తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలోని కార్మిక సంఘాల పిలుపుమేరకు కార్మికులంతా సమ్మెలోకి దిగారు.
సమ్మెకు కొన్ని సంఘాలు మాత్రమే పిలుపునిచ్చినప్పటికీ సంస్థలోని మిగతా అన్ని కార్మిక సంఘాలు కూడా సమ్మెను బలపరచి స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనడం ఎంతో సంతోషించదగ్గ విషయం, అభినందనీయం.
ఉద్దేశపూర్వకంగా ఆలోచించి నిర్ణయించిన తేదీ కాకపోయినప్పటికీ ఈరోజు ప్రపంచ ప్రఖ్యాత మహనీయుడు లెనిన్ జయంతి.
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పలు కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు తెలియజేయడానికి ముందుకు రావచ్చు. ఆ విధంగా ఎవరు సమ్మెకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చినా వారందరి సహకారం తీసుకోవాల్సిందే. వారికి అభినందనలు తెలియజేయాల్సిందే.
అప్పుడు ఒకలా.. ఇప్పుడు మరోలా..
అయితే అదే సందర్భంలో మరొక ముఖ్యమైన విషయం కార్మికులు మరచిపోకూడదు.
2019లో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు మొదటిసారి సమ్మె బాట పట్టినప్పుడు నాడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది.
చర్చలు కూడా జరపనని మొరాయించి తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించి చివరకు కార్మికులు విధులకు హాజరు కావలసిన పరిస్థితిని ప్రభుత్వం సృష్టించింది.
నాటి ప్రతిపక్ష కాంగ్రెస్ సమ్మెకు మద్దతు తెలియజేసింది. నేడు అదే కాంగ్రెస్ తాను అధికారంలో ఉండి కార్మికుల డిమాండ్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి కార్మికులను సమ్మెలోకి నెట్టింది. సమ్మెకు అన్ని విధాల బాధ్యత వహించాల్సింది ప్రభుత్వం మాత్రమే.
ఇప్పుడు ప్రతిపక్ష బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ కార్మికులకు మద్దతును తెలియజేయవచ్చు.
అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక వైఖరి, అధికారంలో ఉన్నప్పుడు మరొక వైఖరి అనుసరిస్తున్నాయని ఈ సమ్మె మరొకమారు రుజువు చేసింది.
ఇదే సందర్భంలో నిన్నటి నుంచి మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెలోకి దిగారు.
మహారాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు కూడా జరపకుండా నిరాకరించిన కారణంగానే తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెలోకి దిగామని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.
బీజేపీ ద్వంద్వ వైఖరి..
ప్రభుత్వం అక్కడితో ఆగకుండా అత్యవసర సర్వీసుల నిర్వహణ చట్టాన్ని వినియోగించి తగిన చర్యలు తీసుకుంటామని ఉద్యోగులను హెచ్చరించింది.
అక్కడ అధికారంలో ఉన్నది బీజేపీ, దానికి మద్దతు ఇచ్చే రాజకీయ పార్టీలు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు తెలియజేసే అవకాశం ఉన్నది.
మహారాష్ట్రలో ఒకవైఖరి, ఇక్కడ మరొక వైఖరి బీజేపీ తీసుకోవడం సమంజసమా? ఆర్టీసీ కార్మికులు ఆలోచించాలి.
అందుకే మహనీయుడు లెనిన్ ఎన్నడో, “ఏ నినాదం వెనుక ఏ వర్గ ప్రయోజనం దాగి ఉన్నదో అర్థం చేసుకోలేనంత కాలం ప్రజలు, కార్మికులు మోసపోతూనే ఉంటారు” అని చెప్పారు.
సమస్యల పరిష్కారానికి తాము చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, అందుకే సమ్మె నోటీసు ఇచ్చామని కార్మిక సంఘాలు బహిరంగంగా ప్రకటించాయి.
వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ వార్తలు వచ్చాయి. డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసు ఆర్టీసీ ఎండీ, కార్మిక శాఖ కమిషనర్‌కు, సంబంధిత ప్రభుత్వ అధికారులు అందరికీ కార్మిక సంఘాలు అందజేశాయి.
అకస్మాత్తుగా కమిటీ ఏర్పాటు..
నిన్నటి వరకు ఏమీ తెలియనట్టుగా, నిద్రపోయినట్టు నటించిన ప్రభుత్వం అకస్మాత్తుగా నలుగురు అధికారులతో ఒక కమిటీని నియమించింది.
ప్రజలను, కార్మికులను పక్కదారి పట్టించడానికి ప్రభుత్వం ఆడిన కపట నాటకం ఇది.
ఇప్పుడే కాదు ప్రతి సమ్మె సందర్భంగా అధికారంలో ఎవరున్నారనే దాంతో నిమిత్తం లేకుండా ప్రభుత్వాలన్నీ ఇదే వైఖరిని అవలంబిస్తున్నాయి.
ప్రభుత్వం నియమించిన ఆ కమిటీ నిన్న రాత్రి జరిగిన చర్చల్లో తమకు ఒక నెల రోజులు గడువు ఇవ్వాలని, సమ్మెని వాయిదా వేయాలని కార్మిక సంఘాలను కోరింది.
కార్మిక సంఘాలు ధీటుగా స్పందించి కమిటీ అభ్యర్థనను తోసిపుచ్చి, సమ్మెకు వెళ్తున్నట్టు ప్రకటించాయి.
కమిటీలోని ఆ నలుగురు అధికారులలో కార్మిక శాఖ అధికారి, ఆర్టీసీ ఎండీ, రవాణా శాఖ కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి ఉన్నారు.
మిగిలిన ఇద్దరు అధికారుల సంగతి పక్కన పెడితే, ఆర్టీసీ ఎండీ, కార్మిక శాఖ కార్యదర్శికి సమ్మె నోటీసు ఇచ్చిన రోజు దగ్గర నుంచి సమ్మె డిమాండ్లు ఏమిటో సంపూర్ణంగా తెలుసు.
కార్మికుల సమ్మె ప్రారంభానికంటే ముందు అర్ధరాత్రికే అన్ని డిపోల వద్ద ప్రభుత్వం పోలీసులను మోహరించింది. ఆ అవసరం ఎందుకు వచ్చింది? కార్మికులు ఏమైనా విధ్వంసానికి పాల్పడ్డారా? ఆ రకమైన ఫిర్యాదులు ఉన్నాయా? ఏమీ లేవు. అయినా పోలీసులు డిపోలను పహారా కాస్తున్నారు.
సమ్మె ప్రారంభమైన తర్వాత ప్రజా ప్రయోజనాల ముసుగులో కార్మిక వ్యతిరేకులు కొందరు హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.
గతంలోనూ ఇలానే జరిగింది. న్యాయస్థానం తీసుకున్న వైఖరి ఏమిటో కార్మికులందరికీ తెలిసిందే.
వర్గ పోరాటాలే ఒక పెద్ద పాఠశాల..
చట్టాలు, పోలీసులు, న్యాయస్థానాలు, అధికార వర్గాల ప్రయోజనాలను కాపాడటం కోసమే సృష్టించబడ్డాయని ఈ సందర్భంగా కార్మికులందరూ అర్థం చేసుకోవాలి.
అందుకే మహనీయుడు లెనిన్ “కార్మిక వర్గ పోరాటాలే ఒక పెద్ద పాఠశాల” అని చెప్పారు.
కార్మికుల సమ్మె డిమాండ్ల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం: ఆర్టీసీ కార్మికులకు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ జరగాలి. కానీ గత ఎనిమిది సంవత్సరాలుగా వేతన సవరణ జరగలేదు.
వేతన సవరణ అంటే ఉద్యోగులకు అదనపు డబ్బు సమకూర్చటం కాదు. ప్రభుత్వాల వైఫల్యం కారణంగా ధరలు ఆకాశాన్ని అంటి, కార్మికులు వారి సాధారణ జీవితం గడపడం కూడా దుర్భరం అవుతోంది.
