ప్రస్తుత బ్రిటీష్ రాజకీయం చూస్తుంటే షేక్స్పియర్ నాటకాల్లోని సన్నివేశాలను తలపిస్తోంది. నిండా రెండేళ్లు కూడా పూర్తి కాకముందే పార్లమెంట్లో భారీ మెజారిటీతో ఎన్నికైన ఒక ప్రభుత్వం ఇప్పుడు రాజకీయంగా బలహీనపడి, సిద్ధాంతపరమైన అనిశ్చితితో, అన్ని వైపుల నుంచి ఒకేసారి ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
2026 మే నాటి స్థానిక, ప్రాంతీయ ఉప-ఎన్నికలు కేవలం మధ్యంతర నిరసన ఓటింగ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. అవి బ్రిటన్ రాజకీయ వ్యవస్థలోని లోతైన సంక్షోభాన్ని, సైద్ధాంతిక అనిశ్చితిని, పాత ఎన్నికల విధానంలో పెరుగుతున్న చీలికలను బహిర్గతం చేశాయి.
2026 మే 7న, ఇంగ్లాండ్, స్కాట్లాండ్- వేల్స్ వ్యాప్తంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. కీర్ స్టార్మర్ నాయకత్వంలోని లేబర్ ప్రభుత్వానికి ఇది మొదటి పెద్ద ఎన్నికల పరీక్షగా నిలిచింది.
2024 జూలై నాటి సార్వత్రిక ఎన్నికలలో లేబర్ పార్టీ 411 స్థానాలను గెలుచుకొని, 174 స్థానాల భారీ పార్లమెంటరీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అది పొదుపు చర్యలు, అవినీతి స్కాండల్స్, బ్రెక్సిట్ సృష్టించిన రాజకీయ గందరగోళంతో కూడిన పద్నాలుగేళ్ల కన్జర్వేటివ్ పాలనకు ముగింపుగా విస్తృతంగా భావించబడింది.
కానీ రెండేళ్లలోనే, లేబర్ పార్టీ రాజకీయ పలుకుబడి అసాధారణ వేగంతో క్షీణించింది.
లేబర్ పార్టీ పతనం – రిఫార్మ్ పార్టీ ఎదుగుదల..
స్థానిక ఎన్నికల ఫలితాలు లేబర్ పార్టీ పతనపు తీవ్రతను స్పష్టం చేశాయి:
లేబర్ పార్టీ: 1,068 కౌన్సిలర్లు ఎన్నికయ్యారు. ఇది గతం కంటే 1,498 స్థానాలు తక్కువ. గతంలో 66 కౌన్సిల్స్‌లో అధికారంలో ఉండగా, ప్రస్తుతం అది 28కి పడిపోయింది. అంటే 38 కౌన్సిల్స్‌లో అధికారాన్ని కోల్పోయింది.
కన్జర్వేటివ్ పార్టీ: గతంలో ఉన్న 1,364 స్థానాలకు గాను 801 గెలుచుకొని, 563 స్థానాలను కోల్పోయింది. గతంలో 15 కౌన్సిల్స్‌లో అధికారంలో ఉండగా 6 కోల్పోయి, 9 కౌన్సిల్స్‌లో అధికారాన్ని నిలబెట్టుకుంది.
లిబరల్ డెమోక్రాట్లు: గతంలో 684 స్థానాలు గెలుపొందగా ఇప్పుడు అదనంగా 150 స్థానాలు గెలుచుకొని మొత్తం 844 స్థానాలకు చేరుకుంది. గతంలో 14 కౌన్సిల్స్‌లో అధికారంలో ఉండగా నేడు 15 కౌన్సిల్స్‌లో అధికారానికి వచ్చింది.
రిఫార్మ్ యూకే పార్టీ: గతంలో కేవలం రెండు స్థానాలు ఉండగా నేడు నమ్మశక్యం కాని విధంగా 1,454 స్థానాలు గెలుచుకుంది. గతంలో ఏ ఒక్క కౌన్సిల్లో కూడా అధికారంలో లేదు కానీ నేటి ఎన్నికల్లో 14 కౌన్సిల్స్‌లో అధికారానికి వచ్చింది.
