అమెరికా ఆవిర్భావాన్ని సమర్థించే కథనానికి ఆధారంగా నిలిచిన ప్రధాన స్తంభాలే నేడు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఒకప్పుడు దేశ ఐక్యతకు, జాతీయ గుర్తింపుకు ప్రతీకలుగా భావించిన ఆ విలువలు ఇప్పుడు తమ పూర్వపు బలాన్ని కోల్పోయాయి. వాటి అసలు అర్థం ఏమిటి? అవి ఎవరిని సూచిస్తున్నాయి? అనే ప్రశ్నలు నేడు తీవ్రమైన రాజకీయ, సామాజిక పోరాటానికి కేంద్రబిందువుగా మారాయి. అందుకే ఇప్పుడు ఆ కథనానికి సంబంధించిన అర్థాన్ని ఎవరు ఎలా నిర్వచిస్తారన్నదే ప్రధాన వివాదంగా నిలిచింది.
మొదటి ప్రపంచ యుద్ధం సృష్టించిన మారణహోమం మధ్య రచనలు చేస్తున్న స్వతంత్ర భావాల మేధావి రాండాల్ఫ్ బోర్న్ అమెరికా విప్లవ వారసత్వాన్ని ఒక ఘాటైన ఉపమానంతో విశ్లేషించాడు. ఆయన దృష్టిలో అది పట్టణ పెట్టుబడిదారీ వర్గానికీ, బానిస శ్రమపై ఆధారపడిన తోటల యజమానులకూ మధ్య కుదిరిన ఒక హీనమైన కలయిక.
స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం వంటి గొప్ప ఆదర్శాలను అమెరికా ప్రపంచానికి చాటిచెప్పినా వాటిపై డబ్బును దేవుడిగా భావించే పెట్టుబడిదారుల ఆధిపత్యం మనుషులనే బానిసలుగా కొనుగోలు చేసి అమ్ముకునే వ్యవస్థ, యజమానుల ముద్ర చెరగని విధంగా పడిందని బోర్న్ పేర్కొన్నాడు. అందువల్ల అమెరికా ప్రకటించిన ఆ ఉన్నత విలువలు ఆరంభం నుంచే ఆర్థిక ప్రయోజనాలకూ, బానిస వ్యవస్థకూ బందీలుగా మారిపోయాయని ఆయన విమర్శించాడు.
అమెరికా చరిత్రలో అత్యంత అవినీతిపరమైన, అసమర్థమైన పాలనల్లో ఒకదానికి నాయకత్వం వహిస్తున్న డొనాల్డ్ ట్రంప్ వంటి నాయకుల ఆధిపత్యంలో ఉన్న నేటి అమెరికాను చూస్తే అమెరికా స్వాతంత్ర్య ప్రకటనకు 250 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ సందర్భంగా రాండాల్ఫ్ బోర్న్ చేసిన విశ్లేషణ ఎంత నిజమో మరోసారి స్పష్టమవుతున్నట్లు కనిపిస్తుంది.
అపరిమిత లాభాల కోసం పరిగెత్తే మార్కెట్ ఉన్మాదం, నిరంతరం విస్తరిస్తున్న యుద్ధ యంత్రాంగం, వలసదారులపై విద్వేషపూరిత బహిష్కరణ రాజకీయాలు, స్థానిక జాతీయవాద ఉద్రేకాలు ఇవే నేటి కాలాన్ని నిర్వచిస్తున్న ప్రధాన లక్షణాలు. ఈ పరిస్థితులు బోర్న్ తన కాలంలో చేసిన హెచ్చరికలను ప్రతిధ్వనింపజేస్తున్నాయి. సమాజం తీవ్ర విభజనకు గురై, నైతిక విలువలు క్షీణించి, ప్రపంచంపై అమెరికా ఆధిపత్యం బలహీనపడుతున్న ఈ దశలో అవకాశవాదం మరియు నిర్దయ రాజకీయాలే పైచేయి సాధిస్తున్నాయి.
రాబోయే రోజుల్లో అమెరికా ఆవిర్భావ గాథను మరోసారి అట్టహాసంగా అపార వ్యయంతో దేశ ప్రజల ముందుకు తీసుకువస్తారు. క్రైస్తవ జాతీయవాదపు వస్త్రాలు తొడిగించి, ఆడంబరమైన సైనిక ప్రదర్శనలతో అలంకరించి దానిని మహిమామండితం చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే ప్రపంచ చరిత్రనే కొత్త దిశగా మలిచిన విప్లవాత్మక ఘటనగా ఆ కథనానికి ఒకప్పుడు ఉన్న స్ఫూర్తి, ప్రభావం మాత్రం క్రమంగా క్షీణించింది. 1776లో థామస్ పెయిన్ తన ప్రసిద్ధ కరపత్రం కామన్ సెన్స్‌లో చెప్పినట్లుగా అమెరికా లక్ష్యం అంటే సమస్త మానవజాతి లక్ష్యం అనే విశ్వజనీన భావన నేడు తన పూర్వపు శక్తిని కోల్పోయింది.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఈ విషయాన్ని మరచిపోవడం సులభమే. కానీ చాలా కాలం క్రితం కాదు. ఒకప్పుడు ఈ విముక్తి భావన ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ప్రేరేపించింది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రాత్రి బరాక్ ఒబామా తన విజయాన్ని కూడా అదే దృక్పథంలో వివరించాడు. అమెరికా ప్రకటించిన ప్రజాస్వామ్య ఆదర్శాలకు, ఆ దేశ వాస్తవ పరిస్థితులకు మధ్య ఉన్న అంతరాన్ని తన విజయం గణనీయంగా తగ్గించిందని ఆయన పేర్కొన్నాడు. అమెరికా అనేది ఏదైనా సాధ్యమయ్యే దేశమేనా అని ఇంకా ఎవరైనా సందేహిస్తుంటే, మన వ్యవస్థాపకులు కలగన్న స్వప్నం ఇప్పటికీ సజీవంగానే ఉందా అని ఎవరైనా ప్రశ్నిస్తుంటే, మన ప్రజాస్వామ్య శక్తిపై ఇంకా ఎవరికైనా అనుమానం ఉంటే ఈ రాత్రే వారికి సమాధానం అని ఒబామా ప్రకటించాడు.
మన చరిత్రలోని ఉత్తమ ఘట్టాలను సృష్టించినవారు సాధారణ ప్రజలే అని పేర్కొన్న ఒబామా తన అసాధారణ వక్తృత్వంతో అమెరికా చరిత్రకు ఒక నిరంతర పరిణామ క్రమాన్ని చిత్రించాడు. మహిళలకు ఓటు హక్కు సాధించిన ఉద్యమం నుంచి న్యూ డీల్ వరకు అక్కడి నుంచి పౌరహక్కుల ఉద్యమం అనంతరం స్వలింగ వివాహాలకు చట్టబద్ధ గుర్తింపు లభించడం వరకు ఇవన్నీ మరింత పరిపూర్ణమైన, సమానత్వపూర్వకమైన దేశ నిర్మాణం వైపు సాగుతున్న ఒకే నిరంతర ఇంకా పూర్తికాని ప్రయాణంలోని మైలురాళ్లుగా ఆయన అభివర్ణించాడు.
