సాహసమో, దుస్సాహసమో ఇప్పుడప్పుడే తేల్చలేము. రాజధాని విషయం మీద జగన్ ఆడుతున్న జూదంలో ఇదే పెద్ద పందెం. రాబోయే ఎన్నికలలో తాను పేరు పెట్టిన ‘మావిగన్’ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) రాజధానిగా కావాలా లేక ఇప్పుడు చంద్రబాబు నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ అమరావతి రాజధానిగా కొనసాగాలా అన్న అంశం మీదే రిఫరెండంను ఓటర్ల నుంచి కోరతానని ప్రకటించేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై చర్చ దాదాపు ముగిసిపోయిందని అందరూ భావిస్తున్నారు.
ఈ సమయంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సవాల్ విసరడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనిక పైకి జగన్ ఈ అంశాన్ని పెద్దస్థాయిలో చర్చకు పెట్టారు.
ఈ అంశాన్ని ఇప్పుడు నెత్తికెత్తుకోవడం, అదీ ఈ స్థాయిలో ఆత్మహత్యా సదృశమని భావించేవాళ్ళు చాలా మందే ఉన్నారు.
ఇప్పుడే ఆయన సరైన వ్యూహంతో బయటకు వచ్చారని, తెలుగుదేశం – జనసేన కూటమిని ఈ అంశం బాగా ఇరుకున పెడుతుందని వాదించే మేధావులూ ఉన్నారు.
ఈ రాజకీయ సమరం రాష్ట్రానికి ఆర్థిక వెసులుబాటును కల్పిస్తుందా? న్యాయ సమీక్షలకు నిలబడగలుగుతుందా? మావిగన్ అయితేనే తన ముద్ర కనపడుతుందా?
ముందుగా ప్రజలను ఒప్పించటం ఎలా? ఏ నమ్మకమో, ఏ అంచనాయో లేకుండా, తన మూడు రాజధానుల ప్రతిపాదనను పక్కకు పెడుతూ ఈ స్థాయిలో వివాదాన్ని జగన్ సృష్టిస్తారా?
గ్రీన్‌ఫీల్డ్ అమరావతి వర్సెస్ బ్రౌన్ ఫీల్డ్ మావిగన్..
ఒక పక్క ఎన్నో నెలలు శ్రమించి, రకరకాల కసరత్తులు చేసి, చాలా జాగ్రత్తగా ప్రతి చిన్న విషయాన్ని పొందుపరుస్తూ ప్లాన్ గీసుకున్న గ్రీన్‌ఫీల్డ్ నగరం ‘అమరావతి’. 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, కృష్ణానదిని ఆనుకుని, అత్యంత సారవంతమైన భూమిలో ప్రపంచస్థాయి కట్టడాలతో నిర్మించదలచిన ఆంధ్రుల అద్భుత రాజధానీ నగరం.
మరో పక్క 110 కిలోమీటర్ల పొడవునా విస్తరించిన, మూడు నగర కేంద్రాలైన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలుపుతూ నిర్మించగలిగిన బ్రౌన్ ఫీల్డ్ నగర కారిడార్ ‘మావిగన్’.
ఒక మహా నగర నిర్మాణానికి పునాది నుంచి పూనుకునే బదులు, ఈ కారిడార్‌తో ఇప్పటికే జనసాంద్రత ఎక్కువగా ఉన్న మూడు మున్సిపల్ కార్పోరేషన్లను కలుపుకుంటూ వెళితే ఏర్పడే రాజధాని నగరం.
రాజధాని అంటే కొన్ని బ్లూప్రింట్ల సమన్వయం కాదు. ప్రజా సంపద కొద్దికొద్దిగా చాలానే ఒక చోట చేర్చబడటం. రాష్ట్రాన్ని శాసించే అధికార గణం అంతా ఒక చోట కేంద్రీకరింపబడటం. అనేక న్యాయపరమైన చిక్కులను పరిష్కరించడం.