గ్రీన్స్ పార్టీ: గతంలో 146 స్థానాలు గెలుచుకోగా నేడు అదనంగా 441 స్థానాలు గెలుచుకొని మొత్తం స్థానాల సంఖ్య 587కు చేరుకుంది. గతంలో ఏ ఒక్క కౌన్సిల్లో కూడా అధికారంలో లేదు కానీ ఈ ఎన్నికల్లో ఐదు కౌన్సిల్స్‌లో అధికారం హస్తగతం చేసుకుంది.
ఇతరులు, స్వతంత్రులు: గతంలో 178 స్థానాలు గెలుచుకోగా నేడు 213 స్థానాలలో గెలిచారు.
ఈ ఎన్నికల్లో స్పష్టమైన రాజకీయ విజేత నైజెల్ ఫరాజ్, ఆయనకు చెందిన ‘రిఫార్మ్ యూకే’ పార్టీ. ఒకప్పుడు కేవలం ఒక చిన్న పాపులిస్ట్ ఉద్యమంగా కొట్టిపారవేయబడిన ఈ పార్టీ, ఇప్పుడు బ్రిటీష్ రాజకీయాల్లో గట్టిగా పాతుకుపోయింది.
పారిశ్రామిక పతనం, ఉద్యోగ భద్రత లేకపోవడం, కుప్పకూలుతున్న ప్రజా సేవల వల్ల నష్టపోతున్న పేద కార్మిక వర్గ ప్రాంతాలలో, ముఖ్యంగా ఒకప్పటి లేబర్ పార్టీ కోటలలో రిఫార్మ్ పార్టీ అనూహ్య విజయాలను సాధించింది.
ఫరాజ్ డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహిత మిత్రుడు. బ్రెక్సిట్(యూరోపియన్ యూనియన్ నుంచి బయటకి రావడం), జాతీయవాదానికి దీర్ఘకాలిక రూపశిల్పి అయిన ఫరాజ్, జీవన వ్యయ సంక్షోభంపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతను ఆసరాగా చేసుకున్నారు.
జాతీయవాదం, వలస వ్యతిరేకత ఆయన పార్టీ విధానాలు. ఆశ్చర్యకరంగా ఆ వికృత విధానాలను తనకు మద్దతుగా విజయవంతంగా మలుచుకున్నారు.
ఈ పార్టీ ప్రసంగాలు టామీ రాబిన్సన్(అసలు పేరు స్టీఫెన్ క్రిస్టోఫర్ యాక్స్లీ – లెన్నాన్) వంటి వ్యక్తులతో ముడిపడి ఉన్న ఇస్లామోఫోబిక్(ముస్లిం వ్యతిరేక) రాజకీయాలతో కూడి ఉన్నాయి.
అధికార లేబర్ పార్టీ అనుసరించిన విధానాలు సంక్షోభాన్ని మరింత తీవ్రం చేశాయి.
వలస వ్యతిరేక ప్రచారాన్ని ఎదిరించడానికి బదులుగా, ప్రభుత్వంలోని కొన్ని విభాగాలు సరిహద్దు నియంత్రణలు, వలసల అంశాలపై రిఫార్మ్ పార్టీతో పోటీ పడటానికి ప్రయత్నించాయి. దీని ఫలితంగా రాజకీయ గందరగోళం ఏర్పడింది.
లేబర్ పార్టీ తన ప్రగతిశీల మద్దతుదారులను దూరం చేసుకుంది.
అదే సమయంలో అసంతృప్తితో ఉన్న ఓటర్లలో రిఫార్మ్ పార్టీ ఎదుగుదలను కూడా అడ్డుకోలేకపోయింది.
“పోస్ట్-బ్రెక్సిట్ వాగ్దానం” వైఫల్యం..
ఈ సంక్షోభం మూలాలు కేవలం ఎన్నికల వ్యూహాల కంటే లోతైనవి.
కన్జర్వేటివ్ ప్రభుత్వాల హయాంలో బ్రిటీష్ ప్రజలు అప్పటికే ఎన్నో ఏళ్లపాటు పొదుపు చర్యల(ఆర్థిక కోతలు) భారాన్ని అనుభవించారు.
బ్రెక్సిట్ అనేది కార్మిక వర్గానికి ఆర్థిక పునరుద్ధరణ, సార్వభౌమాధికారం, శ్రేయస్సుకు మార్గంగా ప్రచారం చేయబడింది.
