“ఘర్ వాపసీయా? మీ వాదన చూస్తుంటే ‘ఆయా రామ్, గయా రామ్, ఫిర్ ఆయా రామ్’ అన్నట్టుంది. ఈ ఘర్ వాపసీ మిమ్మల్ని అనర్హత నుంచి కాపాడుతుందా? స్వచ్ఛందంగా ఒక పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకున్న మరుక్షణమే సభ సభ్యత్వాన్ని కోల్పోతారు. మీరు మళ్లీ పార్టీలోకి తిరిగి వెళ్లవచ్చు, కావాలంటే మీ పార్టీ మిమ్మల్ని రాజ్యసభకు పంపుకోవచ్చు. కానీ కోల్పోయిన అసెంబ్లీ సభ్యత్వం తిరిగి రాదు” ఇది సుప్రీంకోర్టు ఇటీవలి న్యాయమూర్తి విమర్శ.
బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్ ‘బి-ఫారం’ తీసుకుని, ఫారం-26 సమర్పించి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత, ఇంకా ఆ పార్టీలోనే ఉన్నానని చెప్పడం పచ్చి రాజ్యాంగ మోసం తప్ప మరొకటి కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇది కేవలం దానం నాగేందర్ కథ మాత్రమే కాదు.
హైకోర్టు 2024 ఏప్రిల్ 23 నుంచే నాగేందర్‌పై అనర్హత వేటు వేయడంతో ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయింది.
అయితే ఇక్కడే ఒక కీలకమైన రాజ్యాంగ సంక్లిష్టత నెలకొంది. అనర్హత వేటు పడిన దానం నాగేందర్, అదే ఖాళీకి జరిగే ఉపఎన్నికలో మళ్లీ పోటీ చేయవచ్చా?
2020లో కర్ణాటక రెబెల్ ఎమ్మెల్యేల కేసులో(శ్రీమంత్ బాలాసాహెబ్ పాటిల్ వర్సెస్ కర్ణాటక స్పీకర్) సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం— అనర్హతకు గురైన ఎమ్మెల్యే తక్షణమే మళ్లీ పోటీ చేయవచ్చు.
ఇది ఎంతో అన్యాయమనీ, రాజ్యాంగ వ్యతిరేకమనీ, అవినీతికరమైన తీర్పు అనీ మనం అందరం విమర్శిస్తున్నా, ఆ న్యాయమూర్తి ఎందుకు ఈ విధంగా తీర్పు చేసారో తెలియదు.
దురదృష్టం ఏమంటే దాని గురించి చర్చ పక్కన పెట్టి, ఇప్పుడున్న పరిస్థితి ఏమిటో చూడాలి.
జస్టిస్ రమణ ధర్మాసనం చెప్పిన వివరాలు..
స్పీకర్‌కు పరిమితి విధించే అధికారం లేదు: పదో షెడ్యూల్ కింద స్పీకర్ ఒక సభ్యుడిని ఆ అసెంబ్లీ పదవీకాలం ముగిసేవరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించే అధికారం లేదు. స్పీకర్ న్యాయమూర్తి తరహా ట్రిబ్యునల్ మాత్రమే తప్ప, రాజ్యాంగ పరిధిని దాటి శిక్షలు విధించలేరు.
ఆర్టికల్ 164(1బీ), 361బీ నిబంధనలు: 91వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన ఆర్టికల్ 164(1బీ) ప్రకారం, ఫిరాయింపుల వల్ల అనర్హుడైన సభ్యుడు ఆ అసెంబ్లీ కాలపరిమితి ముగిసేవరకూ లేదా “ఆ స్థానానికి జరిగే ఎన్నికల్లో మళ్లీ గెలిచేంతవరకు” మంత్రి పదవి చేపట్టడానికి వీల్లేదు. అంటే, అనర్హుడైన వ్యక్తి తిరిగి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని రాజ్యాంగమే పరోక్షంగా అంగీకరిస్తోంది.
ఈ తీర్పు దానం నాగేందర్‌కు ఒక రకంగా మార్గం సుగమం చేస్తోంది. ఆయనపై అనర్హత వేటు పడినప్పటికీ, ఎన్నికల సంఘం నిర్వహించే ఖైరతాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి చట్టపరమైన అడ్డంకి లేదు. అది అన్యాయం. చట్టబద్ధమైన పాలన కాకపోయినా, అదే చట్టం.
ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8 ఎందుకు వర్తించదు?
సాధారణంగా ఎన్నికల చట్టాల్లో ఒకసారి అనర్హత వేటు పడితే ఆరేళ్ల పాటు పోటీ చేయకుండా నిషేధం ఉంటుందనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంటుంది. కానీ ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8 సూత్రాలు ఇక్కడ వర్తించవు.
క్రిమినల్ శిక్ష ఉంటేనే సెక్షన్ 8: అవినీతి నిరోధక చట్టం కింద శిక్ష పడినా, లేదా ఏదైనా క్రిమినల్ కేసులో రెండేళ్లు అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడినప్పుడు మాత్రమే ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(1), (2), (3) కింద ఒక ప్రజాప్రతినిధి తన పదవిని కోల్పోవడంతో పాటు, జైలు నుంచి విడుదలైన తర్వాత మరో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం ఎదుర్కొంటారు.
పదో షెడ్యూల్ వేరు, సెక్షన్ 8 వేరు: పదో షెడ్యూల్ కింద విధించే అనర్హత పూర్తిగా రాజకీయ ప్రవర్తనకు సంబంధించింది.
ఆర్టికల్ 191(1)(ఇ) వర్తించాలంటే స్పష్టమైన చట్టబద్ధమైన నేరం లేదా నేరారోపణ రుజువు కావాలి. అటువంటి క్రిమినల్ నేర నిర్ధారణ ఏదీ లేనప్పుడు, సెక్షన్ 8లోని ఆరేళ్ల నిషేధాన్ని తీసుకొచ్చి పదో షెడ్యూల్ అనర్హతలకు అన్వయించడం రాజ్యాంగపరంగా చెల్లదు.
న్యాయస్థానాలు రాజ్యాంగంలో లేని అంశాలను లేదా పార్లమెంట్ ఉద్దేశపూర్వకంగా చేర్చని నిబంధనలను తమంతట తాము చట్టంలోకి న్యాయపరమైన శాసనంగా తీసుకురాలేవు.
ప్రజాస్వామ్యానికి పొంచి ఉన్న ముప్పు
ఈ న్యాయపరమైన లొసుగులు ఫిరాయింపుదారులకు ఒక సురక్షితమైన రాజకీయ కవచాన్ని కల్పిస్తున్నాయి:
ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి మారడం; స్పీకర్ ద్వారా విచారణలను ఏళ్ల తరబడి వాయిదా వేయించి అధికారాన్ని, జీతభత్యాలను అనుభవించడం; చివరకు కోర్టులు అనర్హత వేటు వేస్తే, శ్రీమంత్ బాలాసాహెబ్ పాటిల్ తీర్పు ఆసరాగా మళ్లీ ఉపఎన్నికల్లో పోటీ చేసి గెలవడం; గెలిచిన వెంటనే ఆర్టికల్ 164(1బి) ప్రకారం తిరిగి మంత్రి పదవులను దక్కించుకోవడం.
ఇది రాజ్యాంగ నైతికతను అపహాస్యం చేయడమే అవుతుంది. దానం నాగేందర్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టులు ఇచ్చిన తీర్పులు స్పీకర్ల పక్షపాత ధోరణిని ఎండగట్టి ఒక గట్టి హెచ్చరిక పంపినప్పటికీ, ప్రస్తుత చట్టం ప్రకారం ఆయన ఉపఎన్నికలో పోటీ చేయకుండా అడ్డుకోలేకపోవడం పెద్ద లోపం.
చట్ట సవరణ బాధ్యత పార్లమెంట్‌దే
ఈ దుర్నీతికి శాశ్వత ముగింపు పలకాలంటే—పదో షెడ్యూల్ కింద అనర్హతకు గురైన ఏ సభ్యుడైనా ఆ శాసనసభ మిగిలిన కాలపరిమితి ముగిసేవరకు ఎటువంటి ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా ప్రజాప్రాతినిధ్య చట్టంలో ప్రత్యేక సవరణ తీసుకురావాల్సిన బాధ్యత పార్లమెంట్‌పైనే ఉంది.
లేనిపక్షంలో, రాజ్యాంగ ధర్మాసనాలు ఎన్ని మొట్టికాయలు వేసినా ‘ఆయా రామ్.. గయా రామ్’ల రాజకీయ క్రీడ నిరంతరాయంగా సాగుతూనే ఉంటుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
