నిరుద్యోగం అనే గణాంకాల సమస్యను కొలవడానికి ప్రభుత్వం ఎట్టకేలకు ఒక మార్గాన్ని కనుగొన్నది. అయితే, ఇది ఏనుగును తాకి ఒక్కో భాగాన్ని మాత్రమే అర్థం చేసుకుని, దాన్నే పూర్తి నిజమని భావించిన గుడ్డివాళ్ల కథలాగే అసంపూర్తిగా ఉండవచ్చు.
ప్రస్తుత వారాంతపు స్థితి(కరెంట్ వీక్లీ స్టేటస్ – సీడబ్ల్యూఎస్) విధానం ద్వారా నిరుద్యోగ రేటును కొలవడంలో ప్రధాన సవాలు ఏంటంటే, దీని ద్వారా ఒక వ్యక్తి గత ఏడు రోజులలో చేసిన పని ఆధారంగా వారి కార్యకలాపాల స్థితిని నిర్ణయిస్తారు— ఇందులో ప్రజలు ఉపాధి పొందుతున్నారో లేదో చూడటమే కాకుండా, వారి ఉద్యోగాల స్వభావం, వేతన చెల్లింపుల క్రమబద్ధత, ఉద్యోగ నాణ్యతను కూడా అంచనా వేయాలి.
అత్యధిక జనాభా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ఆర్థిక వ్యవస్థలో, నిరుద్యోగాన్ని కేవలం ఒక సాధారణ గణాంకం ద్వారా ప్రామాణికంగా విశ్లేషించలేము.
త్రైమాసిక, వార్షిక నిరుద్యోగ నివేదికలను నెలవారీ సూచికగా మార్చాలనే భారతదేశ నిర్ణయం ఆర్థికంగా స్వాగతించదగినదే అయినప్పటికీ, దీని డేటాబేస్ స్వభావం ఆధారంగా దీని విశ్వసనీయత ప్రశ్నార్థకంగానే మారింది. ముఖ్యంగా ఇది వలస కార్మికుల వివరాలను సరిగ్గా పరిగణనలోకి తీసుకోదు.
చెల్లాచెదురుగా ఉన్న సమాచార వనరులు..
ఈపీఎఫ్ఓ(ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ), ఈఎస్ఐసీ(ఉద్యోగుల రాజ్య బీమా కార్పొరేషన్) పే-రోల్ డేటా, జీఎస్టీ ఆధారిత సంస్థల సమాచారం, ఆదాయపు పన్ను రికార్డులు, కార్పొరేట్ పే-రోల్ డేటా, గిగ్ ఎకానమీ ఉపాధి వివరాలు, గ్రామీణ వేతన సూచికలతో భారతదేశ డేటాబేస్‌ను బలోపేతం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ ప్రస్తుతానికి ఈ వనరులు చెల్లాచెదురుగానే ఉన్నాయి.
పే-రోల్ సర్వేలు, నిరుద్యోగ బీమా రికార్డులు, అధికారిక ఒప్పందాలు, సమగ్ర పరిపాలనా డేటాబేస్లను కలిగి ఉన్న పరిణతి చెందిన లేబర్ మార్కెట్ల లాగా కాకుండా — భారతదేశంలోని భారీ అసంఘటిత ఉపాధి రంగాన్ని ట్రాక్ చేయడం చాలా కష్టం.
అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ) నిర్వచనం ఆధారంగా చాలా అభివృద్ధి చెందిన దేశాలు ‘లేబర్ ఫోర్స్ సర్వే’ ద్వారా నిరుద్యోగాన్ని లెక్కిస్తాయి.
అమెరికా, జపాన్, ఐరోపా యూనియన్, ఇంగ్లాండ్ దేశాలు దశాబ్దాలుగా శాశ్వత, పార్ట్ టైం ఉద్యోగాలు, గంటల వారీ వేతనాలు, ఉద్యోగ వ్యవధి, కార్మికుల చలనాలు, నిరుద్యోగ వ్యవధిపై వివరణాత్మక గృహ సర్వే డేటాను కలిగి ఉంటాయి.
కాలానుగుణ మార్పులే.. శాశ్వత పురోగతి కాదు..
ఇటీవలి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(పీఎల్ఎఫ్ఎస్) ప్రకారం, 15 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి భారతదేశ నిరుద్యోగ రేటు జూలైలో నాలుగు నెలల కనిష్ట స్థాయి 5.1 శాతానికి చేరింది.
