కృత్రిమ మేధ(ఏఐ) సృష్టిస్తున్న ఊహించని సాంకేతిక సుడిగాలిలో మానవాళి తన దిశనూ, దశాబ్దాల విలువలనూ వెతుక్కుంటున్న క్లిష్ట సమయమిది.
సాంకేతికత కేవలం కోట్లాది డాలర్ల లాభాలను గడించే బహుళజాతి కంపెనీల గుత్తాధిపత్యానికే పరిమితం కావాలా, లేక సామాన్య మానవుడి జీవితాన్ని సుసంపన్నం చేసే సాధనంగా మారాలా అన్న ప్రశ్న నేడు ప్రపంచం ముందు నిలిచింది.
ఈ చారిత్రక ఘట్టంలో చైనాలోని సాంస్కృతిక, డిజిటల్ రాజధాని ‘హాంజౌ’ నేల సాక్షిగా ప్రపంచానికి ఒక స్పష్టమైన, పదునైన సమాధానం లభించింది.
సెప్టెంబర్ 1 నుంచి 4 వరకు అత్యంత వైభవంగా జరిగిన ‘ఆసియా పసిఫిక్ కోఆపరేటివ్ యూత్ సమ్మిట్ (ఎపిసివైఎస్ 5.0)’ పది వసంతాల పండుగను జరుపుకోవడమే కాక, రాబోయే డిజిటల్ యుగానికి సహకార రంగం ఎలాంటి దిక్సూచిగా నిలవాలో ప్రపంచానికి స్పష్టం చేసింది.
ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ ఆసియా-పసిఫిక్, ఐసివైసి ఆధ్వర్యంలో, చైనా ప్రభుత్వ సహకార సమూహాల భాగస్వామ్యంతో జరిగిన ఈ సదస్సుకు 13 దేశాల నుంచి 130 మంది యువ నాయకులు, సాంకేతిక నిపుణులు, విధానకర్తలు తరలివచ్చారు.
“నైతిక ఏఐ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలను తీర్చిదిద్దుతున్న యువత” అనే ప్రతిష్టాత్మక ఇతివృత్తంతో ఈ అంతర్జాతీయ వేదిక మార్మోగింది.
చైనా సాంప్రదాయ వాయిద్యం ‘గుజెంగ్’ మంత్రముగ్ధమైన నాదం, చైనా కళాకారుల విచిత్ర ‘ముఖాల మార్పిడి’ విన్యాసాలు, కదిలించే గాత్రాలతో ప్రారంభమైన ఈ సమ్మేళనం మొదటి నిమిషం నుంచే సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.
ప్రారంభోత్సవంలో మాట్లాడిన అంతర్జాతీయ ప్రతినిధులు డిజిటల్ ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న పక్షపాతాలను, అల్గారిథమిక్ వివక్షను, పెరుగుతున్న డిజిటల్ వ్యత్యాసాలను ప్రధానంగా ప్రస్తావించారు.
కేవలం అతికొద్ది ప్లాట్‌ఫారమ్ కంపెనీల చేతుల్లోనే సాంకేతిక అధికారమంతా కేంద్రీకృతమవుతున్న వేళ, దానికి ఏకైక, బలమైన మానవీయ ప్రత్యామ్నాయం ప్రజాస్వామ్యయుతమైన ‘సహకార నమూనా’ మాత్రమేనని స్పష్టంగా ప్రకటిస్తూ సదస్సుకు శంఖారావం పూరించారు.
ఏఐని సేవ చేసే సాధనంగా..
ఈ నాలుగో విడత సదస్సు కేవలం ఏసీ రూముల్లో సాగే పొడిపొడి ప్రసంగాలకే పరిమితం కాకుండా, యువతకు లోతైన అవగాహనను, ఆచరణాత్మక ఆలోచనలను అందించే అధ్యయన వేదికగా మారింది.
