“కల్పనలపై నమ్మకం ఉంచి పుక్కిటి పురాణాలను నమ్ముతున్నంతకాలం, ఒక జాతి మరో జాతిపై పెత్తనం సాగిస్తున్నంతకాలం ఈ దేశం బాగుపడదు”అని మహాత్మా జ్యోతిరావు ఫూలే అన్నారు.
ఇవి సరిగ్గా నూట యాభై ఏళ్ళ క్రితం మహాత్మా ఫూలే చెప్పిన మాటలు.
కొన్ని రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహంపై జరిగిన దాడిని గమనిస్తే అక్షరాలా ఈ మాటలు నిజమనిపిస్తున్నాయి. ఆ విగ్రహాలు కేవలం రాతి లేదా లోహ నిర్మాణాలనుకుంటే పొరపాటే అవుతుంది- అవి జ్ఞానసౌధాలు, తరతరాల అణిచివేతకు ప్రతిఘటనా స్వరాలు, సామూహిక గుర్తింపుకు ప్రతీకలు.
ఎక్కువగా ఆధిపత్య కులాలు, పాలక వర్గాలు చరిత్రను రాసిన చోట- అణగదొక్కబడిన వర్గాల నాయకుల విగ్రహాల; దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన సంఘ సంస్కర్తలు, కుల వ్యతిరేక విప్లవకారుల విగ్రహాల మీద కుట్ర పన్ని కూల్చివేయడం లేదా తొలగించడం యాదృచ్ఛికమేమీ కాదు.
ఈ చర్యల వెనుక కులోన్మాద, మతోన్మాద శక్తుల నిర్మాణాత్మక ఎజెండాలు దాగి ఉన్నాయి.
జ్ఞానానికి, చైతన్యానికి ప్రతీక
దుర్మార్గమైన బ్రాహ్మణీయ మనువాద భావజాలన్నీ ఫూలే వ్యతిరేకించారు. హక్కులు, స్వేచ్ఛ, సామాజిక సమానత్వాన్ని దళిత- బహుజనులకు అందించడానికి అనేక అవమానలను ఎదుర్కొంటూ ఆయన కృషి చేశారు.
ఫూలే దంపతుల ఆచరణను, వారసత్వాన్ని విద్యార్థులు, బహుజన ఉద్యమకారులు ప్రస్తుతం కొనసాగిస్తున్నారు.
రోహిత్ వేముల మరణం తర్వాత అనేక సామాజిక ఉద్యమాలకు యూనివర్సిటీ అఫ్ హైద్రాబాద్, తెల్లాపూర్‌లోని ఫూలే అంబేద్కర్ సెంటర్ ఫర్ ఫిలోసాఫికల్ అండ్ ఇంగ్లీష్ ట్రైనింగ్ సంస్థలు కేంద్రమైయ్యాయి.
బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఈ సంస్థలు అందిస్తున్న జ్ఞానాన్ని, భావజాలపరంగా చైతన్య పరుస్తున్న విధానాలను గమనిస్తున్న సంఘ్‌పరివార్ చాలా పకడ్బందీగా దాడికి దిగింది.
అణగారిన వర్గాలకు ప్రతినిధులైన- బీఆర్ అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే, బిర్సా ముండా, పెరియార్ ఈవీ రామస్వామివంటి నాయకుల విగ్రహాలను; ఇతర సామాజిక సంఘసంస్కర్తల విగ్రహాలను ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశ్యమేంటంటే- వాటి నుంచి బహుజనులు చరిత్రను తెలుసుకోవడం, చైతన్యాన్ని పొందడం.
అయితే, ఈ ప్రాంతంలో పెరుగుతున్న మహనీయుల సంస్కృతి వల్ల అగ్రకులాలకు మింగుడు పడటం లేదు.
ఫూలే విగ్రహం పక్కకే గద్దర్ విగ్రహం కూడా ఉన్నది. వీళ్లు బడుగు బలహీనవర్గాలైన మా కోసం పోరాడిన నాయకులు, చాలా ముఖ్యమైనవారు; మనువాద నిచ్చెనమెట్ల వ్యవస్థ వల్ల తరతరాల పీడనకు వ్యతిరేకంగా జరిగిన మా పోరాటాలు దేశ చరిత్రలో భాగమని ఈ విగ్రహాలు గుర్తుచేస్తాయి.
మనువాద అగ్రకుల ఏకస్వామ్య అహంకారనికి ఈ విగ్రహాలు సవాలుగా మారాయి కాబట్టే, ఉన్మత్తులైన మనువాద సంఘ్‌పరివార్ శ్రేణులు భౌతికదాడులకు దిగారు.
బహుజన మహనీయుల విగ్రహాల ధ్వంసం వెనుక రాజకీయం
ఒకప్పుడు మతోన్మాదులు అంబేద్కర్, పెరియార్ విగ్రహాలను మాత్రమే ధ్వంసం చేసేవారు. ఆ తరువాత కాలంలో దళిత క్రైస్తవుల ప్రార్థనా స్థలమైన చర్చి మీద దాడికి దిగారు- మణిపూర్, ఒడిస్సాల్లో; దేశంలోని పలుప్రాంతాల్లో ఇప్పటికీ దాడులు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కొత్తగా ఫూలే విగ్రహం, ఇతర మహనీయుల విగ్రహాల మీద కుట్రపూరితంగా దాడులను పెంచారు.
