2021లో ‘జయంతి’ విడుదలైనప్పుడు, ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి ముగిసిన వెంటనే, భారతీయ సినిమాలో న్యూ వేవ్ సినిమాల హవా మొదలయిందా అనిపించింది.
ఈ సినిమాకు అసాధారణమైన ఆదరణ లభించింది. దర్శకుడు, నటీనటులకు ప్రశంసలు దక్కడంతో పాటు, దీనిపై విస్తృతంగా రచనలు వెలువడ్డాయి, చర్చలు జరిగాయి.
దాదాపు ఐదేళ్ల తర్వాత, దర్శకుడు శైలేష్ నార్వాడే దీని సీక్వెల్‌తో తిరిగి వచ్చారు. మేము ‘జయంతి 2’ ప్రీమియర్‌ను వీక్షించాము, అనంతరం నటీనటులతో సంభాషించాము.
సెన్సార్ కట్స్ దాటుకుని..
ఈ చిత్రం సినిమాటిక్‌గా ప్రేక్షకులకు పూర్తి సంతృప్తినిస్తుంది. సెన్సార్షిప్ విచ్చుకత్తుల కాలంలో కూడా, ఎవరో ఒకరు తాము చెప్పాలనుకున్నది భయం లేకుండా చెప్పడానికి ముందుకు వస్తారని ఈ చిత్రాన్ని చూస్తే అర్థమవుతుంది.
స్క్రీనింగ్ తదుపరి చర్చలో, ఈ చిత్రం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(సెన్సార్ బోర్డు) వద్ద కొన్ని నెలల పాటు నిలిచిపోయిందని, చివరకు 22 కట్స్ తర్వాతే సర్టిఫికేట్ పొందిందని నార్వాడే మాకు తెలిపారు. ఇది సెప్టెంబర్ 11న విడుదలైంది.
అన్ని తొలగించిన సన్నివేశాలు ఉన్నప్పటికీ, చిత్రం తన పసను ఏ మాత్రం కోల్పోలేదు. ఈ చిత్రం లేవనెత్తిన ప్రశ్నకు ఆ కట్లే మరింత పదును పెట్టినట్లు అనిపిస్తుంది.
ఒక అంబేడ్కరిస్ట్ సినిమాటిక్ స్వరాన్ని అణచివేయడానికి ఎంత ప్రయత్నిస్తే, అది అంత శక్తివంతంగా తన స్వరాన్ని వినిపిస్తుంది అనడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ.
రిజర్వేషన్ల ఆవశ్యకతపై స్పష్టత
విద్యాసంస్థల్లో కుల వివక్షను ప్రదర్శించడంలో, అలాగే ఆదివాసీ, లింగ, భాషా లేదా భౌగోళిక అస్తిత్వాల ప్రశ్నలను అన్వేషించడంలో ‘జయంతి 2’ను ఒక మాస్టర్‌క్లాస్ అని చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.
“రిజర్వేషన్లు తొలగించండి” అనే ఉద్యమం మళ్లీ పుంజుకుంటున్న ఈ తరుణంలో ఈ చిత్రం మరింత అత్యవసరమైనది అని మీరూ ఏకీభవిస్తారు.
రిజర్వేషన్ల చుట్టూ, అలాగే ఈ మధ్యకాలంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ఉప-వర్గీకరణ చుట్టూ ఆధిపత్య-కుల సమాజం నిర్మించిన అపోహలు, తప్పుడు అభిప్రాయాలను బహుజన్ మేధావులు వాస్తవ వాదనలతో నిరంతరం సవాలు చేస్తున్నారు.
‘జయంతి 2’ ఈ చర్చలను ఎంతో సున్నితత్వంతో ప్రతిపాదిస్తుంది. ఎవరి జనాభా ఎక్కువగా ఉంటే వారికి దామాషా ప్రకారం అంత ఎక్కువ వాటా ఉండాలనే ప్రసిద్ధ కాన్షీరామ్ సామాజిక-రాజకీయ సూత్రాన్ని ఈ చిత్రం మరలా ముందుకు తీసుకువచ్చింది.