సాంకేతికతను చూసి భయపడి వ్యతిరేకించడం గానీ, లేదా దాని ప్రతికూల ప్రభావాలను చూడకుండా గుడ్డిగా నెత్తిన పెట్టుకోవడం గానీ రెండూ ప్రమాదకరమేనన్న సత్యం చర్చల్లో వ్యక్తమైంది.
ఏఐని భయపెట్టే శక్తిగా కాకుండా, మానవాళికి సేవ చేసే బాధ్యతాయుత సాధనంగా తీర్చిదిద్దడమే నవ యువ సహకార నాయకుల ప్రాథమిక విధి అని ప్రసంగాలు స్పష్టం చేశాయి.
ప్లీనరీ సెషన్లలో అంతర్జాతీయ నిపుణులు, వివిధ సంస్థల సీఈఓలు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో సహకార రంగానికి ఉన్న విస్తృత అవకాశాలపై దృష్టి సారించారు. అనంతరం జరిగిన ‘స్టార్టప్ ప్రయాణం’ వర్క్‌షాప్‌లో ప్రతినిధులు కేవలం శ్రోతలుగా మిగిలిపోకుండా క్రియాశీల పాత్ర పోషించారు.
వివిధ దేశాల యువత కలిసికట్టుగా తమ ఊహాత్మక సహకార సంస్థలను సున్నా నుంచి నిర్మించి, వాటి యాజమాన్య పద్ధతులు, సవాళ్లను స్వయంగా అనుభవించి వేదికపై ప్రతిపాదించడం వారికొక అపూర్వమైన ఆచరణాత్మక అభ్యాసంగా మారింది.
సాంకేతిక సాయుధులుగా యువత
రెండవ ఘట్టంలో సాగిన ‘డిజిటల్ అండ్ ఏఐ టూల్‌కిట్’ శిక్షణా తరగతులు యువతలో కొత్త ఆశలను నింపాయి.
సహకార సంస్థల రోజువారీ నిర్వహణలో, కమ్యూనికేషన్లలో ఎంతవరకు ఏఐ వాడవచ్చు? ప్రభుత్వం పరిమితులు ఎక్కడ ప్రారంభమవ్వాలి? అనే ప్రశ్నలకు సాంకేతిక ఆధారాలతో సమాధానాలు వెతికారు.
ఈ శిక్షణ ద్వారా ప్రతినిధులు కేవలం సమాచారాన్ని వినడమే కాకుండా, స్వయంగా ఏఐ ఆధారిత వెబ్సైట్లు, డాష్‌బోర్డ్‌లు, డిజిటల్ న్యూస్లెటర్లు తయారుచేసే స్థాయికి నైపుణ్యాలను పెంపొందించుకుని నిజమైన ‘సాంకేతిక సాయుధులు’గా మారారు.
ఆచరణాత్మక పరిష్కారాల అన్వేషణ
సదస్సులో అత్యంత పదునైన ఆలోచనలను రగిలించిన ఘట్టం ‘పాలసీ హ్యాక్ డైలాగ్’ (క్లిష్టమైన విధానపరమైన సమస్యలకు త్వరితగతిన, ఆచరణాత్మకమైన పరిష్కారాలను కనుగొనడానికి నిర్వహించే ఆలోచనాత్మకమైన చర్చా కార్యక్రమం).
ఏడు వేర్వేరు సమాంతర బృందాలుగా విడిపోయిన యువత- ఏఐ నైతికత, ప్లాట్‌ఫారమ్ నిబంధనలు, యువతల భాగస్వామ్యం వంటి నిరంతరం కలవరపెట్టే అంశాలపై లోతైన విధాన నిర్ణయాలను రూపొందించారు.
తమ తమ దేశాల్లో, క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న ప్రత్యక్ష అనుభవాలను క్రోడీకరిస్తూ, ఒక సాధారణ సహకార సభ్యుడు సైతం ప్రభుత్వ పాలసీ రూపకల్పనలో ఎలా భాగస్వామి కావాలో స్పష్టమైన ముసాయిదా నమూనాలను తయారుచేసి ఆశ్చర్యపరిచారు.