ఇది భారతదేశంలోని “అచ్ఛే దిన్” నినాదానికి సమానమైన బ్రిటీష్ వెర్షన్. కానీ మిలియన్ల మంది ప్రజలకు ఆ వాగ్దానాలు ఎన్నడూ నెరవేరలేదు.
నేడు బ్రిటన్ ఆర్థిక స్థబ్దత, క్షీణిస్తున్న జీవన ప్రమాణాలు, పెరుగుతున్న సామాజిక అసమానతలను ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న గృహ ఖర్చులు కార్మిక వర్గ సమాజాలను అతలాకుతలం చేస్తున్నాయి.
భారీ అద్దెలు, అస్థిరమైన ఉద్యోగాలు, పెరుగుతున్న విద్యార్థి రుణాల ఫలితంగా యువత తీవ్రమైన నిరాశ నిస్పృహలకు గురయ్యారు.
విశ్వవిద్యాలయాలు రుణాల కర్మాగారాలుగా మారుతున్నాయి. ట్యూషన్ ఫీజులు, రుణాల వడ్డీలు పట్టభద్రులపై దశాబ్దాల పాటు భారం మోపుతున్నాయి.
లేబర్ ప్రభుత్వపు తొలి, అత్యంత వివాదాస్పద నిర్ణయాలలో ఒకటి, పెన్షనర్లకు శీతాకాలపు ఇంధన మద్దతును తొలగించడం.
ఆ తర్వాత తీవ్ర నిరసనల మధ్య యు-టర్న్ తీసుకుని కొంతమేర ఇంధన సబ్సిడీని పునరుద్ధరించింది.
ఇది చాలా మంది లేబర్ పార్టీ సాంప్రదాయ మద్దతు దారులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
వృద్ధులు అప్పటికే చలికాలపు ఖర్చులు, ఆహార ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్న సమయంలో, ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య సామాన్య పౌరుల వాస్తవ పరిస్థితులకు అది ఎంత దూరంగా ఉందో సూచించింది.
అదే సమయంలో, లేబర్ పార్టీ నాయకత్వం సైనిక వ్యయం పెంపు, నాటో నిబద్ధతలను బలోపేతం చేయడం, ఉక్రెయిన్ యుద్ధానికి నిరంతర మద్దతు ఇవ్వడం వైపు మొగ్గు చూపింది.
విస్తరిస్తున్న యుద్ధ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి సంక్షేమ పథకాల్లో కోతలు విధిస్తున్నారని లేబర్ పార్టీలోని విమర్శకులు, వామపక్షాలు వాదించాయి.
ఇది లేబర్ పార్టీ స్వంత శ్రేణులలో- ట్రేడ్ యూనియన్ మద్దతుదారులలో అసంతృప్తికి దారితీసింది.
వలసలు, మీడియా రాజకీయం, ఇస్లామోఫోబియా..
బ్రిటన్ రాజకీయ వ్యవస్థ, అక్కడి కార్పొరేట్ మీడియాలో ఎక్కువ భాగం వలసలనే ప్రధాన జాతీయ సంక్షోభంగా చిత్రీకరించాయి.
శరణార్థులు, ఆశ్రయం కోరేవారు, విద్యార్థులు, వలస కార్మికులు, పత్రాలు లేని వలసదారులను బ్రిటన్‌కు పెద్ద ముప్పుగా చూపారు. ఇందులోని వ్యంగ్యం ఆశ్చర్యకరం.
బ్రెక్సిట్ తర్వాత, చాలా మంది యూరోపియన్ కార్మికులు తిరిగి తమ దేశాలకు వెళ్ళిపోవడంతో ఏర్పడిన కొరతను పూరించడానికి బ్రిటీష్ యజమానులు వలస కార్మికులను చేర్చుకున్నారు.
కానీ, దశాబ్ద కాల ప్రైవేటీకరణ, పెట్టుబడుల కొరత వల్ల ఏర్పడిన సమస్యలకు ఇప్పుడు అదే వలస కార్మికులను నిందిస్తున్నారు.
ముస్లింలను రాజకీయంగా లక్ష్యంగా చేసుకోవడం మరింత స్పష్టమైంది. “తీవ్రవాదం” లేదా “యూదు వ్యతిరేకత”ను ఎదుర్కొనే నెపంతో, ఇజ్రాయెల్ ప్రభుత్వ విధానాలపై చట్టబద్ధమైన విమర్శలను, పాలస్తీనాకు సంఘీభావం తెలపడాన్ని తప్పుగా చూశారు.
