైక్ జాన్సన్ సెనేట్ ఆమోదించిన డీహెచ్ఎస్ బిల్లులో “సమస్యాత్మకమైన పదజాలం” ఉందని చెప్పారు.
దానిని ఆమోదించే ముందు ప్రతినిధుల సభలో మార్పులు చేయాల్సి ఉంటుందని తెలిపారు.
దీంతో యునైటెడ్ స్టేట్స్ కోస్ట్ గార్డ్ నుంచి ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ వరకు వివిధ సంస్థలకు నిధులు ఎప్పుడు ఆమోదం పొందుతాయన్న విషయంలో మరింత అనిశ్చితి ఏర్పడింది.
“స్పీకర్ మైక్ జాన్సన్ ‘అవును’ ఈ బిల్లును ఎందుకు ముందుకు తీసుకురాలేకపోతున్నారో నాకు అర్థం కావడం లేదు” అని కాలిఫోర్నియాకు చెందిన డెమోక్రాట్ ప్రతినిధి పీట్ అగ్యిలార్ అన్నారు.
ప్రతినిధుల సభలోని అనేకమంది రిపబ్లికన్ పార్టీ సభ్యులు, డీహెచ్ఎస్ విషయంలో పార్టీ నాయకులు అంగీకరించిన రెండు దశల విధానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో మిన్నెసోటాలో, ఇద్దరు అమెరికా పౌరులు ఇమ్మిగ్రేషన్ అధికారుల చర్యల వలన మరణించిన తర్వాత, అటువంటి చర్యలకు నిధులు కల్పించే ఏ ప్యాకేజీకి తాము ఓట్లు ఇవ్వబోమని డెమోక్రాట్లు స్పష్టంగా చెప్పారు.
గూఢచర్య చట్టం(ఎఫ్ఐఎస్ఏ) పొడిగింపుపై రగడ..
ఈ వారంలో రిపబ్లికన్ల మధ్య తీవ్రంగా జరిగిన వివాదాల్లో ఒకటి, గూఢచర్య అధికారాలను మరో మూడు సంవత్సరాలు పొడిగించే బిల్లు. ఈ నేపథ్యంలో, స్పీకర్ మైక్ జాన్సన్ తన పార్టీలోని తిరుగుబాటును అదుపులో పెట్టడానికి ప్రయత్నిస్తుండగా, ప్రతినిధుల సభ- సెనేట్ రెండింటిలోనూ ఓట్ల ప్రక్రియను వాయిదా వేయాల్సి వచ్చింది.
కొంతమంది రిపబ్లికన్ సభ్యులు మార్పులు లేకుండా ఈ బిల్లును ఆమోదించడానికి నిరాకరించారు. ఈ కార్యక్రమం ముగిసే లోపు, బిల్లును ఆమోదించాలని ట్రంప్ చేసిన విజ్ఞప్తిని కూడా పట్టించుకోలేదు.
ట్రంప్‌తో పాటు కాంగ్రెస్‌లోని ఆయన పార్టీ నాయకులు, ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వైలెన్స్ యాక్ట్‌లోని సెక్షన్ 702ను పొడిగించాలనే ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
ఈ బిల్లు ద్వారా, విదేశాల్లో ఉన్న వ్యక్తులు అమెరికా కమ్యూనికేషన్ వ్యవస్థలను ఉపయోగిస్తున్నప్పుడు, అలాంటి సమాచారాన్ని ప్రభుత్వం సేకరించడానికి అనుమతిస్తుంది.
అలాగే, వారితో సంబంధం పెట్టుకునే అమెరికన్లపై కూడా వారెంట్ లేకుండా సమాచారం సేకరించడానికి ఇది వీలు కల్పిస్తుంది.
ఇది వ్యక్తిగత సమాచార పరిరక్షకులు, రెండు పార్టీలకు చెందిన కొంతమంది చట్టసభ్యుల మధ్య వివాదానికి కారణమైంది.
ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నాయకులు ఈ బిల్లులను పొడిగించేందుకు చేసిన ప్రయత్నాలు ఇప్పటివరకు విజయవంతం కాలేదు.
ప్రస్తుతం తాజా ప్రతిపాదనలతో ప్రవేశపెట్టిన ఎఫ్ఐఎస్ఏ బిల్లును ప్రతినిధుల సభ రూల్స్ కమిటీ పరిశీలిస్తున్నది. అమెరికన్లపై సేకరించిన డేటాను పరిశీలించడానికి వారెంట్ తప్పనిసరి చేయాలని కొంతమంది చట్ట సభ్యులు కోరుతున్నారు.
“మనమందరం అమెరికా రాజ్యాంగంలోని నాలుగో సవరణను రక్షించేందుకు నిలబడాలి” అని టెక్సాస్‌కు చెందిన రిపబ్లికన్, కన్జర్వేటివ్ ఫ్రీడమ్ కాకస్ సభ్యుడు చిప్ రాయ్ అన్నారు. నాలుగో సవరణ అన్యాయమైన శోధనలు, స్వాధీనం చేసుకోవడంపై రక్షణ కల్పిస్తుంది.
వ్యవసాయ బిల్లు (ఫార్మ్ బిల్) వివాదం..
ఫార్మ్ బిల్: ఇది రైతులకు, ఆహార కొరత నిర్మూలన కార్యక్రమాలకు సంబంధించిన ఐదేళ్ల బడ్జెట్. ఈ బిల్లుపై ప్రధాన వివాదం, పురుగుమందులు తయారు చేసే కంపెనీలను కోర్టు కేసుల నుంచి రక్షించాలా లేదా అన్న దానిపై కేంద్రీకృతమైంది.
ఈ రక్షణ నిబంధనకు “మేక్ అమెరికా హెల్తీ అగైన్” ఉద్యమానికి చెందిన కార్యకర్తలు వ్యతిరేకంగా ఉన్నారు. వారు ఈ నిబంధనను ఒక అప్రోప్రియేషన్స్ బిల్లులో నుంచి తొలగించడానికి విజయవంతంగా ఒత్తిడి తెచ్చారు.
అనువాదం: జె నాగేశ్వర రావు
వాల్ స్ట్రీట్ జర్నల్ సౌజన్యంతో ఈ వ్యాసాన్ని ది వైర్ తెలుగు పాఠకులకు అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