కాబట్టే వేతన సవరణ చేయడం ప్రభుత్వ విధి తప్ప, ప్రభుత్వాన్ని కార్మికులు దేబరించడం కాదని కార్మికులు అర్థం చేసుకోవాలి.
ఇక్కడ మరొక విషయం కూడా గమనించాలి. సహజంగా ప్రభుత్వ ఉద్యోగుల కంటే పారిశ్రామిక కార్మికులకు వేతనాలు ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంది.
వారి పని స్వభావం వల్ల ఈ అవసరం ఏర్పడింది.
రోడ్డు రవాణా కార్మికులు పారిశ్రామిక కార్మికుల కంటే కూడా ఎక్కువ వేతనాలకు అర్హులు. అది వారి హక్కు కూడా.
ఎందుకంటే వారు మానసిక శ్రమ, శారీరక శ్రమ ఏకకాలంలో చేస్తూ.. వారి ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. ఇంతకంటే ఆర్టీసీ కార్మికుల శ్రమ గురించి ఏమి చెప్పాలి? కానీ ప్రభుత్వ ఉద్యోగుల కంటే తెలంగాణ ఆర్టీసీ కార్మికుల వేతనాలు సుమారు 30% తక్కువగా ఉన్నాయి. ఇది అత్యంత దుర్మార్గం.
అలాగే వివిధ కేటగిరీలలో భారీ ఎత్తున ఖాళీలు ఉన్నాయి. కానీ వాటిని భర్తీ చేయకుండా ఉన్న కార్మికుల మీదనే ఆ భారాన్నంతా మోపి, తీవ్ర నిర్బంధానికి గురిచేస్తున్నారు.
“చేస్తే చెయ్యి- లేకుంటే ఉద్యోగం మానుకొని ఇంటికి పో” అని దౌర్జన్యంగా బెదిరిస్తున్నారు. అందుకే ఆర్టీసీ యాజమాన్యం ఏకపక్షంగా నిర్ణయించిన కొలమానం ప్రకారమే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం ఆర్టీసీ యాజమాన్యం బాధ్యత. అందుకు అనుమతించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.
గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్..
మరొక ప్రధానమైన డిమాండ్ విద్యుత్ బస్సుల కొనుగోలు, మెయింటెనెన్స్, ఆపరేషన్ అంతా ఆర్టీసీకే అప్పగించాలి.
ప్రస్తుతం నడుస్తున్న విద్యుత్ బస్సులు కానీ, భవిష్యత్తులో రాబోతున్నవి కానీ ఆర్టీసీ సొంత బస్సులు కావు. ఇవి ప్రైవేటు వ్యక్తులవి లేదా సంస్థలవి.
అయితే విద్యుత్ బస్సులన్నీ ఆర్టీసీవే అనే అపోహ ప్రయాణికులలో ఉన్నది. కారణం విద్యుత్తు బస్సుల వెనక జరుగుతున్న రాజకీయ నాటకం వారికి తెలియకపోవటమే.
ప్రైవేటు సంస్థలలో పనిచేసే కార్మికులు ఎలాంటి హక్కులు లేకుండా వెట్టి చాకిరి చేస్తున్నారు. అయినా ప్రైవేటు వారు పెట్టిన పెట్టుబడి, నిర్వహణ ఖర్చులు, లాభాలు కలిపి వారికి డబ్బులు చెల్లించే విధంగా కేంద్ర ప్రభుత్వం విధానాన్ని రూపొందించింది. దాని ముద్దు పేరే “గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్’.
ఆర్టీసీ కార్మికులు కోరుతున్నది.. పన్నుల రూపంలో ప్రజలు ప్రభుత్వ ఖజానాకు జమ చేసిన డబ్బులు కొల్లగొట్టి కొద్ది మంది ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయవద్దు. ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీకే బస్సుల కొనుగోలు, నిర్వహణ, ఆపరేషన్ అప్పగించాలి. ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే రాయితీలన్నీ ఆర్టీసీకే ఇవ్వాలి అనేది కార్మికుల డిమాండ్.
