భారతదేశంలో యూనిఫాం అనేది భద్రతా చిహ్నం కాదు, అది అధికారానికి, భయానికి, అణచివేతకు రూపం.
డయల్-112 వంటి అత్యవసర సేవల వాహనాలు ప్రజలను కాపాడాల్సినవని రాజ్యం చెబుతుంది. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని కొర్బాలో ఒక 19 ఏళ్ల యువతిపై జరిగిన అత్యాచారం – అదే పోలీస్ వాహనంలో – ఈ రాజ్య యంత్రాంగం ఎంత లోతైన పతనంలో ఉందో బయటపెట్టింది. ఇది ఒక్క వ్యక్తి నేరం కాదు. ఇది రాజ్యం నిర్మించిన అధికార వ్యవస్థ చేసిన నేరం.
ఇది కొత్త కథ కాదు. వాకపల్లి గ్రామంలో గ్రేహౌండ్స్ దళం తుపాకీ ముప్పుతో 13 మంది ఆదివాసీ మహిళలపై అత్యాచారం చేసిన ఘటనలో నేడు కేవలం తొమ్మిది మంది మాత్రమే బతికి ఉన్నారు. మిగిలిన నలుగురు న్యాయం కోసం ఎదురుచూస్తూనే మరణించారు. ఈ కేసు ఇప్పటికీ ముగియలేదు, న్యాయ పోరాటం కొనసాగుతూనే ఉంది.
అంతకుముందు శ్రీకాకుళం జిల్లాలో తొమ్మిది మంది ఆదివాసీ మహిళలపై జరిగిన అత్యాచారాలు, ఛత్తీస్‌గఢ్ బస్తర్-బాసగూడ ప్రాంతాల్లో “కాంబింగ్ ఆపరేషన్” పేరుతో భద్రతా దళాలు చేసిన లైంగిక హింస, ఇవన్నీ ఒకే నమూనా.
నక్సలైట్స్ అనే పేరు, భద్రత అనే ముసుగు, కానీ లక్ష్యం మాత్రం ఆదివాసీ మహిళల శరీరాలే. ఇది ఒక రాజకీయ యుద్ధం. తుపాకులతో కాదు, శరీరాలపై. ఒక సమాజాన్ని లొంగదీసుకోవాలంటే ఆ సమాజంలోని మహిళలను అవమానించడం అత్యంత ప్రభావవంతమైన వ్యూహమని రాజ్యం తెలుసుకుంది. అందుకే ఆదివాసీ, దళిత, పేద మహిళల శరీరాలు భారత అంతర్గత యుద్ధంలో యుద్ధభూములుగా మారాయి.
కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, టీడీపీ అయినా, ప్రభుత్వాలు మారాయి; కానీ రాజ్య స్వభావం మారలేదు.
గణాంకాలు చెబుతున్న చేదు నిజాలు..
గణాంకాలు ఈ దుస్థితిని నిర్ధారిస్తున్నాయి. 2022 నాటికి దేశవ్యాప్తంగా 31,000కు పైగా అత్యాచార కేసులు – రోజుకు సగటున 86 నుంచి 91 మహిళలు.
తెలంగాణలో 20,865, ఆంధ్రప్రదేశ్‌లో 17,752. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అత్యధికంగా ఉన్నాయి; ఢిల్లీ మెట్రోల్లో ముందుంది. దాదాపు 89 శాతం కేసుల్లో నిందితులు బాధితురాలికి తెలిసిన వారే. కానీ ఆదివాసీ ప్రాంతాల్లో పోలీసులే లేదా భద్రతా దళాలే నిందితులైతే – కేసే నమోదు కాకుండా మాయం అవుతుంది.
2024 నాటికి మహిళలపై నేరాలు 4 శాతం పెరిగాయి, అయినా శిక్షా రేటు 1.61 శాతం మాత్రమే. చట్టం మాత్రం స్పష్టంగా ఉంది. కొత్త భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) సెక్షన్ 64(2) ప్రకారం పోలీస్ అధికారి తన అధికార పరిధిలో ఉన్న మహిళపై అత్యాచారం చేస్తే కనీసం 10 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష. పాత ఐపీసీ 376(2)(ఏ) కూడా ఇదే చెబుతుంది.
