ఇటీవల కాలంలో సనాతనం అనే పదం తరచుగా వినపడుతోంది. సనాతనం అంటే హిందూ దేవతల ఆరాధన మాత్రమే అన్న భావం కొంతమందిలో ఉంది. అంత మేరకే పరిమితమయితే ప్రమాదం లేదు. కానీ, సనాతనం పేరున సమాజాన్ని వెనక్కు నెట్టే కొన్ని ప్రమాదకర చర్యలు నేడు జరుగుతున్నాయి. వీటిని వ్యతిరేకించేవారిని హిందూ మత వ్యతిరేకులుగా కూడా ముద్ర వేస్తున్నారు. దీని వెనుక ఉన్న నిగూఢార్థాలను తెలుసుకోవాలంటే కొన్ని వాస్తవాలను పరిశీలించాలి.
భారత నాగరికత వేల సంవత్సరాల చరిత్ర కలిగినది. ఈ చరిత్రలో ఒక వైపు సనాతన సంప్రదాయాల బలం, మరోవైపు వాటిని సవాలు చేసిన తర్కబద్ధ, శాస్త్రీయ మానవతా ప్రవాహాల మధ్య నిరంతర పోరాటం సాగింది. అదే భారత సాంస్కృతిక పరిణామ అసలైన చైతన్య రేఖ.
“సనాతనం” అనే పదం సంస్కృత మూలమైంది. దీని అర్థం సులభంగా చెప్పాలంటే — శాశ్వతం, ఎప్పటినుండో ఉన్నది అనే భావం. అంటే కాలం మారినా మారని, ఎప్పటికీ ఉండే ధర్మం లేదా వ్యవస్థ. హిందూ ధర్మం అనే పేరుతో ఎక్కువగా పిలుస్తున్నారు.
అంటే వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులు, పురాణాలు మొదలైన వాటి మీద ఆధారపడి ఉన్న జీవన విధానం. కానీ మొదట్లో సనాతన ధర్మం అనే పదం ఏక మతం కంటే పెద్దది. ఇది మనిషి నడవాల్సిన శాశ్వత నైతిక మార్గం, సమాజ ధర్మం, ప్రకృతి ధర్మం అన్నట్లుగా విస్తృతంగా ఉండేది.
ఇప్పుడు “సనాతనం” అనే పదానికి రెండు విధాల వాడుక ఉంది. ఒకటి ఆధ్యాత్మిక తాత్విక అర్థం. ఇది శాశ్వత సత్యాలు, నైతిక విలువలు, ధర్మం, కర్మ సిద్ధాంతం మొదలైన వాటిని సూచిస్తుంది.
రెండోది సాంప్రదాయ లేదా రాజకీయ అర్థం. “సనాతనం” అనే పదాన్ని పాత సామాజిక వ్యవస్థలోని కుల వ్యవస్థ, జాతి ఆధారిత హక్కులు, మహిళలపట్ల వివక్షతను కాపాడటానికి వాడుతున్నారు. దీనివల్లే సమాజానికి అసలు ప్రమాదం.
సనాతనత్వం వర్సెస్ శాస్త్రీయ దృక్పథం..
ఈ సనాతన వాదులు భావించినట్లు ఈ సృష్టిలో ఏదీ శాశ్వతంగా ఉండదు, ప్రతిదీ నిరంతరం చలనంలో ఉంటుంది అన్నది శాస్త్రం చెబుతుంది.
కులవ్యవస్థ, మహిళపట్ల వివక్షత వంటివి ఆరెస్సెస్ ప్రబోధించే మనుధర్మ సిద్ధాంతాలు. దీన్నే సనాతనం కింద ప్రచారం చేస్తున్నారు.
నేటి సమాజంలో పేదరికం, నిరుద్యోగం, ఆదాయ అంతరాలు, మనుషుల మధ్య తేడా వంటి ప్రజల ఈతి బాధలకు కారణం, జన్మ ఆధారంగా ఉందని సనాతనం చెబుతుంది. శూద్రుడు బ్రాహ్మణునికి సేవ చేయాలి అని పేర్కొంది. కింది వర్ణాలు అశుద్ధులు అని పరిగణించి, అస్పృశ్యత ఏర్పడింది. మనుస్మృతి లాంటి గ్రంథాలు దీన్ని సమర్థించాయి.
