ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ – జస్టిస్ స్వర్ణ కాంత శర్మ వివాదం నేపథ్యంలో, ఒక యువ న్యాయవాదిగా నేను చూసిన ఒక నిశ్శబ్ద ‘ఉపసంహరణ'(రిక్యూసల్ – కేసు విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకోవడం) వ్యవహారం మళ్లీ నా మదిలో మెదిలింది.
గతకాలపు జ్ఞాపకం: నిశ్శబ్ద ఉపసంహరణ..
2017లో నేను కోర్టులో ఉన్నప్పటి సంఘటన అది. న్యాయవాద వృత్తికి నేను అప్పటికీ చాలా కొత్త. ఆ రోజువారీ కేసుల జాబితా ఎప్పటికీ ముగిసేలా కనిపించని దశలో ఉంది.
అంతేకాకుండా, జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేసులను సీనియర్ న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు నేను నా సీనియర్‌కు సహాయకుడిగా ఉన్నాను.
న్యాయవాదుల సంఖ్య పెరుగుతోంది. వారి కేసులను పిలిచినప్పుడు సాధారణ న్యాయవాదులు చూపించే ఉత్సాహం కంటే, ఆ ప్రక్రియ చాలా నెమ్మదిగా, గంభీరంగా సాగుతున్నట్టు నాకు అనిపించింది. ఆ తర్వాత, విచారణ నుంచి తప్పుకోవాలనే(ఉపసంహరణ) అభ్యర్థన, చాలా జాగ్రత్తగా ఎంచుకున్న పదాలతో న్యాయమూర్తి ముందు ఉంచబడింది.
అక్కడ అతిశయోక్తులు లేవు, ఆర్భాటాలు అసలే లేవు. ఒక పక్షం పట్ల న్యాయమూర్తికి పక్షపాతం ఉండే అవకాశం ఉందని భావించడానికి దారితీసే పరిస్థితుల గురించి చాలా జాగ్రత్తగా, మర్యాదపూర్వకంగా చేసిన సూచన అది.
ఆ మాటలు విన్న న్యాయమూర్తి కొద్దిసేపు నాటకీయంగా ఆగిపోయారు. ఆ తర్వాత ఆలోచనాత్మక ఆమోదంతో ఆ ఉపసంహరణ అభ్యర్థనను అనుమతించారు.
ఒక జూనియర్ న్యాయవాదిగా నాకు కొంచెం అయోమయంగా అనిపించింది. “అంతేనా? కేవలం ఒక అనుమానం ఉంటే చాలా? ఎలాంటి రుజువు అవసరం లేదా? విచారణ నుంచి తప్పుకోవడానికి ఇది సరిపోతుందా?” అనిపించింది.
ఆ తర్వాత కాజ్ లిస్ట్‌లోని ఇతర కేసులు సాధారణంగానే సాగిపోయాయి. కానీ ఆ సంఘటన నా లాంటి ఒక యువ న్యాయవాదిలో న్యాయ ప్రక్రియకు సంబంధించి ఒక బలమైన జ్ఞాపకాన్ని మిగిల్చింది.
కొన్నిసార్లు ఒక కేసు విచారణ నుంచి న్యాయమూర్తి హుందాగా వైదొలగడం ద్వారానే, మొత్తం న్యాయ ప్రక్రియ చట్టబద్ధత ఉత్తమంగా సంరక్షించబడుతుంది.
ఉపసంహరణ చట్టం: పక్షపాత భయమా? ఆత్మాశ్రయ ముద్రనా?..
కోర్ట్రూమ్లు అనేక విధాలుగా నాటకీయతను కలిగి ఉంటాయి. కానీ అది ఎప్పుడూ తెలియకుండానే ప్రవహిస్తూ ఉంటుంది. ఢిల్లీ హైకోర్టులో ఇటీవల కేజ్రీవాల్-జస్టిస్ స్వర్ణ కాంత శర్మ గాథలో జరిగిన ‘ఉపసంహరణ’ (రిక్యూసల్) ప్రొసీడింగ్ల సందర్భంలో నాకు ఈ పాత జ్ఞాపకం తిరిగి వచ్చింది.
ఇది నిస్సందేహంగా న్యాయవాద వర్గాన్ని(బార్‌ను) కదిలించింది. అంతేకాకుండా, ‘ఒక న్యాయమూర్తి ఎప్పుడు విరమించుకోవాలి?’ అనే క్లిష్టమైన ప్రశ్నను లేవనెత్తింది.
చాలా సాంకేతికంగా ఆలోచించకుండా చూస్తే, ఉపసంహరణ చట్టం చాలా సులభం. న్యాయమూర్తులు పక్షపాతంతో వ్యవహరిస్తారనే భయం లేదా అనుమానం ఉన్న కేసులను వారు విచారించకూడదని చట్టం భావిస్తుంది.
అయితే, అసలు సమస్య వాస్తవ పరిస్థితుల్లోనే ఉంది. ఇక్కడే ‘ఉపసంహరణకు ఒక చిన్న సందేహం సరిపోతుంది’ అనే కోర్టు రూమ్ జ్ఞాపకం ప్రాధాన్యత సంతరించుకుంటుంది.
