ఏక్ హై అప్ని జమీన్-ఏక్ హై అప్నా గగన్
ఏక్ హై అప్నా జహాఁ – ఏక్ హై అప్నా వతన్
అప్నె సబ్ సుఖ్ ఏక్ హై- అప్నె సబ్ గమ్ ఏక్ హై
ఆవాజ్ దో.. హం ఏక్ హై
– జా నిసార్ అఖ్తర్, ఉర్దూ కవి(జావెద్ అఖ్తర్ తండ్రి)దీని అర్థం ఏమిటంటే-
మన భూమి ఒక్కటి – మన ఆకాశం ఒక్కటి
మన ప్రపంచం ఒక్కటి – మన స్వాతంత్ర్యం ఒక్కటి
మన సుఖాలన్నీ ఒక్కటి – మన దుఃఖాలన్నీ ఒక్కటి
అందుకే నినదించండిక, మనమంతా ఒక్కటని.
గత తరంలోని మనుషులు, స్వాతంత్రోద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడిన మన పూర్వీకులు, ఆనాటి దేశ నాయకులు ఇలాంటి విశాల దృక్పథంతో ఉండేవారు. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ.
మనం ఇప్పుడు ఒక విచిత్రమైన కాలంలో బతుకుతున్నాం. విచిత్రం ఏమిటంటే, భారతీయ చరిత్రకు ఒక చిన్న ఇటుక కూడా సమకూర్చలేనివారు ఈ రోజు నెహ్రూను ఆధునిక భారత చరిత్ర నుంచి తుడిచేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ, చరిత్ర ఎప్పుడూ గ్రంథాల్లో మాత్రమే రాయబడి ఉండదు. అది ఈ దేశపు నేలలో, గాలిలో, కోట్లాది జనం జ్ఞాపకాల్లో కూడా రాయబడే ఉంది.
ఒక పెద్ద ప్రాజెక్ట్ ఈ దేశపు పంట పొలాలకు నీరు అందిస్తున్నప్పుడల్లా అందులో అంతర్లీనంగా నెహ్రూ పారుతూనే ఉన్నాడు.
భారతదేశపు మువ్వన్నెల జెండాను వైజ్ఞానికులు అంతరిక్షంలో ఎగరేస్తున్నప్పుడల్లా అది నెహ్రూ కృషిని విశ్వాంతరాళాల్లో నినదిస్తూనే ఉంది.
ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఏయిమ్స్)లో ఒక పేదవాడు చికిత్స పొందినప్పుడల్లా చరిత్ర లిఖించబడుతూనే ఉంది.
ఒక ఐఐటీ విద్యార్థి ప్రపంచ పటం మీద భారతదేశపు జెండాను పాతినప్పుడల్లా అది రెపరెపలాడుతూనే ఉంది. ఉజ్వలంగా ఎగురుతూ చరిత్ర లిఖిస్తూనే ఉంది.
నెహ్రూ ఒక వ్యక్తి కాదు, ఒక ఆలోచన
ఈ దేశ చరిత్ర ప్రతిసారీ ఒక పేరును పదే పదే స్మరిస్తూనే ఉంది. అదే జవహర్ లాల్ నెహ్రూ.
అవును, నెహ్రూతో విధానపరమైన అభిప్రాయ భేదాలుంటే ఉండొచ్చు, వాటిని తప్పకుండా చర్చకు పెట్టొచ్చు. అంతేగాని, ఆయన కృషిని మొత్తానికి మొత్తంగా పక్కకు నెట్టడమంటే దేశ నిర్మాణాన్ని విస్మరించడం కదా.
పునాదులు తవ్వేసి భవనాన్ని ఎలా నిలబెడతారు. అప్పటికీ, ఇప్పటికీ ఉన్న భేదాన్ని ఈ దేశ ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకున్నారు.
అప్పుడు కొందరు దేశ నిర్మాతలయితే, ఇప్పుడు మరికొందరు దేశాన్ని అంగడి వస్తువుగా మార్చారు.
అప్పుడు కొందరు వ్యవస్థల్ని నిర్మించి, విశాలం చేస్తే, ఇప్పుడు మరికొందరు వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు.
అప్పుడు కొందరు భారతదేశపు కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచం నలుమూలలా వ్యాప్తి చేసి, గౌరవప్రదమైన స్థానాన్ని సాధిస్తే, ఇప్పుడు మరికొందరు ఇంటా బయటా పరువుతీస్తున్నారు.
పైగా ప్రశ్నలడిగిన వారిని చూసి, భయపడి పారిపోతున్నారు. అంతేకాదు, వారంతా తమ శత్రువులంటూ ప్రశ్ననూ, ప్రశ్నలడిగిన వారినీ జైలుకు పంపుతున్నారు.
గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది.
నెహ్రూ ఒక వ్యక్తి కాదు, ఒక ఆలోచన, ఒక దృక్పథం.
ఒక ప్రజాస్వామ్య విధానం, ఒక రాజ్యాంగపు కూర్పు.