దీనికి భిన్నంగా అందరూ జన్యుపరంగా సమానులేనని, ఎవరి తెలివి, ప్రతిభ, కృషి వంటివే వ్యక్తిని నిర్ణయిస్తాయి తప్ప జన్మ కాదు అని శాస్త్రం చెబుతుంది. మన ఆధునిక రాజ్యాంగం కూడా ఆర్టికల్ 14-18 ద్వారా సమానత్వ హక్కు ఇచ్చింది. ఇది సనాతనం అనే భావనకు విరుద్ధం. అందుకే వీరు భారత రాజ్యాంగాన్ని కూడా సవాలు చేస్తున్నారు.
సనాతన దృక్పథం మహిళను పతివ్రతగా వర్ణించి పురుషాధీనంగా చూపింది. విద్య, వారసత్వం, ఆస్తి హక్కులు వంటివి పరిమితం చేసింది. పతి దేవుడు అన్న భావనతో, ఆమె స్వేచ్ఛను నియంత్రించింది. దీనికి భిన్నంగా శాస్త్రీయ దృక్పథం మహిళలు పురుషుల్లాగే మెదడు, భావజాలం, సామర్థ్యం కలవారని నిరూపించింది.
విద్య, ఉపాధి, సమాన వేతనం, రాజకీయ ప్రాతినిధ్యం వంటివన్నీ సమానంగా ఉండాలని చెబుతుంది.
ఆర్థిక వ్యవస్థ – భావజాల ఆధిపత్యం..
సమాజంలోని ఆలోచనలు, సంస్కృతి, మతం, నైతికత వంటివన్నీ ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడి ఉంటాయని కార్ల్ మార్క్స్, ఫెడరిక్ ఏంగెల్స్ పేర్కొన్నారు. ఎవరి చేతిలో ఉత్పత్తి సాధనాలు ఉంటాయో వాళ్ల చేతిలోనే ఆలోచనల ఆధిపత్యం కూడా ఉంటుంది. అలా ఏర్పడినదే పాలక వర్గం, శ్రామికవర్గాల మధ్య సంబంధం.
సనాతనం పాలక వర్గాల సిద్ధాంత సాధనం. అంటే ప్రజలు “ఇది దేవుని నిర్ణయం” అని నమ్మితే, వారు తమ స్థితిని మార్చే ప్రయత్నం చేయరు. కాబట్టి సనాతనం ప్రజల ఆలోచనలను నియంత్రించి, ఉన్న క్రమాన్ని కాపాడుతుంది. దీనివల్ల పాలక వర్గాల ఆధిపత్యం న్యాయబద్ధంగా కనిపిస్తుంది. దీనినే మార్క్స్ ఐడియలాజికల్ సూపర్ స్ట్రక్చర్(సైద్ధాంతిక పైనిర్మాణం) అన్నారు.
దీనికి భిన్నంగా శాస్త్రీయత శ్రమజీవి విముక్తికి మార్గం చూపుతుంది. శాస్త్రీయ దృక్పథం ప్రజల్ని భ్రమల బంధనాల నుండి విముక్తం చేస్తుంది. ఉదాహరణకు కులం దేవుని సృష్టి కాదు, ఆర్థిక వ్యవస్థ సృష్టి. ఆస్తి సమానంగా పంచకపోవడం అనేది ధర్మం కాదు, దోపిడీ. శ్రమజీవి తన శ్రమ ఫలాన్ని స్వాధీనం చేసుకోవాలి — ఇదీ శాస్త్రీయ ఆర్థిక దృక్పథం.
సనాతనం దోపిడీని కాపాడే భావజాలం. శాస్త్రీయత దోపిడీని చెరిపే, సమానత్వాన్ని సృష్టించే దృక్పథం. క్లుప్తంగా చెప్పాలంటే సనాతనం మనసును బంధిస్తుంది, శాస్త్రీయత మనసును విముక్తం చేస్తుంది.
మన దేశంలో బ్రాహ్మణాధిక్య సనాతన భావజాలం, కులదోపిడీకి ఆధ్యాత్మిక కవచం ఇచ్చింది.
ప్రాచీన, ఆధునిక సవాళ్లు – ప్రత్యామ్నాయ మార్గాలు..
దీనికి సవాలు కూడా ప్రాచీన కాలం నుంచి మన సమాజంలో జరుగుతూనే ఉంది. భక్తి ఉద్యమాలు, చార్వాకులు, బుద్ధుడు, జైనులు వంటి వారు, ఆధునిక కాలంలో అంబేద్కర్, పెరియార్, మార్క్సిస్టులు ఈ సనాతన ధర్మాన్ని తర్కబద్ధంగా సవాలు చేశారు.