పాలస్తీనాలో న్యాయం జరగాలని పెరుగుతున్న ప్రజా డిమాండ్లకు లేబర్ పార్టీ మద్దతు ఇవ్వకపోవడం చాలా మంది యువ ఓటర్లు, మైనారిటీలు, వామపక్ష విభాగాలలో ఆగ్రహాన్ని సృష్టించింది.
లేబర్ పార్టీ గాజా, వెస్ట్ బ్యాంక్, లెబనాన్‌లో జరుగుతున్న యుద్ధ నేరాలను, సామూహిక శిక్షలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేదని చాలా మంది బ్రిటీష్ ముస్లింలు, ప్రగతిశీల కార్యకర్తలు భావించారు.
మీడియా, ఇజ్రాయెల్ అనుకూల లాబీయింగ్ గ్రూపుల నుంచి వచ్చే వ్యతిరేకతకు భయపడటమే దీనికి కారణం.
పుంజుకుంటున్న ప్రాంతీయ జాతీయవాదం..
ఈ ఎన్నికలు యునైటెడ్ కింగ్‌డమ్‌లోని అంతర్గత చీలికలను కూడా నిరూపించాయి.
వేల్స్లో: లేబర్ పార్టీ తన ఎరుపు కోట ‘సెనెడ్'(Senedd – వేల్స్ దేశ పార్లమెంట్)లో చారిత్రాత్మక అవమానాన్ని ఎదుర్కొంది.
ప్లాయిడ్ కమ్రీ – 43 స్థానాలు
రిఫార్మ్ యూకే – 34 స్థానాలు
లేబర్ పార్టీ – 9 స్థానాలు
కన్జర్వేటివ్‌లు – 7 స్థానాలు
గ్రీన్స్ – 2 స్థానాలు
లిబరల్ డెమోక్రాట్లు – 1 స్థానం
వేల్స్ జాతీయవాద పార్టీ ప్లాయిడ్ కమ్రీ పుంజుకోవడంతో పాటు, నైజెల్ ఫరాజ్ రిఫార్మ్ పార్టీ అనూహ్యంగా ఎదగడం రెండు భిన్నమైన జాతీయవాదాల పోటీని ప్రతిబింబిస్తుంది.
ఒకటి స్థానిక వెల్ష్-ఆధారిత జాతీయవాదం, మరొకటి రైట్ వింగ్ బ్రిటీష్ జాతీయవాదం.
స్కాట్లాండ్లో: పరిస్థితి ఇలాగే ఉంది..
స్కాటిష్ నేషనల్ పార్టీ – 58 స్థానాలు
లేబర్ పార్టీ – 17 స్థానాలు
రిఫార్మ్ పార్టీ – 17 స్థానాలు
గ్రీన్స్ – 15 స్థానాలు
కన్జర్వేటివ్‌లు – 12 స్థానాలు
లిబరల్ డెమోక్రాట్లు – 10 స్థానాలు
స్కాటిష్ నేషనల్ పార్టీ నిరంతర బలం, అక్కడి రాజ్యాంగపరమైన సమస్య ఇంకా పరిష్కారం కాలేదని నిరూపిస్తున్నది.
స్కాట్లాండ్ స్వాతంత్ర్యానికి ఉన్న మద్దతు అక్కడి రాజకీయ జీవితాన్ని శాసిస్తూనే ఉంది.
అదే సమయంలో కన్జర్వేటివ్ పార్టీ పతనం సాంప్రదాయ యూనియనిస్ట్ రాజకీయాలను మరింత బలహీనపరిచింది. ఐక్య వామపక్షం లేకపోవడంతో ఏర్పడిన శూన్యతను గ్రీన్స్ పార్టీ భర్తీ చేసింది.
బ్రిటీష్ వామపక్షాల సంక్షోభం..
ఈ ఎన్నికలు బ్రిటన్‌లో విచ్ఛిన్నమైన వామపక్షాల సంస్థాగత బలహీనతను కూడా బయటపెట్టాయి.
జెరెమీ కార్బిన్‌ను పార్లమెంటరీ ఉద్యమం నుంచి తొలగించిన తర్వాత, పార్లమెంటరీ లేబర్ పార్టీ వెళ్తున్న తీరుపై చాలా మంది లేబర్ సభ్యులు అసంతృప్తితో ఉన్నారు.
