రిజర్వేషన్ల విభజన అంశంపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సవాళ్లను ఎదుర్కొంటున్నది. ఈ తరుణంలో, వివిధ సామాజిక వర్గాలు తమ మత గురువుల నాయకత్వంలో బెంగళూరులో శక్తి ప్రదర్శన చేయనున్నాయి.
కర్ణాటక హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల దృష్ట్యా, మొత్తం రిజర్వేషన్ కోటాను 56% నుంచి 50%కి తగ్గిస్తూనే, షెడ్యూల్డ్ కులాలకు(ఎస్సీ) కేటాయించిన 15% కోటాలో అంతర్గత రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రత్యేక మంత్రివర్గ సమావేశం చర్చించనుంది.
ఈ అంశంపై మంత్రివర్గంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దళిత ఎడమ, దళిత కుడి వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు.
అందరికీ ఆమోదయోగ్యమైన ఉప-వర్గీకరణ నిష్పత్తిపై ఏకాభిప్రాయం తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రతిపాదిత రిజర్వేషన్ నిష్పత్తి..
మొత్తం 15% ఎస్సీ కోటాలో దళిత ఎడమ వర్గానికి 5.3%, దళిత కుడి వర్గానికి 5.3%, స్పృశ్య కులాలకు 4.4% చొప్పున రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.
మార్చి 11న దావణగెరెలోని హరిహర నుంచి ప్రారంభమైన పాదయాత్రలో పాల్గొంటున్న సహాయకుల సమాచారం ప్రకారం, ఈ మఠాధిపతి ఆదివారం రాత్రి సిరాలో బస చేసి, ప్రత్యేక క్యాబినెట్ సమావేశానికి ముందే బెంగళూరు చేరుకుంటారు.
మాదిగల పాదయాత్ర..
అంతర్గత రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చిత్రదుర్గకు చెందిన ఆదిజాంబవ మఠాధిపతి, మాదిగ సామాజికవర్గ అధిపతి శ్రీ షడక్షరి ముని స్వామి బెంగళూరుకు పాదయాత్ర చేపట్టారు.
కర్ణాటక రాష్ట్ర చరిత్రలో ఇటీవల చేపట్టిన అత్యధిక ఉద్యోగాల నియామకాలలో 15% కోటాకు లోబడి అంతర్గత రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మార్చి 11న దావణగెరెలోని హరిహరలో ప్రారంభమైన ఈ యాత్ర, ఆదివారం నాడు సిరాలో బస చేసింది. క్యాబినెట్ సమావేశానికి ముందే బెంగళూరు చేరుకుంది.
అదే సందర్భంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకులు క్యాబినెట్ మంత్రులను కలిసి తమ వాదనలను వినిపించి మద్దతు కోరనున్నారు.
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కులాలకు ఉన్న 15 శాతంలో అంతర్గత రిజర్వేషన్లు లేకుండా, మొత్తం 50 శాతానికి లోబడి రిజర్వేషన్లు అమలు చేస్తూ (2022కి పూర్వం ఉన్న విధంగా) 56,432 ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో, రిజర్వేషన్ కోటా విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.
పెరుగుతున్న వ్యతిరేకత..
ప్రత్యేక క్యాబినెట్ సమావేశానికి ముందు- దళిత ఎడమ (మాదిగ) వర్గం అంతర్గత రిజర్వేషన్ల కోసం పట్టుబడుతుండగా, దళిత కుడి(హొలెయ) వర్గంతో పాటు బంజారా/లంబాడి, భోవి, కొరమ, కొరాచ వంటి స్పృశ్య కులాలు అంతర్గత రిజర్వేషన్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
దళిత ఎడమ(మాదిగ) వర్గం మాత్రం 15% కోటాలోనే అంతర్గత రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతోంది. ఈ నేపథ్యంలో క్యాబినెట్ సమావేశం జరగనున్నది.
భోవి గురుపీఠానికి చెందిన ఇమ్మడి సిద్ధరామేశ్వర స్వామి, బంజారా పీఠాధిపతి సర్దార్ సేవలాల్ స్వామి ఆధ్వర్యంలో అంతర్గత రిజర్వేషన్లు లేకుండా 50% రిజర్వేషన్లతో ఉద్యోగ నియామకానికి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌కు మద్దతుగా బెంగళూరులో ప్రదర్శన జరిగింది.
2027 జనాభా లెక్కల ఫలితాలు వెలువడేదాకా అంతర్గత రిజర్వేషన్లు అమలు చేయవద్దని వీరు కోరుతున్నారు.
అంతర్గత రిజర్వేషన్ తమ వర్గానికి అన్యాయం చేస్తుందని, ఇతరుల ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవద్దని వీరి వాదన.
కర్ణాటక రాష్ట్ర రిజర్వేషన్ల పరిరక్షణ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి రవి కే పూజార్ ఈ వివరాలు తెలియజేస్తూ, మంగళవారం నాడు జరిగే ప్రభుత్వ నియామక ప్రకటన మద్దతు ప్రదర్శనలో పాల్గొనబోతున్నట్లు చెప్పారు.
హెచ్ఎన్ నాగమోహన్ దాస్ కమిషన్ నివేదికను తిరస్కరించాలని కోరుతూ ఉరిలింగి పెద్ది మఠం మైసూర్ బ్రాంచ్ జ్ఞానప్రకాష్ స్వామి ఆధ్వర్యంలో దళిత కుడి(హొలెయ) వర్గం వారు ఫ్రీడమ్ పార్క్ వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు.
కర్ణాటక రాష్ట్ర రైట్ కమ్యూనిటీ క్యాస్ట్ ఫెడరేషన్ అధిపతి, అంతర్గత రిజర్వేషన్లు లేకుండా పాత పద్ధతినే కొనసాగించాలని కోరారు.
ప్రభుత్వం ఇటీవల 56,432 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తూ, పాత 50% రిజర్వేషన్ కోటానే అమలు చేస్తామని, అంతర్గత రిజర్వేషన్లు ఉండవని ప్రకటించడంతో ఒత్తిడి పెరిగింది.
“2027 జనాభా గణన నివేదిక వచ్చే వరకు అంతర్గత రిజర్వేషన్లను అమలు చేయకూడదు. ఒత్తిడికి లోనై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మా వర్గాలకు అన్యాయం చేసినట్లే,” అని కర్ణాటక రిజర్వేషన్ సంరక్షణ కూటమి ప్రధాన కార్యదర్శి రవి కే పూజార్ పేర్కొన్నారు.
బీజేపీ కార్యాచరణ..
మరోవైపు, రిజర్వేషన్ కోటాను తగ్గించడాన్ని నిరసిస్తూ బీజేపీ చేపట్టదలచిన పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేసింది.
ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని బీజేపీ ప్రధాన కార్యదర్శి పీ రాజీవ్ తెలిపారు.
ఒకవేళ ప్రభుత్వం రిజర్వేషన్ 56% నుంచి 50 శాతానికి తగ్గించాలని నిర్ణయిస్తే, దానికి వ్యతిరేకంగా తాము పాదయాత్ర నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు.
అనువాదం: ఆర్ లక్ష్మయ్య
ది హిందూ సౌజన్యంతో ఈ వ్యాసాన్ని ది వైర్ తెలుగు పాఠకులకు అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
