‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ అనే డ్రామా సిరీస్ చివరి సీజన్లో, అధికారం అనేది వంశపారంపర్యం వలన, శక్తివంతమైన సైన్యం వలన లేదా గొప్ప సంపద వలన రాదని, అది ఒక ఆకట్టుకునే కథ ద్వారా వస్తుందని ‘టైరియన్ లానిస్టర్’ వాదిస్తారు.
‘బ్రాన్ స్టార్క్’ను రాజుగా ప్రతిపాదిస్తూ, “అంగవైకల్యుడైన ‘బ్రాన్ ది బ్రోకెన్’ కంటే గొప్ప కథ ఎవరి దగ్గర ఉంది?” అంటూ అతను ప్రశ్నిస్తారు.
భారత వామపక్షాల పతనంపై కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో ఇటీవల రాసిన వ్యాసం కూడా ఇలాంటి వాదనే చేస్తున్నట్టు కనిపిస్తోంది.
మారుతున్న భారతదేశానికి కావలసిన కొత్త ‘పదజాలాన్ని’ కనుగొనడంలో భారత వామపక్షాలు విఫలమయ్యాయని ఆయన వాదిస్తున్నారు.
వ్యక్తిగత ఆకాంక్షలు, వినియోగదారుల ప్రాధాన్యత పెరిగిన ప్రస్తుత సమాజంలో- వర్గం, వర్గ పోరాటం, పెట్టుబడిదారీ వ్యతిరేకత వంటి పాత భాష ఇక ముందు ప్రజలను ఏమాత్రం ఆకట్టుకోవటం లేదు.
భారత వామపక్షం సంక్షోభంలో ఉన్నదనే విషయం కాదనలేనిది.
ఒకప్పుడు జాతీయంగా రాజకీయ ఎజెండాను నిర్దేశించి, జాతీయ చర్చలను తీర్చిదిద్దిన కమ్యూనిస్ట్ ఉద్యమం, ఎన్నికల పరంగా బాగా వెనుకబడిపోయింది.
పశ్చిమ బెంగాల్ చేజారిపోయింది. అదే విధంగా త్రిపుర చేజారిపోయింది. కేరళలో కూడా కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది.
వయసు మళ్లిన నాయకత్వం, బలహీనపడిన కార్యకర్తలు, పట్టున్న సాంప్రదాయ ప్రాంతాలకు మించి విస్తరించలేకపోవడం వంటివి విస్మరించలేని కీలక వైఫల్యాలు.
కొత్త పదజాల లేమి కాదు.. అసలు కారణం సరళీకరణ విధానాలే..
అయితే ఈ సంక్షోభంపై థరూర్ చేసిన విశ్లేషణ, భారతదేశంలోని నిర్మాణాత్మకంగా జరిగిన మార్పును, రాజకీయ భాషా సమస్యగా పొరబడ్డారు.
అసలు సమస్య వామపక్షాలు కొత్త పదజాలాన్ని సృష్టించడంలో విఫలమవడంలో మాత్రమే లేదు, అసలు సమస్య ప్రస్తుత పరిస్థితులను పూర్తిగా మార్చివేసి, ప్రజల అనుభవంలోకి నూతన రాజకీయాలను- కొత్త ఆకాంక్షలను తీసుకువచ్చిన సరళీకరణ విధానాలకు సంబంధించినది.
థరూర్ స్వయంగా ఉదహరించిన ఉదాహరణనే పరిశీలిస్తే, గుర్గావ్లోని ఒక యువ కంప్యూటర్ నిపుణుడు, కోల్‌కతాలోని ఒక డెలివరీ గిగ్-వర్కర్, వీరిద్దరూ తమ ఆశయాలకు వామపక్ష భావజాలం ఒక అడ్డంకిగానే భావిస్తున్నారు.
ప్రపంచ అసమానతల ప్రయోగశాల నిర్వహించిన అధ్యయనం ప్రకారం, భారతదేశంలోని అగ్రశ్రేణి 1 శాతం మంది జాతీయ సంపదలో 40 శాతం వాటాను అనుభవిస్తుండగా, దిగువన ఉన్న 50 శాతం ప్రజలు జాతీయ ఆదాయంలో 15 శాతం మాత్రమే పొందుతున్నారు.
గిగ్ ప్లాట్‌ఫారమ్‌లు: కనుమరుగవుతున్న కార్మిక హక్కులు..
