హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఒక ప్రభుత్వ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు ఎనిమిదేళ్ల దళిత బాలుడిని నానా చిత్రహింసలు పెట్టి, తన ప్యాంటులో తేలు వేశారు. ఆ బాలుడి తండ్రి ఫిర్యాదు ఆధారంగా, ప్రిన్సిపాల్‌తో సహా ముగ్గురు ఉపాధ్యాయులపై బీఎన్ఎస్, ఎస్సీ/ఎస్టీ, జువెనైల్ జస్టిస్ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
న్యూఢిల్లీ: సిమ్లా జిల్లాలోని రోహ్రు సబ్ డివిజన్లోని ఖద్దపాణి ప్రాంత ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో దళిత బాలుడిపై జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఎనిమిదేళ్ల బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పాఠశాల ప్రిన్సిపాల్‌తో పాటు ముగ్గురు ఉపాధ్యాయులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
ఉపాధ్యాయులు ఆ పిల్లవాడిని నిరంతరం కొడుతున్నారని, ఒకసారి అతని ప్యాంటులో తేలు కూడా వేశారని ఆరోపణలు ఉన్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రిన్సిపాల్ దేవేంద్ర, ఉపాధ్యాయుడు బాబు రామ్, ఉపాధ్యాయురాలు కృతికా ఠాకూర్ నిందితులుగా ఉన్నారు. ఒకటవ తరగతి చదువుతున్న తన కొడుకును ఈ ముగ్గురు ఉపాధ్యాయులు దాదాపు ఒక సంవత్సరం పాటు పదేపదే శారీరకంగా వేధించారని బాలుడి తండ్రి పేర్కొన్నారు.
పదేపదే కొట్టడం వల్ల పిల్లవాడి కర్ణభేరి పగిలిపోయి, చెవుల నుంచి రక్తం కారడం మొదలైందని ఫిర్యాదులో పేర్కొనబడింది. అంతేకాకుండా, ఒకరోజు టీచర్లు స్కూల్ రెస్ట్రూమ్కు పిల్లవాడిని తీసుకెళ్లి ప్యాంటులో తేలు వేశారని విద్యార్థి తండ్రి చెప్పారు.
భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ) సెక్షన్లు 127(2) (చట్టవిరుద్ధ నిర్బంధం), 115(2) (కావాలని గాయపరచడం), 351(2)(నేరపూరిత బెదిరింపు), 3(5), జువెనైల్ జస్టిస్ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
అదనంగా నిందితులపై షెడ్యూల్డ్ కులాలు/ తెగలు(అత్యాచారాల నిరోధక) చట్టం(ఎస్సీ/ఎస్టీ చట్టం)లోని సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. ఇవి దళిత లేదా గిరిజన వ్యక్తిని అవమానించే లేదా అమానవీయంగా ప్రవర్తించే సెక్షన్లకు సంబంధించినవి.
తన మీద జరిగిన దాడులను ఇంటికి వెళ్లి ఎవరికైనా చెబితే అరెస్టు చేస్తామని ఉపాధ్యాయులు పిల్లవాడిని బెదిరించారని పిల్లవాడి తండ్రి ఆరోపించారు. అక్టోబర్ 30న ప్రిన్సిపాల్ తన కొడుకును పాఠశాల నుంచి బహిష్కరిస్తానని బెదిరించారని, ఈ విషయం బహిరంగంగా చెబితే “మేము మిమ్మల్ని కాల్చివేస్తాము” అని తమ కుటుంబ సభ్యులను హెచ్చరించారని కూడా ఆయన అన్నారు.
గత ఒక సంవత్సరం నుంచి పాఠశాలలో పిల్లలకు చట్టవిరుద్ధంగా టీచర్ కృతికా ఠాకూర్ భర్త నితీష్ ఠాకూర్ బోధిస్తున్నారని, ఆమె స్వయంగా తన విధులను నిర్వర్తించడం లేదని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.
పాఠశాలలో కుల వివక్ష సర్వసాధారణమని, “భోజన సమయాల్లో నేపాలీ, దళిత పిల్లలను రాజ్‌పుత్ పిల్లల నుంచి విడిగా కూర్చోబెడతారు” అని బాలుడి తండ్రి ఆరోపించారు.
ఈ సంఘటన రోహ్రు ప్రాంతంలో మొదటిది కాదు.
గత వారం గవానా ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడిని ముళ్ల పొదతో కొట్టారనే ఆరోపణలతో సస్పెండ్ చేశారు. దీని కంటే ముందు, లిమ్డా గ్రామంలో “తమ ఇంట్లోకి ప్రవేశించినందుకు” ఉన్నత కుల మహిళలు తనను గోశాలలో బంధించారని ఆరోపిస్తూ 12 ఏళ్ల దళిత విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