ప్రజలూ, ప్రజల ఆస్తి జాతి సమైక్యతకు బలం అనుకున్నవాడు. బలమైన జాతీయతకు చిహ్నంగా నిలబడిన వాడు.
నేటి రాజకీయాలు – చరిత్ర వక్రీకరణ
మరి, విద్వేషమే రాజకీయమైన ఈరోజు నేటి పాలకులు చరిత్రను వక్రీకరించి వండి వడ్డిస్తున్నారు. జాతి వారసత్వాన్ని అమ్మేస్తున్నారు. అందువల్ల ఈ దేశ ప్రజలంతా ఏక కంఠంతో ఇలా నినదించడం అవసరం – మాకు మళ్లీ నెహ్రూ కావాలి.
జాతి సమైక్యత కోసం, ఈ దేశపు ఆస్తులు రక్షింపబడడం కోసం తప్పదు, మాకు మళ్లీ మరో నెహ్రూ కావాలి. ఈ దేశపు ఆత్మను కాపాడుకోవాలంటే మనకు మళ్ళీ నెహ్రూయే కావాలి.
చరిత్ర పుటలు జాగ్రత్తగా వెనక్కి తిప్పిన వారికి ఒక విషయం తప్పక తెలుస్తుంది. ఏ ఇతర పార్టీల మీద ఆధారపడకుండా లోక్ సభలో పూర్తి మెజారిటీతో వరుసగా పదేళ్ళు ప్రధానులుగా కొనసాగిన రికార్డు కేవలం ఇద్దరికే ఉంది. 1. జవహర్లాల్ నెహ్రూ 2. ఇందిరా గాంధీ.
జ్ఞానానికీ, అహంకారానికీ నేరుగా సంబంధం ఉంది. “జ్ఞానం తగ్గిన కొద్దీ అహంకారం పెరుగుతూ ఉంటుంది” అని అన్నాడు ఆల్బర్ట్ ఐన్స్టీయిన్.
ఈ మాట నెహ్రూ కాలాన్ని ఇప్పటి కాలంతో పోల్చుకోవడానికి పనికొస్తుంది. అజ్ఞానం గానీ, అహంకారం గానీ ఆనాటి పాలనలో లేదు. మరి ఇప్పటి ప్రభుత్వ పాలనలో ఏముందో ఈ దేశ ప్రజలకు తెలుసు.
ఆడంబరాలు లేని ఆచరణాత్మకత
1954 ఏప్రిల్ 10న జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన వార్త చూద్దాం. అహ్మదాబాద్ వస్త్ర పారిశ్రామిక పరిశోధనా కేంద్ర భవనం ప్రారంభించడానికి నాటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ వచ్చారు. ఆ సందర్భంలో అక్కడి పురోహితుడు ఆయన నుదుట తిలకం దిద్దాడు.
సంస్కృత శ్లోకాలు ధారాళంగా పఠించాడు. ఆ తరువాత వాస్తు పూజకు ఉపక్రమించాడు. అది సుదీర్ఘంగా సాగింది. ఆ తరువాత పురోహితుడు ప్రధానిని భవనం గోడను తాకమన్నాడు. ఇలాంటివి నచ్చని నెహ్రూకు ఓర్పు నశించింది.
అడ్డంగా నిలబడ్డ పురోహితుణ్ణి ఒక తోపు తోసి “ఈ గోల నేను భరించలేను” అంటూ కోపంగా భవనంలోకి చకచకా నడిచి వెళ్ళాడు.
ఇకనేం, అనుచరగణమంతా నెహ్రూను అనుసరించింది. ఈ విషయం నాటి మన తెలుగు దిన పత్రిక ఆంధ్ర పత్రిక 12 ఏప్రిల్ 1954న ప్రచురించింది.
ఇక్కడ చెప్పుకోవాల్సిందేమంటే అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ భవనానికి గానీ, పరిశోధనలకు గానీ, వస్త్ర వ్యాపారానికి గానీ ఏ మాత్రం కీడు జరగలేదు.
అంతా సజావుగా నడుస్తూ ఉంది. పండిత పురోహితులు చెపుతున్నట్లు పూజా కార్యక్రమం విచ్ఛిన్నమైనందుకు ఏదో కీడు జరగాలి కదా, జరగలేదు. పనికిరాని పూజల తంతుతో ఏమీ జరగదని ఆనాడే నెహ్రూ తేల్చి చెప్పినట్లయ్యింది.
ఈ సంఘటన ఆయన ఆలోచనా విధానానికి అద్దం పట్టింది. కశ్మీరీ బ్రాహ్మణుడిగా పుట్టినందుకు విశ్వ పూజారి వేషం వేసుకుని ప్రపంచంలోని హిందూ దేవాలయాలన్నీ ఆయన చుట్టిరాలేదు.
శూద్రుడిగా పుట్టిన ప్రస్తుత ప్రధాని, బ్రాహ్మణ పురోహితుడిగా వేషం కట్టి ఏమేం చేస్తున్నాడో ఈ దేశవాసులందరికీ తెలుసు.