మనుస్కీ: మానవత్వానికి ప్రతీక
అవగాహన, సహానుభూతిని పెంపొందించడానికి, విద్యాసంస్థల్లో ఈ చిత్రాన్ని తప్పనిసరిగా ప్రదర్శించాలి. ఒకానొక సందర్భంలో, చిత్రంలోని ఆదివాసీ కథానాయిక పాయల్ మార్కమ్, మనుషులు అడవికి వెలుపల నివసిస్తున్నప్పటికీ, మానుస్కీ'(మానవత్వం) ఇప్పటికీ అడవిలోనే ఉనికిలో ఉందని చెబుతుంది.
ఇది ఒక చిన్న సంభాషణే అయినా ఎంతో శక్తివంతమైనది. సమత్వం కోసం, సామాజిక న్యాయం కోసం, రిజర్వేషన్ల ప్రాముఖ్యత కోసం నార్వాడే నిర్దిష్టమైన ఆచరణాత్మక ఉదాహరణల ద్వారా తన వాదనను వినిపిస్తారు.
ఇందులో అత్యంత ప్రత్యేకమైనది దర్శకుని పాత్రల ఎంపిక. అన్యాయానికి గురైన పాత్ర సుదీర్ఘ కాలం మౌనంగా సహించి చివరి ఘట్టంలో మాత్రమే తిరగబడే అనేక భారతీయ చిత్రాలకు భిన్నంగా, నార్వాడే పాయల్‌ను రెండు, మూడు అవమానాలు ఎదురవడంతోటే ఎదురుతిరిగి, వేధించేవారిని ప్రశ్నించేలా ఆ పాత్రను తీర్చిదిద్దారు.

ప్రతిభ-రిజర్వేషన్ ద్వంద్వత్వాన్ని తిరగరాస్తూ
పాయల్ “కోటా” విద్యార్థి అని పదేపదే ఎగతాళికి గురవుతుంది. కానీ తన విమర్శకులు సహజమని భావించే వనరులు లేనప్పటికీ, వ్యవసాయ పరిశోధనలో అద్భుతమైన పురోగతిని సాధించి, ప్రతిభ అనే అపోహను విచ్ఛిన్నం చేస్తుంది.
రిజర్వేషన్ ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థి కూడా “ప్రతిభావంతుడు” కాగలడని కేవలం నిరూపించడమే కాకుండా, ఈ చిత్రం సంప్రదాయ ప్రతిభ/రిజర్వేషన్ ద్వంద్వత్వాన్ని తిరగరాస్తుంది.
ప్రతిభను ఎవరు నిర్వచించాలి, ఏ భౌతిక పరిస్థితులు ప్రతిభను సాధ్యం చేస్తాయి, రిజర్వేషన్‌ను తరచుగా ప్రతిభకు విరుద్ధంగా ఎందుకు పరిగణిస్తారనే విషయాలను ఆలోచించమని ఇది మనల్ని అడుగుతుంది.
మూక న్యాయ వ్యవస్థలపై విమర్శ
ఈ చిత్రం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్‌పై కూడా తన విమర్శనాత్మక దృష్టిని సారిస్తుంది. సాంప్రదాయాన్ని పరిరక్షించడం పేరిట అనధికారికంగా చట్టాన్ని చేతిలోకి తీసుకునే మూక న్యాయ వ్యవస్థల ముసుగును కూడా ఈ సినిమా తొలగిస్తుంది.
చిత్రంలోని అత్యంత పదునైన సంభాషణలలో ఒకటిగా, దళిత పాత్ర తనూజ షిండే ఇలా అంటుంది: “నేను జంతువును కాను, అదే నా సమస్య.”
మనలో ఒకరినొకరు గుర్తించాలని ‘మానుస్కీ’ మనల్ని కోరే మానవత్వానికి ఈ సంభాషణ ఒక స్పష్టమైన జ్ఞాపిక.
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, అలాగే మహిళల మధ్య ఈ చిత్రం నిర్మించే ఐక్యత నిజంగా హృదయపూర్వకమైనది.
పరిహార న్యాయ భావన..