ఒక్క మాటలో చెప్పాలంటే పాలన అంతా దాని చుట్టూ పరిభ్రమించడం, మరి అలాంటప్పుడు ఈ రెండు ప్రతిపాదనలను ఏఏ కోణాలలో ఎలా అర్థం చేసుకోవాలి?
అసలు చిక్కుముడి ఎక్కడ?
జగన్ ప్రతిపాదిస్తున్న మావిగన్ ప్రాంతంలో చాలా భాగం ఇప్పుడు అమరావతి కేంద్రంగా ఏర్పడిన క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(సీఆర్డీఏ) సరిహద్దులలోనే ఉంది.
మచిలీపట్నం పోర్టు భాగం ఈ అథారిటీకి బయటవున్న ప్రాంతంగా చెప్పుకోవచ్చు, రెండు ప్రతిపాదనలలో పేర్కొన్న ప్రాంతం దాదాపుగా ఒకటే అయినా ఈ చిక్కు ఎందుకు వస్తున్నది?
జగన్ మావిగన్‌లో ‘అమరావతి’ లేదు.
ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఏ గ్రామాల రైతులైతే భూమిని ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చారో ఆ 26 గ్రామాల కోర్ ప్రాంతం మావిగన్‌లో లేదు.
చంద్రబాబు నాయుడు ఏర్పరిచిన సీఆర్డీఏలో మచిలీపట్నం పోర్టులేదు. అవసరమని భావిస్తే ఆ ప్రాంతాన్ని చేర్చడంలో ఇబ్బంది ప్రస్తుత ప్రభుత్వానికి ఉండదు. కానీ అసలు చిక్కుముడి ‘అమరావతి’ ప్రాంతమే.
ఆర్ధిక, న్యాయపరమైన సవాళ్లు..
నిజానికి అమరావతిని ఇప్పుడు పక్కన పెట్టడం ఆషామాషీగా జరిగే వ్యవహారం కాదు. ఆర్థికపరమైన రిస్కు చాలా పెద్దది.
ఇప్పటికే హైకోర్టు, నిర్వహణా సిబ్బంది ఇళ్ళ సముదాయాలు, ట్రంక్ – రోడ్లు వంటి మౌలిక సదుపాయాల కల్పనలో 16,000 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు.
మరో 50,000 కోట్ల రూపాయల పనులు మొదలయ్యాయి లేదా ప్రభుత్వ అనుమతులు లభించాయి.
ఇంతటి భారీ పెట్టుబడుల నుంచి 26 గ్రామాల ‘కోర్’ ప్రాంతం నుంచి హఠాత్తుగా ఖాళీ చేసి వెళ్ళటం అంత తేలికగా కుదిరే పనికాదు. ఇప్పటికే రుణభారంతో ఉన్న ప్రభుత్వ ఖజానాపై ఈ పెనుభారం కూడా తోడయితే అది మరింత నీరుగారడమే కానీ ముందు పడుతుందన్న ఆశ ప్రజలకు ఉండే అవకాశం తక్కువ.
అమరావతికి చట్టపరమైన, న్యాయపరమైన రక్షణలు కోటగోడలుగా నిలబడతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన తీర్మానం ప్రాతిపదికగా పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్(అమెండ్మెంట్) యాక్టు, 2026ను ఆమోదించింది.
రాష్ట్రపతి సంతకంతో అది చట్టంగా రూపుదాల్చింది. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని ‘అమరావతి వద్ద’ అనే మాటలు స్పష్టంగా చేర్చబడ్డాయి.
రైతుల త్యాగాలు – చట్టపరమైన చిక్కులు..
26 గ్రామాల ప్రజలు ల్యాండ్ పూలింగ్ సిస్టంతో దీనికి అనుసంధానం చేయబడ్డారు.