మతపరంగా దోపిడీకి న్యాయబద్ధత ఇచ్చిన పాలక వర్గాల ఈ సనాతన వ్యవస్థను క్రీస్తుపూర్వ 6వ శతాబ్దంలోనే గౌతమ బుద్ధుడు బలంగా ప్రశ్నించాడు. జన్మ వల్ల కాదు, కర్మ వల్లే మనిషి ఉన్నతుడు అవుతాడు అని ఆయన చెప్పారు. అంటే ఇది వర్ణవ్యవస్థకు వ్యతిరేకంగా శాస్త్రీయ, మానవతా తర్కం. కార్యానికి ఫలితం ఉంటుంది, కానీ అది దేవుడు నిర్ణయించేది కాదు అన్నది ఆయన బోధించిన భౌతికవాద సూత్రం.
ప్రతి దానికి కారణం ఉంటుంది, కారణం మారితే ఫలితం మారుతుంది. సుమారు 2500 సంవత్సరాల క్రితమే చార్వాకులు లేదా లోకాయతులు ఆత్మ, పరలోకం, పునర్జన్మ అన్న వాటిని తిరస్కరించారు.
కబీర్, రామదాసు, మీరాబాయి, తులసీదాస్, తుకారాం, రామానుజాచార్యులు, చైతన్యుడు వంటి వారు మధ్య యుగాలలో భక్తి ఉద్యమాల ద్వారా కుల, మత భేదాలను తిరస్కరించారు. మానవతా స్వరాలు వినిపించారు.
“మనిషి గొప్పవాడు, దేవుడు మనసులో ఉన్నాడు”, వైషమ్యాలను పెంచుకోవటం మూర్ఖత్వం అని చెప్పారు. ఇది సనాతన క్రమానికి ప్రత్యామ్నాయం.
ఈ ఉద్యమాలు ఆధ్యాత్మిక రూపంలో ఉన్నా, మూలంలో సమానత్వం, మానవత, కుల వ్యతిరేకత అనే అభ్యుదయ విలువలను ప్రతిపాదించాయి.
నేడు భక్తి ముసుగులో నడుస్తున్న నయా సనాతవాదుల హంగామా అసలు గుట్టు దీని ద్వారా బహిర్గతమవుతుంది.
ఆధునిక కాలంలో అంబేద్కర్ “సనాతన ధర్మం అంటే అసమానత పునాది” అని సూటిగా చెప్పారు. కులవ్యవస్థను శాస్త్రీయంగా విశ్లేషించి, దాన్ని “ఆర్థిక–సామాజిక దోపిడీ వ్యవస్థ”గా నిరూపించారు. ఆయన “అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్” గ్రంథంలో సనాతన ధర్మంపై అత్యంత తర్కబద్ధమైన విమర్శ చేశారు.
పెరియార్ “కులం లేని సమాజమే నిజమైన ధర్మం” అని చెప్పారు. విద్య, మహిళా స్వేచ్ఛ, శ్రమ విలువలపై శాస్త్రీయ చైతన్యం నింపాడు.
శాస్త్రీయ మానవతే భవిష్యత్తు..
ఇవి అన్నీ కలిపి- భారత సాంస్కృతిక పోరాటం అనేది “సనాతన భావజాలం” నుంచి “శాస్త్రీయ మానవత” వైపు ప్రయాణం అని చెప్పవచ్చు.
భారత సాంస్కృతిక చరిత్ర అనేది కేవలం మతపరమైన పరిణామం కాదు, అది సనాతన విశ్వాసం నుంచి శాస్త్రీయ మానవత వైపు సాగిన దీర్ఘ యాత్ర.
బుద్ధుడి తర్కం, చార్వాకుల భౌతికవాదం, అంబేద్కర్–పెరియార్–మార్క్సిస్టుల విశ్లేషణ – ఇవన్నీ భారత ఆలోచనల శాస్త్రీయ దిశను ప్రతిబింబిస్తాయి.
సనాతనం సమాజాన్ని బంధిస్తే, శాస్త్రీయ మానవత సమాజాన్ని విముక్తం చేస్తుంది. సమాజం ముందుకు సాగాలంటే, భ్రమల కట్టుబాట్లను విడిచి, శాస్త్రీయ మానవతా విలువల దారిలో నడవాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