ఈ చిత్రం ఆవిష్కరించే మరొక ముఖ్యమైన కోణం పరిహార న్యాయ భావన(రిపరేటివ్ జస్టిస్). సినిమా తరచుగా సమాజానికి అద్దంగా పరిగణించబడుతుంది.
అయితే తీవ్రమైన అసమానతలు ఉన్న సమాజంలో, సినిమా కేవలం సామాజిక వాస్తవాలను ప్రతిబింబించడమే కాకుండా, సినిమాటిక్ కమ్యూనికేషన్ ద్వారా పరిహార న్యాయానికి దోహదపడుతుంది. దర్శకుడు నార్వాడే ‘జయంతి 2’లో దీనిని నిరూపించారు.
పైన వివరించినట్లుగా, కుల రిజర్వేషన్లు, సామాజిక అసమానత, రాజ్యాంగబద్ధమైన న్యాయం అనే క్లిష్టమైన విషయాల్లోకి ఒక ప్రసిద్ధ సినిమా కథనం ద్వారా ప్రవేశించడంలోనే ఈ చిత్ర ప్రాముఖ్యత ఇమిడి ఉంది.
ఈ చిత్రం కేవలం ఒక ఆదివాసీ అమ్మాయి కథ మాత్రమే కాదని స్పష్టం చేస్తూ, సమాజంలోని కులతత్వ మనస్తత్వాలను నిరంతరం సవాలు చేసే ప్రశ్నలను ఎదుర్కోవడానికి ప్రేక్షకులను ఆహ్వానిస్తుంది.
ఇది జీవితం, సామాజిక న్యాయం గురించి ప్రాథమిక ప్రశ్నలను లేవనెత్తుతుంది. అవకాశాలు ఎవరికి లభిస్తాయి? రిజర్వేషన్ ఎందుకు వివాదాస్పదంగా ఉంది? చారిత్రక అన్యాయాన్ని మరచిపోతే ఏమి జరుగుతుంది? శతాబ్దాల తరబడి నిచ్చెనమెట్ల అసమానతలతో నిర్మితమైన సమాజంలో న్యాయం అంటే ఏమిటి?
ఆలోచన రేకెత్తించే బోధనాత్మక జోక్యం
సంప్రదాయ అకాడమిక్ చర్చలు సాధించడానికి కష్టపడే ఒక విషయాన్ని సాధించే సామర్థ్యం ‘జయంతి 2’కి ఉన్నది.
సంస్థాగతమైన అన్యాయాన్ని వీక్షకులకు భావోద్వేగంగా, మేధోపరంగా దృశ్యమానం చేయడం ఈ సినిమా గొప్పదనం.
ఆధునిక సమాజాలు కుల ఉనికిని నిరాకరించడం లేదా కుల-ఆధారిత రిజర్వేషన్లను విలన్లుగా చిత్రీకరించడం తరచుగా కనిపిస్తుంది.
ఈ తరుణంలో, ఈ చిత్రం తరగతి గది విశ్లేషణల ద్వారా చర్చల్లోకి ప్రవేశించడానికి ఒక ముఖ్యమైన బోధనా స్థలానికి మార్గం తెరిచింది.
హర్డిల్స్ రేసు ప్రదర్శనతో ప్రొఫెసర్ చూపించే అసమాన పోటీ పాఠాలు చిత్రంలోని విద్యార్థులకే కాకుండా ప్రేక్షకులకు కూడా ఆలోచనాత్మకమైన విషయాన్ని అందిస్తాయి.
సాధారణ విశ్వవిద్యాలయ సంస్కృతి, ఫ్యాషన్, వినియోగదారీతనం, పోటీతత్వంపై దృష్టి పెట్టడానికి బదులుగా, ఈ చిత్రం ప్రొఫెసర్ – విద్యార్థులు, ప్రిన్సిపాల్ – ప్రొఫెసర్, విద్యార్థులు – విద్యార్థి నాయకులు, రాజకీయ నాయకులు – ప్రొఫెసర్లు, అలాగే విద్యార్థుల మధ్య లోతైన పరస్పర చర్యలను చిత్రీకరిస్తుంది.