ప్రత్యామ్నాయ వామపక్ష కూటములను(యువర్ పార్టీ) సృష్టించే ప్రయత్నాలు ఇప్పటివరకు సరైన రూపాన్ని సంతరించుకోలేదు.
ఫలితంగా ఎన్నికలలో విజయం సాధించలేక పోయింది. దీంతో ఏర్పడిన రాజకీయ స్థలాన్ని గ్రీన్స్, స్వతంత్రులు పాక్షికంగా ఆక్రమించారు.
అదే సమయంలో, ట్రేడ్ యూనియన్ల నిరసనలు లోలోపల రగులుతూ ఉన్నాయి. రైల్వే కార్మికులు, ఉపాధ్యాయులు, ఆరోగ్య కార్యకర్తలు, ప్రభుత్వ రంగ ఉద్యోగులందరూ పడిపోతున్న నిజ వేతనాలు, అధ్వాన్నంగా మారుతున్న పని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
అలెక్స్ గోర్డాన్ నాయకత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ బ్రిటన్, ట్రేడ్ యూనియన్లు, ప్రజా ఉద్యమాలు- కార్మిక వర్గ సంస్థలతో కలిపి విస్తృత ప్రజాస్వామ్య వామపక్ష వేదికను అభివృద్ధి చేయాలని భావిస్తున్నది.
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్క్సిస్ట్) విదేశీ విభాగమైన ‘అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ కమ్యూనిస్ట్స్’ కూడా దీనితో ఏకీభవిస్తోంది.
పరివర్తనలో రాజకీయ వ్యవస్థ..
ఈ ఎన్నికలు కేవలం ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి కంటే ఇంకా ఎక్కువ విషయాలను తెలియ జేస్తున్నాయి.
అవి బ్రిటన్ రాజకీయ వ్యవస్థలోని విశ్వసనీయతకు సంబంధించిన లోతైన సంక్షోభాన్ని సూచిస్తున్నాయి.
లేబర్, కన్జర్వేటివ్‌ల ద్విపార్టీ ఆధిపత్యం బలహీనపడుతోంది. జాతీయవాద శక్తులు, ప్రాంతీయ పార్టీలు, రైట్ వింగ్ ప్రజాకర్షక పార్టీలు, గ్రీన్స్- స్వతంత్రులు అందరూ పుంజుకుంటున్నారు.
బ్రిటన్ ఇప్పుడు యూరోపియన్ దేశాల మాదిరిగా విచ్ఛిన్నమైన రాజకీయాలు, అస్థిరమైన కూటములవైపు మారిన ఓటర్లకు పోలికగా మారుతున్నది.
భారతీయ పరిశీలకులకు, బ్రిటీష్ అనుభవం ముఖ్యమైన పాఠాలను అందిస్తుంది.
ఆర్థిక అభద్రత, అస్తిత్వ రాజకీయాలు, మీడియా మానిప్యులేషన్, వివిధ సంస్థలపై తగ్గుతున్న నమ్మకం, రాజకీయ ప్రముఖులకు సామాన్య పౌరులకు మధ్య పెరుగుతున్న వ్యత్యాసం కేవలం బ్రిటన్‌కే పరిమితమైన సమస్యలు కావు.
అవి ప్రపంచవ్యాప్తంగా ఉదారవాద ప్రజాస్వామ్యాలను ప్రభావితం చేస్తున్న విస్తృత ప్రపంచ సంక్షోభ లక్షణాలు.
ప్రస్తుతం బ్రిటన్ ముందున్న ప్రశ్న ఏమిటంటే, ఈ శూన్యతను సామాజిక న్యాయం, కార్మిక వర్గ సంఘీభావంతో కూడిన ప్రగతిశీల ప్రజాస్వామ్య ఉద్యమాలు భర్తీ చేస్తాయా, లేక భయం, విభజనతోపాటు అసంతృప్తిపై నిర్మించిన తీవ్ర అధికార జాతీయవాద రూపాలు ఆక్రమిస్తాయా? చరిత్ర ఇలాంటి క్షణాలను ఎక్కువ కాలం ఖాళీగా ఉంచదు.
హర్సేవ్ బైన్స్, అధ్యక్షులు ఇండియన్ వర్కర్స్ అసోసియేషన్, గ్రేట్ బ్రిటన్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
