గూగుల్ డైరెక్టర్ రెనే మేయర్హోఫర్ నైతిక అభ్యంతరాల కారణంగా రాజీనామా చేశారు.
సంస్థ యాజమాన్యంతో వచ్చిన విభేదాలు, అలాగే సుందర్ పిచాయ్ ప్రకటించిన ఏఐ సూత్రాలకు విరుద్ధంగా ఉందని విమర్శలు ఎదుర్కొంటున్న పెంటగాన్ ఏఐ ఒప్పందాన్ని ఆయన తన రాజీనామాకు కారణాలుగా పేర్కొన్నారు. ఈ రాజీనామా గూగుల్ సైనిక ఒప్పందాలపై సంస్థలోనే ఉన్న అసంతృప్తిని బయటపెట్టింది.
దశాబ్ద కాలపు ప్రయాణానికి ముగింపు..
టెక్ పరిశ్రమను కుదిపేస్తున్న ప్రస్తుత ఉద్యోగాల కోతల(లేఆఫ్స్) ప్రవాహంలో అనేక మంది ఉద్యోగులు సామాజిక మాధ్యమాలలో భావోద్వేగభరితమైన వీడ్కోలు సందేశాలు రాస్తున్నారు.
ఈ నేపథ్యంలో, ఒక గూగుల్ డైరెక్టర్ మాత్రం తన స్వచ్ఛంద నిర్ణయంతో కంపెనీని వీడారు.
2017లో సుందర్ పిచాయ్ నాయకత్వంలోని గూగుల్ సంస్థ రెనే మేయర్హోఫర్కు తిరస్కరించలేని అవకాశం ఇచ్చి ఆయనను ఆండ్రాయిడ్ ప్లాట్ఫార్మ్ సెక్యూరిటీ డైరెక్టర్‌గా నియమించింది.
అయితే దాదాపు దశాబ్దం తర్వాత తాను తొమ్మిది సంవత్సరాల క్రితం చేరిన గూగుల్ ఇప్పుడు అదే సంస్థగా లేదని చెబుతూ ఆయన రాజీనామా చేశారు.
జూన్ 7న తన వ్యక్తిగత బ్లాగులో పూర్తి రాజీనామా లేఖను ప్రచురించిన మేయర్హోఫర్- గూగుల్ ఉద్యోగాన్ని వీడాలనే తన నిర్ణయం ఒకవైపు అత్యంత కఠినమైనదని, మరోవైపు సులభమైనదని కూడా అని పేర్కొన్నారు.
అయితే చివరికి కంపెనీ యాజమాన్యం నైతిక దిక్సూచిని కోల్పోయింది కాబట్టి తాను వీడ్కోలు చెప్పక తప్పలేదని ఆయన అన్నారు.
తాను ఎందుకు రాజీనామా చేశాననే విషయాన్ని వివరించిన ఈ లేఖ మొదట్లో పెద్దగా దృష్టిని ఆకర్షించలేదు.
అయితే ఈ వారం మేయర్హోఫర్ తన సహోద్యోగులతో అంతర్గతంగా పంచుకున్న వీడ్కోలు సందేశం తమకు లభించిందని బిజినెస్ ఇన్సైడర్ పత్రిక పేర్కొనడంతో ఆ లేఖ అమెరికా మీడియా కథనాల్లో ప్రధానాంశంగా మారింది.
విలువల నుంచి దారితప్పిన యాజమాన్యం..
గూగుల్‌లో ఆండ్రాయిడ్ ప్లాట్ఫార్మ్ సెక్యూరిటీ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సమయంలోనే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారని రెనే మేయర్హోఫర్ గుర్తుచేశారు.
అయితే అప్పటి నుంచి గూగుల్ సంస్థ తాను ప్రకటించిన కొన్ని లక్ష్యాలను నిశ్శబ్దంగా పక్కన పెట్టిందని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
రాజీనామా చేయడానికి ప్రధాన కారణంగా రెండు వేల పద్దెనిమిదిలో సుందర్ పిచాయ్ ప్రకటించిన ఏఐ సూత్రాలకు విరుద్ధంగా గూగుల్ యాజమాన్యం అమెరికా రక్షణ శాఖతో(పెంటగాన్) ఒప్పందాలు కుదుర్చుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు.
ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ సంస్థ తన ప్రకటిత సూత్రాలకు భిన్నమైన దిశలో సాగిందని ఆయన ఆరోపించారు.
ప్రపంచ స్థాయిలో ప్రభావం చూపే పనులు చేయడానికి గూగుల్ ఉత్తమ వేదికగా ఉండేదని మేయర్హోఫర్ ఈ నెల ప్రారంభంలో తన బ్లాగులో రాశారు.