30వేల మంది రైతులు 33 వేల ఎకరాలను స్వచ్ఛందంగా నగర నిర్మాణానికి ఇచ్చి, బదులుగా అభివృద్ధి చేసి ఇచ్చిన వాణిజ్య స్థలాలను తీసుకోవడానికి చేసుకున్న చారిత్రాత్మక ఒప్పందం.
దీన్ని ఉనికిలో లేకుండా చేయడం, పోనీ పని చేయకుండా చేయడం చట్టపరమైన చిక్కుల ఊబిలోకి నేరుగా దిగిపోవడమే.
ఈ వేల మంది రైతులు, తమ వద్ద ఉన్న ఒప్పంద పత్రాలతో, ఏ క్షణంలో రాజధానిని కదల్చాలని చూస్తారో ఆ క్షణంలోనే యుద్ధానికి దిగుతారు.
చరిత్రలో రెండుసార్లు రాజధానుల నుంచి తరిమివేయబడ్డామని అవమాన భారాన్ని మోస్తున్న ఆంధ్ర ప్రజల కలల రాజధానిని నిర్మించేందుకు, తమ జీవన మార్గాలను త్యాగం చేశామని నమ్ముతున్న వారికి ఈ యుద్ధం పెద్ద విషయం కాదు.
ఈ ఉద్వేగం కృష్ణా, గుంటూరు జిల్లాలలో కూడా ఎంతోకొంత ఉండి తీరుతుంది.
పైగా జగన్ 2014లో అయిష్టంగానైనా ‘అమరావతి’ని అంగీకరించారనీ- 2019లో ఎన్నికలకు ముందు, తాను రాజధానిలో ఇల్లు కూడా నిర్మించుకున్నానని, ఆ మాటకు వస్తే చంద్రబాబుకే ఇక్కడ ఇల్లు లేదని మాట్లాడారని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
పైగా తన ప్రభుత్వ కాలమంతా మూడు రాజధానుల జపం చేశారని, నిర్వహణా రాజధానిగా విశాఖపట్నం ఉంటుందని పలుమార్లు చెప్పారనీ, 2024లో గెలిస్తే విశాఖపట్నం నుంచే పాలన ఉంటుందని ప్రకటించారని కూడా ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటున్నారు.
‘అభివృద్ధి వికేంద్రీకరణ’ అన్న ఆ నినాదం ఇప్పుడేమయిందని ప్రశ్నిస్తున్నారు. ఉత్తరాంధ్రను, రాయలసీమను ఇప్పుడు ఏ పేరుతో వదిలేస్తారని అడుగుతున్నారు.
అమరావతిపై జగన్ వర్గం వాదనలు..
అమరావతిది ఒక అంతులేని కథ అని జగన్ వాదన. మొదటి దశలో 33వేల ఎకరాలు కావాలని, ఇప్పుడు మరో 50 వేల ఎకరాలను రెండవ దశలో సమీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న మాట నిజం.
కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే 2 లక్షల కోట్ల రూపాయలు కావాల్సివస్తుందనీ, ఈ గాలిలో మేడలు మనకెందుకనీ ఆయన అడుగుతున్నారు.
వేల ఎకరాలలో రైల్వే స్టేషన్లు, విమానాశ్రయం, ఒక క్రీడా నగరం, ఒక ఎలక్ట్రానిక్ నగరం, ఒక జ్ఞాన నగరం ఇలా నిర్మించుకుంటూ పోవాలంటే తరాలు దాటినా కష్టమే నన్నది ఆయన పాయింట్.
2015లో ఉత్సాహంగా ముందుకు వచ్చిన రైతులు కూడా ఈ రెండవ దశ ల్యాండ్ పూలింగ్ పట్ల అంత సానుకూలతను ప్రదర్శించటం లేదని కూడా ఆయన వర్గం గుర్తు చేస్తోంది. మొదటి దశలో భూమి ఇచ్చిన వారికే అభివృద్ధి చేసిన వాణిజ్య స్థలాలను ఇప్పటివరకూ అప్పగించలేదు. కేవలం కాగితాలపై మాత్రమే వారికి కేటాయించబడ్డాయి.