అమెరికాను సమస్త మానవాళి ఆకాంక్షలకు ప్రతినిధిగా చూపించే ఈ విశ్వజనీన కథనం రెండో ప్రపంచ యుద్ధ కాలంలోనే స్పష్టమైన రూపం సంతరించుకుంది. ఫాసిజానికి, జాతి వివక్షకు వ్యతిరేకంగా సాగిన పోరాటాల ఆధారంగా అది బలపడింది. ఆ విలువలు క్రమంగా సంప్రదాయవాద రాజకీయ, పాలక వర్గాలపై కూడా ప్రభావం చూపించాయి.
రెండో ప్రపంచ యుద్ధానంతర కాలంలో వివక్ష వ్యతిరేక సూత్రాలు చట్టాల్లోనూ, సామాజిక సంస్కృతిలోనూ క్రమంగా స్థిరపడటంతో అమెరికా చరిత్రను విముక్తి దిశగా సాగిన విజయాల పరంపరగా చిత్రీకరించడం ప్రారంభమైంది. ఆ కథనం ఒకవైపు దేశంలోని పాలక వ్యవస్థకు నైతిక సమర్థన కల్పించగా మరోవైపు ప్రపంచ నాయకత్వంపై అమెరికా చేసిన హక్కు దావాకు కూడా బలాన్ని చేకూర్చింది.
ఇటీవలి సంవత్సరాల్లో అమెరికా చరిత్రపై చాలాకాలంగా నెలకొన్న ఈ ఏకాభిప్రాయ కథనాన్ని ప్రశ్నించే స్వరాలు ప్రధాన స్రవంతిలోనే పెరుగుతున్నాయి. వాటిలో అత్యంత ప్రభావం చూపిన ప్రయత్నాల్లో ఒకటి న్యూయార్క్ టైమ్స్ ప్రారంభించిన 1619 ప్రాజెక్ట్. పౌరహక్కుల ఉద్యమాన్ని సమర్థించే ఉదారవాదులు చెప్పే అమెరికా ఆవిర్భావ కథనానికి సమాంతరంగా ఒక కొత్త ఆవిర్భావం గురించి అది ప్రతిపాదించింది. అయితే అదే సమయంలో అమెరికా అసలు ఆవిర్భావ కథనాన్ని తీవ్రంగా సవాలు చేస్తూ దానిపై కఠినమైన విమర్శను కూడా గుప్పించింది.
ఆ ప్రాజెక్టుకు ప్రధాన రచయిత్రి నికోల్ హన్నా జోన్స్ అభిప్రాయం ప్రకారం అమెరికా స్వాతంత్ర్య యుద్ధానికి ప్రధాన ప్రేరణ స్వేచ్ఛా సమానత్వాల కోసం పోరాటం కాదు. రాండాల్ఫ్ బోర్న్ పేర్కొన్న బానిస శ్రమపై ఆధారపడిన తోటల యజమానులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా బానిస వ్యవస్థను కొనసాగించే అవకాశాన్ని కల్పించాలనే స్వార్థపూరిత ఉద్దేశమే ఆ యుద్ధానికి ప్రధాన కారణమని ఆమె వాదించింది.
అమెరికా ఆవిర్భావ చరిత్రను ఈ విధంగా తిరిగి అర్థం చేసుకునే ప్రయత్నంపై సంప్రదాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నికోల్ హన్నా–జోన్స్ చేసిన వాదనలను అనేక మంది అమెరికా చరిత్రకారులు కూడా సవాలు చేశారు. అమెరికా పుట్టుకను బానిస వ్యవస్థ వారసత్వం కోణంలో అర్థం చేసుకోవాలా? లేక బానిసత్వ వ్యతిరేక పోరాటాల వారసత్వం కోణంలో చూడాలా? అనే అంశంపై వారు చాలాకాలంగా విస్తృతంగా చర్చిస్తున్నారు.
అయితే 1619 ప్రాజెక్ట్‌లోనూ దానిపై జరిగిన విస్తృత చర్చల్లోనూ ఒక కీలక అంశం దాదాపు విస్మరించబడింది. అదే భూమిని స్వాధీనం చేసుకోవాలనే తీరని ఆకాంక్ష పశ్చిమ దిశగా అమెరికా భూవిస్తరణ. అమెరికా విప్లవానికి ఊపునిచ్చిన ప్రధాన శక్తుల్లో ఇవి కూడా అత్యంత ముఖ్యమైనవే అయినప్పటికీ ఆ వాస్తవానికి తగిన ప్రాధాన్యం ఇవ్వబడలేదు.
స్వేచ్ఛ, విముక్తి అనే ఆదర్శాలతో పాటు భూవిస్తరణ కూడా అమెరికా విప్లవ కథనాన్ని నిలబెట్టిన రెండు ప్రధాన పునాదుల్లో ఒకటి. అమెరికా ఆవిర్భావ చరిత్రను అర్థం చేసుకోవాలంటే ఈ రెండింటినీ విడదీయలేము
వాస్తవానికి విముక్తి మరియు భూవిస్తరణ అమెరికా విప్లవ కథనాన్ని నిలబెట్టిన జంట స్తంభాలు. ఈ రెండూ బానిసత్వం–స్వేచ్ఛల చరిత్రతో, సరిహద్దుల నిరంతర విస్తరణతో అలాగే ఉత్తర అమెరికా ఖండమంతటా అనంతరం ప్రపంచవ్యాప్తంగా అమెరికా తన ప్రభావాన్ని విస్తరించుకున్న చరిత్రతో విడదీయరాని సంబంధం కలిగి ఉన్నాయి. అంతేకాదు అమెరికా ప్రజాస్వామ్యం తన పౌరులకు, నివాసితులలో అత్యధిక మందికి అవకాశాలు, ఆర్థిక సౌభాగ్యం కల్పించే వ్యవస్థ అనే భావనకు బలం చేకూర్చడానికి కూడా ఈ రెండు అంశాలను వివిధ సందర్భాల్లో ఉపయోగించారు.
అయితే నేటి సంక్లిష్ట పరిస్థితుల్లో భూవిస్తరణ మరియు విముక్తి పరస్పరం ఒకదానిని మరొకటి బలపరుస్తూ సమాజాన్ని ముందుకు నడిపించాయనే భావన తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సంపదలో పెరుగుతున్న అసమానతలు, పౌరహక్కుల పరిరక్షణలో వెనుకడుగులు, పోలీసు హింస, ప్రజల మద్దతు లేని యుద్ధాలు ఇవన్నీ కలిసి ఆ కథనంలోని నైతిక విశ్వసనీయతను క్రమంగా దెబ్బతీశాయి.
జూలై 4వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం ఒక బానిసకు ఏమి చెబుతుంది?
1852 జూలై 4న మాజీ బానిస, ప్రముఖ బానిసత్వ వ్యతిరేక ఉద్యమకారుడు ఫ్రెడరిక్ డగ్లస్ ఈ ప్రశ్నను సంధించాడు. అమెరికా తీవ్ర రాజకీయ విభేదాలు, అనిశ్చితిని ఎదుర్కొంటున్న కాలంలో ఆయన ఈ ప్రశ్నను లేవనెత్తాడు. ఆ సమయానికి కొత్తగా అమల్లోకి వచ్చిన ఫ్యూజిటివ్ స్లేవ్ చట్టం కారణంగా బానిసత్వం లేని రాష్ట్రాలు కూడా పారిపోయిన బానిసలకు ఆశ్రయం కల్పించలేని పరిస్థితి ఏర్పడింది. వారిని పట్టుకొని తిరిగి బానిసత్వంలోకి అప్పగించేందుకు చట్టమే అనుమతిచ్చింది.