“సంస్థలో పారదర్శకత ఉండేది. భిన్నాభిప్రాయాలు, విభిన్న ఆలోచనలను గౌరవించే సంస్కృతి ఉండేది. అంతేకాకుండా గూగుల్ ఉద్యోగులమైన మేము మా వ్యక్తిగత గుర్తింపు, విలువలను ఉద్యోగంలో ప్రతిబింబించడం కేవలం అనుమతించబడటమే కాదు, అలా చేయాలని ప్రోత్సహించబడేవాళ్ళం” అని ఆయన పేర్కొన్నారు.
బాధ్యతలకు వీడ్కోలు పలికిన శాంతివాది..
గూగుల్ మాజీ డైరెక్టర్ రెనే మేయర్హోఫర్ ప్రస్తుతం ఆస్ట్రియాలోని జోహన్నెస్ కెప్లర్ యూనివర్సిటీ లింజ్లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
అలాగే ఆ విశ్వవిద్యాలయంలోని నెట్వర్క్స్ అండ్ సెక్యూరిటీ ఇన్స్టిట్యూట్కు అధిపతిగా కూడా ఉన్నారు. ఆయన తనను తాను శాంతివాదిగా(యుద్ధాలను వ్యతిరేకించే వ్యక్తిగా) పేర్కొంటారు.
తనపై నమ్మకం ఉంచిన గూగుల్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ విభాగం ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ డేవ్ క్లైడర్మాచెర్కు, అలాగే గూగుల్ ఆండ్రాయిడ్ ప్లాట్ఫార్మ్ సెక్యూరిటీ విభాగాధిపతి నిక్ క్రాలెవిచ్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
సంస్థ లోపల నుంచే నాయకత్వ బాధ్యతలు చేపట్టి మార్పు తీసుకురావడానికి అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఏఐ సూత్రాలకు పాతాళం..
అదే సమయంలో తాను ఎప్పుడూ క్లౌడ్ విభాగానికి సంబంధించిన విషయాలలో పాలుపంచుకోనప్పటికీ, కంపెనీ మొత్తం లక్ష్యం మాత్రం ఇంకా పూర్తిగా కర్బన ఉద్గారాలు లేనిదిగా మారడమేనని ఆయన అంగీకరించారు.
ఉద్యోగులు వాటికి వ్యతిరేకంగా మాట్లాడిన తర్వాత కొన్నేళ్ల నాటి పెంటగాన్ ఒప్పందాలను సైతం రద్దు చేసుకునేలా ఇది కంపెనీని ప్రేరేపించింది.
గతంలొ ఈ విషయానికి సంబంధించి ఒక బహిరంగ లేఖపై తాను స్వయంగా సంతకం చేసినట్లు పేర్కొంటూ, ఆ మాజీ గూగుల్ ఉన్నతాధికారి సీఈఓ సుందర్ పిచాయ్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్న ఏఐ సూత్రాలు పెంటగాన్ కొత్త ఏఐ ఒప్పందానికి వ్యతిరేకంగా ఉన్న కొన్ని నిబంధనలను స్పష్టం చేశాయని జోడించారు.
2018లో సుందర్ పిచాయ్ గూగుల్ ఏఐ గురించి కొన్ని నియమాలు ప్రకటించారు. “మనుషులకు హాని చేసే పనుల కోసం ఏఐని ఉపయోగించము” అని అప్పట్లో గూగుల్ చెప్పింది.
అందులో ముఖ్యంగా మనుషులను గాయపరచడానికి లేదా చంపడానికి ఉపయోగపడే ఆయుధాల కోసం ఏఐ తయారు చేయమని, ప్రజలపై నిఘా (గూఢచర్యం) చేపట్టే ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేయమని, అంతర్జాతీయ చట్టాలు, మానవ హక్కులకు విరుద్ధమైన పనుల కోసం ఏఐని ఉపయోగించరాదని ప్రకటించారు.
కానీ ఇప్పుడు గూగుల్ అమెరికా సైన్యంతో (పెంటగాన్) ఏఐ ఒప్పందాలు చేసుకుంటోంది.
ఇది గూగుల్ గతంలో చెప్పిన మాటలకు విరుద్ధమని రెనే మేయర్హోఫర్ భావించారు. అందుకే ఆయన రాజీనామా చేశారు.
అందుకే రాజీనామా తప్పనిసరైంది..
గూగుల్ గతంలో ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా మారిపోయిందో పోలుస్తూ రెనే మేయర్హోఫర్ వివరిస్తూ, ప్రస్తుతం గూగుల్ యాజమాన్యం అమెరికా రక్షణ శాఖతో(పెంటగాన్) ఒప్పందాలు కుదుర్చుకుంటోందన్నారు.