సమస్య ఏమిటంటే, ‘పక్షపాత భయం’ అనే పదానికి స్పష్టమైన నిర్వచనం లేదు. ఇది ఒక వ్యక్తిగత(ఆత్మాశ్రయ) ముద్ర మాత్రమే తప్ప, నిర్దిష్టమైన (ఆబ్జెక్టివ్) పరీక్ష కాదు. ఇటీవలి కేజ్రీవాల్-జస్టిస్ శర్మ వివాదం ఈ కోణంలోనే చర్చనీయాంశమైంది.
కేజ్రీవాల్ – జస్టిస్ శర్మ వివాదం: థియేట్రికల్ పాలిటిక్స్..
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పునర్విచారణ దరఖాస్తులో జస్టిస్ శర్మ ముందు తన కేసును వ్యక్తిగతంగా వాదించారు. తమ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం న్యాయస్థానాలను ఒక నాటకీయ వేదికగా ఉపయోగిస్తున్న రాజకీయ నాయకుల జాబితాలో ఇది మరొక ఉదాహరణగా నిలిచింది.
అయితే కేజ్రీవాల్ తన వాదనలలో, జస్టిస్ శర్మపై నేరుగా ‘పక్షపాతాన్ని’ ఆరోపించలేదు. ఎందుకంటే, ఆ దశలో పక్షపాతాన్ని ఫోరెన్సిక్ ఆధారాలతో నిరూపించాల్సిన అవసరం లేదు. బదులుగా, ‘ఉపసంహరణ’ అనేది ఒక గ్రహణ సంబంధమైన విషయం. “ఒక సాధారణ, సహేతుకమైన పరిశీలకుడు ఈ పరిస్థితులను చూసి పక్షపాతం ఉందని అనుమానిస్తాడా లేదా?” అనేదే ఇక్కడ ప్రామాణికం.
న్యాయమూర్తులు కేసులను విచారించడానికి వెనుకాడకుండా, తీర్పులు ఇవ్వడానికి శిక్షణ పొందుతారు. ఆ కోణంలో చూస్తే రిక్యూసల్(తప్పుకోవడం) అభ్యర్థనలు న్యాయమూర్తి ప్రాథమిక విధికి విరుద్ధంగా కనిపిస్తాయి. కానీ కొన్నిసార్లు ఇవి చట్టం కంటే చాలా ఆత్మాశ్రయమైనవి.
న్యాయమూర్తులు కూడా తరచుగా తమ మౌఖిక పరిశీలనలలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తారు. జస్టిస్ శర్మ కూడా అదే అన్నారు. “ఈ కారణం(చిన్న అనుమానం) చూపి నేను విరమించుకుంటే, నా జాబితాలోని సగం కేసులను నేను వదులుకోవలసి ఉంటుంది” అని ఆమె వ్యాఖ్యానించారు. అది చులకనగా చెప్పిన మాట కాదు, న్యాయవ్యవస్థకు ఉన్న సంస్థాగత ఆందోళనను అది ప్రతిబింబిస్తుంది.
నిజం చెప్పాలంటే, రిక్యూసల్ అప్లికేషన్లను మామూలుగా అనుమతించడం మొదలుపెడితే, అస్పష్టమైన ఆరోపణలు, సంబంధం లేని కనెక్షన్ల ఆధారంగా న్యాయమూర్తుల బెంచ్‌లను మార్చడానికి ప్రయత్నించే న్యాయవాదులకు అది దారులు తెరుస్తుంది.
రిక్యూసల్ అభ్యర్థనలను న్యాయస్థానాలు తిరస్కరించడం(పుష్బ్యాక్లు) పూర్తిగా తప్పు కాదు. ఎందుకంటే న్యాయస్థానాలు కొంతవరకు న్యాయపరమైన దృఢత్వంతో, అధికారంతో పనిచేయాలి, లేదా కనీసం అలా పని చేస్తున్నట్లు కనిపించాలి.
ప్రయోజనాల సంఘర్షణ: అసలు ఆరోపణ ఏమిటి?..
అయితే, మరోవైపు న్యాయపరమైన అనుచితత్వం, ప్రయోజనాల సంఘర్షణ అనేవి కూడా ముఖ్యం.
నివేదికల ప్రకారం, కేజ్రీవాల్ న్యాయస్థానం ముందు ఒక అఫిడవిట్ దాఖలు చేశారు.
న్యాయమూర్తి సమీప కుటుంబ సభ్యులు (వారు కూడా న్యాయవాదులే) తన కేసును విచారిస్తున్న దర్యాప్తు సంస్థల ద్వారా ఆర్థికంగా లాభపడుతున్నారనే వాస్తవాన్ని అందులో పొందుపరిచారు.
జస్టిస్ శర్మ పిల్లలకు కేవలం మూడేళ్ల వ్యవధిలో 5,000 కు పైగా కేసులు(ఏజెన్సీల తరపున) కేటాయించబడ్డాయన్నది ప్రధాన ఆరోపణ.
