కేవలం తమ పార్టీనే కాదు, పౌరుల ఓటును కాపాడేందుకు ప్రతిపక్ష పార్టీలు ముందుకు రావాలని సంతకాలు చేసిన వారు కోరారు. అరకొరగా అప్పుడప్పుడూ స్పందించడం కాకుండా ప్రస్తుత పని తీరులో మార్పులు చేసుకొని కనీస ఉమ్మడి ప్రజాస్వామ్య నియమాలను స్థాపించాలని సూచించారు.
న్యూఢిల్లీ: తమ రాజ్యాంగపరమైన బాధ్యతను గుర్తు చేసుకొని పోరాటాన్ని పెంచాలని మాజీ న్యాయమూర్తులు, ఆర్థికవేత్తలు, హక్కుల కార్యకర్తలు, ప్రొఫెసర్లు, ఇతర ప్రముఖ పౌరులతో కూడిన ఒక బృందం దేశంలోని ప్రతిపక్ష పార్టీలను కోరుతూ బహిరంగ లేఖ రాసింది.
ప్రతిపక్షం తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ, తదుపరి జరిగే ప్రతి ఎన్నికలో విశ్వసించే విధంగా పౌరుల ఓటు హక్కును కాపాడాలని వారు డిమాండ్ చేశారు.
రాజ్యాంగబద్ధమైన, సంస్థాగతమైన అంశంగా దీనిని పరిగణించాలే తప్ప కేవలం పార్టీ-రాజకీయ పోరాటంగా చూడరాదని 32 మంది పౌరులు సంతకం చేసిన ఆ లేఖ పేర్కొంది.
“ప్రతి పౌరుడు ఓటు వేసే తన హక్కును కాపాడుకోవడానికి ఎన్నికల సంఘం సహాయపడుతుందా లేదా ఒక పార్టీకి కొమ్ముకాస్తుందా అన్న దాంతో నిమిత్తం లేకుండా, ప్రస్తుతం ఎన్నికల సంఘం తప్పుడు నిర్వహణపై దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో భారత ఎన్నికల సంస్థల సమగ్రత చుట్టూ ఇమిడి ఉన్న అంశంగా దీనిని ప్రతిపక్షం మార్చాలి” అని సంతకాలు చేసిన వారు అన్నారు.
సీఈసీ నియామకంలో పారదర్శకత అవసరం
“సీఈసీ నియామకానికి పారదర్శక, నిష్పాక్షిక ప్రక్రియ అవసరం. అర్హులైన ఓటర్లను మినహాయించే లేదా తొలగించే ప్రక్రియను ప్రతిఘటించడంలో పార్లమెంటులో, వీధుల్లో ఉమ్మడిగా అందరికంటే ముందుండి ప్రతిసారీ ఎన్నికల ప్రక్రియ ద్వారా ప్రజల తీర్పు మాత్రమే వెలువడే విధంగా చూడాలి. ఏ యంత్రాంగం ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారో ఆ యంత్రాంగంపై ప్రతి పౌరుడికీ నమ్మకం కలిగించి ప్రజాస్వామ్యాన్ని బతికించే బాధ్యత కేవలం ప్రజలదే కాదు, ప్రతిపక్షాలది కూడా” అని గుర్తు చేశారు.
తమ ఆరు డిమాండ్ల జాబితాను ముందు ఉంచుతూ, కేవలం తమ పార్టీనే కాకుండా ఓటును సమర్థిస్తూ సాక్ష్యాలను రికార్డుల్లో నమోదు చేయడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ప్రతిపక్ష పార్టీలను వారు కోరారు.
అరకొరగా స్పందించడం కాకుండా కనీస ఉమ్మడి ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం కోసం ప్రస్తుత పని తీరులో మార్పులు చేసుకోవాలని డిమాండ్ చేశారు.
“సంస్థాగత స్వాతంత్ర్యం, సాంకేతికత, ఓటర్ల తొలగింపులు, ఓటర్ల జాబితాను సవాల్ చేసేందుకు పౌరులమైన మేము వచ్చే ఎన్నికల వరకు వేచి ఉండలేము. మనం క్లిష్టమైన దశలో ఉన్నాము. కేవలం రోజువారీ వివాదాలపై పార్లమెంట్లో, వీధుల్లో స్పందించే విధంగా కాకుండా శాశ్వత ప్రాతిపదికన ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గట్టి వైఖరి తీసుకోవడానికి ప్రస్తుత తరుణం అవకాశాన్ని కల్పిస్తోంద”ని అన్నారు.
“ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఎన్నికైన ప్రతిపక్షం మరింత క్రియాశీలకంగా, సాక్ష్యాల ఆధారంగా వ్యవహరిస్తూ చిత్తశుద్ధితో న్యాయపరమైన ఫలితాలను కల్పిస్తుందని ఆశిస్తున్నాము. ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా సభ ముందుంచిన అభిశంసన తీర్మానంతో పాటు పార్లమెంటరీ పరిశీలనను నిలబెట్టాలి” అని వారు కోరారు.