“ప్రస్తుత అమెరికా ప్రభుత్వం చట్టబద్ధమైన ఏ ప్రయోజనం కోసం అయినా ఈ సాంకేతికతను ఉపయోగించవచ్చని చెబుతోంది. అయితే అలాంటి చర్యలు గతంలో ఎన్నోసార్లు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినవిగా నిరూపితమయ్యాయ”ని ఆయన పేర్కొన్నారు.
అందువల్ల గూగుల్ తన పాత విలువలు, సూత్రాల నుంచి దూరమైందని భావించిన ఆయన ఈ పరిస్థితుల్లో రాజీనామా చేయడం తప్ప తనకు మరో మార్గం లేదని చెప్పారు.
అమెరికా అధికారులు చట్టబద్ధమైన ఏ అవసరం కోసం అయినా ఉపయోగించవచ్చని చెప్పిన ఏఐ నమూనాలను(మోడళ్లను) అందించేందుకు గూగుల్ పెంటగాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఇటువంటి వినియోగాలు గతంలో అనేకసార్లు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినవిగా తేలినట్లు ఆయన ఆరోపించారు.
ఉద్యోగుల వ్యతిరేకతను పట్టించుకోని గూగుల్..
గూగుల్ ఉద్యోగుల్లో చాలామంది కలిసి ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించినప్పటికీ పెంటగాన్‌తో ఏఐ ఒప్పందం అమల్లోకి వచ్చింది.
అమెరికా రక్షణ శాఖ కోసం రహస్య ఏఐ ప్రాజెక్టుల్లో పాల్గొనవద్దని కోరుతూ ఉద్యోగులు పిటిషన్ కూడా పెట్టారు.
అయినప్పటికీ గూగుల్ ఆ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లింది. ఆ సమయంలో సుందర్ పిచాయ్.. పెంటగాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవద్దని కోరుతూ ఆరు వందల మందికి పైగా ఉద్యోగులు ఒక లేఖపై సంతకం చేశారు. ఆ లేఖ ప్రతిని చూసినట్లు వాషింగ్టన్ పోస్ట్ పత్రిక అప్పట్లో వెల్లడించింది.
కంపెనీ లోపల నుంచే తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ ఈ నిర్ణయాలు గూగుల్ అత్యున్నత యాజమాన్య స్థాయిలో తీసుకున్నవేనని మేయర్హోఫర్ చెప్పారు.
తాను కూడా ఒకప్పుడు సంస్థలో ఉన్నత స్థాయిలో పనిచేసినప్పటికీ ఈ విధాన మార్పుల గురించి అధికారిక అంతర్గత సమాచార మార్గాల ద్వారా తనకు ఎప్పుడూ తెలియజేయలేదని ఆయన పేర్కొన్నారు.
రెనే మేయర్హోఫర్ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తన బ్లాగులో ఇంకాస్త ఘాటుగా రాస్తూ- “నాకున్న నైతిక విలువల ప్రకారం చట్టాల గురించి పెద్దగా పట్టించుకోకుండా శత్రువులను ఎంత వీలైతే అంత ఘోరంగా మట్టుబెట్టడమే లక్ష్యం అని చెప్పుకునే అమెరికా రక్షణ శాఖ చేస్తున్న పనులకు నేను ఏ రకంగానూ మద్దతు ఇవ్వలేను. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ దానికి నేను సహాయం చేయలేను” అని తెలిపారు.
కంపెనీ పైస్థాయి నిర్వహణ బృందం తీసుకున్న నిర్ణయాల వల్ల తనకు ఉద్యోగానికి రాజీనామా చేయడం తప్ప మరో దారి లేకుండా పోయిందని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
సులువైన.. కఠినమైన నిర్ణయం..
గూగుల్ లాంటి పెద్ద కంపెనీని వదిలేసి వెళ్ళిపోవడం తనకు చాలా కష్టమైన నిర్ణయమనీ, అక్కడ ఉన్నవారందరినీ తాను కచ్చితంగా మిస్ అవుతానని ఆయన చెప్పారు.
అయినప్పటికీ తాను ఒక శాంతి కాముకుడినని, యుద్ధాలు, హింసను వ్యతిరేకించే వ్యక్తిని కావడం వల్ల ఈ పరిస్థితుల్లో ఉద్యోగం మానేయడం తప్పనిసరని, తన సిద్ధాంతాల పరంగా చూసుకుంటే ఇది చాలా సులువైన నిర్ణయమని ఆయన అన్నారు.
దాడి చేసే, యుద్ధాల్లో పాల్గొనే సైన్యాల కోసం తాను ఎప్పుడూ పనిచేయనని ముందే నిర్ణయించుకున్నానని మేయర్హోఫర్ తెలిపారు.
ప్రజలకు ఉద్దేశపూర్వకంగా హాని చేసే కార్యక్రమాల్లో భాగస్వామి కావడం తన వల్ల కాదని ఆయన చెప్పారు.