అపహాస్యం పాలవుతున్న నేటి పాలకులు
నెహ్రూ ఇస్రో పెట్టకపోతే చంద్రయాన్ ఎక్కడిది, డీఆర్డీఓ లేకపోతే తేజస్ ఎక్కడ ఉండేది, ఐఐటి లేదా ఏయిమ్స్ లేకపోతే ఐటీ ఇండస్ట్రీలో మనం ఎక్కడ, ఏయిమ్స్ లేకపోతే కరోనా వంటి సవాళ్ళను ఎలా ఎదుర్కునే వాళ్ళం, కనీసం అవగాహన పెంచుకోరా, ఒక పని చేయండి.
“వందేమాతరం” మీద చర్చ పెట్టినట్టుగానే, ఒక పార్లమెంట్ సెషన్ మొత్తం నెహ్రూ మీదే మాట్లాడండి. ఆ అక్కసు వెళ్లగక్కుకున్నాక ఆ తర్వాత ప్రస్తుతంలోకి వచ్చి మీ ప్రభుత్వం, దేశవాసుల ఆకలి, ఉపాధి, ఆరోగ్యం, అభివృద్ధి వంటి విషయాల గూర్చి చెప్పుదురు గానీ, మాట్లాడవలసినవి మాట్లాడకుండా అనవసరంగా ఎందుకు ప్రతి విషయానికీ నెహ్రూ దగ్గరికి పోతారు.
ప్రధానిగా అధికారంలో ఉన్నన్నేళ్ళు ఈ దేశ స్వాతంత్ర్యం కోసం నెహ్రూ జైల్లో ఉన్నారని ప్రియాంక గాంధీ పార్లమెంట్లోనే మోదీ ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబట్టింది. మోదీ, ఆయన అనుచరుల మొహాలు మాడిపోయాయి.
మరో సందర్భంలో పార్లమెంట్లోనే ప్రియాంక గాంధీ, మోదీ ఉపన్యాసాన్ని ఇలా ఆటపట్టించింది. మోదీ ఉపన్యాసం బాగా ఇస్తారు. కొంచెం సుదీర్ఘంగా ఇస్తారు. బాగానే మాట్లాడతారు.
అయితే ఒక లోపం ఉంది. నిజాలు చెప్పడంలో ఆయన కంజూర్ అవుర్ (బలహీనులు, కంజూష్) మెత్తని వాతలు ఎలా ఉంటాయో ఆరోజు ఆమె సెషన్లోనే పెట్టి చూపించింది.
చరిత్ర పట్ల అజ్ఞానం
1964లో సావర్కర్ మరణించినప్పుడు పార్లమెంట్లో ఆయనకు నివాళులు అర్పించకుండా నెహ్రూ అడ్డుకున్నాడని ప్రకటించాడు ఒక బీజేపీ ఆణిముత్యం బీఎల్ సంతోష్.
ఈయన బీజేపీ జాతీయ సంస్థాగత కార్యదర్శి. వాళ్ళకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో తెలియదు. 1964లో మరణించింది సావర్కర్ కాదు.
పండిట్ జవహర్లాల్ నెహ్రూనే (27 మే 1964). సావర్కర్ మరణించింది 26 ఫిబ్రవరి 1966. అంటే, 1966లో చనిపోయిన వాడికి నివాళులు అర్పించడానికి రెండేళ్ళు ముందే చనిపోయిన నెహ్రూ అడ్డుకున్నాడట.
చదువులేని మూర్ఖులంతా అక్రమ మార్గాల్లో అధికారం చేజిక్కించుకుంటే పరిస్థితి ఇదిగో ఇలాగే ఉంటుంది. సావర్కర్ బ్రిటిష్ వారి దగ్గర పది క్షమాభిక్షల పిటిషన్లు సమర్పించాడు. కానీ, భగత్ సింగ్ మాత్రం రాజీ పడడానికి నిరాకరించాడని ప్రకటించింది స్వయానా ఈ సావర్కర్ పెద్ద మనుమడు సత్యకి సావర్కర్.
ప్రస్తుత పరిస్థితుల్లోంచి బయట పడాలంటే, ఈ దేశ ప్రజలందరూ ప్రపంచ ప్రఖ్యాత రష్యన్ రచయిత లియో టాల్ స్టాయ్ మాటల్ని గుర్తుంచుకోవాలి. ప్రభుత్వాల బలం ఎప్పుడూ ప్రజల అజ్ఞానంలో ఉంటుంది.
ప్రభుత్వాలకు ఈ విషయం తెలుసు. కాబట్టి, ప్రజల్లో నిజమైన జ్ఞానాన్ని ఇవి వ్యతిరేకిస్తాయి. ఈ సత్యాన్ని మనం గుర్తించవలసిన సమయం ఇదే.
ఒకవైపు ప్రజల్లో అజ్ఞానాన్ని వ్యాప్తి చేస్తూ జ్ఞానాన్ని పెంపొందించడానికి తీరిక లేనట్లు నటిస్తున్న ప్రభుత్వాలను అలాగే వదిలేయడం అత్యంత హానికరం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