ఫెయిర్‌వర్క్ ఇండియా నివేదిక- 2024, 11 ప్రధాన గిగ్ ప్లాట్‌ఫారమ్‌లను అధ్యయనం చేసింది. వేతనాల్లో కోత పెట్టటం, ఏకపక్షంగా విధుల్లోంచి తీసివేయడం, సామాజిక భద్రత లేకపోవడం, ప్రమాద బీమా లేకపోవడం వంటి ప్రాథమిక కార్మిక ప్రమాణాల విషయంలో ఒక్క కంపెనీ కూడా 10కి ఆరు కంటే ఎక్కువ స్కోర్ చేయలేదని ఈ నివేదిక తెలిపింది.
భారతదేశ సామాజిక భద్రతా నియమావళి గిగ్ వర్కర్లను గుర్తిస్తుంది. కానీ సంక్షేమ సదుపాయాల కల్పనను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణకు వదిలివేస్తుంది.
ఈ చట్టం వారికి ఎటువంటి రక్షణ హక్కులను కల్పించదు. దీనికి సంబంధించి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి పథకం తీసుకురాలేదు.
లక్షలాది మంది సామాజిక భద్రత, నిర్ణీత పని గంటలు, ఆరోగ్య సంరక్షణ లేకుండా పనిచేస్తున్నారు. యాప్ ఆధారిత కార్మిక విధానం, కార్మికులను సామూహికంగా సంఘటితం కాకుండా, ఎక్కువ ఆర్డర్ల కోసం ఒకరితో ఒకరు పోటీపడే వివిధ భాగాలుగా విడగొట్టింది.
అంతరించిపోని దోపిడీ వ్యవస్థ – వ్యక్తిగతీకరించబడిన అభద్రత..
1991 తర్వాత భారతదేశంలో దోపిడీ అంతరించిపోలేదు. ఇది వ్యక్తిగతీకరించబడి, విపరీతంగా పెరిగి ఒక సాధారణమైన విషయంగా ప్రజలు అనుకునే విధంగా మారింది.
కొన్ని దశాబ్దాల క్రితం, కర్మాగారాలు, మిల్లులు, పొలాలు, ఇతర పని ప్రదేశాలలో కార్మిక సంఘాలతో కలిసి సామూహికంగా దోపిడీని ఎదుర్కొనే వారు.
నేడు కార్మికులు తరచుగా ఈ అభద్రతను, దోపిడీని, అణచివేతను ఒంటరిగా ఎదుర్కొంటున్నారు. గిగ్-వర్కర్ల ఆకాంక్షలు, వారిపై జరుగుతున్న వ్యవస్థాగత దోపిడీ పరస్పర విరుద్ధమైనవి కావు.
వారు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించవచ్చు. కానీ కేవలం వారి ఆకాంక్ష మాత్రమే వర్గ వాస్తవికతను మార్చదు.
వ్యవస్థ చట్రంలో చిక్కుకుపోయిన కార్మికులుగా కాకుండా, తమను తాము విజయం వైపు పయనిస్తున్న తాత్కాలిక పారిశ్రామికవేత్తలుగా చూసుకునేలా శ్రామిక వర్గాన్ని ఒప్పించడం ద్వారా నయా ఉదారవాదం విజయం సాధించింది. సరళీకరణ తర్వాత భారతదేశం వర్గరహిత దేశంగా ఏమీ మారలేదు.
క్షీణించిన సామూహిక వర్గ చైతన్యం..
వర్గం అనేక భాగాలుగా విభజించబడటం వలన, దాని ఉనికి ప్రస్ఫుటంగా కనిపించటం లేదు. వర్గ రాజకీయాలు బలహీనపడటమే, వర్గం తన ప్రాసంగికతను కోల్పోయిందనడానికి థరూర్ సాక్ష్యంగా చూపిస్తున్నారు. సామూహిక వర్గ చైతన్యం క్షీణించడం అంటే దోపిడీ అంతమైపోయినట్లు కాదు.
ప్రైవేట్ రంగ సంస్థలు, స్టార్టప్ సంస్కృతి అద్భుత విజయం సాధించాయని చెబుతున్నప్పటికీ, లక్షలాది మంది భారతీయులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎందుకు తీవ్రంగా ఆరాటపడుతున్నారు?
దీనికి సమాధానం ఏమిటంటే, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పటికీ స్థిరత్వం, చట్టపరమైన రక్షణ, స్థిరమైన ఆదాయం, సామాజిక గౌరవాన్ని ఇస్తుంది.
