అవినీతి, లంచగొండితనం అనేవి ఒకదానికొకటి ప్రత్యామ్నాయంగా వాడే రెండు పదాలు. లేదా అవి నిజంగా వేర్వేరు పదాలా? మనం ఈనాడు ఉపయోగిస్తున్న ‘లంచగొండితనం’ అనే పదం 16వ శతాబ్దం నుంచి వాడుకలోకి వచ్చింది.
దీనిని “అవినీతికరమైన సేవల కోసం అధికారులు డబ్బులు తీసుకోవడం” అని నిర్వచించారు. ఆ నిర్వచనంలో అవినీతి అనేది ఒక భాగమని గుర్తించండి, కానీ అది లాటిన్ మూలాలు కలిగిన చాలా పురాతన పదం. దాని అర్థానికి ప్రతిఫలంగా డబ్బుల మార్పిడితో చాలా తక్కువ సంబంధం ఉంది. దీనిని “కుళ్ళిపోవడం; విచ్ఛిన్నం కావడం, క్షీణించడం” అని నిర్వచించారు.
లంచగొండితనం అనేది ఒక వ్యక్తిగత చర్య. కానీ అవినీతి అనేది లంచగొండితనంతో పాటు వ్యవస్థల క్షీణత, వినాశనానికి దారితీస్తుంది. రెండింటిలో ఇది చాలా ముఖ్యమైన తేడా.
ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం
‘ద ఎకనామిస్ట్’ పత్రికకు చెందిన ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్, ప్రతి కొన్ని సంవత్సరాలకొకసారి ఒక క్రోనీ క్యాపిటలిజం(ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం) సూచీని తయారు చేస్తుంది.
విధానాలను తమకు అనుకూలంగా మలచుకోవడం ద్వారా వ్యక్తులను ధనవంతులను చేయడానికి ఆర్థిక వ్యవస్థలో ఎంత భాగం అప్పగించబడిందో ఇది లెక్కిస్తుంది.
2016లో, భారతదేశ జాతీయ స్థూల ఉత్పత్తిలో క్రోనీ క్యాపిటలిజం మూడు శాతం కాగా, 2023లో అది రెట్టింపు అయింది.
ఇది లంచగొండితనం కావచ్చు కాకపోవచ్చు. కానీ ఇది ఖచ్చితంగా అవినీతి. ఎందుకంటే ఎంపిక చేసిన కొందరు వ్యక్తులను సంపన్నులుగా చేయడానికి ప్రభుత్వ అధికారం, ప్రామాణికతలు నిర్వీర్యం చేయబడుతున్నాయి, దుర్వినియోగం చేయబడుతున్నాయి.
ప్రజాస్వామ్య నిర్మాణం – ఎన్నికల వ్యవస్థ
రాజ్యం ఇతర మార్గాల్లో కూడా క్షీణించి, కుళ్ళిపోవచ్చు. ఏదైనా ఒక వస్తువు లేదా వ్యవస్థ కుళ్ళిపోవాలంటే, అది మొదట పూర్తిస్థాయిలో ఉనికిలో ఉండాలని అర్థం చేసుకోవడం ముఖ్యం.
భారత ప్రజాస్వామ్యం అనేది నిర్మించడానికి సుదీర్ఘ కాలం పట్టిన ఒక మహత్తర ప్రాజెక్ట్. సార్వత్రిక వయోజన ఓటు హక్కును తీసుకురావడం ఎంతటి గొప్ప ప్రయత్నమో, మొదటి ఓటర్ల జాబితాలను ఎలా తయారు చేశారో విపులంగా తెలియచెప్పే పుస్తకాలు వెలువడ్డాయి.
రాత్రి వేళల్లో ప్లాట్‌ఫారమ్‌లపై నిద్రించే వారితో సహా ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేయడానికి ఎంతటి కృషి జరిగిందో అందులో పేర్కొన్నారు.