పౌరులు ప్రేక్షకులు కాదు.. ప్రతిపక్షం రక్షకులు కాదు
“పౌరుడు ప్రేక్షకుడు కాదు. ప్రతిపక్షం రక్షకుడు కాదు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజ్యాంగం, సంస్థలు, పౌరులే కేంద్ర బిందువులు. పౌరులమైన మేము అంతా చూస్తున్నాము. మీకు రాజ్యాంగబద్ధమైన పాత్ర ఉందని మేము గుర్తిస్తున్నాము. దాన్ని నెరవేరుస్తారని ఆశిస్తున్నాం. దాన్ని మీరు ఏ విధంగా నెరవేరుస్తారో అన్న దానికి మిమ్మల్ని జవాబుదారీ చేస్తామ”ని వారు రాశారు.
ఎన్నికైన ప్రతిపక్షంగా పార్టీలు అస్పష్టతను, ఏకపక్షంగా అధికారాన్ని వినియోగించడాన్ని వ్యతిరేకించాలి. న్యాయబద్ధమైన ప్రశ్నలను దాటవేయడాన్ని వ్యతిరేకించాలి. ఎవరు బాధ్యులైనప్పటికీ సంస్థల జవాబుదారీతనాన్ని బలహీనపరచడాన్ని వ్యతిరేకించాలి. ప్రతి ఓటునూ లెక్కించే పౌరుడి పక్షాన నిలబడాలి.
లేఖపై సంతకాలు చేసిన ప్రముఖులు
1. జస్టిస్ అజిత్ ప్రకాశ్ షా, ఐసీజే కమిషనర్, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి
2. జస్టిస్ హరిపరంథమన్, మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి
3. ఎంజీ దేవసహాయం, మాజీ ఐఏఎస్ అధికారి, సిటిజన్స్ కమిషన్ ఆన్ ఎలక్షన్స్ కోఆర్డినేటర్
4. అంజలి భరద్వాజ్, సతర్క్ నాగరిక్ సంఘటన్
5. డాక్టర్ పరకాల ప్రభాకర్, ప్రముఖ ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకులు
6. ప్రొఫెసర్ గణేశ్ దేవీ, సాంస్కృతిక కార్యకర్త
7. నిఖిల్ దే, ఎంకేఎస్ఎస్
8. ప్రకాశ్ రాజ్, నటుడు, కార్యకర్త
9. లలితా రాందాస్, అహింసా శాంతి కార్యకర్త
10. ప్రొఫెసర్ అరుణ్ కుమార్, ప్రముఖ ఆర్థికవేత్త
11. ఆకార్ పటేల్, కాలమిస్టు
12. తారా రావు, ఆల్ ఇండియా పీపుల్స్ మిషన్
13. ఈఏఎస్ శర్మ, మాజీ ఐఏఎస్ అధికారి
14. డాక్టర్ పీవీ రమేశ్, ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి
15. తీస్తా సెతల్వాద్, సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్
16. సురేంద్ర నాథ్, మాజీ ఐఏఎస్ అధికారి
17. అమితాభ పాండే, మాజీ ఐఏఎస్ అధికారి
18. అమృతా జోహ్రీ, సతర్క్ నాగరిక్ సంఘటన్
19. కమల్ మల్హోత్రా, యూఎన్ సెక్రటరీ జనరల్ మాజీ ప్రతినిధి
20. అవయ్ శుక్లా, మాజీ ఐఏఎస్ అధికారి
21. కొనినికా రే రోనేష్, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ
22. ప్రొఫెసర్ రాహుల్ ముఖర్జీ, రాజకీయ శాస్త్ర విభాగం
23. మాధవ్ దేశ్ పాండే, కంప్యూటింగ్ టెక్నాలజీ నిపుణులు
24. అశోక్ శర్మ, మాజీ దౌత్యవేత్త
25. ఏ సునీత, ఆల్ ఇండియా ఫెమినిస్ట్ అలయన్స్
26. జాన్ దయాళ్, సంపాదకులు, కార్యకర్త
27. డాక్టర్ సంతోష్ మెహ్రోత్రా, ప్రముఖ ఆర్థికవేత్త
28. హెన్రీ తిఫాంగే, మానవ హక్కుల రక్షకులు
29. ప్రొఫెసర్ ఎన్ మను చక్రవర్తి, బెంగళూరు యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్
30. ఫ్రాంకో థామస్, బ్యాంక్ అధికారుల సమాఖ్య జాతీయ మాజీ కార్యదర్శి
31. దినేశ్ అబ్రోల్, పీపుల్ సైన్స్ నెట్ వర్క్
32. కె రామచంద్ర మూర్తి, మాజీ సంపాదకులు
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్ట్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