ప్రస్తుతానికి కౌలు దొరుకుతుంది కాబట్టి ఫర్వాలేదనీ, నిజంగా ఈ వేల, వేల వాణిజ్య స్థలాలను అప్పజెప్పేసి, కౌలు ఆపేస్తే అప్పుడు అమరావతి రైతులకు నిజంగా దేవతలు కన్పిస్తారని కూడా వాదిస్తున్నారు. సుమారు 80వేల ప్లాట్లలో ఏ నిర్మాణాలు జరగాలి? ఏ ప్రజలు వచ్చి ఇక్కడ నివసించాలి?
పైగా ఈ మోడల్ ఎలా ఉండబోతోందంటే ఆఫీసు సమయాల ఆవల ప్రజలకు గుంటూరు, విజయవాడ, ఆ మాటకొస్తే హైదరాబాద్ చేరుకునే సదుపాయం ఉన్నప్పుడు ‘డౌన్‌టౌన్’ చుట్టూ సబ్-అర్బన్ ప్రాంతాలకు వెళ్ళిపోయినట్లు ప్రజలు వెళ్ళిపోతారని చెపుతున్నారు. అలా అని అభివృద్ధి జరగదా అంటే జరుగుతుంది కానీ చంద్రబాబు చెప్పినట్లు జరగదని వారు వాదిస్తున్నారు. రాజధాని వేరు; రాజధానీ నగరం వేరని వారు గుర్తు చేస్తున్నారు.
పలు కీలక ఆరోపణలు..
నగరాలు ఒక్క రోజులో నిర్మించబడవని మనకు ఎన్నో సామెతలు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు రావడం అటుంచి, ఇక్కడున్న రైతులే నెమ్మది నెమ్మదిగా పెట్టుబడిదారులకు తమ ప్లాట్లను అమ్ముకొని ‘రివర్స్ మైగ్రేషన్’ జరిగి, ఎక్కడికి వెళ్ళిపోవాల్సివస్తుందో మన ఊహకు కూడా అందదని చెపుతున్నారు.
పెట్టుబడిదారులకు ఇదొక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు. అనుకూలమైన సమయం వచ్చేదాకా ఆగగలిగిన ఆర్థిక సత్తా వారికి ఉంటుంది. ఇది కాకులను కొట్టి గద్దలకు వేయడం తప్ప మరొకటి కాదని అంటున్నారు.
గొప్ప గొప్ప కలలెప్పుడూ అసాధ్యాలుగానే కన్పిస్తాయనే వాదనకు బదులుగా కలల బేహారుల మాట విని ఎండమావుల వెంట పరిగెత్తటం అంత తెలివైన పని కాదని వాదిస్తున్నారు.
మరో యాభై ఏళ్ళకు జరిగే విషయాల కోసం, ప్రజల నేటిని బలిపెట్టటం మంచిది కాదని హితవు పలుకుతున్నామని చెపుతున్నారు.
పైగా అమరావతి నిర్మాణాలలో అంతులేని అవినీతి రాజ్యమేలుతోందని, ఇది పాలకపక్షానికి ధనరాశులు పెద్దఎత్తున కూడబెట్టే కల్పతరువుగా మారిందనేది మరో ఆరోపణ.
తెలంగాణా అసెంబ్లీ, మోదీ నిర్మించిన కేంద్ర పార్లమెంట్ భవనాల కంటే ఎక్కువ ఖర్చు జరుగుతోందని మాట్లాడుతున్నారు.
