తెలంగాణ కులగణన సర్వే 242 కులాల మధ్య బహుముఖ వెనుకబాటుతనాన్ని మ్యాప్ చేసి, తీవ్రమైన, కొనసాగుతున్న సామాజిక శ్రేణీకరణను బయటపెట్టింది.
ఆర్థిక వృద్ధి, పట్టణీకరణ, సగటు జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నప్పటికీ- కులాధారిత అసమానతను మాత్రం తొలగించలేకపోతున్నాయి. కాబట్టి ప్రత్యేక వెనుకబాటుతన స్కోర్ల ఆధారంగా కుల-సున్నితమైన రిజర్వేషన్లు, విధానాలు అవసరమని ఈ అధ్యయనం సూచిస్తోంది.
ఆర్థిక వృద్ధి, పట్టణీకరణ, ఆధునీకరణ వలన కుల వ్యవస్థ క్రమంగా కనుమరుగవుతుందని చాలాకాలంగా భావించారు. కానీ థోరట్, న్యూమన్(2007) ప్రకారం, కుల వివక్ష సమాజ నిర్మాణంలోనే బలంగా పాతుకుపోయి ఉంది. మార్కెట్లు విస్తరించినా అది స్వయంగా తగ్గిపోదు.
బీహార్ కుల జనగణన ఆధారంగా గత అధ్యయనాలు కులాల మధ్య, కులాల లోపల పెద్ద తేడాలు ఉన్నాయని చూపించాయి. ఇప్పుడు తెలంగాణ డేటా ఆ వాదనకు మరింత సున్నితమైన ఆధారాన్ని జోడించింది.
ఈ సర్వేలో కనిపించిన అసమానతలు స్వల్పమైనవి కావు, అవి తీవ్రమైనవి. సర్వే నివేదిక ప్రకారం ఈ వ్యత్యాసం “ఎక్స్పోనెన్షియల్” స్థాయిలో ఉంది.
సర్వే గణాంకాలు తెలంగాణ సామాజిక-ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ- కుల సర్వేలో ఉన్నాయి.
2024 చివరలో నిర్వహించిన ఈ సర్వే రాష్ట్ర జనాభాలో సుమారు 97% అయిన 35.4 మిలియన్ల మందిని సర్వే చేసింది. సాధారణ నమూనా సర్వేలతో పోలిస్తే, ఈ డేటా మొత్తం జనాభా స్థాయిలో 242 కులాల మధ్య అసమానతను విశ్లేషించేందుకు అవకాశం కల్పించింది. దీనివల్ల కేవలం ఎస్సీ, ఇతర కులాల మధ్య తేడాలు మాత్రమే కాకుండా, పక్కపక్కనే నివసించే, ఒకే పాఠశాలల్లో చదివే, ఒకే ఉద్యోగ మార్కెట్లో పోటీపడే సముదాయాల మధ్య ఉన్న అసమానతలు కూడా స్పష్టమయ్యాయి.
కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్..
ఈ అధ్యయనానికి కేంద్రంగా “కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్” ఉంది. ఇది విద్య, ఉపాధి, జీవన పరిస్థితులు, ఆస్తులు, సామాజిక సమీకరణ వంటి 42 సూచికల ఆధారంగా పలు కోణాలలో వెనుకబాటుతనాన్ని గుర్తించే కొలమానం. ఒకే సూచిక ముఖ్యంగా, ఆదాయం, వెనుకబాటుతనం తరతరాలుగా ఎలా పేరుకుపోతుందో పూర్తిగా చూపలేదని కొందరు పరిశోధకులు చెబుతున్నారు.
ఈ సర్వేలో 57 ప్రధాన ప్రశ్నలు, అనేక ఉపప్రశ్నలు ఉండగా, సర్వే సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించి సమాచారం సేకరించారు.
వెనుకబాటుతన స్థాయి..
సీబీఐ పంపిణీ సాధారణ బెల్ ఆకారంలో లేదు. చాలా కులాలు రాష్ట్ర సగటు సీబీఐ అయిన 81 కంటే చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. అంటే తీవ్రమైన వెనుకబాటుతనం కొద్దిమంది సముదాయాలకు మాత్రమే పరిమితం కాలేదు. అనేక కులాల్లో అది విస్తరించి ఉంది.
