జ్యూరీ పత్రికా స్వేచ్ఛ విభాగంలో సిద్ధార్థ్ వరదరాజన్‌ను అత్యుత్తమ జర్నలిస్టిక్ కృషికి గుర్తింపుగా మార్సెలా తురాతీని ఎంపిక చేసింది. వీరిద్దరికీ 2027 ఫిబ్రవరిలో ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.
న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు సిద్ధార్థ్ వరదరాజన్, మెక్సికోకు చెందిన సీనియర్ జర్నలిస్టు మార్సెలా తురాతీలను 24వ ఎల్ ముండో అంతర్జాతీయ జర్నలిజం పురస్కారాల గ్రహీతలుగా ఎంపిక చేశారు.
ఎల్ ముండో స్పెయిన్‌లోని అతిపెద్ద వార్తాపత్రికల్లో ఒకటి.
జ్యూరీ పత్రికా స్వేచ్ఛ విభాగంలో సిద్ధార్థ్ వరదరాజన్‌ను, అత్యుత్తమ జర్నలిస్టిక్ కృషికి గుర్తింపుగా మార్సెలా తురాతీని ఎంపిక చేసింది. వీరిద్దరికీ 2027 ఫిబ్రవరిలో ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.
స్వతంత్ర జర్నలిజానికి బలం..
ది వైర్ వ్యవస్థాపక సంపాదకుడు సిద్ధార్థ్ వరదరాజన్ ఎల్ ముండోతో మాట్లాడుతూ ఈ పురస్కారం ది వైర్‌కు మాత్రమే కాదు భారతదేశంలో స్వతంత్రంగా పనిచేస్తున్న జర్నలిజానికీ ఎంతో బలాన్నిస్తుందని అన్నారు.
ఈ పురస్కారాల కోసం ఏర్పాటైన జ్యూరీకి ఎల్ ముండో డైరెక్టర్ జోక్విన్ మాన్సోతో పాటు పలువురు ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. వారిలో మాజీ విదేశాంగ మంత్రి అనా పలాసియో, కొరియేరే డెల్లా సెరా జర్నలిస్టు సారా గాండోల్ఫీ, రాయిటర్స్ స్పెయిన్ డైరెక్టర్ ఐస్లిన్ లాయింగ్, టెలీసింకో వార్తల డైరెక్టర్ కార్లోస్ ఫ్రాంగనిలో, రాజకీయ శాస్త్రవేత్త జోసే ఇగ్నాసియో టోర్రెబ్లాంకా, జర్నలిస్టు ఫెలిపే సాగున్, ప్రతినిధి జర్నలిస్టు జేవియర్ కొలాస్, ఎల్ ముండో డిప్యూటీ ఎడిటర్ సిల్వియా రోమాన్ ఉన్నారు.
పురస్కారాల వెనుక ఉన్న చరిత్ర..
అంతర్జాతీయ జర్నలిజం పురస్కారాలను 2002లో ఏర్పాటు చేశారు. జర్నలిజం వృత్తిలో ప్రాణాలు కోల్పోయిన ఎల్ ముండోకు చెందిన ఇద్దరు జర్నలిస్టుల హత్యల నేపథ్యంలో ఈ పురస్కారాలకు శ్రీకారం చుట్టారు. వారిలో జోసే లూయిస్ లోపెజ్ డి లకాయె 2007 మేలో కాల్చిచంపబడ్డారు.
మరో జర్నలిస్టు జూలియో ఫుయెంటెస్ 2001 నవంబరులో ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ సమయంలో జర్నలిస్టులతో వెళ్తున్న కాన్వాయ్‌పై జరిగిన ఆకస్మిక దాడిలో హతమయ్యారు.
ఎల్ ముండో తన కథనంలో సిద్ధార్థ్ వరదరాజన్, మార్సెలా తురాతీలకు ఇచ్చిన ఈ పురస్కారం ఒత్తిళ్లు పెరిగే కొద్దీ మరింత అవసరమయ్యే ధైర్యమైన జర్నలిజాన్ని గుర్తిస్తోంది.
స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న ఈ ఇద్దరు జర్నలిస్టులు రెండు వేర్వేరు ఖండాలకు చెందినవారైనా వారి పోరాటం మనందరికీ సంబంధించినదే అని పేర్కొంది.
ఎల్ ముండో డైరెక్టర్ జోక్విన్ మాన్సో మాట్లాడుతూ సిద్ధార్థ్ వరదరాజన్‌కు ప్రకటించిన పత్రికా స్వేచ్ఛ పురస్కారం భారతదేశంలో కొనసాగుతున్న ఆసియాలోని గొప్ప స్వతంత్ర జర్నలిజం సంప్రదాయానికి ఇచ్చిన గుర్తింపుగా నిలుస్తుందని అన్నారు.
అధికారాన్ని ప్రశ్నించే ధైర్యం..
