పోలీస్ కస్టడీలో అఫ్రోజ్ అంగీకరించినట్లు చెబుతున్న వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని ముందస్తు నిర్బంధంపై ఉత్తర్వులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జారీ చేయకపోవాల్సి ఉందని, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగులతో కూడిన డివిజన్ బెంచ్ తన తీర్పులో పేర్కొంది.
న్యూఢిల్లీ: సంభల్ హింస 2024లో ప్రధాన నిందితుడు ముల్లా అఫ్రోజ్‌పై జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద ప్రయోగించిన ముందస్తు నిర్బంధాన్ని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 29న కొట్టివేసింది.
అక్రమ ముందస్తు నిర్బంధ ఉత్తర్వులను జారీ చేసినందుకు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) పాలిత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై రూ 10 లక్షల జరిమానా విధించినట్లు లైవ్‌లా కథనం వెల్లడించింది.
పోలీస్ కస్టడీలో ముల్లా అఫ్రోజ్ నేరాన్ని అంగీకరించినట్లు చెబుతున్న వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని ముందస్తు నిర్బంధంపై యూపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేయకూడదని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగులతో కూడిన ధర్మాసనం తీర్పులో అభిప్రాయపడింది.
సుప్రీంకోర్టు ప్రశ్నలు
సుప్రీంకోర్టు ఈ అంశంపై తీర్పును సెప్టెంబర్ 8న రిజర్వ్ చేసింది. ముందస్తు నిర్బంధపు ఉత్తర్వులు జారీ చేయడానికి కస్టడీలో ఇచ్చినట్లు చెబుతున్న వాంగ్మూలం సంబంధిత అధికారుల వ్యక్తిగత సంతృప్తికి ఆధారంగా నిలుస్తుందా అంటూ ఉత్తర్వును రిజర్వులో పెడుతూ బెంచ్ ప్రశ్నించింది. ఆ వాంగ్మూలం ఔచిత్యాన్ని కూడా కోర్టు ప్రశ్నించింది.
హింస జరిగిన 54 రోజుల తర్వాత అఫ్రోజ్‌ను అరెస్టు చేశారు. అలహాబాద్ హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. కానీ అతనికి వ్యతిరేకంగా ఎన్ఎస్ఏ కింద ముందస్తు నిర్బంధపు ఉత్తర్వు అక్టోబర్ 13, 2025న జారీ అయింది.
హైకోర్టు తదనంతరం దానిని సమర్థించింది. ఆ తర్వాత నిర్బంధ ఉత్తర్వును రద్దు చేయాలని కోరుతూ అఫ్రోజ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
పిటిషనర్ వాదనలు
సంభల్ హింస సందర్భంగా పోలీసులు తమకు తాము జరిపిన కాల్పుల కోణాన్ని నిష్పాక్షికంగా దర్యాప్తు జరపలేదని పిటిషనర్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
పోలీస్ కస్టడీలో ఇచ్చిన నేరాంగీకారాన్ని ఆధారం చేసుకుని తనను అరెస్టు చేశారని, అది చట్టపరంగా ఆమోదయోగ్యం కాదని కూడా ఆయన వాదించినట్లు లైవ్‌లా కథనం వెల్లడించింది.
పిటిషనర్ హింసను ఉసిగొల్పి, ప్రజల్లో అశాంతిని సృష్టించగలరన్న సంభావ్యత ఉన్నదని భావిస్తున్నామని చెబుతూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్బంధ ఉత్తర్వును సమర్థించింది. అందుబాటులో ఉన్న సమాచారం ఆ సంభావ్యతను రుజువు చేస్తే ముందస్తు నిర్బంధాన్ని సమర్థించడం సబబేనని ప్రభుత్వం వాదించింది.
తీర్పును మంగళవారం వెలువరించడానికి ముందు- ఇటీవల తన 27వ జన్మదినోత్సవానికి ముందే మరణించిన తన లా క్లర్క్‌కు జస్టిస్ దత్తా నివాళులర్పిస్తూ ఈ తీర్పును ఆయనకు అంకితం చేశారు.
అసలేం జరిగింది?
సీనియర్ డివిజన్ సివిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత మూడు గంటల వ్యవధిలోనే కోర్టు నియమించిన అడ్వకేట్ కమిషనర్ సంభల్‌లోని మొఘల్ యుగం నాటి షాహీ జామా మసీదు సర్వేను 2024 నవంబర్ 19న నిర్వహించారు.
రెండవ దఫా సర్వేను నవంబర్ 24న చేశారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది.
ఈ హింస కారణంగా ఐదుగురు ముస్లింలు చనిపోయారు. అయితే అధికారిక రికార్డులు మాత్రం కేవలం నలుగురు(మహ్మద్ కైఫ్, నయీమ్, అయాన్, బిలాల్) మృతి చెందినట్లు గుర్తించాయి.
28 మంది పోలీస్ సిబ్బంది గాయపడగా, ఘర్షణ సందర్భంగా అనేక వాహనాలకు నిప్పంటించారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్ట్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