సాక్ష్య చట్టం సెక్షన్ 114(ఏ) ప్రకారం కస్టోడియల్ రేప్లో శారీరక సంబంధం తేలితే, అది సమ్మతితో జరిగిందని నిందితుడే నిరూపించాలి.

అయినా పోలీసులకు శిక్ష పడడం లేదు – ఎందుకంటే దర్యాప్తు చేసే పోలీసులే నిందితుల సహచరులు.
చట్టబద్ధ కవచం.. సంస్థాగత నేరం..
ఇక్కడే అసలు నేరం ఉంది. ఇది వ్యక్తిగత పతనం కాదు, సంస్థాగత నేరం.
ఒక పోలీస్ అత్యాచారం చేస్తే, అతని వెనుక ఉన్న ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి, డీజీపీ, ఆపరేషన్‌కు అనుమతి ఇచ్చిన కేంద్ర భద్రతా వ్యవస్థ – అందరూ బాధ్యులు.
కాబట్టి ఈ కేసుల్లో కేవలం కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేయడం న్యాయం కాదు.
రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ, హోంశాఖ మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలి.
కానీ ఇక్కడ మరో భయంకరమైన గోడ ఉంది – సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ) కింద పనిచేసే సైనికులపై గానీ, క్రిమినల్ ప్రొసీజర్ చట్టంలోని సెక్షన్ 197 (ఇప్పుడది బీఎన్ఎస్ఎస్లో ఉంది) ప్రకారం, విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారిపై కేసు పెట్టాలంటే అదే ప్రభుత్వం ముందుగా అనుమతి ఇవ్వాలి.
అంటే, నేరం చేసినవాడు ప్రభుత్వ ఉద్యోగి; అనుమతి ఇవ్వాల్సింది అదే ప్రభుత్వం. ఇది న్యాయం కాదు, ఇది రాజ్యం తన నేరస్తులను కాపాడుకునే చట్టబద్ధ కవచం.
వాకపల్లి, బాసగూడ, బస్తర్, కొర్బా – ఈ అన్ని చోట్ల కేసులు కోర్టుల వరకు వెళ్లకముందే ఈ శాంక్షన్ గోడ దగ్గరే చచ్చిపోతాయి.
మౌనంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు..
మరి ఎస్సీ, ఎస్టీ కమిషన్లు ఏమి చేస్తున్నాయి? వాకపల్లి మహిళలు పోరాడినప్పుడు, బస్తర్ ఆదివాసీలు వాపోయినప్పుడు, కొర్బా యువతి న్యాయం అడిగినప్పుడు, ఈ కమిషన్లు మౌనంగా ఎందుకు ఉన్నాయి? బాధితులను రక్షించడం, అధికారులను ప్రశ్నించడం వీళ్ల పని. కానీ వాస్తవంలో ఇవి ప్రభుత్వాలకు రబ్బర్ స్టాంపులుగా మారాయి.
మీడియా, ప్రజాసమాజం కూడా మౌనంగా ఉండటం ఆశ్చర్యమే. కానీ ఇది నిర్లక్ష్యం కాదు, ఇది భయం (భయభ్రాంతుల వాతావరణం).
ప్రభుత్వ వ్యతిరేక ముద్ర పడుతుందనే భయం. అందుకే ఆదివాసీ మహిళలపై జరిగిన అత్యాచారాలు దేశానికి కనిపించవు.
చట్టాలు కాగితాల మీద ఉన్నాయి, నిర్భయ నిధి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, మహిళా పోలీస్ నిఘా.
కానీ అమలు విషయంలో రాజ్యం కులం, వర్గం వైపు వంగుతుంది. పేదలకు వెంటనే శిక్షలు; పోలీసులకు, రాజకీయ నాయకులకు, ధనికులకు కాలయాపన, క్లీన్ చిట్లు.
అందుకే ఈ పోరాటం కేవలం న్యాయం కోసం కాదు, రాజ్య స్వభావానికి వ్యతిరేకంగా.
యూనిఫాం వెనుక దాగిన ఈ హింసను బయటపెట్టే ప్రతి గొంతు, ప్రతి వ్యాసం, ప్రతి ఉద్యమమే నిజమైన ప్రజాస్వామ్యం కోసం చేసే యుద్ధం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