చదవడం రాని వారు కూడా ఓటింగ్‌లో పాల్గొనేలా ప్రోత్సహించడానికి ఎన్నికల గుర్తులు వంటి ఆవిష్కరణలను తీసుకువచ్చారు.
సమయం గడిచేకొద్దీ విశ్వసనీయత పెరిగింది. ఎన్నుకోబడిన సభ్యుల పార్టీ ఫిరాయింపులను అరికట్టడానికి పార్లమెంట్ ప్రయత్నించింది.
రాష్ట్ర ప్రభుత్వాలను ఏకపక్షంగా రద్దు చేసే కేంద్రాధికారాన్ని 1994లో ఉపసంహరించుకున్నారు. అదే కాలంలో, భారతదేశంలో ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని వేధిస్తున్న అతిపెద్ద సమస్యలైన బూత్ క్యాప్చరింగ్, బ్యాలెట్ బాక్సుల తంతులకు ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) రాకతో అంతం పలికాం.
వ్యవస్థల స్వతంత్రత
దానికి కొంతకాలం ముందు— పాత తరం పాఠకులకు ఇది గుర్తుండే ఉంటుంది— ఎన్నికల సంఘం మొదటిసారిగా ప్రభుత్వంపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించే వ్యవస్థగా మారింది. ఇది మొదట శేషన్ అనే నిష్పాక్షికమైన, మొండి పట్టుదలగల వ్యక్తి నాయకత్వంలో జరిగింది.
అయితే ఆయనకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఇద్దరు కొత్త కమిషనర్లను చేర్చి ముగ్గురితో కూడిన కమిటీగా మార్చినప్పటికీ ఆ స్వతంత్రత కొనసాగింది.
ప్రజాస్వామ్య వ్యవస్థలు మరింత సమర్థవంతంగా, నమ్మదగినవిగా, విశ్వసనీయంగా మారడమే పురోగతి. వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల కోసం అలాంటి వ్యవస్థను కుళ్ళిపోవడానికి, క్షీణించడానికి అనుమతించడమే అవినీతి.
వెనక్కి పోతున్న పురోగతి
పార్టీ ఫిరాయింపులు, ప్రభుత్వాల రద్దుల విషయాల్లో ఆ పురోగతి మళ్లీ వెనక్కి వెళ్లిపోయింది. ఈ రోజు, భారతదేశం అంతటా పశ్చిమం నుంచి తూర్పు వరకు ఏకంగా ఎన్నికయిన రాజకీయ పార్టీలనే కొనుగోలు చేస్తున్నారు.
ప్రజలు ఎవరికి ఓటు వేసినా, ఫలితం మాత్రం ఒకేలా ఉంటోంది— అదే వ్యక్తులు అన్నింటినీ నియంత్రించడం కొనసాగిస్తున్నారు.
ఎన్నికల సంఘం అనే వ్యవస్థకు జరిగిన నష్టం శాశ్వతంగా మారే అవకాశం ఉంది, అలాగే ఓటర్ల జాబితాకు జరిగిన నష్టం కూడా అంతే.
భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వం, ఎంత మంచి ఉద్దేశం ఉన్నదైనా సరే, ప్రస్తుతం మన కళ్లముందు జరుగుతున్నదానిని, ఇప్పటికే జరిగిన నష్టాన్ని సరిదిద్దే మార్గం ఉండదు.
అయితే మొత్తం సవరణ ప్రక్రియ రద్దు కావాలి(ఆ సందర్భంలో ఇది ఓటర్ల జాబితాపై దాడి జరిగిన తర్వాత జరిగిన ఎన్నికలను కూడా చెల్లుబాటు కాకుండా చేస్తుంది), లేదా పేర్లు తొలగించబడిన కోట్లాది మంది వ్యక్తులు ప్రభుత్వం సంతృప్తి చెందేలా వ్యక్తిగతంగా వారి గుర్తింపును నిరూపించుకున్న తర్వాత వారి పేర్లను తిరిగి చేర్చాలి.
