ఢిల్లీలో ఓటర్ల తొలగింపు వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. బూత్ లెవెల్ ఏజెంట్లు(బీఎల్ఏ) ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ తర్వాత రోజుకు పది ఫారాలకు మించి సమర్పించకూడదని ఎన్నికల సంఘం నిబంధనలు చెబుతున్నప్పటికీ, కొందరు దీనిని తప్పించుకోవడానికి కొత్త మార్గాలు వెతుకుతున్నారని ది హిందూ నివేదిక పేర్కొంది.
ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ముమ్మర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – ఎస్ఐఆర్) ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడానికి ఉపయోగించే ఫారం 7లు విరివిగా దుర్వినియోగం అవుతున్నాయని ఆ నివేదిక స్పష్టం చేసింది.
అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ దశలో బూత్ లెవెల్ ఏజెంట్లు రోజుకు కేవలం 10 దరఖాస్తులు మాత్రమే సమర్పించాలన్న ఎన్నికల సంఘం పరిమితిని దాటిపోయారు.
వారు ఈసీఐనెట్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు సమర్పిస్తూ ఈ పరిమితిని అతిక్రమిస్తున్నారు. ఈ పోర్టల్‌లో రోజువారీ దరఖాస్తుల సమర్పణపై ఎలాంటి పరిమితులు లేకపోవడమే ఇందుకు కారణం.
ఈసీఐనెట్ పోర్టల్ లోపాలు
ఈ పోర్టల్, దాని కేంద్రీకృత నియంత్రణ వ్యవస్థ ఎస్ఐఆర్ ప్రక్రియలో అత్యంత వివాదాస్పద అంశంగా మారాయి.
దీని నిర్వహణపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అధికారికంగా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్త బయటపెట్టినప్పటి నుంచి ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశమైంది.
ఓటర్ల జాబితాలో పేర్ల చేరికపై వచ్చే అభ్యంతరాల పబ్లిక్ లిస్ట్(ఫారం 10 నివేదికలు)ను ది హిందూ విశ్లేషించింది.
సెప్టెంబర్ 21 నుంచి 27 మధ్యకాలంలో నలుగురు వ్యక్తులు రోజుకు 10 కంటే ఎక్కువ దరఖాస్తులను సమర్పించినట్లు ఈ విశ్లేషణలో తేలింది.
నిర్ణీత 10 ఫారాల పరిమితిని అమలు చేసే వ్యవస్థ ఈసీఐనెట్ సాఫ్ట్‌వేర్‌లో లేదు.
బీజేపీ ఏజెంట్ అక్రమాలు
భారతీయ జనతా పార్టీకి చెందిన బూత్ లెవెల్ ఏజెంట్ చిత్రేష్ చందోలియా రెండు రోజుల్లో ఏకంగా 35 అభ్యంతరాలు దాఖలు చేసినట్లు నివేదిక వెల్లడించింది.
సెప్టెంబర్ 21న 12, సెప్టెంబర్ 22న 23 అభ్యంతరాలు సమర్పించారు. చిత్రేష్, వాయవ్య ఢిల్లీ బీజేపీ ఎంపీ యోగేందర్ చందోలియా కుమారుడు.
తాను నేరుగా ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి ఈ ఫారాలను సమర్పించి ఉంటే పది కంటే ఎక్కువ అనుమతించేవారు కాదని తనే స్వయంగా పత్రికకు అంగీకరించారు.
“నేను ఏ ఇతర పౌరుడిలాగే లాగిన్ అయ్యి, ఫారాలు నింపడానికి ఆధార్ అథెంటికేషన్‌ను ఉపయోగిస్తున్నాను. నేను బీఎల్ఏ అని పేర్కొనడానికి అక్కడ ఎలాంటి ప్రత్యేక విభాగం లేదు” అని తను వివరించారు.
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బీఎల్ఏలు ముసాయిదా ఓటర్ల జాబితా వెలువడిన తర్వాత రోజుకు పది ఫారాలకు మించి సమర్పించకూడదన్న షరతుకు లోబడి బల్క్‌గా దరఖాస్తులు చేయవచ్చని ఎన్నికల సంఘం మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.