నాకు లేదా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజలకు మీ జాతీయ స్వాతంత్ర్యంతో సంబంధం ఏమిటి? స్వాతంత్ర్య ప్రకటనలో ప్రతిష్ఠించిన రాజకీయ స్వేచ్ఛ, సహజ న్యాయం అనే గొప్ప సూత్రాలు మాకూ వర్తిస్తున్నాయా..? అని డగ్లస్ ప్రశ్నించాడు.
ఆ ప్రశ్నకు ఐదేళ్ల తరువాత 1857లో అంతర్యుద్ధానికి కాస్త ముందే అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన డ్రెడ్ స్కాట్ తీర్పు సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది. రాజ్యాంగం ప్రకారం బానిసత్వానికి ఉన్న అర్థంపై ఎలాంటి సందేహానికీ తావులేకుండా ఆ తీర్పు ఆఫ్రికన్ మూలాలు కలిగిన ప్రజలు వారి సంతతి అమెరికా పౌరులు కాలేరని ప్రకటించింది. అంతేకాదు శ్వేతజాతీయులు గౌరవించాల్సిన ఎలాంటి హక్కులు వారికి లేవు అని పేర్కొంటూ జాతి వివక్షను రాజ్యాంగబద్ధంగా సమర్థించే ప్రయత్నం చేసింది.
ఫ్రెడరిక్ డగ్లస్ సంధించిన ఆ ప్రశ్నకు బానిసల వారసుల పక్షాన స్పష్టమైన, సానుకూలమైన సమాధానం లభించాలంటే అమెరికా రక్తపాత అంతర్యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. బానిసత్వ వ్యవస్థ రద్దు కావడం, నల్లజాతి ప్రజలను పౌరులుగా రాజ్యాంగం గుర్తించడం ఆ పోరాటం ఫలితమే.
అయితే చట్టపరమైన విముక్తి మాత్రమే సమానత్వాన్ని తీసుకురాలేదు. నల్లజాతి అమెరికన్లు నిజమైన రాజకీయ హక్కులు, పౌర హక్కులను ఆచరణలో పొందడానికి మరో శతాబ్దం పాటు పోరాడాల్సి వచ్చింది. ఈ వాస్తవం అమెరికా సమాజంలో సమానత్వం పట్ల ఉన్న సందిగ్ధత తరచూ వెనక్కి తగ్గే ధోరణి ఎంత లోతుగా పాతుకుపోయిందో తెలియజేస్తుంది. ఆ విరుద్ధతలు, వెనుకడుగులు ఇప్పటికీ పూర్తిగా అంతరించిపోలేదని నేటి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.
1619 ప్రాజెక్ట్‌లోని కొన్ని వాదనలపై ఎంతటి విభేదాలు, విమర్శలు ఉన్నప్పటికీ అది అత్యంత స్పష్టంగా చూపించిన విషయం ఒక్కటే. జాతీయవాద చరిత్రకథనాన్ని, ప్రగతిశీల చరిత్ర దృక్పథాన్ని కలిపి నిర్మించిన అమెరికా సంప్రదాయ కథనం ఇక చెల్లాచెదురైపోయింది. ఒకప్పుడు విస్తృతంగా ఆమోదం పొందిన ఆ చారిత్రక సమన్వయం ఇప్పుడు విచ్ఛిన్నమైంది.
దీంతో అమెరికా ఆవిర్భావానికి అసలు అర్థం ఏమిటి? ఆ చారిత్రక వారసత్వానికి నేటి అమెరికాతో ఉన్న సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలు ఇప్పుడు మళ్లీ తీవ్ర రాజకీయ, మేధోపరమైన పోరాటానికి కేంద్రంగా మారాయి. అమెరికా స్థాపనను ఎవరు ఎలా అర్థం చేసుకోవాలి, దాని భావాన్ని ఎవరు నిర్వచించాలి అన్నది ఇక స్థిరమైన విషయం కాదు. అది నేడు తీవ్ర వివాదానికి, భిన్న వ్యాఖ్యానాలకు లోనవుతోంది.
అమెరికా స్వాతంత్ర్య దినోత్సవమైన జూలై నాలుగో తేదీ నేడు నిజంగా దేనికి ప్రతీక?
అమెరికా స్వాతంత్ర్య దినోత్సవమైన జూలై 4 వేడుకలు ప్రతి ఏడాది అమెరికన్లను తమ దేశ రాజకీయ స్వరూపం గురించి ప్రాథమిక ప్రశ్నలు వేసుకునేలా కొన్నిసార్లు ఆ ప్రశ్నలను మళ్లీ కొత్త కోణంలో చర్చించేలా ప్రేరేపిస్తుంటాయి. అయితే చరిత్రను పరిశీలిస్తే ఈ వేడుకలు ఆత్మపరిశీలనకు వేదికలుగా నిలవడం కంటే అసౌకర్యమైన నిజాలను తప్పించుకోవడానికి, కఠినమైన ప్రశ్నల నుంచి దృష్టి మళ్లించడానికి ఎక్కువగా ఉపయోగించబడినట్లు కనిపిస్తుంది.
1876లో అమెరికా స్వాతంత్ర్య శతాబ్ది వేడుకలు జరిగే సమయానికి అంతర్యుద్ధం అనంతరం కొనసాగిన పునర్నిర్మాణ (రీకన్స్ట్రక్షన్) కాలం చేదు అనుభవాలతో ముగింపుకు చేరుకుంది. అయినప్పటికీ ఆ వేడుకల్లో బానిసత్వం గురించి దాదాపు ప్రస్తావనే లేకుండా పోయింది. దాని బదులుగా అమెరికా పారిశ్రామిక శక్తిగా ఎదుగుతున్న తీరు, ఖండమంతటా సాగిన భూవిస్తరణ, పసిఫిక్ ప్రాంతం వరకు విస్తరించిన అమెరికా ప్రభావానికే ప్రధాన ప్రాధాన్యం ఇచ్చారు.
1893 జూలై 4న ప్రారంభమైన చికాగో ప్రపంచ ప్రదర్శన కూడా ఇదే కథనాన్ని మరింత బలపరిచింది. జాతి వేర్పాటు చట్టాలు అమల్లో ఉన్న నల్లజాతి ప్రజలపై హింస విస్తృతంగా కొనసాగుతున్న విదేశీ భూభాగాలపై సామ్రాజ్యవాద దండయాత్రలకు అమెరికా సిద్ధమవుతున్న కాలంలో జరిగిన ఆ ప్రదర్శన అమెరికా విస్తరణనే జాతీయ గొప్పతనానికి చిహ్నంగా చిత్రించింది.
ఆ ప్రదర్శన సందర్భంగా అమెరికన్ హిస్టారికల్ అసోసియేషన్‌లో చరిత్రకారుడు ఫ్రెడరిక్ జాక్సన్ టర్నర్ చేసిన ప్రసిద్ధ ఉపన్యాసం ఈ దృక్పథాన్నే ప్రతిబింబించింది. అమెరికా పశ్చిమ సరిహద్దులు వరుసగా విస్తరించడమే దేశ ప్రజాస్వామ్య వికాసానికి అసలు చోదకశక్తి అని ఆయన వాదించాడు. ఆ ప్రక్రియలో బానిసత్వ సమస్య కేవలం ఒక చిన్న ఘటన మాత్రమేనని భూమి సమృద్ధిగా అందుబాటులో ఉండటమే వ్యక్తిగత ఆస్తి కలిగిన స్వతంత్ర పౌరుల సమాజాన్ని నిర్మించడానికి ప్రధాన ఆధారమైందని ఆయన అభిప్రాయపడ్డాడు.