సామాజిక వర్గాల వారీగా సగటు సీబీఐ:
ఎస్సీలు – 92.6
ఎస్టీలు – 94.9
బీసీలు – 85.8
ఓసీలు/జనరల్ కేటగిరీ – 30.8 శాతంగా ఉన్నాయి.
దీంతో ఆధునికీకరణ జరిగినా కుల ఆధారిత అసమానత కొనసాగుతూనే ఉందని స్పష్టమవుతోంది.
ప్రభుత్వ నివేదిక ప్రకారం, సగటు అగ్రకుల కుటుంబంతో పోలిస్తే సగటు ఎస్సీ కుటుంబంలో మూడు రెట్లు ఎక్కువ వెనుకబాటుతనం ఉంది. అందువల్ల కేవలం ఆదాయం ఆధారంగా పేదరికాన్ని కొలవడం సరిపోదని అధ్యయనం రుజువు చేస్తోంది.
242 కులాల్లో 135 కులాలు, అంటే రాష్ట్ర జనాభాలో 67% రాష్ట్ర సగటు కంటే ఎక్కువగా వెనుకబడి ఉన్నాయి.
కులాల మధ్య అసమానత..
మొత్తం అసమానతలో 72% ప్రధాన సామాజిక వర్గాల మధ్యే ఉందని ఈ అధ్యయనం తెలియజేస్తోంది. కేవలం 28% మాత్రమే వర్గాల లోపల ఉంది. అంటే సమస్య కొద్దిమంది వ్యక్తుల పురోగతి కాదు. అది నిర్మాణాత్మక సామాజిక విభజన.
కులం, పేదరికం సర్వే ప్రకారం కులం కేవలం ఆదాయంతో సంబంధం ఉన్న సమస్య కాదు. ఆదాయం పెరిగినా కుల ఆధారిత వెనుకబాటుతనం అలాగే కొనసాగుతోంది.
అత్యధిక వెనుకబాటుతనం కలిగిన కులాలు:
డక్కల్ (ఎస్సీ) – సీబీఐ 116
బేడా (ఎస్సీ) – 113
నక్కల (ఎస్టీ) – 112
సింధోళ్లు (ఎస్సీ) – 112
తురక ముస్లిం (బీసీ- ఈ) – 111
అత్యల్ప వెనుకబాటుతనం కలిగిన కులాలు:
కాపు (ఓసీ) – 12
జైనులు (ఓసీ) – 13
రాజు (ఓసీ) – 17
కమ్మ (ఓసీ) – 19
వెలమ (ఓసీ) – 19
దీన్ని బట్టి మతం ఒక్కటే నిర్ణాయకం కాదని, ఉపసముదాయ స్థాయి తేడాలు కూడా ముఖ్యమని నివేదిక తెలియజేస్తోంది.
విద్య, ఉపాధిలో వ్యత్యాసాలు..
ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఉన్నత విద్య చదివే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. డిప్లొమా లేదా అంతకంటే ఎక్కువ చదువు పొందినవారు:
ఓబీసీలు – 20%
ఎస్సీలు – 19%
ఎస్టీలు – 16%
ఓసీలు – 32%
ప్రైవేట్ పాఠశాలల్లో చదివేవారి శాతం:
ఎస్సీలు – 10%
ఎస్టీలు – 8%
ఓసీలు – 30%
ఉపాధి విభజన..
ఎస్సీ, ఎస్టీ వర్గాలు అధికంగా వ్యవసాయ కూలి, అసంఘటిత రంగ పనుల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. అగ్రకులాలు మాత్రం ప్రొఫెషనల్, శాశ్వత ఉద్యోగాల్లో ఆధిపత్యం కలిగి ఉన్నాయి.
రోజువారీ కూలి పనుల్లో ఉన్నవారి శాతం:
ఎస్సీలు – 46%
ఎస్టీలు – 41%
బీసీలు – 32%
ఓసీలు – 11%
భూమి యాజమాన్యం..
భూమి యాజమాన్యంలో కూడా తీవ్రమైన తేడాలు ఉన్నాయి:
ఓసీలు – 31%
ఎస్సీలు – 8%
ఓబీసీలు – 15%
ఎస్టీలు – 20%
సామాజిక సమీకరణ- పట్టణీకరణ ప్రభావం..
కులాంతర వివాహాలు కేవలం 5–6% మాత్రమే ఉన్నాయి. కులాంతర వివాహాల లోపం సామాజికంగా తరతరాలుగా కొనసాగుతున్నదని సర్వే రుజువు చేస్తోంది.
