సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం, నివాస గృహాలను కూల్చివేయడానికి ముందు అధికారులు తప్పనిసరిగా 15 రోజుల ముందు షోకాజ్ నోటీసును జారీ చేయాలి.
దానిని రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించడంతో పాటు, కూల్చివేత జాబితాలో ఉన్న ఆస్తిపై ఆ నోటీసును అతికించాలి.
ఈ నిబంధనలను పాటించకుండా ఇళ్లను కూల్చివేయడాన్ని అత్యున్నత న్యాయస్థానం నిషేధించింది.
శ్రీనగర్: బుల్డోజర్ కూల్చివేతలు “చట్టవిరుద్ధమైన, కనికరం లేని రాజ్య వ్యవహార శైలిని” ప్రతిబింబిస్తున్నాయని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ, మంగళవారం(మే 19న) జమ్మూకశ్మీర్ యంత్రాంగం చేపట్టిన “ఆక్రమణల తొలగింపు” డ్రైవ్ కారణంగా జమ్మూలో అనేక గిరిజన కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి.
జమ్మూలో ఆక్రమిత స్థలాలలో కశ్మీరీలు, “ఒక వర్గం”(గుజ్జర్లు) ఇళ్లు నిర్మించుకున్నారని, వాటిని కూల్చివేస్తామని సీనియర్ బీజేపీ నాయకుడు, జమ్మూ బహు నియోజకవర్గ ఎమ్మెల్యే విక్రమ్ రంధావా బెదిరించిన కొద్ది రోజులకే ఈ కూల్చివేతలు జరగడం గమనార్హం.
మరోవైపు, జమ్మూలోని మండల తహసీల్ పరిధిలోని చక్ గణేషు గ్రామంలో ఎనిమిది కనాల్‌ల భూమిని (ఖస్రా నెం. 211) ఆక్రమించి స్టోన్ క్రషర్‌ను ఏర్పాటు చేశారని రంధావా స్వయంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
అయితే, ఈ అంశం కోర్టు పరిధిలో (సబ్ జ్యుడిస్) ఉందని చెబుతూ ఆయన ఈ ఆరోపణలను కొట్టిపారేశారు.
బీజేపీ ప్రభుత్వానిది విభజించి పాలించే కుట్ర: జావేద్ అహ్మద్ రాణా..
దీనిపై జమ్మూకశ్మీర్ అటవీ శాఖ మంత్రి, సీనియర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు జావేద్ అహ్మద్ రాణా తీవ్రంగా స్పందించారు.
ఈ కూల్చివేతలకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. జమ్మూకశ్మీర్ ప్రజలను మతం ఆధారంగా చీల్చడానికి ఇది ఒక “ముందస్తు కుట్ర” అని అభివర్ణించారు.
బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం రాణా విలేకరులతో మాట్లాడుతూ, “ఇలాంటి నగ్న నృత్యాన్ని(బరితెగింపును) నేను మొదటిసారి చూస్తున్నాను. మన ప్రజాస్వామ్య దేశంలో జమ్మూకశ్మీర్ మత సామరస్యాన్ని దెబ్బతీయాలనుకునే కొన్ని నల్ల గొర్రెలు ఉండటం విచారకరం. ‘విభజించి పాలించు’ అన్నదే కేంద్ర ప్రభుత్వ విధానం. ఈ చర్యకు బాధ్యులైన వారిని కచ్చితంగా శిక్షిస్తాం” అని అన్నారు.
మంగళవారం తెల్లవారుజామున, భారీ సంఖ్యలో పోలీసు, పారామిలటరీ బలగాలు బుల్డోజర్లతో జమ్మూలోని సిద్రా ప్రాంతంలో ముస్లిం గుజ్జార్ వర్గానికి చెందిన గిరిజన కుటుంబాలు నివసిస్తున్న ప్రాంతాన్ని చుట్టుముట్టినట్లు పలు కథనాలు తెలిపాయి.
జమ్మూకశ్మీర్ శీతాకాల రాజధానిలో 95% భూమిని కశ్మీరీలు, “ఒక వర్గం” ఆక్రమించుకున్నారని రంధావా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గత వారం జమ్మూలో గుజ్జార్ వర్గం ఆందోళన చేపట్టింది.
మంగళవారం కూల్చివేతలు జరిగిన ప్రాంతం జమ్మూలోని దిగువ శివాలిక్ పర్వత శ్రేణికి చెందిన రైకా అటవీ ప్రాంతంలో భాగంగా ఉంది.
ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన 20-30 నిర్మాణాలు (వాటిలో కొన్ని నివాస గృహాలు) ఉన్నాయని, వాటిని కూల్చివేసి 60 కనాల్‌ల భూమిని స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.
అయితే, బాధిత కుటుంబాలు దాదాపు ఐదు దశాబ్దాలుగా ఇక్కడే నివసిస్తున్నాయని చెబుతూ మంత్రి రాణాతో పాటు స్థానికులు అధికారుల వాదనను త్రోసిపుచ్చారు.