ఈ సంభాషణలు నిరంతరం విమర్శనాత్మక ఆలోచనను రేకెత్తిస్తాయి. పైగా, పరిహార న్యాయం అనేది తప్పు చేసిన వ్యక్తి చారిత్రక అన్యాయం జరిగిందని అంగీకరించి, నైతిక మరమ్మతుకు బాధ్యత వహించినప్పుడు ప్రారంభమవుతుంది.
‘జయంతి 2’ ఈ నైతిక మరమ్మతు పనిని ఆశావాదంతో చేపడుతుంది.
ప్రేక్షకులను ఆలోచింపజేసే బోధనాత్మక జోక్యంగా ఈ చిత్రం ఎంతగానో ఆకట్టుకుందని విద్యావేత్తలుగా మేము భావించాము.
కులం, రిజర్వేషన్ల చర్చకు మాత్రమే పరిమితం కాకుండా, ఈ చిత్రం కళాశాలను కులం, అస్తిత్వాల స్పృహ గురించి తెలుసుకునే స్థలంగా మారుస్తుంది.
అదే సమయంలో ఇది నైతిక మరమ్మతు గురించి ఆలోచించేలా మిమ్మల్ని నెట్టివేస్తుంది.
మార్పుకు ఆహ్వానం
ఇక్కడ కొత్త అంతర్దృష్టి ఏమిటంటే- అన్యాయాన్ని చూసిన తర్వాత వీక్షకుడికి ఏమి జరుగుతుంది? కుల సమస్యలపై మనమందరం అనేక చిత్రాలను చూసిన దృష్ట్యా, ఈ చిత్రం కేవలం భావోద్వేగాలను ఉత్పాదన చేస్తుందా లేదా సామాజిక అసమానతతో తనకున్న సంబంధాన్ని విమర్శనాత్మకంగా ప్రశ్నించడాన్ని, పునరాలోచించడాన్ని ప్రోత్సహిస్తుందా?
ఇది నిజంగానే సామాజిక మార్పులో భాగస్వాములు కావడానికి సమాజంలోని ప్రతి విభాగాన్ని ఆహ్వానిస్తుంది.
గుర్తింపుతో పరిహార న్యాయం ప్రారంభమవుతుంది కాబట్టి, ‘జయంతి 2’ చారిత్రక హానిని గుర్తించే అవకాశాన్ని సృష్టిస్తుంది.
తరతరాల సదుపాయం, తరతరాల నష్టం మధ్య ఉన్న ఉద్రిక్తత, నష్టాన్ని పునరుత్పత్తి చేయడానికి బదులుగా మరమ్మతును సాధ్యం చేసే ఉద్దేశ్యంతో అన్వేషించబడుతుంది. అందువల్ల, ‘జయంతి 2’ పరిహార న్యాయ బోధనా శాస్త్రంగా సినిమా సామర్థ్యాన్ని నిరూపిస్తుంది.
అదనంగా, బాబాసాహెబ్ అంబేడ్కర్ చెప్పిన ‘బోధించు, సమీకరించు, పోరాడు'(ఎడ్యుకేట్, ఎజిటేట్, ఆర్గనైజ్) అనే మాటలను అనుసరిస్తూ, ఈ చిత్రం సామూహిక బాధ్యతను నొక్కి చెబుతుంది.
డాక్టర్ అంబేడ్కర్ పరివర్తనాత్మక బోధనా తత్వశాస్త్రం చిత్రంలో ప్రతిధ్వనిస్తుంది. ప్రజలు నిష్క్రియ వీక్షకులుగా ఉండటం మానేసి, సామూహిక బాధ్యత వహించడం ప్రారంభించినప్పుడు సామాజిక మార్పు ఎలా సాధ్యమవుతుందో ఇది చెబుతుంది.
పాయల్ మార్కమ్ కథ మిగిలిన విద్యార్థులకు ఈ ప్రక్రియను అనుసరించడానికి ప్రేరణనిస్తుంది.