జూలై 4 స్వాతంత్ర్య దినోత్సవం ప్రతి ఏడాది అమెరికన్ల ముందుకు ఒక ప్రాథమిక ప్రశ్నను తీసుకువస్తుంది వారి దేశం నిజంగా ఎలాంటి రాజకీయ విలువలపై నిర్మితమైంది? దాని ప్రజాస్వామ్య స్వరూపం అసలు ఏమిటి? అనే ప్రశ్నలను మళ్లీ ఆలోచించే సందర్భాన్ని అది కల్పిస్తుంది
రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా ప్రవేశించిన తరువాత అమెరికా స్వాతంత్ర్యం, భూవిస్తరణల అసలు అర్థం ఏమిటనే అంశంపై చరిత్రను కొత్త కోణంలో తిరిగి పరిశీలించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ కొత్త చారిత్రక దృక్పథానికి 1945లో పులిట్జర్ బహుమతి పొందిన ఆర్థర్ ష్లెసింజర్ రచించిన ది ఏజ్ ఆఫ్ జాక్సన్ ఒక ప్రముఖ ఉదాహరణ.
ఆ గ్రంథంలో 1826 జూలై 4 అమెరికా స్వాతంత్ర్యానికి యాభై సంవత్సరాలు పూర్తయిన రోజు. యాదృచ్ఛికంగా అమెరికా మాజీ అధ్యక్షులు జాన్ ఆడమ్స్, థామస్ జెఫర్సన్ ఇద్దరూ మరణించిన రోజే అమెరికా విప్లవ తరం నుంచి ఆండ్రూ జాక్సన్ నాయకత్వంలోని కొత్త రాజకీయ తరానికి బాధ్యతలు బదిలీ అయిన చారిత్రక క్షణంగా చిత్రించబడింది.
ఆండ్రూ జాక్సన్ స్థానిక అమెరికన్ ఆదివాసీలపై అత్యంత క్రూరమైన యుద్ధాలు చేసిన వ్యక్తిగా, బానిసలను కలిగి ఉన్న యజమానిగా ప్రసిద్ధి చెందినప్పటికీ ష్లెసింజర్ ఆయనను ప్రజల పక్షాన నిలిచిన ప్రజాకర్షక నాయకుడిగా చిత్రించాడు. ఆస్తి లేని శ్వేతజాతీయ పురుషులకు ఓటు హక్కును విస్తరించిన జాక్సన్ చర్యను న్యూ డీల్ కాలంలో కార్మిక వర్గం సాగించిన హక్కుల పోరాటాలతో ఆయన పోల్చి చూశాడు.
ఈ దృక్పథం ప్రకారం అమెరికా స్వాతంత్ర్య ప్రకటనలోని నిజమైన విముక్తి సందేశం బానిసత్వ నిర్మూలనలో మాత్రమే లేదు. ఉత్పత్తి చేసే ప్రజా వర్గాలకు రాజకీయ శక్తిని అందించి థామస్ జెఫర్సన్ ధనికుల ఆధిపత్య వర్గంగా అభివర్ణించిన ఆర్థిక శక్తులపై వారిని నిలబెట్టడంలోనే దాని అసలు సారాంశం ఉందని ఈ చారిత్రక వ్యాఖ్యానం ప్రతిపాదించింది.
అయితే ఈ చారిత్రక వ్యాఖ్యానంలో ఒక గొప్ప వైరుధ్యం దాగి ఉంది. ప్రజాస్వామ్య విస్తరణకు ప్రతీకగా ఆండ్రూ జాక్సన్‌ను కీర్తించిన ఈ కథనం బానిసత్వ వ్యతిరేక ఉద్యమాలను ఆయన చురుకుగా అణచివేసిన విషయాన్ని, స్థానిక అమెరికన్ ఆదివాసీలను వారి భూముల నుంచి బలవంతంగా తరలించే విధానానికి ఆయన ఉత్సాహంగా మద్దతు ఇచ్చిన వాస్తవాన్ని, అలాగే మహిళలకు ఓటు హక్కు కల్పించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించిన అంశాన్ని పూర్తిగా విస్మరించింది.
అయినప్పటికీ అమెరికా స్వాతంత్ర్య ప్రకటన అణగారిన ప్రజల తిరుగుబాట్లకు, దిగువ వర్గాల విముక్తి పోరాటాలకు నైతిక అధికారాన్ని ఇచ్చే పత్రం అనే భావన ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రభావాన్ని చూపింది. 1945లో ష్లెసింజర్ గ్రంథం వెలువడిన అదే సంవత్సరంలో హనోయిలో లక్షలాది మంది ప్రజల సమక్షంలో జపాన్ ఆక్రమణ, ఫ్రెంచ్ వలస పాలన ముగిసిన సందర్భంగా హో చి మిన్ వియత్నాం స్వాతంత్ర్యాన్ని ప్రకటించాడు. తన ప్రసంగాన్ని ఆయన అమెరికా స్వాతంత్ర్య ప్రకటనలోని ప్రసిద్ధ వాక్యాలతో ప్రారంభించాడు: మనుషులందరూ సమానులుగానే జన్మించారు. వారికి జీవించే హక్కు, స్వేచ్ఛ, ఆనందాన్ని అన్వేషించే హక్కు వంటి ఎవరూ హరించలేని హక్కులను సృష్టికర్త ప్రసాదించాడు.
ఆ తరువాతి ఏడాది అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ ప్రభుత్వానికి పంపిన లేఖలో వియత్నాం ప్రజాస్వామ్య గణరాజ్య స్వాతంత్ర్య ప్రకటన ప్రతిని జతచేసి వియత్నాం ప్రజల స్వయంప్రతిపత్తి హక్కుకు అమెరికా మద్దతు ఇవ్వాలని హో చి మిన్ కోరాడు. అయితే ఆ లేఖకు అమెరికా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తరువాతి సంవత్సరాల్లో ఆయన పంపిన మరెన్నో లేఖలు, టెలిగ్రామ్‌లు కూడా అదే మౌనాన్నే ఎదుర్కొన్నాయి.
వియత్నాంపై అమెరికా సాగించిన దీర్ఘకాలిక, విధ్వంసకర యుద్ధం ముగిసిన తరువాత అలాగే పౌరహక్కుల ఉద్యమం దేశాన్ని తీవ్ర రాజకీయ విభేదాల మధ్య నిలబెట్టిన నేపథ్యంలో 1976లో జరిగిన అమెరికా ద్విశతాబ్ది స్వాతంత్ర్య వేడుకలు మళ్లీ బానిస యుగ దక్షిణాది జీవితంపై ఉన్న వ్యామోహాన్నీ, ఆడంబరమైన స్మారక సంస్కృతినీ ముందుకు తెచ్చాయి.
ఈ సందర్భంగా భారీ నౌకల ఊరేగింపు లోయర్ మాన్హాటన్ చుట్టూ సాగగా ప్రుడెన్షియల్, పెప్సీ, జనరల్ మోటార్స్ వంటి కార్పొరేట్ సంస్థల ప్రాయోజకత్వంలో నడిచిన ఫ్రీడమ్ ట్రెయిన్ అమెరికా ఖండమంతా సంచరించింది. ఆ రైలులో అమెరికా చరిత్రను సూచించే అనేక వస్తువులను ప్రదర్శించారు. పౌరహక్కుల ఉద్యమ నాయకుడు మార్టిన్ లూథర్ కింగ్ ధరించిన మతగురువు వస్త్రాల పక్కనే ది విజార్డ్ ఆఫ్ ఓజ్ చిత్రంలో డోరోథీ పాత్ర పోషించిన జూడీ గార్లాండ్ ధరించిన చెక్కుల దుస్తులను కూడా ఉంచారు. ఇలా చారిత్రక పోరాటాల ప్రతీకలను వినోద సంస్కృతికి చెందిన జ్ఞాపకాలతో కలిపి ప్రదర్శించారు.