ఎంతో సమర్థులైన ఇతర యువ జూనియర్ న్యాయవాదులకు కనీసం సంవత్సరానికి రెండు కేసులు కూడా దక్కని పరిస్థితి ఉన్నప్పుడు, ఈ స్థాయి కేటాయింపులు న్యాయమైనవేనా? ఇవి ప్రయోజనాల విరుద్ధమైన ప్రశ్నలను లేవనెత్తుతాయా?
బహుశా లేవనెత్తవచ్చు. కానీ నిజాయితీగా చెప్పాలంటే, ఇది జస్టిస్ శర్మ కంటే న్యాయ వ్యవస్థలోని లోపాన్ని చాలా దారుణంగా ప్రతిబింబిస్తుంది.
అటువంటి కేసులను న్యాయమూర్తి తక్షణ కుటుంబ సభ్యులకు అప్పగించడం వల్ల, ఆ న్యాయమూర్తి మనస్సులో దర్యాప్తు సంస్థల పట్ల అనుకూలమైన పక్షపాతం ఏర్పడుతుందని ‘సహేతుకమైన పరిశీలకుడు’ నిర్ధారించగలడా?
మనకు కచ్చితంగా తెలియడానికి ఎలాంటి మార్గం లేదు. ఇది ఇరువైపులా ఇబ్బందికరమైన పరిస్థితి.
ఇక్కడ ‘సహేతుకమైన పరిశీలకుడు’ అంటే అమాయకుడు లేదా విరక్తి చెందినవాడు కాదు. అతను సమతూకంతో, నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా ఆలోచించే వ్యక్తి.
న్యాయం జరగడమే కాదు.. జరుగుతున్నట్లు కనిపించాలి..
తరచుగా చెప్పినట్లు, “న్యాయం జరగడమే కాదు, న్యాయం జరుగుతోందని అందరికీ కనిపించాలి”. పక్షపాతానికి సంబంధించిన ‘భయం’, పక్షపాతానికి సంబంధించిన ‘రుజువు’ కంటే భిన్నమైనది.
కేజ్రీవాల్ తిరస్కరణ దరఖాస్తును తోసిపుచ్చుతూ జస్టిస్ శర్మ ఇచ్చిన ఆర్డర్లో ఈ రెండింటి వ్యత్యాసాన్ని సరిగ్గా పరిగణనలోకి తీసుకున్నట్లు అనిపించలేదు.
చాలా సందర్భాలలో, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం నిరుపయోగంగా లేదా అనవసరంగా అనిపిస్తుంది. కానీ ఎప్పుడో ఒకసారి కేజ్రీవాల్ రిక్యూసల్ అప్లికేషన్ లాంటి కేసులు వస్తుంటాయి.
ఇక్కడ నిరూపించడానికి ఏమీ ఉండదు, కానీ ఏదో విచిత్రమైన, అసాధారణమైన వాతావరణం నెలకొంటుంది.
బహుశా అందుకేనేమో చాలా వరకు న్యాయమూర్తుల ఉపసంహరణలు(రిక్యూసల్స్) ఎటువంటి కారణాలు చెప్పకుండా మౌనంగా జరిగిపోతుంటాయి.
ఈ నిర్దిష్ట కేసులో న్యాయమూర్తి కచ్చితంగా తప్పుకోవాలని ఏ చట్టమూ సూచించదు.
ఇక్కడ పాయింట్ ‘నేను తప్పుకుని తీరాలి’ అని కాదు, ‘విరమించుకోవడం మరింత తెలివైన చర్య’ అని భావించడం.
ఈ రెంటి మధ్య వ్యత్యాసం చాలా సూక్ష్మంగా ఉంటుంది.
బలవంతంగా కాకుండా, న్యాయపరమైన జ్ఞానంతో, పక్షపాత ఆరోపణలు వస్తాయన్న భావనను గౌరవించడం అందులో ఇమిడి ఉంటుంది.
అనిశ్చితి రాజ్యమేలుతున్న దేశంలో న్యాయస్థానాలు తరచుగా అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటాయి. సందేహమే లేనట్లు నటించకుండా, స్పృహతో వ్యవహరించాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపై ఉంది.
కొన్నిసార్లు, ఆ పాత కోర్ట్‌రూమ్ జ్ఞాపకం మనకు ఒక విషయాన్ని గుర్తుచేస్తుంది: నిష్పాక్షికతకు సంబంధించిన అత్యంత ఒప్పించే ప్రకటన ఏమిటంటే, ఆ నిష్పాక్షికతను పరీక్షకు గురిచేసే పరిస్థితి రాకముందే నిశ్శబ్దంగా తప్పుకోవడం.
నిజంగా చెప్పాలంటే.. ఒక న్యాయమూర్తి కేసు నుంచి విరమించుకోవడానికి ఆ మాత్రం సందేహం సరిపోతుంది.
అనువాదం: కొండూరు వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