కానీ ఇవి ఏవీ కూడా ఎంత పెద్ద ప్రైవేట్ రంగ సంస్థలో కూడా దొరకవు.
ప్రభుత్వ ఉద్యోగాల మీద ప్రజలకు ఉన్న ఆశ, సరళీకృత వృద్ధి ఎడల వారికి ఉన్న ఆందోళనను, భయాలను బయటపెడుతుంది.
సంక్షేమ రాజకీయాలపై వామపక్షాలకు ఇకపై గుత్తాధిపత్యం లేదనే విషయంలో థరూర్ చెప్పింది సరైనదే కావచ్చు. సంక్షేమ పథకాలను ఇప్పుడు అన్ని రాజకీయ వర్గాలు అంగీకరించాయి.
అయితే సంపద పంపిణీ, సామాజిక పరివర్తన అనే విస్తృత రాజకీయాలలో, సమకాలీన సంక్షేమ రాజ్యాన్ని వామపక్షాలు చారిత్రాత్మకంగా తాత్కాలిక ఉపశమనం కలిగించే ఒక చర్యగానే చూశాయి.
ప్రజారోగ్య అభివృద్ధి కొరకు మౌలిక సదుపాయాలపై దశాబ్దాలుగా చేసిన పెట్టుబడులకు ప్రత్యక్ష నగదు బదిలీ ప్రత్యామ్నాయం కానే కాదు.
పేదరికం నుంచి విముక్తి చేసిన వామపక్షాలు..
వామపక్షాల నాయకత్వంలో కేరళ, 1970లలో 60% పేదరికం ఉన్న స్థితి నుంచి 2025 నాటికి తీవ్ర పేదరికం నుంచి విముక్తి పొందిన రాష్ట్రంగా ప్రకటించబడింది.
అది కే-ఫాన్(Kerala Fiber Optic Network – K-FON)ను ఏర్పాటు చేసి, ఇంటర్నెట్ సదుపాయాన్ని ప్రాథమిక హక్కుగా ప్రకటించిన భారతదేశంలోని మొదటి రాష్ట్రంగా కేరళను నిలిపింది.
అది 20 లక్షల దారిద్య్రరేఖకు దిగువన ఉన్న(బీపీఎల్) కుటుంబాలకు ఉచిత ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించింది. 45,000 ప్రభుత్వ పాఠశాల తరగతి గదులను హై-టెక్ లెర్నింగ్ సెంటర్లుగా మార్చింది. ఈ విధానాలు ఒక చారిత్రాత్మక మార్పుకు శ్రీకారం చుట్టాయి.
విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి తిరిగి ప్రభుత్వ పాఠశాలలకు మారడం ప్రారంభించారు.
కేరళ రాష్ట్రంలోని వామపక్షం రెండు విపత్కరమైన వరదలను, నిపా వైరస్ వ్యాప్తిని, కోవిడ్ అనే ఒక ప్రపంచ మహమ్మారిని ఎదుర్కొని తిరిగి ఎన్నికలలో విజయం సాధించింది.
వామపక్షాలు అస్తిత్వ రాజకీయాలకు బలి అయ్యాయని థరూర్ అంగీకరిస్తున్నారు. వర్గ ఐక్యతకు నష్టం కలిగించే కుల, మత సమీకరణలు పెరిగాయని ఆయన అంటారు.
అయితే దీనికి కారణాలు ఏమిటో తెలుపకుండా, ఆయన దీనిని రాజకీయ మార్పులో ఒక భాగంగా పరిగణిస్తున్నట్టు కనిపిస్తుంది.
నయా ఉదారవాద నేపథ్యంలో తీవ్రమైన అస్తిత్వ రాజకీయాలు..
1991 తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ అమలు పరిచిన నయా ఉదారవాదం నేపథ్యంలో గుర్తింపు(అస్తిత్వ) రాజకీయాలు తీవ్రమయ్యాయి. ఇది సంఘటిత కార్మిక శక్తిని విచ్ఛిన్నం చేసింది.
శ్రామిక వర్గాన్ని బలహీనపరిచింది. భౌతికంగా ఐక్యతను నిలబెట్టుకోవడం కష్టతరం చేసే పరిస్థితులను సృష్టించింది. ఆ కారణంగా సమూహ గుర్తింపు ఒక అవసరంగా మారింది.