తమ ఇళ్లను కూల్చివేసే ముందు అధికారులు తప్పనిసరిగా పాటించాల్సిన చట్టపరమైన మార్గదర్శకాలను పాటించలేదని, దీనివల్ల తాము రోడ్డున పడ్డామని స్థానికులు ఆరోపించారు.
గమనించాల్సిందేంటే, కశ్మీరీలు భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్న జే&కే బీజేపీ ఎమ్మెల్యేకే భూ ఆక్రమణ ఆరోపణలపై 2021లో నోటీసులు జారీ అయ్యాయి.
కన్నీరు పెట్టిస్తున్న స్థానికుల ఆవేదన..
ఒకప్పుడు ఇళ్లు ఉన్న చోట ఇప్పుడు శిథిలాల దిబ్బలు దర్శనమిస్తున్న దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి.
మంగళవారం ఉదయం బుల్డోజర్లు పని ప్రారంభించక ముందే, ప్రాణభయంతో తాము కాపాడుకోగలిగిన కొద్దిపాటి వస్తువులకు కాపలాగా కూర్చున్న బాధితుల దృశ్యాలు కలచివేస్తున్నాయి.
“మా కూతురి పెళ్లి త్వరలోనే జరగాల్సి ఉంది. ఆమె కోసం తెచ్చిన కట్నకానుకలన్నీ ఇంట్లోనే ఉన్నాయి. నేను అప్పుడు నమాజ్ చేసుకుంటున్నాను. వారు ఇంట్లోని వస్తువులన్నింటినీ ధ్వంసం చేశారు. సోఫా, అల్మారాతో సహా ప్రతిదీ కూల్చేశారు. మేమేమీ బయటివాళ్లం కాదు. దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నాం. ఇప్పుడు మేం ఎక్కడికి వెళ్లాలి?” అని ఇల్లు కోల్పోయిన ఓ మహిళ కన్నీరుమున్నీరయ్యారు.
ప్రభుత్వ స్థలంలో కొత్తగా ఇళ్లు కట్టారన్న అధికారుల ఆరోపణలపై మరో బాధిత మహిళ స్పందిస్తూ, 1947లో అక్కడ మూడు ఇళ్లు మాత్రమే ఉండేవన్న మాట వాస్తవమేనని అంగీకరించారు.
“1947 తర్వాత ప్రపంచం ఎంతో మారిపోయింది. ఆ మూడు కుటుంబాల జనాభా పెరగకూడదా? మాకు చట్టబద్ధమైన నీటి, విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అయినా కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా మా ఇళ్లు కూల్చేశారు. ఇది ముమ్మాటికీ అన్యాయం” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ప్రాంతంలో మొదట “కొన్ని నిర్మాణాలు మాత్రమే ఉండేవని”, “కొత్త నిర్మాణాలు కొనసాగుతూనే అనేక అక్రమ నిర్మాణాలు వెలిశాయి” అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అధికారి చెప్పినట్లు ఒక వార్తా కథనం పేర్కొంది.
ఈ కూల్చివేతల అంశం అధికార నేషనల్ కాన్ఫరెన్స్, ప్రతిపక్ష బీజేపీల మధ్య రాజకీయ దుమారానికి దారితీసే అవకాశం ఉంది.
రానున్న రోజుల్లో హిందూ ప్రాబల్యం ఉన్న జమ్మూ ప్రాంతానికి, ముస్లిం మెజారిటీ ఉన్న కశ్మీర్‌కు మధ్య విభేదాలను ఇది మరింత పెంచవచ్చని భావిస్తున్నారు.
న్యాయ విచారణ జరిపించాలి: జే&కే ఆర్టీఐ ఉద్యమం..
ఇదిలా ఉండగా, గిరిజన సంఘాలు, పౌర సమాజ కార్యకర్తల సంకీర్ణ వేదికైన ‘జే&కే ఆర్టీఐ ఉద్యమం’ ఈ కూల్చివేతలను తీవ్రంగా ఖండించింది.
ఇది “మానవ ఆత్మగౌరవం, రాజ్యాంగ హక్కులు, అటవీ హక్కుల చట్టం-2006 కింద కల్పించిన న్యాయపరమైన హామీలపై జరిగిన క్రూరమైన దాడి” అని అభివర్ణించింది.
“సరైన న్యాయ ప్రక్రియ పాటించకుండా, పునరావాసం కల్పించకుండా, ఎలాంటి కనికరం లేకుండా కుటుంబాలను రోడ్డున పడేశారు. కనీసం పవిత్ర ఖురాన్‌ను, ప్రాథమిక గృహోపకరణాలను కూడా కాపాడుకోలేని విధంగా కూల్చివేతలకు పాల్పడ్డారన్న నివేదికలు- ఈ ఆపరేషన్‌లో అధికారుల అమానవీయతను, సున్నితత్వం లేమిని బట్టబయలు చేస్తున్నాయి” అని ఆ వేదిక ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ కూల్చివేతలపై న్యాయ విచారణ జరిపించి, బాధిత కుటుంబాలకు తక్షణమే పునరావాసం కల్పించాలని డిమాండ్ చేసింది.
అలాగే బాధ్యులైన అధికారులపై ఎస్సీ/ఎస్టీ(అట్రాసిటీ) చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరింది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
