ఉత్తరప్రదేశ్ చట్ట విరుద్ధ మత మార్పిడి నిరోధక చట్టం-2021 కింద తప్పుడు ఎఫ్ఐఆర్ల నమోదును ఈ ఏడాది ఏప్రిల్‌లో అలహాబాద్ హైకోర్టు ఖండిస్తూ, ఇది “కలవరపెట్టే ధోరణి” అని వ్యాఖ్యానించింది.
న్యూఢిల్లీ: రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలు, మెడికల్, డెంటల్ కళాశాలలతో సహా “మార్పిడి వ్యతిరేక విభాగాలు” ఏర్పాటు చేయాలని ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఆదేశించారు.
రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం ఈ చర్యను సమర్థించినట్టు హిందుస్థాన్ టైమ్స్ కథనం తెలియజేసింది.
విద్యా సంస్థలకు గవర్నర్ సచివాలయం లేఖ..
రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, డైరెక్టర్లు, అన్ని ఉన్నత విద్యా సంస్థలు, వైద్య సంస్థలతో సహా ఇతర విద్యా సంస్థలకు గవర్నర్ సచివాలయం నుంచి ఈ మేరకు లేఖ పంపించారు.
మత మార్పిడి కోసం ప్రలోభాలు, మానసిక ఒత్తిడి లేదా ఇతర అనైతిక మార్గాల ద్వారా విద్యార్థులు ప్రభావితం అవుతున్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ సేవలు, పర్యవేక్షణ వ్యవస్థలు, విద్యార్థి సంక్షేమ యంత్రాంగాలు, రిపోర్టింగ్ ప్రోటోకాల్స్, వంటి నిరోధక, రక్షణ చర్యలను పటిష్టం చేయాలని కూడా గవర్నర్ ఆదేశించారు.
విద్యార్థులను ప్రభావితం చేస్తూ వారిలో భయాన్ని చొప్పించడం, మానసిక ఒత్తిడిని సృష్టించడం లేదా అనైతిక ప్రలోభాలకు గురిచేయడం వంటి ఏ రకమైన అక్రమ లేదా బలవంతపు మత మార్పిడి ప్రయత్నాలను అంగీకరించబోమని, ఇలా చేయడం అనైతికం, చట్టానికి విరుద్ధమని ఆ లేఖలో స్పష్టం చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం వెల్లడించింది.
ప్రలోభాలు లేదా మానసిక ఒత్తిడి ద్వారా విద్యార్థులను మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తరచుగా నివేదికలు అందుతున్నట్లు కూడా ఆ లేఖ పేర్కొంది.
విద్యార్థి సంక్షేమ విభాగాల బలోపేతం..
విశ్వవిద్యాలయం, సంస్థల స్థాయిలో, ‘యాంటీ-రాడికలైజేషన్'(తీవ్రవాద వ్యతిరేక) యూనిట్లు లేదా విద్యార్థి సంక్షేమ విభాగాలను అత్యంత చురుకుగా మార్చాలని లేఖ పేర్కొంది.
నైతిక విలువలు, తార్కిక ఆలోచన, చట్టపరమైన హక్కులపై సదస్సులు, ఉపన్యాసాలను ఏర్పాటు చేయాలని విద్యా సంస్థలకు సూచించింది.
మత మార్పిడి ప్రయత్నాలతో ముడిపడి ఉన్న అనుమానాస్పద కార్యకలాపాలకు ఏ వ్యక్తి, సమూహం లేదా సంస్థ పాల్పడుతున్నట్లు గుర్తించినా వెంటనే స్థానిక యంత్రాంగానికి, పోలీసులకు సమాచారం ఇవ్వాలని గవర్నర్ కోరారు.
ఇలాంటి కేసుల్లో రాష్ట్ర మత మార్పిడి వ్యతిరేక చట్టాల కింద చర్యలు తీసుకోవాలని లేఖ సూచించింది.
చట్టాల దుర్వినియోగంపై ఆందోళనలు..
మత మార్పిడి వ్యతిరేక చట్టాలను అమలు చేసే ఏజెన్సీలు స్వచ్ఛందంగా(సుమోటో) లేదా రాజకీయ ఆదేశాలతో ఎలా దుర్వినియోగం చేస్తున్నాయన్న దానిపై ది వైర్ గతంలోనే నివేదించింది.
బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్, ఇతరులకు చెందిన విజిలెంట్లు కూడా మైనారిటీలను, ముఖ్యంగా ముస్లింలను వేధించడానికి ఈ చట్టాలను ఉపయోగిస్తున్నారు.
హిందూయేతర సంస్థ లేదా సమూహం ఏదైనా ఉచిత క్లినిక్, స్కాలర్షిప్, లేదా కనీసం స్నేహపూర్వక ప్రార్థన సమావేశాలు నిర్వహించినా వాటిని పరిశీలన పరిధిలోకి తెచ్చి చట్టపరమైన, చట్టవిరుద్ధమైన వేధింపులకు గురిచేస్తున్నారు.
హిందూ జాతీయవాద గ్రూపులు దాఖలు చేసిన ఫిర్యాదులకు సంబంధించి అనేక కేసుల్లో, సాక్ష్యం బలహీనంగా ఉన్నా లేదా అసలు లేకపోయినా పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటున్నారు.
తక్కువ శిక్షల రేటు ఉన్నప్పటికీ అరెస్టులు, కోర్టు కేసులు, హింస కారణంగా సామాజిక సామరస్యం దెబ్బతింటోంది.
ఈ చట్టాలు మత మార్పిడులను ఆపడానికి కాకుండా మైనారిటీలను భయభ్రాంతులకు గురిచేయడానికి ఒక సాధనంగా మారుతున్నట్లు కనిపిస్తోంది.
ఉత్తరప్రదేశ్ చట్ట విరుద్ధ మత మార్పిడి నిరోధక చట్టం-2021 కింద తప్పుడు ఎఫ్ఐఆర్లను నమోదు చేయడాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లో ఖండిస్తూ, ఇది కలవరపెట్టే ధోరణి అని వ్యాఖ్యానించిన అలహాబాద్ హైకోర్టు, ఇలాంటి కేసుల్లో తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ వ్యక్తిగత అఫిడవిట్‌ను దాఖలు చేయాలని రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శి (హోం)ని ఆదేశించింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