ఆ సమయంలో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న జిమ్మీ కార్టర్ నల్లజాతి పౌరహక్కులకు, జాతి సామరస్యానికి మద్దతు తెలిపిన దక్షిణాది శ్వేతజాతీయ ప్రగతిశీల నాయకుడు జార్జియా రాష్ట్రంలోని లంప్కిన్ పట్టణంలో ఏర్పాటు చేసిన బానిస యుగ దక్షిణాది గ్రామ నమూనాలో గుర్రపు బండిపై ఊరేగింపులో పాల్గొన్నాడు. పాత దక్షిణాది భౌతిక, సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం లక్ష్యంగా 1960లలో రూపొందించిన ఆ ప్రదర్శన గ్రామం బానిస యుగాన్ని ఒక శృంగారభరిత జ్ఞాపకంలా చూపించే ప్రయత్నానికి ప్రతీకగా నిలిచింది.
ఇదిలా ఉండగా ఈ ద్విశతాబ్ది వేడుకలను కార్పొరేట్ సంస్థల ప్రచార కార్యక్రమంగా విమర్శించినవారికి న్యూయార్క్ శాఖ సన్స్ ఆఫ్ ది రివల్యూషన్ కార్యదర్శి రాబర్ట్ విలియమ్స్ ఇలా సమాధానమిచ్చాడు: డబ్బు సంపాదించడంలో తప్పేమీ లేదు. స్వేచ్ఛా మార్కెట్ వ్యవస్థే ఈ దేశాన్ని ఇంత దూరం తీసుకొచ్చింది. ఆయన వ్యాఖ్య అమెరికా జాతీయ వేడుకలు కూడా ఎంతగా మార్కెట్ ప్రయోజనాలతో ముడిపడి పోయాయో సూచించింది.
అదే సమయంలో ఫిలడెల్ఫియాలో నల్లజాతి లాటినో స్థానిక అమెరికన్ (ఆదివాసీ) ఉద్యమకారుల నాయకత్వంలోని జూలై ఫోర్త్ కూటమి అధికారిక వేడుకలకు ప్రత్యామ్నాయంగా ఒక ప్రతిఘటన సభను నిర్వహించింది. వలస పాలనలేని ద్విశతాబ్ది అనే నినాదంతో వారు అమెరికా తన ఆధీనంలోని ప్రజలపై కొనసాగిస్తున్న ఆధిపత్యాన్ని ప్రశ్నించడంతో పాటు ప్రతి ఒక్కరికీ ఉపాధి, గౌరవప్రదమైన జీవన ప్రమాణాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
అయితే అమెరికా ఇంకా పూర్తికాని విముక్తి ప్రాజెక్టు అనే భావన లేదా అణగారిన ప్రజల పోరాటాల ద్వారా నిరంతరం మార్పు చెందాల్సిన సమాజం అనే ఆలోచన అప్పటికే క్రమంగా బలహీనపడుతోంది.
అదే కాలంలో న్యూయార్క్ నగరంలో తన కుటుంబ రియల్ ఎస్టేట్ సంస్థపై జాతి వివక్ష ఆరోపణలతో ఫెడరల్ కోర్టు కేసును ఎదుర్కొంటున్న ముప్పై ఏళ్ల యువ వ్యాపారవేత్త డొనాల్డ్ ట్రంప్ ప్రజా జీవితంలో వేగంగా ఎదుగుతున్నాడు. కొద్ది కాలానికే రాండాల్ఫ్ బోర్న్ పేర్కొన్న పట్టణ పెట్టుబడిదారుడి ప్రతిరూపంగా ఆయన నిలిచాడు.
ఆ తరువాత రోనాల్డ్ రీగన్ పశ్చిమ సరిహద్దుల విస్తరణను మహిమపరిచే సంప్రదాయ కథనాలు, కౌబాయ్ తరహా యుద్ధోన్మాద రాజకీయాల ఆధారంగా అమెరికా అధ్యక్షుడిగా ఎదిగాడు. ఇదే సమయంలో ట్రంప్ కూడా తన భవిష్యత్ రాజకీయ, వ్యాపార విజయాలకు పునాది వేసే రాజకీయ ధోరణిని రూపొందించుకుంటున్నాడు. నేరాలు, సామాజిక పతనం గురించి జాతి విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రచారం చేయడం అలాగే అమెరికా వైభవం క్షీణిస్తోందని, మార్కెట్లలో అమ్ముడవుతున్న అనేక వస్తువులు విదేశీయుల చేత తయారవుతున్నాయని ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడం ఇవే తరువాత ఆయన రాజకీయాల ప్రధాన లక్షణాలుగా మారాయి.
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న ఈ సమయంలో జరగబోయే అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవం అమెరికా విప్లవ నాయకులు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన, శక్తివంతమైన బానిస సమాజాల్లో ఒకదాన్ని నిర్మించారని, ఆ వ్యవస్థను వారి వారసులే దీర్ఘకాల పోరాటం ద్వారా కూలదోశారని చెప్పే చారిత్రక వాస్తవాన్ని దాదాపు పూర్తిగా పక్కనపెట్టే అవకాశం ఉందని ఊహించడం కష్టం కాదు.
దానికి బదులుగా అమెరికా తొలి వలసదారుల సాహస స్ఫూర్తిని, దేశ సైనిక శక్తిని, వ్యాపార నాగరికతను అమెరికా విప్లవం యొక్క పరిపూర్ణమైన, లోపరహిత విజయాలుగా కీర్తించే కథనాలకే ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. ఆ వేడుకల మధ్య బానిస యుగ దక్షిణాది జీవితంపై కొంత వ్యామోహాన్ని కూడా అలంకారంలా జోడించే ప్రయత్నం జరిగే అవకాశముంది.
దీనికి సంకేతంగానే బానిస యజమాని అయిన మాజీ అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్ నివాసమైన టెన్నెసీలోని హెర్మిటేజ్ లో 1,776 అమెరికా జెండాలతో భారీ ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే వాషింగ్టన్ డీసీలో జరిగే అధికారిక వేడుకలకు నేపథ్యంగా ఒకప్పుడు కాన్ఫెడరేట్ మెమోరియల్ గా పిలవబడిన ప్రస్తుతం రీకన్సిలియేషన్ మాన్యుమెంట్ గా పేరు మార్చి పునరుద్ధరించిన స్మారక చిహ్నాన్ని ఉపయోగించనున్నారు. ఈ ఏర్పాట్లు అమెరికా తన చరిత్రలోని అసౌకర్యమైన సత్యాలను పక్కనపెట్టి మరింత మహిమామండితమైన జాతీయ కథనాన్ని ముందుకు తెచ్చే ప్రయత్నానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ట్రంప్ తనను తాను తరచుగా పోల్చుకునే ఆండ్రూ జాక్సన్‌ను అవినీతిపరమైన పాలక వర్గానికి వ్యతిరేకంగా సామాన్య ప్రజలకు రాజకీయ శక్తిని అందించిన నాయకుడిగా ఈ వేడుకల్లో ఘనంగా కీర్తిస్తారు. అయితే బానిస వ్యవస్థను మరింత విస్తరించడంలో ఆయన పోషించిన పాత్రను స్థానిక అమెరికన్ ఆదివాసీలను వారి స్వస్థలాల నుంచి బలవంతంగా తరిమివేయడానికి ఆయన ఇచ్చిన అధికారాన్ని మాత్రం దాదాపు ప్రస్తావించరు.