అలాగే యూరప్‌కు చెందిన విద్యావేత్తగా ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు తనకే కాకుండా మొత్తం యూరోపియన్ యూనియన్ పౌరులందరికీ ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
చట్టబద్ధమైన ఏ ప్రయోజనం కోసం అయినా అనే నిబంధనను ఆధారంగా చేసుకుని ప్రజలపై విస్తృత స్థాయిలో దొంగచాటు నిఘా (గూఢచర్యం) నిర్వహించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
“ఈ ఒప్పందం వల్ల గూగుల్ ఏఐ ఉత్పత్తులు భవిష్యత్తులో నాపై, నా కుటుంబ సభ్యులపై లేదా నా వంటి వ్యక్తులపైన కూడా నేరుగా ఉపయోగించే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో నేను రాజీనామా చేయకుండా కొనసాగడం అసాధ్యమని భావించాను” అని మాజీ గూగుల్ డైరెక్టర్ మేయర్హోఫర్ పేర్కొన్నారు.
గూగుల్ యాజమాన్యానికి మళ్లీ మంచి బుద్ధి, నైతిక విలువలు వస్తాయని ఆశిస్తున్నట్లు మేయర్హోఫర్ చెప్పారు. తన ప్రస్తుత కాంట్రాక్ట్ నియమాల ప్రకారం తాను ఉద్యోగం మానేయడానికి మూడు నెలల ముందే కంపెనీకి ముందస్తు సమాచారం (నోటీస్ పీరియడ్) ఇవ్వాల్సి ఉందని ఆయన తెలిపారు.
తన బ్లాగ్ పోస్ట్‌లో చెప్పినట్లుగా ఆయన 2026 ఆగస్టు 31 వరకు అధికారికంగా గూగుల్ కంపెనీతోనే ఉంటారు.
ఈ లోపు తను చేస్తున్న పనులను పూర్తి చేయడం లేదా వేరే వారికి అప్పగించడం పైనే దృష్టి పెడతానని చెప్పారు.
అయినప్పటికీ అమెరికా రక్షణ శాఖతో జరిగిన ఆ ఒప్పందానికి సంబంధించి ఎలాంటి ఏఐ వ్యవస్థల పనుల నుంచైనా సరే తాను వెంటనే తప్పుకుంటానని ఆయన స్పష్టం చేశారు.
భవిష్యత్తు ప్రణాళికలు.. గూగుల్ స్పందన..
ఇకపై తాను ఏ పనుల మీద దృష్టి పెట్టనున్నాడో తెలియజేస్తూ.. డేటా భద్రతకు సంబంధించిన విషయాలైన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్టెడ్ సమాచార మార్పిడి అనగా మనం పంపే సందేశాలు లేదా సమాచారాన్ని మధ్యలో ఎవరూ చౌర్యం చేయకుండా కేవలం పంపినవారికి, అందుకునేవారికీ మాత్రమే కనిపించేలా చేసే భద్రతా వ్యవస్థల మీద, గోప్యతను కాపాడే డిజిటల్ గుర్తింపు అనగా మన వ్యక్తిగత వివరాలు బయటకు లీక్ కాకుండా కాపాడే డిజిటల్ గుర్తింపు కార్డుల సాంకేతికతల మీద, ఆపరేటింగ్ వ్యవస్థలు, సరఫరా వ్యవస్థల భద్రత అనగా కంప్యూటర్లు, మొబైల్స్ సాఫ్ట్వేర్లతో పాటు సాంకేతిక తయారీ వ్యవస్థకు ఎలాంటి వైరస్లు, ప్రమాదాలు రాకుండా రక్షణ కల్పించడం వంటి మరికొన్ని సెక్యూరిటీ అంశాలపైనే తన పరిశోధనలను, పనులను కొనసాగిస్తాను అని తెలిపారు.
ప్రస్తుతం అయితే మేయర్హోఫర్ రాజీనామా లేదా ఆయన బ్లాగులో చేసిన వ్యాఖ్యలపై గూగుల్ అధికారికంగా స్పందించలేదు.
అయితే గతంలో ఈ ప్రాజెక్టు గురించి స్పందించిన గూగుల్, ఇది జాతీయ భద్రతకు తోడ్పడే కార్యక్రమమని, ఇందులో భాగస్వామ్యం కావడం తమకు గర్వకారణమని తెలిపింది.
బిజినెస్ ఇన్సైడర్ పత్రికకు ఇచ్చిన ప్రకటనలో, “ప్రజలపై భారీ స్థాయిలో నిఘా పెట్టడానికి లేదా తగిన మానవ పర్యవేక్షణ లేకుండా స్వయంచాలక ఆయుధాల కోసం ఏఐని ఉపయోగించకూడదనే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల ఉమ్మడి అభిప్రాయానికే మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం” అని గూగుల్ తెలిపింది.
అనువాదం: కె. మనోహర రాజు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