సమీక్షా కాలం బిజీ ఖరీఫ్ సీజన్. ఆ సీజన్లో భూమి దుక్కి దున్నడం, నాట్లు వేయడం, సంబంధిత పనుల కోసం వ్యవసాయ కార్మికులకు డిమాండ్ పెరిగింది.
నిర్మాణం, వ్యవసాయం, చిన్న వ్యాపారం, లాజిస్టిక్స్, స్థానిక సేవలు కాలానుగుణ మార్పులను చూస్తాయి కాబట్టి, జూలైలో నమోదైన తగ్గుదల అధికారిక రంగ ఉద్యోగాల విస్తరణ కంటే ఈ రంగాలలో తాత్కాలిక నియామకాలు పెరగడాన్నే సూచిస్తుంది.
నెలవారీ నిరుద్యోగ డేటా అనేది లేబర్ మార్కెట్ ఆరోగ్యాన్ని సూచించే ఒక ప్రాథమిక ప్రతిబింబం మాత్రమే కావచ్చు కానీ పూర్తిస్థాయి సమగ్ర కొలమానం కాకపోవచ్చు.
అసంఘటిత రంగమే ప్రధాన సవాలు..
భారతదేశంలో 90 శాతం జనాభా అసంఘటిత రంగంలో ఉన్నారని వివిధ నివేదికలు చెబుతున్నాయి. వ్యవసాయ రంగ ఉపాధి కాలానుగుణంగానే ఉంటుంది, వేతన చెల్లింపులు క్రమబద్ధంగా ఉండవు. అల్ప-ఉపాధి, అదృశ్య నిరుద్యోగం విస్తృతంగా ఉంది.
వేతన పెరుగుదల, పనిచేసిన గంటలు, ఉద్యోగ నాణ్యత, వృత్తిపరమైన మార్పులు, రంగాల వారీగా ఉపాధి ట్రెండ్స్‌పై డేటా చాలా పరిమితంగా ఉంది. అందువల్ల, నెలవారీ నిరుద్యోగ డేటా శాశ్వత పురోగతి కంటే కాలానుగుణ మార్పులనే ప్రతిబింబిస్తుంది.
నిరుద్యోగంలో తగ్గుదల అనేది నిజమైన ఉపాధి కల్పన కంటే, ఆర్థిక ఇబ్బందుల వల్ల తక్కువ-ఉత్పాదకత కలిగిన ఉద్యోగాలలో చేరడాన్ని సూచించవచ్చు.
గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగం 5 శాతం నుంచి 4.5 శాతానికి తగ్గడం వల్ల మొత్తం నిరుద్యోగంలో తగ్గుదల కనిపిస్తోంది. కానీ దీనిని ఉద్యోగ మార్కెట్లో లభించిన పెద్ద పురోగతిగా భావించకూడదు.
భారతదేశంలో ఏటా 30 నుంచి 35 లక్షల మంది సీజనల్ కార్మికులు వలస వెళ్తున్నారని, వీరే పట్టణ నిర్మాణ, మౌలిక సదుపాయాల రంగానికి దృశ్యమానం కాని వెన్నెముకగా నిలుస్తున్నారని స్వతంత్ర కార్మిక అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి.
వాస్తవికతను ప్రతిబింబించే సూచిక అవసరం..
జూలై డేటా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటులో పెరుగుదలను చూపించింది, ఇది సానుకూల సంకేతమే అయినప్పటికీ, నిలకడైన ఉపాధి పుంజుకోవడానికి భారీ పెట్టుబడులు, ఉద్యోగ కల్పన అవసరం.
ఈ భాగస్వామ్యాన్ని స్థిరమైన, అధిక-ఉత్పాదకత కలిగిన ఉద్యోగాలుగా మార్చడమే ప్రస్తుత సవాలు.
రూపాంతరం చెందిన పీఎల్ఎఫ్ఎస్ అనేది పాత నివేదికల కంటే స్పష్టమైన పురోగతిని తెచ్చినప్పటికీ, దాని విజయం అంతిమంగా కేవలం తరచుగా లెక్కించడంపై మాత్రమే కాకుండా ఉద్యోగ మార్కెట్ యథార్థ స్థితిని అంచనా వేస్తుందా లేదా అనేదానిపై ఆధారపడి ఉంటుంది.
లక్షలాది మంది కార్మికుల జీవనోపాధిని సరిగ్గా నమోదు చేసే విశ్వసనీయమైన లేబర్ మార్కెట్ సూచిక ఈనాటి తక్షణ అవసరం.
అనువాదం: కె సత్యరంజన్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