అమెరికా విప్లవం యొక్క వలసవాద వ్యతిరేక స్ఫూర్తిని ఆధారంగా చేసుకుని తమ దేశాల స్వాతంత్ర్య పోరాటాలకు నైతిక బలం పొందాలని ప్రయత్నించిన హో చి మిన్తో పాటు గ్లోబల్ సౌత్‌కు చెందిన అనేక మంది నాయకులు చివరికి ఒక చేదు వాస్తవాన్ని గ్రహించారు. అదే ప్రతీ తిరుగుబాటు ప్రతీ విముక్తి పోరాటానికి సమానమైన గుర్తింపు లేదా మద్దతు లభించదు. అధికారంలో ఉన్నవారి ప్రయోజనాలకు అనుకూలమైన పోరాటాలను మాత్రమే చరిత్ర గొప్పవిగా కీర్తిస్తుంది. మిగిలిన వాటిని తరచుగా నిర్లక్ష్యం చేస్తుంది లేదా అణచివేస్తుంది.
ఇంకా ఆవిష్కృతం కావాల్సి ఉన్న ఒక వారసత్వం
డొనాల్డ్ ట్రంప్ తొలి అధ్యక్ష పదవీకాలంలో వెలువడిన పులిట్జర్ బహుమతి పొందిన గ్రెగ్ గ్రాండిన్ గ్రంథం ది ఎండ్ ఆఫ్ ది మిత్ నేటి అమెరికా పరిస్థితిపై ఒక కీలకమైన పరిశీలన చేసింది. ప్రస్తుత కాలాన్ని అత్యంత ప్రత్యేకంగా నిలబెడుతున్న అంశం అమెరికాను నిరంతరం ముందుకు నడిపించిన చారిత్రక చలనశక్తి క్షీణించిపోవడమేనని ఆయన పేర్కొన్నాడు. ఇది చరిత్ర అంతం కాదు కొత్త అవకాశాల దిశగా చరిత్ర పయనించే మార్గాలే మూసుకుపోయిన పరిస్థితి.
ఒకప్పుడు నైతికంగానైనా, భౌతికంగానైనా విస్తరణకు కొత్త దారులను వెతికిన అమెరికా నేడు మాత్రం క్షీణత, పరిమిత ఆశలు, సంకుచిత దృష్టితో ముందుకు సాగుతోంది. చిన్న చిన్న ప్రయోజనాలకే పరిమితమవడం, ఎత్తైన కంచెలు నిర్మించడం, కొత్త వాణిజ్య అడ్డంకులు సృష్టించడం, మధ్య వయస్సులోనే పెరుగుతున్న మరణాలు, సరిహద్దు గోడలు, జైలు కటకటాలు ఇవే నేటి అమెరికా యుగానికి ప్రతీకలుగా మారాయని గ్రాండిన్ విశ్లేషించాడు.
ఈ కొత్త యుగానికి ప్రతీకగా నిలిచిన తొలి పరిణామాల్లో ఒకటి తన రెండో అధ్యక్ష పదవీకాలం మొదటి రోజే ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ద్వారా హామీ ఇవ్వబడిన 19వ శతాబ్దం చివర్లో న్యాయస్థానాల తీర్పులతో బలపడిన జన్మహక్కు పౌరసత్వం (Birthright Citizenship) సూత్రాన్ని పత్రాలు లేని వలసదారుల అమెరికాలో జన్మించిన పిల్లలకు వర్తించకుండా చేయాలని ఆయన ప్రయత్నించాడు.
అక్కడితో ఆగకుండా సైనిక చర్యలను తలపించే స్థాయిలో వలస నియంత్రణ దళాలను అమెరికా నగరాల్లో మోహరించడం, పశ్చిమ అర్ధగోళంలోని ఇతర దేశాలపై మరింత బలవంతపు దౌత్య విధానాలను అవలంబించడం, లక్ష్యిత సైనిక చర్యలను తీవ్రతరం చేయడం, అంతేకాక కెనడా, గ్రీన్‌ల్యాండ్‌లను అమెరికాలో విలీనం చేస్తామంటూ బెదిరింపులు చేయడం వంటి చర్యలు కూడా వరుసగా చోటుచేసుకున్నాయి.
ట్రంప్ చేపట్టిన ఈ చర్యలన్నీ చట్టపరంగానూ, నైతికంగానూ బలమైన ఆధారాలు లేని వాదనలపైనే నిలిచాయి. అయినప్పటికీ ఒక అధ్యక్షుడు కార్యనిర్వాహక ఉత్తర్వుతోనే పౌరసత్వ హక్కులను రద్దు చేయగలడనే భావన ఎన్నో ఏళ్లుగా అమెరికాలో నివసిస్తూ, చట్టాలను గౌరవిస్తున్న వలసదారులను నేరస్తుల్లా వెంబడించి నిర్బంధించవచ్చనే దృక్పథం, విదేశీ భూభాగాలను బలప్రయోగంతో స్వాధీనం చేసుకోవచ్చనే ఆలోచన ఇవన్నీ అమెరికా చరిత్రలో ఒకప్పుడు అమలులో ఉన్నా తరువాత ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని తిరస్కరించబడిన విధానాలను మళ్లీ చైతన్యపరచే ప్రయత్నాలుగా కనిపిస్తున్నాయి.
అయితే ట్రంప్ అనేక సందర్భాల్లో చారిత్రక సంప్రదాయాలను ధిక్కరించినప్పటికీ అమెరికా పౌరసత్వానికి జాతి, వలసవాదం వంటి అంశాలు ప్రాథమిక అర్హతలుగా ఉండాలనే భావన అమెరికా చరిత్రలో ఎప్పుడూ పూర్తిగా అంతరించిపోలేదు. ఆ వివాదం ఎన్నడూ పూర్తిగా ముగియలేదు.
20వ శతాబ్దం ప్రారంభంలో అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన ఇన్సులర్ కేసెస్ తీర్పులు కొత్తగా అమెరికా ఆధీనంలోకి వచ్చిన ప్యూర్టో రికో, గువామ్, ఫిలిప్పీన్స్ వంటి భూభాగాల ప్రజలకు అమెరికా రాజ్యాంగంలోని హక్కులు స్వయంచాలకంగా వర్తించవని ప్రకటించాయి. దీంతో ఆ ప్రాంతాలు పేరు మాత్రం అమెరికా ఆధీనంలో ఉన్నప్పటికీ వాస్తవానికి వలస పాలనను పోలిన పరిస్థితుల్లోనే కొనసాగాయి. అనేక అంశాల్లో ఆ పరిస్థితి ఇప్పటికీ పూర్తిగా మారలేదని విమర్శకులు చెబుతున్నారు.
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో వచ్చిన కోరెమాత్సు వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ తీర్పులో జపాన్ మూలాలు కలిగిన ప్రజలను అమెరికాలో జన్మించిన వారి పిల్లలను కూడా శత్రు విదేశీయులుగా పరిగణించి, జాతీయ భద్రత పేరుతో నిర్బంధించవచ్చని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ తీర్పును అమెరికా సుప్రీంకోర్టు అధికారికంగా తిరస్కరించింది మాత్రం 2018లోనే.