ఏ నిబంధనల ప్రకారం ఇది సాధ్యమవుతుంది? ఈ కొత్త నిబంధనల వల్ల మన వద్ద ఇద్దరు స్థాయిల ఓటర్లు ఉంటారా— ఒకరు అధికారుల ద్వారా క్లియర్ చేసినవారు, మరొకరు వేరే మార్గంలో వచ్చినవారు? ఇది అంత సులభంగా సమసిపోని సమస్య.
ఓటర్ల జాబితాల విధ్వంసం
ఇదంతా ఎలాంటి తక్షణ కారణం లేకుండా ప్రారంభమైందని గుర్తుంచుకోండి. భారతదేశ ఓటర్ల జాబితాలు బాగుచేయలేనంతగా దెబ్బతిన్నాయని, వాటిని సరిచేయడానికి వంశపారంపర్యంగా ప్రామాణికతను నిరూపించుకోవాల్సిన ఇలాంటి ఒక మొరటు, సంక్లిష్టమైన మార్గం అవసరమని ఎవరూ నిరూపించలేదు, కనీసం ఆరోపించలేదు.
దశాబ్దం క్రితం మన కరెన్సీ నోట్లను ఎంత అనాలోచితంగా రద్దు చేశారో, అలాగే ఇప్పుడు మన ఓటర్ల జాబితాలపై కూడా దెబ్బకొట్టారు.
గున్న వ్యవస్థలను పాడుచేయడం
అమెరికాలో ఒక సామెత ఉంది: “ఏదైనా విరిగిపోకపోతే లేదా పాడవకపోతే దాన్ని బాగు చేయకండి”. ఏదైనా వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంటే దానితో అనవసరంగా గెలకాల్సిన అవసరం లేదని ఈ సామెత చెబుతుంది. కానీ దుర్బుద్ధితో కూడిన ఆలోచన ఈ సామెతను పరిగణనలోకి తీసుకోదు. “ఇది పాడవకపోతే, దాన్ని పాడుచేయండి” అనే సూత్రం కిందే మనం ప్రస్తుతం జీవిస్తున్నాం.
మన ప్రజాస్వామ్యంలో లోపాలు ఉన్నప్పటికీ, ప్రపంచంతో మనం మమేకమైనప్పుడు అది మన మకుటంలో కిరీటం లాంటిది. అది కొంత గందరగోళంగా ఉన్నప్పటికీ, నిజమైనది, నిజాయితీ కలిగినది.
ఒకే వ్యక్తి, ఒకే ఓటు వంటి ప్రజాస్వామ్య సూత్రాలు కలిగిన దేశమని మనం గర్వంగా చెప్పుకోగలిగేవాళ్లం. కానీ ఇప్పుడు అలా చెప్పగలమా?
2014లో బీజేపీ మెజారిటీ సాధించడానికి ముందు దశాబ్దాల పాటు జరిగిన వ్యవస్థల నిర్మాణం ఇప్పుడు తీవ్ర దెబ్బతిన్నది.
వ్యవస్థలపై దాడి— కోర్టులు, విశ్వవిద్యాలయాలు, ఎన్నికల వ్యవస్థ, బహుళత్వ భావన, రాజకీయ సంస్కృతి, మీడియా—ఇవన్నీ దెబ్బతినడానికి ఒక దశాబ్దం పట్టింది.
ఎందుకంటే ఆ వ్యవస్థలు(కొన్ని బలహీనంగా, కొన్ని లోపభూయిష్టంగా ఉన్నప్పటికీ) ఉనికిలో ఉన్నాయి, తమ పరిధిలో బాగానే పనిచేశాయి. ఇప్పుడు కొందరు కేవలం తమ స్వార్థం కోసం ఆ వ్యవస్థలను క్షీణింపజేశారు, కుళ్ళబెట్టారు. ఇదే అవినీతి అసలు నైజం, సారం.
(ఆకార్ పటేల్ – సీనియర్ జర్నలిస్ట్, మానవ హక్కుల కమిషన్ మాజీ రెసిడెంట్ కమిషనర్)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
