కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో జరిగిన రోడ్డు ప్రమాదం వల్ల ప్రైవేటు బస్సు అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో చాలామంది చనిపోయారు. మొన్న రాజస్తాన్లోని జైపూర్లో, నిన్న తెలంగాణలోని చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కూడా చాలామంది చనిపోయారు. దేశంలో ప్రతీరోజు ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల వల్ల పదుల సంఖ్యలో ప్రజలు చనిపోతూ, వారి ఇళ్లలో కన్నీళ్లను మిగుల్చుతున్నారు. అంతేకాకుండా ప్రమాదాల వల్ల ఎక్కువ సంఖ్యలో గాయాలపాలవుతున్నారు. ప్రమాదాల, చనిపోయినవారి, క్షతగాత్రుల అధికారిక లెక్కలను పరిశీలిస్తే దేశం “ప్రమాదాలభారతం”గా కనిపిస్తుంది.
తాజాగా చేవెళ్లలో జరిగిన ప్రమాదంలో 19 మంది చనిపోగా 24 మంది గాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన నాలుగు ప్రమాదాల్లో ఎనిమిది మంది చనిపోగా 33 మంది గాయపడ్డారు, రాజస్తాన్లోని జైపూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది చనిపోగా 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.
అత్యధికంగా ఢిల్లీలో ప్రమాదాలు..
రోడ్డు ప్రమాదాల్లో రాష్ట్ర, దేశ పరిస్థితిని పరిశీలిస్తే- తెలంగాణలో 2023లో 22,903 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ దుర్ఘటనల్లో 21,000 మంది గాయపడ్డారు. ప్రతి లక్ష మంది జనాభాలో రోడ్డు ప్రమాదాల వల్ల 35 మందికి పైగా మృతి చెందుతున్నారు. అలాగే 2022లో 7,859 ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రాష్ట్రంలో 2022 నుంచి ఈ ఏడాది సెప్టెంబరు చివరి వరకు రోడ్డు ప్రమాదాలు 1.33% పెరిగాయి. ఇతర రాష్ట్రాలను గమనిస్తే అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు ఢీల్లీలో చోటు చేసుకుంటున్నాయి.
పూర్తిగా దేశ పరిస్థితిని పరిశీలిస్తే, ఈ ఏడాది 2025 మొదటి ఆరు నెలలో 67,933 రోడ్డు ప్రమాదాలు దేశంలో సంభవించగా; అందులో 29,018 మంది వ్యక్తులు మరణించారు. ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కుగా రాష్ట్ర, జాతీయ రహదారులపైనే సంభవిస్తున్నట్లు అధికార విశ్లేషణలు తెలియజేస్తున్నాయి.
అదే విధంగా గడచిన ఐదు సంవత్సరాల దేశ పరిస్థితిని పరిశీలిస్తే, 2024లో అన్ని రకాల రోడ్డు ప్రమాదాలను కలుపుకొని 1,25,873 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇందులో 53,090 మృతి చెందారు. 2022లో461.312 ప్రమాదాలు, 168,491 మరణాలు; 2021లో412.432 ప్రమాదాలు, 153.972 మరణాలు; 2020లో 372.181 ప్రమాదాలు, 138.383 మరణాలు సంభవించాయి.
అలాగే దేశవ్యాప్తంగా 2023 సంవత్సరంలో జరిగిన 4,64,029 రోడ్డు ప్రమాదాల్లో 1లక్షా 73 వేల మంది మృతి చెందినట్లు నేషనల్ క్రైమ్ రికార్డుల బ్యూరో(ఎన్సీసీఆర్బీ) నివేదిక తెలియజేసింది. ఈ నివేదికను ఆలస్యంగా ఈ ఏడాది సెప్టెంబరు చివర్లో విడుదల చేశారు. చనిపోయినవారిలో 46% ద్విచక్రవాహనదారులున్నట్లు నివేదిక పేర్కొన్నది. అతి వేగం, అజాగ్రత్తే ఈ ప్రమాదాలకు ముఖ్యకారణమని బ్యూరో విశ్లేషించింది. 2022తో పోలిస్తే 2023లో 17,261 ఎక్కువ ప్రమాదాలు జరిగి, అందులో 1.6% ఎక్కువ మరణాలు నమోదయ్యాయి.
మొత్తం ప్రమాదాల్లో మృతి చెందిన వారిలోంచి, ద్విచక్ర వాహానాల ప్రమాదాల్లో మరణించిన వారు 45.8% మంది ఉన్నారు. ప్రమాదాల్లో మరణించిన పాదచారులు 27,586(15.9%), ఎస్యువీ, కారు, జీపు 24,776(14.3%) ఉన్నట్లు, ద్విచక్ర వాహనాల ప్రమాదాలలో 11,490 కేసులతో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. 8,370 కేసులతో ఉత్తర్ప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది.
జాతీయ రహదారులపై ఏటా 34.6%, రాష్ట్ర రహదారుల పై 23.4% ప్రమాదాలు, మరణాల దుర్ఘటనలు జరుగుతున్నాయి.
దేశంలో ప్రతి ఏటా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కారణాలపై అధ్యయనం చేసి విశ్లేషించినట్లు,ఎన్సీఆర్బీ వెల్లడించింది. ఈ విశ్లేషణ ప్రకారం అతివేగం, అజాగ్రత వల్ల 58.6% ప్రమాదాలు జరిగాయి, 26.6% మరణాలు సంభవిస్తున్నాయి. వాతావరణం సరిగ్గా లేకపోయినా, మద్యం, మత్తు పదార్ధాలు సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలు కూడా ప్రమాదాలకు, మరణాలకు కారణమవుతున్నాయని ఎన్సీఆర్బీ తెలియజేసింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