మరొక ప్రధానమైన డిమాండ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. అయితే ఈ డిమాండ్ పట్ల సమ్మెలో పాల్గొంటున్న కార్మిక సంఘాల అన్నిటికీ ఏకాభిప్రాయం లేదు. కొన్ని సంఘాలకు దీని మీద భిన్నాభిప్రాయం ఉన్నది.
భిన్నాభిప్రాయమే కాదు, పొరుగునున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అనుభవం కూడా అదే తెలియజేస్తున్నది. అది వేరే విషయం.
పరిశీలించాల్సిన అంశాలు..
గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నానని ఏకపక్షంగా ప్రకటించి, శాసన సభలో కూడా బిల్లు ప్రవేశపెట్టారు. కానీ అందుకు అవసరమైన కార్యాచరణ పూర్తి చేయకుండా, తాము చెప్పిందాన్ని ఆచరణలో అమలు చేయకుండా దాటవేసింది.
ఇప్పుడు దాన్ని అమలు చేయాలని కొన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్ వెనుక ఉన్న కొన్ని ముఖ్యమైన వాస్తవాలను కూడా ఈ సందర్భంగా పరిశీలించడం అవసరం.
మొదటిది.. ఆర్టీసీలో అమలులో ఉన్న కండక్ట్ రెగ్యులేషన్స్ చట్టాలకు, భారత రాజ్యాంగానికి, సుప్రీంకోర్టు తీర్పులకు భిన్నంగా ఉన్నాయి.
చీటికిమాటికి ఉద్దేశపూర్వకంగా తప్పు చేయకపోయినా అధికారులు తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు.
ఒక కార్మికుడిని సర్వీస్ నుంచి సంపూర్ణంగా తొలగించడం(రిమూవ్ చేయడం) మంచినీరు తాగినంత సులువుగా ఆర్టీసీలో మారింది.
మహిళా కార్మికుల సమస్యల పట్ల కాని, అత్యవసర సందర్భాలలో ఒకరోజు సెలవు దొరకటం కానీ ఎండమావిలో నీరులాగా తయారైంది.
ప్రభుత్వంలో విలీనం అయితే ఈ దుర్భర పరిస్థితుల నుంచి బయటపడతామని కార్మికుల ఆశ.
అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పెన్షన్ పథకం ఆర్టీసీ కార్మికులకు వర్తించదు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు అమలులో ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్(సీపీఎస్) నష్టదాయకమైనది. అందుకే పాత పెన్షన్ విధానం(ఓపీఎస్) అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు పోరాడుతున్నారు. కానీ ఆర్టీసీ కార్మికులకు ఓపీఎస్ లేదా సీపీఎస్ ఏదీ అమలు కాదు.
ముష్టి కంటే హీనంగా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీం కింద అతి తక్కువ పెన్షన్ వస్తున్నది.
ఈ పెన్షన్ ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులలో కొందరికి కనీసం మందుల ఖర్చుకు కూడా ఏమాత్రం సరిపోని విధంగా ఉంది.
ఈ కారణాలన్నీ కలిపి ప్రభుత్వంలో విలీనం కావాలని కార్మికులు కోరుకోవడం తప్పు కాదు.
అయితే విలీనం అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు అక్కడి ఆర్టీసీ కార్మికులను నిరాశా నిస్పృహలకి నెట్టివేశాయి.
ఏమైనా ప్రభుత్వం తక్షణం కార్మిక సంఘాలతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి.
ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని రాజకీయ పక్షాలు, కార్మిక, ప్రజాసంఘాలు, విస్తృత ప్రజానీకం మద్దతును ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడగట్టాలి.
తాము ఈ రాష్ట్ర ప్రజలలో భాగమే తప్ప వేరు కాదు అనే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