అంబేడ్కర్ తత్వశాస్త్రం
పురుష కథానాయకుడు సంత్య, బాబాసాహెబ్ తత్వశాస్త్రం సారమైన మూడు సూత్రాలతో నిర్మించబడిన మార్గాన్ని అనుసరించే నాయకుడిగా చూపించబడ్డాడు.
తనూజ అతనికి కుల చర్చను పరిచయం చేసినప్పుడు అతను పాయల్ మార్కమ్ పోరాటంతో సహానుభూతి పొందడం మొదలవుతుంది. కులం గురించి తాను నేర్చుకోవడం మొదలుపెడతాడు.
కుల వివక్ష చారిత్రక అన్యాయాన్ని అతను ఎంత ఎక్కువ అర్థం చేసుకుంటే, అంతగా అవగాహన వ్యాప్తి చేస్తాడు, దానిని అర్థం చేసుకోవడానికి ప్రజలను సమీకరిస్తాడు.
చర్చల్లో హేతుబద్ధతను తీసుకురావడానికి వారిని సంఘటితం చేస్తాడు. చివరికి, కళాశాల అంతా అన్యాయాన్ని గుర్తించి దానికి వ్యతిరేకంగా చర్య తీసుకోగల సామర్థ్యాన్ని పొందుతుంది.
అంతిమంగా, ‘జయంతి 2’ నిజాయితీ గల ఉద్దేశ్యంతో న్యాయాన్ని అనుసరించినప్పుడు మాత్రమే ప్రభుత్వం, సమాజం ప్రాంతీయ లేదా అణచివేయబడిన వర్గాలకు సమానత్వాన్ని అందించగలవని వాదిస్తుంది.
చిత్రంలోని ఉద్దేశ్యపూర్వక న్యాయం అనే భావన దాని రాజకీయంలో ప్రధానమైనదిగా మారుతుంది.
నేపథ్య సంగీతం కూడా ఈ రాజకీయానికి గణనీయంగా దోహదపడుతుంది, భావోద్వేగ స్థాయిని పెంచుతూ కథనాన్ని ముందుకు నడిపిస్తుంది.
నటీనటుల ప్రదర్శనలు కూడా అంతే బలంగా ఉన్నాయి, ప్రతి నటుడు తమ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు.
ఆధిపత్య వర్గాలు చూడాల్సిన సినిమా..
‘జయంతి 2’ అనేది ముఖ్యంగా ఆధిపత్య, అణచివేసే కుల వర్గాలకు చెందిన వారు చూడవలసిన చిత్రం. ఇది ఎవరిపైనా ద్వేషాన్ని పెంచదు. దానికి బదులుగా, రిజర్వేషన్ వంటి సామాజిక న్యాయ యంత్రాంగాలు మొదటి స్థానంలో ఎందుకు రూపొందించబడ్డాయి, అవి ఇప్పటికీ ఎందుకు ముఖ్యమైనవో అర్థం చేసుకోవాలని వీక్షకులను కోరుతుంది.
బహుశా ఈ చిత్రం మనలో ఒక ఆశ నింపుతుంది. ప్రతాప్, ఆర్య వాఘ్లలో మనం చూసే మార్పుల వలె, నిజాయితీ గల ఉద్దేశ్యం నుండి ఉద్భవించినప్పుడు మార్పు సాధ్యమవుతుందని ‘జయంతి 2’ సూచిస్తుంది.
చిత్ర ప్రపంచంలో న్యాయం అంటే సరైన వ్యవస్థలను కలిగి ఉండటం మాత్రమే కాదు; అది ‘మనుస్కీ’ లేదా ఆ వ్యవస్థలను న్యాయబద్ధంగా మార్చే ఉద్దేశాన్ని కలిగి ఉండటం కూడా.
(డాక్టర్ నీరజ్ బుంకర్ – కుల సమస్య, సినిమా రంగంలో నైపుణ్యం కలిగిన పరిశోధకుడు; డాక్టర్ మధు బి. బాఘేల్ – సామాజిక శాస్త్రవేత్త, అసిస్టెంట్ ప్రొఫెసర్.)
అనువాదం: కె సత్యరంజన్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