జాతీయ భద్రత పేరిట పౌరులు శాశ్వత నివాసితుల ప్రాథమిక హక్కులను కార్యనిర్వాహక అధికారంతో పరిమితం చేయవచ్చని ట్రంప్ చేస్తున్న వాదనల్లో ఆ పాత తీర్పుల ప్రతిధ్వనులు ఇప్పటికీ స్పష్టంగా వినిపిస్తున్నాయని రచయిత సూచిస్తున్నారు.
అంతేకాదు భూభాగాలను ఆక్రమించి విస్తరించాలనే పాత భావనను మళ్లీ ముందుకు తేవడం దేశ అంతర్భాగంలో నివసిస్తున్న తనకు ఇష్టం లేని వలసదారులను బహిష్కరించే విధానాలను అమలు చేయడం అలాగే కృత్రిమ మేధస్సు (AI), ఫైనాన్స్, టెక్నాలజీ వంటి కొత్త రంగాలను సాధారణ అమెరికన్లకు అపార సంపదను అందించే కొత్త సరిహద్దులుగా ప్రచారం చేయడం ద్వారా ట్రంప్ రెండో విడత పాలన అమెరికా చరిత్రలోని సరిహద్దుల విస్తరణ పురాణాన్ని మరోసారి పునరుద్ధరించింది. దాంతో అమెరికాలో ఇంకా పూర్తికాని సమానత్వం, విముక్తి కోసం సాగుతున్న పోరాటాన్ని ప్రధానంగా చెప్పే వోక్ కథనాన్ని వెనక్కి నెట్టే ప్రయత్నం జరిగింది.
సమానత్వం ఎలా సాధించాలి? న్యాయం అందరికీ ఎలా చేరాలి? వంటి క్లిష్టమైన ప్రశ్నలపై చర్చించాల్సిన అవసరం ఏముంది? దానికి బదులుగా పిల్లులు, కుక్కలను తినే అనాగరికులు, అత్యాచారులు, నేరస్థులు, ఉగ్రవాదులు పాశ్చాత్య నాగరికతను నాశనం చేయడానికి వస్తున్నారనే భయాన్ని ప్రజల్లో రేకెత్తించడం రాజకీయంగా మరింత సులభం కాదా? అని రచయిత వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నాడు.
ఈ విధంగా సమానత్వం గురించి జరిగే చర్చను పక్కకు నెట్టి భయం, విద్వేషం, జాతీయవాదాన్ని రాజకీయ ఆయుధాలుగా మార్చడం ట్రంప్ రాజకీయ వ్యూహంలో ప్రధాన భాగంగా మారిందని రచయిత సూచిస్తున్నారు.
ఈ విషయంలో ట్రంప్ ఒక్కడే కాదు అమెరికా చరిత్రలో ఆయనకు ఎంతోమంది పూర్వీకులు ఉన్నారు. థామస్ జెఫర్సన్ రచించిన స్వాతంత్ర్య ప్రకటన బానిసత్వం అనే ప్రశ్నపై ఉద్దేశపూర్వకంగా మౌనం పాటించినప్పటికీ స్థానిక అమెరికన్ ఆదివాసీల విషయానికి వచ్చేసరికి మాత్రం ఎలాంటి సందిగ్ధత చూపలేదు. వారిని వయస్సు, లింగం, స్థితిగతులు అనే తేడా లేకుండా విచక్షణారహితంగా విధ్వంసం సృష్టించే క్రూరమైన ఇండియన్ అడవి వాసులుగా వర్ణించింది. అంటే ఒకవైపు స్వేచ్ఛ, సమానత్వం గురించి ప్రకటిస్తూ మరోవైపు ఆదివాసీలపై జరుగుతున్న హింసను సమర్థించే ద్వంద్వ వైఖరి అప్పటి నుంచే అమెరికా రాజకీయాల్లో ఉందని రచయిత సూచిస్తున్నాడు.
ఇరాక్, ఆఫ్ఘానిస్తాన్ యుద్ధాల నేపథ్యంలో అమెరికా విదేశాంగ విధానాన్ని సమర్థించిన ఉదారవాద మేధావి పాల్ బెర్మన్ కూడా ఇదే భావజాలాన్ని మరో రూపంలో వ్యక్తం చేశాడు. ఇండియన్ యుద్ధాలను మీరు తిరస్కరిస్తే అమెరికాను తిరస్కరించినట్టే అని ఆయన వ్యాఖ్యానించాడు. అంటే అమెరికా చరిత్రలో భూవిస్తరణ కోసం జరిగిన హింసను అంగీకరించకుండా అమెరికా చరిత్రను అర్థం చేసుకోవడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయం.
అమెరికా రాజ్యాంగ రూపకర్తల్లో ఒకరైన జేమ్స్ మాడిసన్ కూడా విముక్తి, భూవిస్తరణ రెండూ పరస్పరం విడదీయరానివని వాదించాడు. కొద్దిమంది చేతుల్లో భారీ స్థాయిలో వ్యక్తిగత ఆస్తి, అందులో బానిసలు కూడా ఒక ఆస్తిగానే పరిగణించబడేవారు. కేంద్రీకృతమై ఉన్న సమాజంలో ఒక దశలో నిజమైన ప్రజా తిరుగుబాట్లు తప్పవని ఆయన భావించాడు. అలాంటి పరిస్థితిని నివారించడానికి దేశ భూవిస్తరణను కొనసాగించాలని, సామాన్య ప్రజల్లో కూడా ఒకరోజు తాము భూమి, సంపద సంపాదించగలమనే ఆశను పెంచాలని అదే సమయంలో బయటి శత్రువుల పట్ల భయాన్ని పెంపొందించాలని ఆయన సూచించాడు. ఈ విధంగా ప్రజల అసంతృప్తిని అంతర్గత అసమానతల నుంచి బాహ్య శత్రువుల వైపు మళ్లించవచ్చని ఆయన నమ్మాడు.
ఈ దృక్పథానికి అత్యంత బలమైన ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించిన వ్యక్తి బానిసత్వం మరియు సామ్రాజ్యవాదం అనే మచ్చల నుంచి విముక్తి పొందిన రెండో అమెరికా ఆవిర్భావం అనే భావనతో అత్యంత సన్నిహితంగా అనుబంధించబడిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్.
ఆయన హత్యకు గురికాకముందే అమెరికా అధికార వర్గాల ఆదరణను కోల్పోయాడు. కారణం స్వేచ్ఛ అంటే స్వయంప్రతిపత్తి అనే హక్కు అమెరికన్లకే పరిమితం కాదని వియత్నాం ప్రజలకు కూడా అదే నైతిక, రాజకీయ హక్కు ఉందని ఆయన ధైర్యంగా ప్రకటించడమే.
ఈ విషయంలో కింగ్ తన అభిప్రాయాన్ని అత్యంత స్పష్టంగా వ్యక్తం చేశాడు. ఇది ఒక విషాదకరమైన వాస్తవం. సౌకర్యాల పట్ల మమకారం, ఆత్మసంతృప్తి, కమ్యూనిజం పట్ల అనారోగ్యకరమైన భయం, అన్యాయానికి అలవాటుపడిపోయే మన ధోరణి ఇవన్నీ కలిసి ఆధునిక ప్రపంచంలో విప్లవాత్మక స్ఫూర్తికి ఒకప్పుడు పునాది వేసిన పాశ్చాత్య దేశాలనే నేడు విప్లవ వ్యతిరేక శక్తుల ప్రధాన కేంద్రాలుగా మార్చేశాయి.