“మోదీ ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరును ప్రశ్నిస్తూ దానిపై పరిశోధనాత్మక కథనాలు ప్రచురించినందుకు వరదరాజన్‌పై కేసులు నమోదయ్యాయి. పోలీసు దర్యాప్తులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అనేక ఆరోపణలు కూడా ఆయనను వెంటాడాయి” అని వరదరాజన్ జర్నలిస్టుగా సాగించిన ప్రస్థావనను వివరిస్తూ మాన్సో అన్నారు.
అధికారిక మీడియా అనుసరిస్తున్న మూసధోరణి, దానికి అలవాటుపడిన వైఖరికి వ్యతిరేకంగా కొత్త తరం భారతీయులు కాక్రోచెస్ తిరుగుబాటు చేయడం ప్రారంభించినప్పుడు వారికి వరదరాజన్లో ఒక జర్నలిస్టు కనిపించారు. అప్పటికే దాదాపు ఒక దశాబ్దం పాటు ఆ విభేద స్వరానికి ఊపిరిపోసిన స్వేచ్ఛా వేదికను కాపాడేందుకు ఆయన పోరాడుతూ వచ్చారు.
ఆయన జర్నలిస్టుగా సాగించిన ప్రస్థానం ఒక కీలకమైన విషయాన్ని గుర్తుచేస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశ బలం కేవలం దాని రాజ్యాంగ సంస్థల్లోనో, ఎన్నికల ప్రక్రియలోనో ఉండదు.
అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించే ధైర్యం ఉన్న జర్నలిస్టులు స్వేచ్ఛగా పనిచేయగలగడం, అధికార దుర్వినియోగాన్ని వెలుగులోకి తేవడం, ప్రజల తరఫున అధికారాన్ని నిలదీయడం కూడా ప్రజాస్వామ్యానికి ప్రాణాధారం.
అధికారానికి అసౌకర్యం కలిగించే నిజాలను చెప్పే జర్నలిస్టులు తమ పని నిరంతరం కొనసాగించగలిగినప్పుడే ప్రజాస్వామ్యం నిజమైన అర్థంలో బలంగా నిలబడుతుంది.
హింసను వెలుగులోకి తెచ్చిన మార్సెలా తురాతీ..
మెక్సికోతో పాటు అంతర్జాతీయ మీడియా సంస్థల్లో పనిచేస్తూ మార్సెలా తురాతీ తనదైన ముద్ర వేసుకున్న జర్నలిస్టుగా ఎదిగారు.
మెక్సికోలోని మాదకద్రవ్యాల యుద్ధం, దాని వెనుక దాగిన హింసను కేవలం గణాంకాలు, అధికారిక ప్రకటనలకే పరిమితం చేయకుండా ఆ హింసను ప్రత్యక్షంగా అనుభవించిన బాధితుల జీవితాల ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారు.
ఆమె రాసిన ఫ్యూగో క్రూజాడో ఈ దిశలో ఒక కీలకమైన రచన. మెక్సికో మాదకద్రవ్యాల యుద్ధం కథను బాధితుల అనుభవాల ద్వారా చెప్పేందుకు జరిగిన తొలి పెద్ద ప్రయత్నాల్లో ఇది ఒకటి. ఆ తర్వాత వచ్చిన సాన్ ఫెర్నాండో: ఉల్టిమా పరాడా ఆ పరిశోధనను మరింత ముందుకు తీసుకెళ్లింది. హింస వెనుక దాగిపోయిన నిజాలను వెలికితీసి బాధితుల గొంతును ప్రజల ముందుకు తీసుకురావడంలో తురాతీ చేసిన జర్నలిస్టిక్ కృషికి ఈ రెండు రచనలు నిదర్శనంగా నిలిచాయి.
నిబద్ధతకు నిదర్శనం..
మెక్సికోలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రాణహాని, బెదిరింపులను ఆమె తన రచనల్లో పదేపదే నమోదు చేశారు.
జర్నలిస్టులపై జరిగే నేరాలకు తరచూ శిక్ష పడకపోవడం, నేరస్థులు తప్పించుకోవడం వంటి వ్యవస్థాగత వైఫల్యాల వల్ల సమాజంపై పడుతున్న ప్రభావాన్నీ ఆమె వెలుగులోకి తెచ్చారు.
రాష్ట్రం పట్టించుకోని చోట జరుగుతున్న అన్యాయాలను తన జర్నలిజం ద్వారా వెలుగులోకి తెచ్చి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్న నిబద్ధతగల జర్నలిస్టుకు తురాతీ ఒక ఉదాహరణ అని మాన్సో పేర్కొన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ, “ఆ నిజాన్ని వెలికితీసే జర్నలిజానికి ఆమె చెల్లించిన మూల్యం తీవ్రమైనది. ఆమెకు సమాచారం అందిస్తున్నవారు ఎవరు, ఆమె కదలికలు ఏమిటన్నది తెలుసుకునేందుకు మెక్సికో ప్రభుత్వమే చట్టవిరుద్ధంగా ఆమెపై నిఘా పెట్టింది” అని చెప్పుకొచ్చారు.
అనువాదం : మనోహర రాజు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