గ్రౌండ్ రియాలిటీ వేరు
చిత్రేష్ ఫారం 7లు దాఖలు చేసిన ఇళ్లను ది హిందూ బృందం సందర్శించింది. ఆ ఇళ్లలో ఒకరైన కర్నైల్ సింగ్ అనే వ్యక్తి అదే చిరునామాలో నివసిస్తున్నట్లు వారు గుర్తించారు.
అయితే కర్నైల్ సింగ్ తన పోలింగ్ బూత్‌కు దూరంగా నివసిస్తున్నందున అతని పేరును జాబితా నుంచి తొలగించాలని తాను కోరినట్లు చిత్రేష్ పత్రికకు తెలిపారు.
సంగం విహార్‌కు చెందిన 20 ఏళ్ల అపూర్వ్ ద్వివేదీ అనే యువకుడు తన పేరుపై తానే అభ్యంతరం తెలుపుతూ, చనిపోయినట్లుగా కారణం చూపుతూ ఫారం 7 దాఖలు చేసినట్లు కనిపించడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం.
నివేదిక మరిన్ని అవకతవకలను కూడా గుర్తించింది. కరోల్ బాగ్‌కు చెందిన బీజేపీ ఏజెంట్ దాఖలు చేసిన అన్ని ఫారం 7లలో ‘గైర్హాజరు లేదా శాశ్వతంగా వేరే చోటికి మారారు’ అనే కారణం చూపించారు.
సంబంధిత వ్యక్తులు జాబితాలో పేర్కొన్న చిరునామాల్లో నివసించడం లేదని లేదా తమ ఇళ్లను విక్రయించారని అతను పేర్కొన్నారు.
వివాహం చేసుకుని ఆ ప్రాంతం లేదా నగరం విడిచివెళ్లిన 15 మంది మహిళల పేర్లు కూడా ఇందులో ఉన్నాయి.
పటేల్ నగర్ పార్ట్ 38లో రాజ్ సింగ్ అనే వ్యక్తి సెప్టెంబర్ 26న 13 పేర్లపై అభ్యంతరాలు దాఖలు చేసినట్లు పత్రిక పరిశీలనలో తేలింది.
అక్కడ ఒకే నంబర్‌తో పలు ఇళ్లు ఉన్నాయి. డ్రాఫ్ట్ రోల్లో పేర్కొన్న చిరునామాలో సోదరులు దానిష్ ఖాన్, తౌఫిక్ ఖాన్ నివసిస్తున్నారు, కానీ వారు ‘గైర్హాజరు లేదా శాశ్వతంగా వేరే చోటికి మారారు’ అనే కారణంతో వారి పేర్లపై అభ్యంతరం వ్యక్తమైంది. అయితే ఈ విషయం ఆ ఇద్దరు సోదరులకు ఏమాత్రం తెలియదు.
బెంగాల్, ఒడిశాల్లోనూ ఇదే పరిస్థితి
బెంగాల్లో జరిగిన ఓటర్ల జాబితా సవరణలో ఫారం 6 దరఖాస్తులు ఎక్కువగా ఉన్నప్పటికీ, వాటికంటే ఫారం 7 దరఖాస్తుల పరిష్కారం ఎక్కువగా జరిగిందని ది వైర్ గతంలో నివేదించింది.
ఫారం 7 ద్వారా భారీ స్థాయిలో ఓటర్ల తొలగింపు బెంగాల్ ముమ్మర సవరణ ప్రక్రియలో ఒక ప్రధాన అంశంగా మారింది. ఇది ముస్లిం ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపింది.
పశ్చిమ బెంగాల్లో ఆమోదం పొందిన 16 లక్షలకు పైగా ఓటర్ల తొలగింపు అభ్యర్థనలు అధికారుల ద్వారా కాకుండా బల్క్ అప్డేట్ల ద్వారా జరిగాయని రికార్డులు చెబుతున్నట్లు ద వైర్ ప్రత్యేకంగా నివేదించింది.
ఒడిశాలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. అక్కడి ఒక ఓటరు ది వైర్‌తో మాట్లాడుతూ “ఫారం 7 సమర్పించిన వ్యక్తి మా పొరుగున కూడా నివసించడం లేదు. అతను దాదాపు 20 మైళ్ల దూరంలో ఉంటున్నాడు. నేను ఇంకా ఇక్కడే నివసిస్తున్నానా, వేరే చోటికి మారాను లేదా నేను చనిపోయానా అనే విషయం అతనికి ఎలా తెలుస్తుంది?” అని ప్రశ్నించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