మున్సిపాలిటీ ఎలక్షన్స్‌ని దృష్టిలో పెట్టుకొని అర్బన్ ఓట్లను సంపాదించాలనే బీజేపీ కుట్రలో భాగమే “ఫూలే విగ్రహం మీద దాడికి కారణం కానీ శివాజీ విగ్రహన్ని సాకు చూపిస్తూ చేస్తున్న రాజకీయం అర్థరహితం.”
ఉత్తర భారతదేశానికే పరిమితమైన ఈ దుర్మార్గమైన నీచ సంస్కృతి ఇప్పుడు తెలంగాణలో క్రమక్రమంగా విస్తరిస్తున్నది.
ఈ కుట్రలో పాత్రదారులు బడుగు బలహీనవర్గలే కానీ సూత్రదారులు మాత్రం సంఘ్ పరివార్ శిక్షణలకు అలవాటుపడిన ఒక కొత్త అగ్రకుల మతోన్మాద నాయకత్వం, మెజారిటీవాద ఎజెండా, ఇక్కడి మార్కెట్ తర్కంతోని సాంస్కృతిక ఆధిపత్యం చెలాయిస్తున్నది.
కూల్చివేతల విచ్ఛిన్నమంటే సాధారణంగా విగ్రహాలు, బహుజన సంస్థల ఆస్తులను లేదా సంక్షేమ నిర్మాణాలను భౌతికంగా తొలగించడమని అర్థం కాదు. దీని పరిధి భౌతిక అంశాలకు మించి విస్తరించి ఉంటుంది.
రిజర్వేషన్ల నేపథ్యం, మండల్ వ్యతిరేక ఉద్యమాల గురించి తెలుసుకుంటే ఈ కుట్రలు అర్థమవుతాయి.
రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు లేదా కార్మిక హక్కులవంటి సామాజిక రక్షణలను విచ్ఛిన్న చేయడం; ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు అధికారం కల్పించడానికి ఉన్నటువంటి వేళ్లను తొలిగించడం ద్వారా సబ్బాల్టర్న్ గొంతులను నొక్కే చర్యలను సంఘ్ పరివార్ రెండు దశబ్దాల కిందే ప్రారంభించింది.
దేశంలో అభివృద్ధి ముసుగులో బహుజన మహనీయుల విగ్రహాలను తొలగించి, వారి ఆధిపత్యాన్ని ప్రదర్శించి అనవసర వితండవాద రాజకీయాలు చేస్తూ- దీంతో ఎప్పుడూ చర్చల్లో ఉండాలని చూస్తున్నారు.
బహుజనుల సామూహిక ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి వారి భావోద్వేగాలతో రాజకీయం చేస్తున్నారు. వీటిని లోకల్ మాస్ లీడర్స్‌తో చేయిస్తున్నారు. వీరికి లా అండ్ ఆర్డర్, రాజ్యాంగం గిట్టవు! కొన్నిరోజుల క్రితం, ఫూలే విగ్రహం మీద దాడితో భయాన్ని కలిగించాలని చూశారు.
ఈ విధ్వంసాలు, కుట్రల తర్వాత మొదలయ్యే బహుజన ఉద్యమాలు కేవలం విగ్రహాలు లేదా బహుజన సంస్థలను సంరక్షించడం కోసమే కాదు- వారి సమానత్వం, ఆత్మగౌరవన్ని, ఆస్తిత్వాలను డిమాండ్ చేస్తాయి. ఇవి మతోన్మాద రాజకీయాలకు, అగ్రకులాలకు కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి.
న్యాయం, ఇంక్లూసివేనెస్ లేకుండా విడదీయడం అనేది అణచివేతకు నిశ్చలమైన స్థితి ఆయుధంగా పనిచేస్తుంది. ఇది పౌర రక్షణలను క్షీణింపజేస్తుంది. చరిత్రను తుడిచివేస్తుంది. మనువాద ఆధిపత్య సమూహాల చేతుల్లో అధికారాన్ని ఏకీకృతం చేస్తుంది.
ఫూలే విగ్రహం మీద దాడిని గమనిస్తే, వారి చేతుల్లో అధికారం బలహీనపడటం కూడా ఒక కారణంగా భావించవచ్చు; అణగారిన వర్గాల సేఫ్గార్డ్స్ని అణచడం, భావజాల నిర్మాణాలను కూల్చివేయడంలాంటివి వారి మతోన్మాద ఎజెండాలో భాగంగా ఉన్నాయి.
పెరిగిన బహుజనవాదాన్ని నేరంగా చూసే ధోరణి..
దేశంలో బహుజన సిద్ధాంతాన్ని, దళిత హక్కుల ఉద్యమాలను నేరంగా పరిగణించే ప్రాపగాండాను సంఘ్‌పరివార్ తయారు చేస్తోంది.