ఈ వ్యాఖ్య ద్వారా కింగ్ చెప్పదలిచింది ఏమిటంటే ఒకప్పుడు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, స్వయంప్రతిపత్తి వంటి విలువలను ప్రపంచానికి బోధించిన పాశ్చాత్య దేశాలే తమ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం ఇప్పుడు అదే విలువలను అణచివేస్తున్నాయన్నది.
అమెరికా ప్రపంచానికి ప్రకటించిన విశ్వజనీన విలువలు నిజమైన నైతిక బలంపై నిలబడలేదు. అవి చవక ధరకు సంపాదించుకున్న ఆదర్శాలు. అంతేకాదు వాటి వైభవం చాలాసార్లు ఇతరుల శ్రమ, దోపిడీ, బాధ, త్యాగాల మీద నిర్మించబడింది. అందుకే ఆ విశ్వజనీనత అంతర్గతంగా బలహీనంగా మిగిలిపోయింది
మార్టిన్ లూథర్ కింగ్ మరో అత్యంత ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తు చేశాడు. అయితే కాలక్రమంలో ఆ ఆలోచన దాదాపు మరుగునపడిపోయింది. అమెరికా ప్రపంచానికి ప్రకటించిన విశ్వజనీన విలువలు అంతర్గతంగా బలహీనంగా ఉండటానికి కారణం అవి నిజమైన నైతిక పునాదులపై నిర్మించబడకపోవడమే. అవి చవక ధరకు సంపాదించుకున్న ఆదర్శాలు. అంతేకాదు ఆ విలువల కోసం చెల్లించిన అసలు మూల్యం చాలాసార్లు ఇతరుల శ్రమ, దోపిడీ, బాధ, త్యాగాల రూపంలో ఉండేది.
ఈ నేపథ్యంలో నల్లజాతి ప్రజల విముక్తి ఉద్యమం కేవలం వారి పౌరహక్కుల కోసం సాగిన పోరాటం మాత్రమే కాదని కింగ్ స్పష్టం చేశాడు. అది అమెరికా సమాజంలోని లోపాలు పైపైన కనిపించే సమస్యలు కావని, వ్యవస్థలోనే లోతుగా పాతుకుపోయిన నిర్మాణాత్మక అన్యాయాలని బహిర్గతం చేసిన ఉద్యమమని ఆయన పేర్కొన్నాడు.
నేడు నల్లజాతి అమెరికన్లకు జీవించే హక్కు, స్వేచ్ఛ, ఆనందాన్ని అన్వేషించే అవకాశం ఈ మూడింటిలో ఏదీ నిజంగా అందుబాటులో లేదు. అదే సమయంలో లక్షలాది మంది పేద శ్వేతజాతీయ అమెరికన్లు కూడా ఆర్థిక బానిసత్వంలో జీవిస్తున్నారు. వారు ఎదుర్కొంటున్న అణచివేత, నల్లజాతి ప్రజలు అనుభవిస్తున్న దమనకాండకు ఏమాత్రం తక్కువ కాదు అని కింగ్ వ్యాఖ్యానించాడు.
అంటే అమెరికాలోని అసమానత ఒకే జాతికి సంబంధించిన సమస్య కాదని మొత్తం సామాజిక, ఆర్థిక వ్యవస్థలోనే ఉన్న లోతైన సంక్షోభానికి అది నిదర్శనమని కింగ్ హెచ్చరించాడు.
ట్రంప్ రెండో అధ్యక్ష పదవీకాలంలో అమెరికా చరిత్రలోని భూవిస్తరణవాద ధోరణి మరింత దూకుడుతో తిరిగి ముందుకు వచ్చింది. అయితే ఈసారి అది ఒకప్పుడు దానితో ముడిపడి ఉన్న విముక్తి, సమానత్వం వంటి ఆదర్శాల నుంచి పూర్తిగా విడిపోయింది. అంటే భూవిస్తరణ అనే అంశం మాత్రమే మిగిలి, దానికి నైతిక సమర్థనగా చెప్పబడిన విముక్తి భావన దాదాపు కనుమరుగైంది.
ఇండియన్ యుద్ధాలను మీరు అంగీకరించకపోతే అమెరికాను కూడా అంగీకరించనట్టే అనే వాదన నేడు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ సామాజిక మాధ్యమాల్లో పెట్టే సందేశంలా అనిపించవచ్చు. అలాగే మధ్యప్రాచ్యంలో తన భూవిస్తరణ విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్న ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చే నినాదంగానూ వినిపించవచ్చు. రచయిత దృష్టిలో అమెరికా వలసదారుల స్థాపన చరిత్రను చిన్న స్థాయిలో ప్రతిబింబించే దేశంలా ఇజ్రాయెల్ వ్యవహరిస్తూ తన సొంత విస్తరణ ప్రాజెక్టును కొనసాగిస్తున్నదనే విమర్శ ఇక్కడ వ్యక్తమవుతోంది.
అయితే నేటి కాలంలో కనిపిస్తున్న హింస, అవినీతి, అధికార దుర్వినియోగానికి ఒకప్పుడు ఉన్నట్లుగా నైతిక సమర్థన కల్పించే సిద్ధాంతపరమైన చట్రం దాదాపు లేకుండాపోయింది. 2008లో డెమోక్రాట్లు అధికారంలోకి వచ్చినప్పుడు అమెరికా ప్రతిష్ఠను కొంతవరకు పునరుద్ధరించగలిగినట్లుగా ఈసారి వారు మళ్లీ అధికారంలోకి వచ్చినా అదే పని అంత సులభంగా చేయగలరని చెప్పలేం.
ప్రపంచ ప్రజల దృష్టిలో అమెరికా ఇక థామస్ పెయిన్ చెప్పినట్లుగా సమస్త మానవాళి కోసం పోరాడే దేశంగా కనిపించడం లేదు. దానికి బదులుగా అనేక ప్రాంతాల్లో బాధలు, విధ్వంసం, అస్థిరతకు కారణమైన శక్తిగా కనిపిస్తోంది.
జాతి సమానత్వం వైపు అమెరికా మళ్లీ పురోగమిస్తున్నదనే పాత కథనాన్ని తిరిగి ప్రాణం పోయడం గానీ అలాంటి చవకబారు రాజకీయ హామీలను మరోసారి ముందుకు తేవడం గానీ ఈసారి అమెరికా సామ్రాజ్యవాద విధానాలకు నైతిక విముక్తిని కల్పించలేవని రచయిత అభిప్రాయపడుతున్నాడు.
ఇప్పుడు పట్టణ పెట్టుబడిదారులు బానిస వ్యవస్థపై ఆధారపడిన తోటల యజమానుల వారసత్వాన్ని ప్రతిబింబించే శక్తులే మళ్లీ అధికార పీఠంపై కూర్చున్నాయి. అదే సమయంలో థామస్ పెయిన్ ఒకప్పుడు స్వేచ్ఛ కోసం సమస్త మానవాళి చేసే విశ్వజనీన పోరాటంగా అభివర్ణించిన విప్లవ వారసత్వం మాత్రం కొత్త రూపంలో, కొత్త అర్థంతపునర్జన్మ పొందేందుకు ఇంకా ఎదురుచూస్తూనే ఉంది.
నిఖిల్ పాల్ సింగ్
ది గార్డియన్ సౌజన్యంతో
అనువాదం : మనోహర రాజు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