ఆ సామాజిక అవసరం తీర్చటం కోసమే అస్తిత్వ, మత రాజకీయాలు ముందుకు వచ్చాయి. వారి ఆర్థికపరమైన ఆందోళనలు జాతీయవాదం పేరుతో, మెజారిటేరియన్ మత రాజకీయాల ద్వారా వ్యక్తమయ్యాయి.
దీనికి అసలు కారణమైన ఆర్థిక విధానాల పేరును ప్రస్తావించకుండానే, థరూర్ ఈ ప్రక్రియ వలన జరిగిన రాజకీయ పరిణామాలను మనకు తెలియజేస్తున్నారు.
కార్పొరేట్ ఎన్నికల యుగం: ఆశ్రిత పక్షపాత ప్రచారాల ప్రభావం..
వామపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలు ‘నూతన భారతదేశాన్ని’ వెంటాడుతూనే ఉంటాయని కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ అంటున్నారు.
ఆ ప్రశ్నల చుట్టూ తిరిగే రాజకీయాలు ఏ పరిస్థితులలో తిరిగి ప్రజల ఆదరణ పొందగలవు? దీనికి సమాధానం ఆయన అంటున్నట్టుగా వామపక్ష పదజాలంతో ముడిపడి లేదు. అది రాజకీయ సమీకరణ జరిగే పరిస్థితులతో ఎక్కువ సంబంధం కలిగి ఉంటుంది.
ప్రస్తుతం భారత ఎన్నికల రంగం ధనబలం, గుత్తాధిపత్యం కలిగిన కార్పొరేట్ మీడియా, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ఆంక్షల మధ్య కొనసాగుతోంది.
థరూర్ వ్యాసంలో, భారతదేశంలో ప్రజాస్వామ్యంలో రావలసిన మార్పుకు సంబంధించి ఎటువంటి చర్చ లేదు.
సమకాలీన ఎన్నికల రాజకీయాలు ఇప్పుడు భారీ ఆర్థిక వనరులు, కార్పొరేట్ మద్దతు ఉన్న మీడియా ప్రచారంతో పాటు ఆశ్రిత పక్షపాత ప్రచారాల ద్వారా నడుస్తున్నాయి.
2024 లోక్‌సభ ఎన్నికలలో సుమారు రూ 1.35 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు సీఎంఎస్(Center for Media Studies) నివేదించింది.
పెట్టుబడి మద్దతు ఉన్న పార్టీలకు ప్రచారం లభిస్తుంది. తద్వారా ఎన్నికల ప్రచారంలో అగ్రభాగాన నిలిచి పోటీలో ముందు ఉంటారు. వామపక్షాల వంటి కార్యకర్తల మీద ఆధారపడిన పార్టీలు ఇటువంటి వాతావరణంలో నష్టపోతాయి.
కమ్యూనిస్టుల ఎన్నికల అపజయం, వారిని సైద్ధాంతిక అప్రస్తుతంగా పరిగణించిన సాంప్రదాయ ఉదారవాద విశ్లేషణలోని పరిమితులను థరూర్ వ్యాసం వెల్లడిస్తుంది.
దశాబ్దకాలంగా కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేకత, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక దిగ్బంధం, కార్పొరేట్ మద్దతు లేని పార్టీలను నిర్వీర్యం చేసే రాజకీయ ఆర్థిక విధానాల వల్ల ఏర్పడిన వామపక్షాల ఎన్నికల ఓటమి ఒక సైద్ధాంతిక తీర్పు కాదు.
భారత కమ్యూనిజంపై సూర్యుడు అస్తమించలేదు. ఎవరి కథ గొప్పది అని కాదు— ఎవరు మెరుగైన ప్రపంచాన్ని నిర్మించారు, ఎవరు నిర్మించగలరు అని అడగవలసిన ప్రశ్న.
వామపక్ష పార్టీల పతనం వాస్తవమే కావచ్చు. కానీ దీనికి కారణమైన వైరుధ్యాలు భారత సమాజంలో చాలా లోతుగా, సజీవంగా ఉన్నాయి. కాంగ్రెస్ నాయకుడి ఎంతటి సుందరమైన పదవిన్యాసం కూడా ఆ వైరుధ్యాలను మాయం చేయలేదు.
వ్యాస రచయిత ఢిల్లీ విశ్వవిద్యాలయం, రాజనీతి శాస్త్ర విభాగంలో విద్యార్థి. రచయిత అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతమైనవి.
అనువాదం: పి రామ కోటేశ్వరరావు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
