న్యూఢిల్లీ: 30% వరకు ఇథనాల్ కలిపిన పెట్రోల్‌కు కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రమాణాలను జారీ చేసింది.
అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ కారణంగా పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఇంధన సంక్షోభం నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.
ఒక కొత్త నోటిఫికేషన్లో, ప్రభుత్వం E20 కార్యక్రమాన్ని దాటి ముందుకు వెళ్లిందని, వరుసగా 22%, 25%, 27%, 30% ఇథనాల్‌తో కలిపిన పెట్రోల్‌ను సూచించే E22, E25, E27, E30 ఇంధన మిశ్రమాల కోసం ప్రమాణాలను నోటిఫై చేసిందని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సూచించింది.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు – ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి..
మింట్ కథనం ప్రకారం, మే 18 నాటి కొత్త నోటిఫికేషన్లో ప్రభుత్వం E20 కార్యక్రమంతో మరింత ముందుకు వెళ్లడానికి సిద్ధమవుతోందని బీఐఎస్ సూచించింది.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు భారతదేశ ఇంధన భద్రతా ఆందోళనలను పెంచాయి.
ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20% ప్రయాణించే హోర్ముజ్ జలసంధి దిగ్బంధనానికి గురయ్యే ముప్పు పొంచివుండటం, ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో సహా ప్రత్యామ్నాయ చర్యలపై ఆధారపడేలా ప్రభుత్వాన్ని ప్రేరేపించింది.
కొత్త ప్రమాణాలు: E22 నుంచి E30 వరకు..
BIS.. E22, E25, E27, E30 ఇంధన మిశ్రమాల కోసం ప్రమాణాలను నోటిఫై చేసింది. ఇవి వరుసగా 22%, 25%, 27%, 30% ఇథనాల్‌తో కలిపిన పెట్రోల్‌ను సూచిస్తాయి.
అయితే, ఈ నోటిఫికేషన్ కేవలం అటువంటి మిశ్రమాల విపణికి అవసరమైన సాంకేతిక ప్రమాణాలను మాత్రమే నిర్దేశిస్తుంది.
దీని అర్థం, దేశవ్యాప్తంగా E30 ఇంధనం అమ్మకాలను తక్షణమే తప్పనిసరి చేశారని కాదు.
వాహనాల ఇంజిన్లపై ప్రభావం – కేంద్ర మంత్రి భరోసా..
గత కొన్నేళ్లుగా ప్రభుత్వం E20 ఇంధనాన్ని విస్తృతంగా ప్రోత్సహిస్తున్నప్పటికీ, ఇది ఇంధన నాణ్యతను ప్రభావితం చేస్తుందని, పాత వాహనాల ఇంజిన్లపై ప్రభావం చూపుతుందని, తద్వారా యజమానులకు నిర్వహణ ఖర్చులు పెరుగుతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఈ చర్యను సమర్థిస్తూ, కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గత సంవత్సరం మాట్లాడుతూ- E20 ప్రాథమిక ఇంధనంగా మారినప్పటి నుంచి ఇంజన్ వైఫల్యం లేదా బ్రేక్‌డౌన్ కేసులు ఏవీ నమోదు కాలేదని స్పష్టం చేశారు.
బ్రెజిల్ ఉదాహరణను ఉటంకిస్తూ, ఆ దేశం ఎటువంటి సమస్యలు లేకుండా సంవత్సరాలుగా E27తో నడుస్తోందని ఆయన గుర్తుచేశారు.
సిద్ధంగా ఉన్న పరిశ్రమలు, వాహన తయారీదారులు..
మరోవైపు, దేశంలో ఇథనాల్ తగినంతగా అందుబాటులో ఉందని, ఇది చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని పేర్కొంటూ, పరిశ్రమల సంఘాలతోపాటు జీవ ఇంధన తయారీదారులు E22, అంతకంటే అధిక మిశ్రమాలకు మారాలని తమ పిలుపులను తీవ్రతరం చేశాయి.
“ప్రభుత్వం దీనిని అమలు చేయాలని నిర్ణయించి, ఇది అందరికీ ప్రామాణిక అవసరంగా మారితే, మేము కచ్చితంగా పాటిస్తాము. దీనిని పాటించే సామర్థ్యం మాకు ఉంది” అని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ ఆర్సీ భార్గవ వార్తాపత్రికకు తెలిపారు.
ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల ప్రోత్సాహం, నిపుణుల హెచ్చరికలు..
మింట్ మరో కథనం ప్రకారం, ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి- E85, E100 వంటి అధిక ఇథనాల్ కలిగిన ఇంధనాల ధరలను తగ్గించాలని భారత వాహన తయారీదారులు ఇప్పుడు ప్రభుత్వాన్ని కోరారు.
ధరలను గణనీయంగా తగ్గించకపోతే, వినియోగదారులు వాటిని స్వీకరించే అవకాశం లేదని వారు అంటున్నారు.
ఇంధన భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో, ఆటోమొబైల్ పరిశ్రమ పన్నుల ఉపశమనం కూడా కోరుతోంది.
బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం, ముఖ్యంగా విభిన్న వాతావరణాలు, నిర్వహణ పరిస్థితులు ఉన్న ప్రాంతాలలో, E20ని దాటి ముందుకు వెళ్లాలంటే ఇంధన లభ్యత, వాహన అనుకూలత ప్రమాణాలు, పంపిణీ మౌలిక సదుపాయాల మధ్య కచ్చితమైన సమన్వయం అవసరమవుతుందని కొంతమంది నిపుణులు హెచ్చరించారు.
పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని E20 కంటే ఎక్కువ స్థాయికి పెంచాలని భారతదేశం కోరుకుంటే, దేశం చక్కెర ఎగుమతులను నిషేధించాల్సి రావచ్చని గతంలో నిపుణులు విశ్లేషించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