పట్టణాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడినప్పటికీ కుల అసమానతలు తగ్గడం లేదు. హైదరాబాద్లోని ఒక దళిత కుటుంబం గ్రామంలోని దళిత కుటుంబం కంటే మెరుగ్గా జీవించినా, అగ్రకులాలతో పోలిస్తే వ్యత్యాసం మాత్రం అలాగే కొనసాగుతోంది.
రిజర్వేషన్ల విధానాలు..
ప్రస్తుతం ఉన్న పేదరిక నిర్మూలన పథకాలు, ఆదాయ బదిలీలు సరిపోవని అధ్యయనం చెబుతోంది. విద్య, ఉద్యోగాలు, గృహాలు, రుణాలు వంటి రంగాల్లో కుల-సున్నితమైన బహుముఖ విధానాలు అవసరమని సూచిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల నాణ్యత మెరుగుపరచడం అత్యంత ముఖ్యమని నివేదిక స్పష్టం చేస్తోంది.
ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల నాణ్యత మెరుగుపడకపోతే తరతరాల వెనుకబాటుతనం కొనసాగుతుందని సర్వే నివేదిక హెచ్చరిస్తోంది.
తెలంగాణ SEEEPC సర్వే కుల చర్చను అభిప్రాయాల స్థాయి నుంచి గణాంక ఆధారిత స్థాయికి తీసుకువచ్చింది. ఆర్థిక వృద్ధి జరిగినా కుల అసమానతలు కొత్త రూపాల్లో కొనసాగుతున్నాయని ఇది స్పష్టంగా చూపిస్తోంది.
తెలంగాణ SEEEPC సర్వే ఆధారంగా వచ్చిన ఈ నిర్ధారణలు ఒంటరి ఉదాహరణ కాదు. ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన ప్రాథమిక డేటా అధ్యయనంలో కూడా తివారి తదితరులు(2022) దాదాపు ఇదే తరహా సామాజిక వర్గ క్రమాన్ని గుర్తించారు.
దళిత ముస్లింలు అత్యంత వెనుకబడిన వర్గంగా, ఆ తరువాత హిందూ దళితులు ఉన్నారని తేలింది.
తెలంగాణ SEEEPC సర్వే ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఒకే రాష్ట్రంలోని 242 కులాల స్థాయిలో సూక్ష్మ విశ్లేషణను వెలుగులోకి తీసుకొని రావడం.
నాలుగు వర్గాల దృక్కోణాన్ని దాటి, దాదాపు జనగణన స్థాయి సమాచారంతో మరింత లోతైన అవగాహనను అందించింది.
అంతేకాకుండా, తెలంగాణ SEEEPC కుల చర్చను కేవలం వాదనలకు బదులుగా గణాంకాలతో రుజువు చేసింది. ఇది 242 కులాల మధ్య వెనుకబాటుతనం తీవ్రంగా అసమానంగా ఉందని చూపిస్తుంది. అనేక కులాల సీబీఐ స్కోర్లు రాష్ట్ర సగటు 81 కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని వెల్లడిస్తుంది.
ఇది ఒక వెనుకబాటుతన శ్రేణిని చూపిస్తుంది. అందులో ఎస్సీలు, ఎస్టీలు ఇంకా అత్యంత దుర్భర స్థాయిలోనే ఉన్నారు.
మొత్తం అసమానతలో 72% విస్తృత సామాజిక వర్గాల మధ్యే ఉందని ఇది చూపిస్తోంది. అంటే సమస్య కేవలం వర్గాల అంతర్గత తేడాలు కాకుండా, వర్గాల మధ్య ఉన్న నిర్మాణాత్మక సరిహద్దులేనని స్పష్టం చేస్తోంది. ఇంకా, కేవలం ఆర్థిక వృద్ధి ఒక్కటే ఎవరికీ విముక్తి ఇవ్వదని కూడా ఇది చూపిస్తోంది.
కులవ్యవస్థ తన రూపాన్ని మార్చుకుంటూ కొనసాగుతుంది. భూ ఆధారిత ఆధిపత్యం నుండి విద్యా వ్యవస్థకు, గ్రామం నుండి కార్యాలయానికి మారినా, ఆదాయాలు పెరిగినా అది కొనసాగుతూనే ఉంటుంది.
అనువాదం: డి. వెంకన్న
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
