The effects of labor codes on workers is the final part of the article.
సామాజిక భద్రతా కోడ్ 2020:
సామాజిక భద్రతను చట్టబద్ధమైన సార్వజనిక సామాజిక భద్రతా చట్టంగా రూపొందించడానికి బదులుగా ఇప్పటికే ఉన్న వివిధ సామాజిక భద్రత చట్టాలన్నీ కలిపి ఒకటిగా చేశారు. ఈ భావన కేవలం పైపైనే ప్రస్తావిస్తుంది తప్ప సార్వజనీన సామాజిక భద్రత చట్టంగా పరిగణించడానికి వీలుకాని కొన్ని హెచ్చరికలు ఇందులో ఉన్నాయి.
ఉదాహరణకు, ప్రావిడెండ్ ఫండ్, ఆరోగ్యం, ప్రసూతి ప్రయోజనాలు మరియు గ్రాట్యుటీకి సంబంధించి ఈపాటికి ఆయా చట్టాలలో ఉన్న 10 మంది కార్మికుల పరిమితిని యథావిధిగానే కొనసాగించింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమ కేటగిరీలోని అనేక ఫ్యాక్టరీలు 10 మంది కంటే తక్కువగా మాత్రమే శాశ్వత కార్మికులను ఇలాంటి చిన్న చిన్న పరిశ్రమలలో పనిచేసే కార్మికులు సామాజిక భద్రతకు దూరం అవుతారు. సామాజిక భద్రత అంశాలు అసంఘటిత రంగ కార్మికులను సంఘటితంగా కార్మికులుగా మార్పు చేసే అవకాశాన్ని ఈ కోడ్ కోల్పోయింది. పదిమంది లోపు కార్మికులు ఉన్న పరిశ్రమలతో సహా మొత్తం అసంఘటిత రంగ కార్మికులందరికీ సామాజిక భద్రత అమలు చేయడం ఎలా సాధ్యమవుతుందని కొందరు మేధావులు ప్రశ్నిస్తున్నారు.
కార్మికులకు సామాజిక భద్రతను కల్పించడంలో యజమానుల పాత్రను నొక్కి చెప్పాక పోవడం విచార విస్మయానికి గురి చేస్తుంది. కార్మికులకు సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నప్పటికీ కార్మికుల ఉత్పత్తి ద్వారా లాభాలను సంపాదించుకునే యజమానుల భాగస్వామ్యాన్ని విస్మరించడం సమర్థనీయం కాదు. ప్రభుత్వం ఒక సాధారణ స్వరూపాన్ని రూపొందించవచ్చు. కానీ, కార్మిక సంబంధాలు సూక్ష్మ స్థాయిలో ప్రోత్సహించబడాలి. దురదష్టవశాత్తు, కోడ్ ఈ అంశాలలోకి లోతుగా వెళ్లలేదు. అంతిమంగా సామాజిక భద్రత కోడ్ ఈపాటికి ఉన్న సంబంధిత చట్టాలన్నిటిని ఒక దగ్గర చేర్చి ఏర్పాటు చేసినదే తప్ప కార్మికుల ఆశలను ఇది ఎంత మాత్రం అర్థం చేసుకోలేదు.
ఉదాహరణకు, ప్రసూతి ప్రయోజనాల నిబంధన 10 లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలలోని మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన అసంఘటిత రంగంలోనీ పెద్ద సంఖ్యలో ఉన్న మహిళలను పూర్తిగా విస్మరించింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ సామాజిక భద్రతను సార్వజనీయం చేయాలని 1952 లో ఆమోదించిన తీర్మానం 102 ప్రస్తుత ఈ కోడ్ విరుద్ధంగా ఉంది. భారత ప్రభుత్వం ఐ ఎల్ ఓ తీర్మానం 102ను ఇప్పటివరకు ఆమోదించలేదు. ఐ ఎల్ ఓ తీర్మానంలోని అంశాలను సాధించడం ఈ కోడ్ ద్వారా సాధ్యం కాదు.
వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ 2020
ఈ కోడ్ 10 లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు ఉన్న సంస్థలకే వర్తిస్తుంది. 10 కంటే తక్కువ మంది కార్మికులు ఉన్న సంస్థలు ఈ కోడ్ పరిధిలోకి రావు.దీంతో పది కంటే తక్కువ మంది పని చేసే చిన్న సంస్థలలోనీ కార్మికులను ఆరోగ్యం మరియు భద్రతా చట్టాల పరిధిలోకి తీసుకురావడం ప్రశ్నార్ధకంగా మారింది. కొత్తగా స్థాపించబడిన పరిశ్రమలపై నిబంధనల భారాన్ని తగ్గించి, వాటి ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి, ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కార్మిక చట్టాలను వర్తింపజేయడం సబబు కాదని కొందరు వాదిస్తున్నారు. చిన్న సంస్థల ఎదుగుదలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కనీస కార్మికుల సంఖ్యను పెంచుతూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈపాటికి చట్టానికి సవరణలు కూడా చేశారు. ఉదాహరణకు ఫ్యాక్టరీల చట్టం 1948 వర్తింపు పరిమితిని 10 నుండి 20కి, 20 నుండి 40కి పెంచుతూ రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. అదేవిధంగా ఫ్యాక్టరీల (సవరణ) బిల్లు, 2014లో కూడా ఇదే విధంగా చట్టం వర్తింపుకు ఉండాల్సిన కనీస కార్మికుల సంఖ్యను పెంచారు. అయితే, 16వ లోక్‌సభ రద్దు కావడంతో ఈ బిల్లుకు కాలం చెల్లింది. ఈ అంశాలన్నీ కొత్త కోడ్‌లోకి తిరిగి తేవడం జరిగింది. వృత్తిపరమైన ఆరోగ్య సమస్యలు, ఆరోగ్యం, పని పరిస్థితులు లాంటి కనీస నిబంధనలు కార్మికుల సంఖ్యతో నిమిత్తం లేకుండా కార్మికులందరికీ సార్వత్రికంగా అందించాలి. అంతర్జాతీయ కార్మిక సంస్థ 19 81లో ఆమోదించిన తీర్మానం 155లో దీనిని తప్పనిసరిగా అమలు జరపాల్సిన అంశంగా ఉంది. అయితే, భారతదేశం దీనిని ఇంకా ఆమోదించవలసి ఉంది.
సంక్షేమ సదుపాయాలు, ఆరోగ్యం మరియు భద్రతా ప్రమాణాలు, కార్మికుల పని గంటలకు సంబంధించిన నిబంధనలను ఈ కోడ్ లో పొందుపరిచినప్పటికీ వీటికి నిర్దిష్ట ప్రమాణాలను స్పష్టం చేయలేదు.. దానికి బదులుగా వాటిని రూపొందించేందుకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పించింది. ఈ కోడ్ రూపొందించడానికి ముందు ఉన్న ఫ్యాక్టరీలు, గనులు, బీడీ కార్మికుల చట్టాలలో పైన ఉదహరించిన అంశాలు నిర్దిష్టంగా పేర్కొన్న బడి ఉన్నాయి. ఉదాహరణకు తాగునీరు, వాష్‌రూమ్‌లు, ప్రథమచికిత్సా వసతులు వంటి వసతుల కల్పనతో పాటు రోజుకు గరిష్టంగా తొమ్మిది గంటలు, వారానికి 48 గంటల పనిని నిర్ధారించాయి. ఫలితంగా పని గంటలు, భద్రతా ప్రమాణాలు, మరియు పని పరిస్థితులు (వాష్‌రూమ్‌లు, తాగునీరు ఏర్పాట్లు) వంటి అంశాలకు సంబంధించి నిర్దిష్టంగా కనీస ప్రమాణాలను ఈ కోడ్ నిర్ధారిస్తుందా లేక తదుపరి ప్రభుత్వ నోటిఫికేషన్లకు వదిలి వేస్తుందా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతున్నది. ఫలితంగా ఈ కోడ్ పైన పేర్కొన్న నిర్దిష్ట అంశాలను స్పష్టం చేయకుండా వాటిని అమలు చేయటం, ఎప్పటికప్పుడు సవరణలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలి వేస్తుందా అనే అనుమానం కలుగుతున్నది.
ముగింపు: భారతదేశ కార్మికుల మౌలిక సమస్యల పరిష్కారానికి ఈ కోడ్ రూపకల్పన ద్వారా మార్గ నిర్దేశం చేసే అవకాశం ప్రభుత్వానికి లభించింది. ప్రభుత్వం ఆ అవకాశాన్ని కోల్పోయింది. ఈ కోడ్లలో అనేక లోటుపాట్లు ఉన్నాయి. ఉదాహరణకు కనీసఉద్యోగ భద్రతకు భరోసా, బేరసారాలలో కార్మిక సంఘాల భాగస్వామ్యానికి వీలుకల్పించడం, కనీస వేతనాల నిర్ధారణ, ఆహార కేలరీల నిర్ధారణలో లింగ వివక్షను పరిష్కరించడం, సార్వత్రిక సామాజిక భద్రత, వత్తిపరమైన భద్రత, ఆరోగ్యం వంటి పలు అంశాలు ఈ కోడ్ లలో మృగ్యం అయినాయి.
భారతదేశంతో పాటు వివిధ దేశాలలోని వర్తమాన లేబర్ మార్కెట్ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా భారతదేశ కార్మికుల పని పరిస్థితులను మెరుగు చేయడం వంటి అంశాలలో ఈ మొత్తం నాలుగు కోడ్ లు విఫలం చెందాయి.
రచయితలు: సంతోష్ మెహ్రోత్రా, ఐజడ్ఎ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లేబర్ & ఎకనామిక్స్ లో రీసెర్చ్ ఫెలో, లగ్జంబర్గ్, విజిటింగ్ ప్రొఫెసర్, హయ్యర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, మాస్కో.
కింగ్షుక్ సర్కార్ – ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్, గోవా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్
అనువాదం పి నర్సింహారావు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