ముఖ్యంగా యూనివర్సిటీలలో అంబేద్కర్ జయంతి; ఫూలే, పెరియార్, మహిషాసుర, బిర్సా ముండా జయంతి ఉత్సవాలు, నిరసనలు, సాంస్కృతిక వేడుకలు; రాజకీయ సమీకరణ లేదా మేధోపరమైన సెమినార్స్‌లో- చీటికిమాటికి విద్యాసంస్థల్లో బీజేపీ పాలిత- ప్రభావ ప్రభుత్వాలు అనవసర జోక్యం చేసుకొని పోలీసుల ప్రమేయన్ని పెంచతూ ఆంక్షలను విధిస్తున్నాయి.
“సామాజిక న్యాయం కోరుతున్న అంబేద్కర్‌వాద ఉద్యమాల నుంచి భూమి, అటవీ హక్కుల కోసం ఉద్యమిస్తున్న ఆదివాసీ పోరాటాల వరకు జాతి వ్యతిరేకులుగా, అర్బన్ నక్సల్స్‌గా ముద్ర వేస్తున్నారు.”
బహుజన కార్యకర్తలు, విద్యార్థులు, మేధావులపై దేశద్రోహ చట్టాలు(UAPA)లాంటి కఠిన చట్టాలను ప్రయోగిస్తున్నారు. ఉమర్ ఖాళీద్ ఉదంతమే దీనికి ఓ మంచి ఉదాహరణ.
అయితే, బహుజన వర్గాలపై హింస తరచుగా కావాలని; అనవసర చట్టాలతో దళిత- బహుజన నాయకులను బెదిరించి; వారి మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ఉద్యమాలను అణచివేస్తున్నారు. భావప్రకటనా స్వేచ్ఛను, సమానత్వానికి రాజ్యాంగం హామీ ఇస్తుండగా- బహుజనులకు ఇవి వర్తించకపోవడం బాధాకరమైన విషయం.
వివక్షకు మరో ఉదాహరణ..
ఈ దేశంలో బహుజనుల పట్ల ఎలాంటి వివక్ష కొనసాగుతుందో చెప్పడానికి మరో ఉదాహరణ, ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(Equal Opportunity Cell (EOC 2026) ఏర్పాటు చేసింది.
ఉన్నత విద్యా సంస్థలలో సమానత్వాన్ని ప్రోత్సహించడం కోసం, వివక్షలు లేకుండా సామాజికంగా కలుపుకుపోయే ఒక అకడమిక్ వాతావరణాన్ని ఏర్పాటు చేయడం ఈ యాక్ట్ అసలు లక్ష్యం.
ఈ యాక్ట్‌లో ఓబీసీలను కలపడం అప్రజాస్వామికమని మనువాదభావజాల ప్రభావమున్న అగ్రకులాలకు చెందినవారు నిరసనలకు దిగారు. అంతేకాకుండా, కోర్టు మెట్లు ఎక్కారు దీంతో సుప్రీం కోర్ట్ స్టే ఇచ్చింది.
బహుజనవాదాన్ని నేరంగా పరిగణించడమంటే, నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో భాగమైన కులాధిపత్యాన్ని కాపాడుకోవడం కోసం బహుజనులను మతోన్మాదులు అన్ని విధాలుగా కార్నర్ చేయడమే అవుతుంది.
ప్రస్తుతం జరుగుతోన్న మహనీయుల విగ్రహాల విధ్వంసపు పరంపర హైందవ కుల వ్యవస్థలో పాతుకుపోయిన రాజకీయ చర్య. ఈ విగ్రహాలను రక్షించడం అంటే ప్రజాస్వామ్యన్ని, రాజ్యాంగ విలువలను, అణగారిన వర్గాల హక్కును రక్షించడం.
నమ్మకాన్ని కోల్పోతున్న వ్వవస్థలు..
దేశంలో సామాజిక మార్పు, సమానత్వ చిహ్నాలను గౌరవించకుండా ఉండే వరకు రాజ్యాంగంలో పొందుపరచిన సామాజిక న్యాయం వాగ్దానం నెరవేరకుండానే ఉంటుంది.
ఒకప్పుడు కోర్టుల మీద, మీడియా సంస్థల మీద కాస్తోకూస్తో నమ్మకం ఉండేది కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
ఒక పౌరుని ప్రాథమిక హక్కును, ఆదేశిక సూత్రాలను అమలుపరిచే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఇది రాజ్యాంగ లక్ష్యం.
అయితే, ఓట్ల సందర్భంలో తప్ప మిగతా సందర్భాల్లో ప్రభుత్వాలు బహుజనులను పట్టించుకోవు.
ఈ దేశంలో ఉద్యమించకుండా ఇప్పటి వరకు ఏ సమస్య పరిష్కారం కాలేదని చరిత్ర చెబుతుంది. కాబట్టి, ప్రస్తుతం ఉద్యమించడమే బహుజనుల లక్ష్యం కావాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