ఇప్పటికైనా ఈ తెల్ల ఏనుగును వదిలించుకొని మావిగన్‌లో పరిపాలనా భవంతులను రోడ్లకు ఇరువైపులా ప్రభుత్వ స్థలాలలో నిర్మించుకుంటూ పోతే రాజధాని దానంతట అదే తయారవుతుందని చెపుతున్నారు. మరో పదివేల కోట్లలో పూర్తి అయిపోయే పనికి ఇన్ని లక్షల కోట్ల ప్రణాళికలు అవసరమా? అన్నది వీళ్ళ ప్రశ్న.
రాజకీయ వ్యూహం – 2029 ఎన్నికల లక్ష్యం..
ఇలా ఎవరి వాదనలు వారికి ఉన్నా, ఎవరికుండే రాజకీయ కోణాలు వారికి ఉంటాయి. చాలామంది విమర్శకుల అభిప్రాయం ప్రకారం జగన్ తీసుకున్న ఒక గాంబుల్ ఇది.
మూడు రాజధానుల ప్రతిపాదన విఫలమైందని జగన్ గ్రహించారు. పార్లమెంటులో చట్టం చేశాక అది మరింత బాగా ఎవరికైనా అర్థం అవుతోంది. ఎన్నికలలోకి దిగితే అది పూర్తిగా అంకెల యుద్ధమే.
అమరావతి కోర్ ప్రాంతంలో కేవలం రెండే అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కానీ మావిగన్ కారిడార్ దాదాపు పదిహేను అసెంబ్లీ నియోజక వర్గాలకు నెలవుగా ఉంటుంది మరి.
2029 ఎన్నికలను రెండు అసెంబ్లీ నియోజకవర్గాల అమరావతి కోర్ ప్రాంతమా? విశాలమైన పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల ప్రాంతమా? దేన్ని మీరు ఎంపిక చేసుకుంటారు? అమరావతి కోర్ ప్రాంతం బయట, చుట్టూ ఉన్న లక్షలాది అర్బన్, సెమీ అర్బన్ ఓటర్లను లక్ష్యంగా చేసుకున్నారు కనుకే ‘మావిగన్’ ప్రతిపాదన అని కూడా అంటున్నారు.
మూడు రాజధానుల ప్రతిపాదన వీగిపోయింది కాబట్టే తాను ఈ ప్రతిపాదన చేయాల్సి వస్తుందని కూడా ఆయన చెపుతారు.
అమరావతికి వెళ్ళే లక్షల కోట్లలో కొన్నైనా ఉత్తరాంధ్రకు, రాయలసీమకు, సంక్షేమ పథకాలకు కేటాయించగలను కదా అని ఆయన వాదించే అవకాశం ఉంది.
అమరావతి ఎంత కాదన్నా చంద్రబాబు అస్తిత్వంతో ముడిపడిఉంది. అది లేని దాదాపు అదే ప్రాంతం మావిగన్ జగన్ సృష్టించిన పేరు. ఇది ఇతని వారసత్వం. రాజకీయాలు చాలాసార్లు వారసత్వ పంచాయితీలే కదాని కూడా విమర్శకులు అంటున్నారు.
ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది?
కానీ ప్రజలు ఎవర్ని నమ్ముతారనేదే అసలు ప్రశ్న. ఇప్పటికే వేల కోట్ల ఖర్చుపెట్టిన అమరావతికి జై కొడతారా? లేదంటే తక్షణ పరిష్కారంతో నిర్మించగలిగే మావిగన్‌తో సర్దుకుంటారా? అన్నది 2029 ఎన్నికల ఫలితాల వరకు తెలియదు.
భారతీయ జనతాపార్టీ ఎటువైపు ఉంటుంది? అన్న సందేహం రెండు వర్గాలలో ఎవరికీ లేదు. ఎందుకంటే వారికి తెలుసు, రాష్ట్రంలో గెలిస్తే చాలు, గెలిచిన వారి పక్కనే అది ఉంటుందని దానితో ఏ పేచీ లేదని, పేచీ అంతా ప్రజలతోనేనని.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