కేవలం ఆలోచనలు, సాంకేతికతలనే కాకుండా ఈ వేదిక మానవీయ స్పందనల నిలయంగానూ మారింది. ‘ఓపెన్ మైక్, స్టోరీ సర్కిల్’ కార్యక్రమంలో పాలస్తీనా, భారత్, ఇండోనేషియా, చైనాలకు చెందిన సాంకేతిక, సామాజిక సంస్థల యువ నాయకులు తమ అనుభవాలను పంచుకున్నారు.
యుద్ధాలు, పేదరికం, వనరుల కొరత వంటి అత్యంత క్లిష్టమైన పరిస్థితులను తట్టుకుని, సహకార రంగాన్ని ఆసరాగా చేసుకుని తమ జీవితాలను ఎలా పునర్నిర్మించుకున్నారో వివరిస్తుంటే సభ మొత్తం ఉద్వేగానికి లోనైంది. సహకార శక్తి వెనుక ఉన్న అసలైన మానవీయ బలమేంటో ఈ కథనాలు నిరూపించాయి.
‘కో-ఆప్ పిచ్’ పోటీలో బహుమతులు
సదస్సుకు ప్రధాన ఆకర్షణగా నిలిచిన ‘కో-ఆప్ పిచ్’ పోటీలో 9 దేశాలకు చెందిన అత్యుత్తమ భావనలు తలపడ్డాయి.
న్యాయనిర్ణేతల హృదయాలను గెలుచుకుంటూ పాలస్తీనాకు చెందిన ‘రిఫ్రేమింగ్ ఆర్కిటెక్ట్స్ కోఆపరేటివ్’ సహకార నిర్మాణ నమూనాతో ప్రథమ బహుమతి గెలుచుకోగా, సముద్ర వ్యర్థాల నుంచి పెంపుడు జంతువుల వ్యర్థ నిర్వహణ ఉత్పత్తులను తయారుచేసే చైనాకు చెందిన ‘చోంగ్క్సింగ్’ (నవవికాసం) టెక్నాలజీ ద్వితీయ స్థానంలోనూ, స్మార్ట్ వ్యవసాయ విధానాలను ప్రతిపాదించిన వియత్నాం బృందం తృతీయ స్థానంలోనూ నిలిచి నగదు పురస్కారాలను, అంతర్జాతీయ మార్గదర్శకత్వాన్ని దక్కించుకున్నాయి.
ముగింపు ఘట్టం.. ప్రతిజ్ఞ
నాలుగు రోజుల జ్ఞాన యజ్ఞం ముగింపులో పాల్గొనే ప్రతినిధులంతా నైతిక ఏఐ దిశగా తమ బాధ్యతలను స్వీకరిస్తూ చారిత్రాత్మక ప్రతిజ్ఞను ఆవిష్కరించారు.
‘గో గ్రీన్’ పర్యావరణ ప్రచారం, అలాగే ప్రపంచ సాంకేతిక దిగ్గజాలైన అలిబాబా, ఐఫ్లైటెక్ సంస్థల ప్రత్యక్ష సందర్శనలతో సదస్సు ఘనంగా ముగిసింది.
యంత్రాలు ఎంత తెలివైనవిగా మారినా, వాటికి నైతికతను, దిశను అందించేది మనిషి మనస్సులోని ‘సహకార స్ఫూర్తి’ మాత్రమేనని, రాబోయే డిజిటల్ యుగంలో తమను తాము సాంకేతికతకు బానిసలుగా కాక, దానికి దిశానిర్దేశం చేసే శిల్పులుగా తీర్చిదిద్దుకుంటామని ప్రతిజ్ఞ చేస్తూ యువత వీడ్కోలు పలికింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
